Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 35


    ఈ లోపులో జానీ జీపువెనుక భాగానికి చేరుకున్నాడు. జీపు చక్రాల క్రింద నుంచి మరోసారి రామూ కాళ్ళవైపు గురిపెట్టి కాల్చాడు. వికృతంగా కేకపెడుతూ రామూ క్రిందికి కూలిపోయి, అడుగునించి జానీని గమనించి, ప్రాణభయంతో తుప్పల్లోకి జారటానికి ప్రయత్నించాడు. అయితే అటువైపు చిన్న లోయ వున్న సంగతి ఆ తొందర పాటులో అతడు గమనించక అటు జారేడు.

    రివర్స్ లోకి వచ్చిన బస్ ని ఆపే ప్రయత్నం ఏమీ చేయకుండానే బిల్హణుడు డ్రైవింగ్ సీటులోంచి దూకడంతో పెద్ద జర్క్ తో బస్ ఆగిపోయింది. అప్పుడు వినపడింది- బస్ లో వాళ్ళు భయంతో చేస్తున్న ఆర్తనాదాల శబ్దం. అతడు దాన్ని పట్టించుకోకుండా జీపు దగ్గిరకి పరుగెత్తి ఎగిరి కూర్చున్నాడు. ఈ లోపులో జానీ  క్రింద నుంచి వేనుగ్గా బయటకొచ్చి, అదేవూపులో ఉత్పలని ఒక బొమ్మలా పట్టుకుని జీపు కదలడం ఏమిటి ఒకేసారి జరిగాయి. మిగతా గూండాలు తమ ఆయుధాలు సర్దుకునేలోపులో జీపు గాలిలో పరుగెత్తింది.

    ఇద్దరూ దాదాపు అరగంట చర్చించుకుని ఒక వ్యూహాన్ని పన్ని ఎంతో ప్లాన్డ్ గా చేసినట్టు నిర్వహించిన ఆ రెండు నిమిషాల "అటాక్" లో ఏ మాత్రం కొద్దిగా అటూ ఇటూ జరిగినా, లేక మరో కనురెప్పపాటు ఆలస్యం అక్కడ జరిగినా- వాళ్ళిద్దరి శరీరం తూట్లు తూట్లు పడేదే. ఇద్దరూ చెరొక మిషన్ లా  పనిచేశారు ఆ రెండు నిమిషాలు.


                                 *    *    *

    "బాగా షాక్ లో వున్నట్టుంది ఈ అమ్మాయి" అన్నాడు బిల్హణుడు- స్పృహలేని ఉత్పల వంక చూస్తూ.

    అపాయంలో వున్నంతసేపూ ఆమె ప్రాణాలకోసం పరుగెడుతూనే వుంది. చివరికి విషవలయంలో ఇరుక్కుని దాదాపు ప్రాణం పోగొట్టుకునే స్థితికి వెళ్ళింది. ఆమె కళ్ళముందే రక్తం ఏరులై పారింది. చివరికెలాగో రక్షింపబడింది.

    ఒకసారి తను రక్షింపబడ్డానని తెలిసాక- అప్పటి వరకూ అనుభవించిన టెన్షన్ - ఆమెని స్పృహ పోగొట్టింది. పక్కకి వంగి- జానీ తొడమీద తలవాల్చి నిస్త్రాణంగా కళ్ళు మూసుకుని- అలాగే నిద్రలాటి మైకంలోకి జారుకుంది. జీపు పక్కవూరు చేరుకోవటం, దాన్నక్కడే వదిలేసి టాక్సీలో నగరానికి వెనక్కి రావటం- తమని టాక్సీవాడు గుర్తుపట్టకుండా, ఆస్పత్రి దగ్గిర దాన్ని ఆపి, తనని లోపలికి తీసుకువెళ్తున్నట్టు నటించి, మరో టాక్సీలోకి మార్చటం- ఇవేమీ ఆమెకి తెలీదు.

    జానీ గదిలో అతడి పక్కమీద ఆమెని పడుకోబెట్టాక, బిల్హణుడు చుట్ట వెలిగించుకుంటూ అన్నాడు - "చాలా అడ్వంచర్ చేశాం బాస్. మనని గానీ వాళ్ళు గుర్తుపట్టి వుంటే రేపటికి మనిద్దరి పనీ ఆఖరు?"

    జానీ మాట్లాడలేదు. బిల్హణుడే అన్నాడు- "ఒక అమ్మాయి కోసం రెండు  జీపుల్లో గన్స్ తో వచ్చి, నడిరోడ్డుమీద బస్ ఆపి ఇంత సీన్ చేశారంటే ఈ అమ్మాయెవరో మామూలు వ్యక్తి అయివుండదు. వాళ్ళ నుంచి పారిపోయిన క్యాబరే  డాన్సర్ అయివుండాలి. లేక ఈ అమ్మాయిని చూస్తుంటే అంత గ్రంథసాంగు రాలులా కనిపించటం లేదు. ఒక పద్యం చెప్పనా? ఉత్సాహం ఆగటంలేదు....."

    "చెప్పు"

    "కలికి పాలిండ్లు, మేలి బంగారు గిండ్లు.....

    యలరుమరువంపు మొలక, కాయజుని చిలుక

    కలిత కర్పూర తిలక సుగంథ ఫలక

    యామినీ పూర్ణ తిలక, నీలాంచ దలక....."

    "ఈ అమ్మాయి నిన్ను 'అంకుల్' అని పిలిచినట్టు జ్ఞాపకం-" అతడిని మధ్యలో ఆపు చేస్తూ జానీ అన్నాడు.

    "ఓహొ. అది కూడా విన్నావన్నమాట. అయినా నా గురించి కాదులే. ఆ వర్ణన నీ తరపు నుంచి అన్నాను".

    "ఈ అమ్మాయి అటువంటిదిలా కనిపించడం లేదు. ఏదో ప్రాచీన వంశం నుంచి వచ్చినట్టు వుంది."

    "తెలుగుకాస్త సరిగ్గా నేర్చుకో జానీ. ప్రాచీన వంశం ఏమిటి? శ్రోత్రియ వంశం అను".

    "అలాటిదే-"

    "అలాటి అమ్మాయి, అంత భయంలో వున్నది కూడా ఆ అరగంట బస్సు ప్రయాణంలో సరీగ్గా ఏడుసార్లు నీవైపు చూసింది. సరస్వతీదేవితో ఒక అందమైన సాయంత్రం గడిపిన ఉత్సాహంతో బహుశ బ్రహ్మదేవుడు నీ ముక్కుని సృష్టించి వుంటాడు జానీ. లేకపోతే దానికి అంత అందం రాదు".

    ఈ లోపులో ఉత్పల కళ్ళు విప్పటం గమనించి "అమ్మాయ్ ఎలా వుంది?" అని అడిగాడు బిల్హణుడు. ఈ లోపులో జానీ  ఫ్రిజ్ లో మంచి నీళ్ళు తీసి గ్లాసులో ఆమెకి అందించాడు. ఆమె వేళ్ళు ఇంకా వణకుతూనే వున్నాయి. ఆమె నీళ్ళు తాగాక, "ఊ చెప్పు. ఎవరు నువ్వు? వాళ్ళకీ నీకూ ఏమిటి సంబంధం?" అని అడిగాడు.

    ఆమె జవాబు చెప్పలేదు.

    బిల్హణుడు అందుకుని "అమ్మాయ్! అమలాపురం బస్ చార్జీలు ఇవ్వాలి నువ్వు మాకు. నాలుగు పిస్తోలు గుళ్ళ ఖర్చు ఇవ్వాలి. ఆ బుణ బాధా విముక్తురాలి వయ్యేటందుకైనా నువ్వు జరిగింది చెప్పక తప్పదు".

    ఉత్పల ఆలోచించింది. జానీని చూస్తే అలా అనిపించటం లేదు గానీ, ఏమో- ఇది మరొక రౌడీ గ్రూపేమో! నడిరోడ్డుమీద వాళ్ళు పిస్తోళ్ళు ఎడాపెడా పేల్చుకున్న దృశ్యం ఇంకా ఆమె కళ్ళముందు నుంచి చెదిరిపోలేదు. ఇటువంటి పరిస్థితిలో తనకి తెలిసిన విషయం ఇప్పుడు చెప్పేస్తే- మరే ప్రమాదంలో ఇరుక్కుంటుందో.

    "ఇంటి దగ్గర బయల్దేరినప్పుటి నుంచీ ఒక రౌడీ వెంటపడ్డాడు. బస్ స్టాండ్ వరకూ వచ్చి వదిలేస్తాడేమో అనుకున్నాను. ఇలా జరుగుతుందను కోలేదు" అంది.

    బిల్హణుడు, జానీ నవ్వేరు. "నువ్వు అందగత్తెవే కానీ అమ్మాయ్! మరీ పృధ్వీరాజులు ప్రాణాలకి తెగించి రోడ్డుమీద  జీపుల్తోనూ స్టెన్ గన్ లతోనూ దారికాసి ఎత్తుకు పోయేటంత నవలామణివి కావని నా వుద్దేశ్యం. అసలు విషయం చెప్పకపొతే పోన్లే. నడవగలిగే ఓపిక వుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. మాకే అభ్యంతరం లేదు" అన్నాడు బిల్హణుడు.

    ఉత్పల తల దించుకుంది. ఎక్కడికి వెళ్తుంది తను? చివరికి అంది "మీరు నాకు చేసిన సాయానికి కృతజ్ఞతలు. ఇదే విధంగా మరికాస్త సాయం చేస్తారా?'

    "ఏమిటీ?"

    "వందో- రెండొందలో సర్దుతారా? మళ్ళీ ఉద్యోగంలో చేరగానే ఇచ్చేస్తాను".

    "ఓహొ ఇంట్లోంచి పారిపోతున్నావా?"

    ఆమె మాట్లాడలేదు.

    "ఉద్యోగం రెడీగా వుందా?"

    "లేదు, చూసుకోవాలి".

    "అమలాపురంలో నీకెవరు ఉద్యోగం ఇస్తారు?"

    "ఎక్కడైనా సరే ఏ ఊళ్ళోనైనా పర్వాలేదు. ఇక్కణ్ణుంచి మాత్రం  వెంటనే వెళ్ళిపోవాలి".

    "ఎందుకు"

    ఆమె జవాబు చెప్పలేదు.

    "గుండప్ప, రామూలకీ, నీకూ ఏమిటి సంబంధం. ఏమీ లేదనకు. నువ్వు అబద్ధం కూడా సరీగ్గా చెప్పలేవు".

    "ఏమీ లేదు".

    "ఇప్పుడింకో వూరు ఎలా వెళ్తావు?"

    "బస్ లో గాని ట్రైన్ లో గానీ"

    జానీ నవ్వేడు. "ఈ పాటికే మొత్తం నగరంలో అన్ని గ్రూపులకీ జరిగినదంతా తెలిసి పోయి వుంటుంది. వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టలేదు. కానీ నిన్ను గుర్తుపట్టారు..... నీకోసం అమలాపురమే కాదు జమ్మలమడుగు నుంచి అన్నవరం వరకూ అన్నిచోట్లా కాపువేసి వుంటారు".

    ఉత్పల మోహం వెలవెల బోయింది. "మరెలా?" అంది.

    "అందుకే అసలు విషయం చెప్పమంటున్నాను".

    ఆమెకిక తప్పలేదు. నెమ్మదిగా అంది. "ఈ రోజు పేపర్లో ఆస్పత్రి దగ్గిర జరిగిన హత్యల విషయం మీరు చదివే వుంటారు. ఆ వుత్తరం తీసింది నేనే".....

    శ్రోతలిద్దరూ అదిరిపడ్డారు. "అంటే.....అంటే....."

    "వసంత దాదా గురించి తెలిసింది నాకే-"

    బిల్హణుడి నోట్లోంచి చుట్ట జారిపడింది.

    జానీ అయోమయంగా ఆమె వైపు చూశాడు. వసంత  దాదా...... వ....సం....త...దా...దా!

    ఈ అమ్మాయి కోసమేనన్నమాట మాఫియా వెతుకుతూంది!

    జానీ ఏదో మాట్లాడబోతూ వుండగా అతడిని వారించి, "ఒక్క నిముషం ఇలారా" అని పక్క గదిలోకి తీసుకువెళ్ళాడు. ఉత్పల ఒక్కతే ఆ గదిలో వుండిపోయింది. వాళ్ళు లోపల మాట్లాడుకుంటున్నదేమిటో ఆమెకు తెలుసు. వసంత్ దాదా పేరు  చెప్పగానే వాళ్ళ మొహాల్లో వచ్చిన మార్పు ఆమె కనిపెట్టింది.

    ఆమె ఊహించింది నిజమే! లోపల ఆ సంభాషణే జరుగుతూంది.

    "జానీ- అనవసరంగా  మనం ఇందులో ఇరుక్కున్నాం. ఏదో 'గ్రూపువార్' అనుకున్నాం గానీ  దీని వెనుక ఢిల్లీ దాదా వున్నాడనుకోలేదు. ఎంత తొందరగా ఈ అమ్మాయిని వదిలించుకుంటే మనకి అంత మంచిది".

    జానీ మాట్లాడలేదు. కెరటాలువచ్చి తీరాన్ని ఢీ కొన్నట్టు అలలు అలలుగా ఉత్పల మొహమే అతడికి గుర్తుకువస్తోంది. ఇద్దరు రౌడీలు గన్స్ తో వచ్చి బస్ తో బెదిరించినప్పుడు ఆమె మొహంలో కనపడిన భయం, ఆ పెద్ద కళ్ళలో బెరుకు ఒక ఫోటోలా ముద్రపడిపోయింది.

    బిల్హణుడు అతడి మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్నాడు.

    "ఒకవేళ ఈమె ప్రాణాల్తో వాళ్ళకి పట్టుబడితే- మనకి కూడా ఈ విషయం తెలిసిందాన్న సంగతి వాళ్ళకి చెపుతుందని భయమా? అలాటిదేమీ అక్కర్లేదు. సలీంశంకర్ తో నేను మాట్లాడుతాను".

    జానీ తలూపాడు. ఆ విషయంలో భయం అక్కర్లేదు..... తనకు తెలిసినా, ఆ విషయం గురించి మాఫియా పట్టించుకోదు. తమకు తెలిసిన విషయాల్ని స్వార్థానికి ఏమైనా ఉపయోగించుకుంటున్నారా అని మాత్రం గమనిస్తుంది. తమకి అలాటి ఉద్దేశ్యం ఏమీ లేదని తెలియగానే మార్చిపోతుంది.

    "కానీ ఆ అమ్మాయి.....?"

    అతడికి ఆ ప్రశ్న ఉదయిస్తున్నప్పుడు- బయట గదిలోంచి వెక్కి వెక్కి ఏడుస్తూన్న చప్పుడు వినిపించింది. ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని బయటకు నడిచారు.

    బల్లమీద తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూంది ఉత్పల! చిన్న పిల్లలకి భయంకరమైన కల వచ్చినప్పుడు నిద్రలో ఎలా ఏడుస్తారో, అలా ఆమె శరీరం వణుకుతూంది. ఆ స్థితి ఎంతటి కఠినాత్ములకైనా జాలికొలిపేలా వుంది. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.

    బిల్హణుడు ఆ మాటే అన్నాడు. అయితే వెంటనే అనలేదు. కంటినీటి రూపంలో రెండు రోజుల వేదనంతా బయటకు పోయి ఆమె అలసటతో నిస్త్రాణ చెంది తేరుకున్నాక అన్నాడు. "అమ్మాయ్! నీమీద  మాకు సానుభూతి వున్నమాట నిజమే! కానీ శత్రువు వూహించలేనంత బలమైనవాడు. ఇప్పటికి మేమీ విషయం తెలియక అనవసరంగా ఇందులో వేలు పెట్టాము. వియ్ ఆర్ సారీ. నువ్విక్కడ ఎక్కువసేపు వుండడం కూడా ప్రమాదమే....." ఆ తరువాత పూర్తి చెయ్యలేదు.

 Previous Page Next Page