Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 35


    రాధ దగ్గర కెళ్ళి ఆమె భుజం చుట్టూ చేతులేసి కౌగిలించుకోబోతూండగా - మల్లెపూలతో అలంకరించిన మంచం మధ్యనుంచి ఎవరో దగ్గినట్లు వినిపించింది.

    ఉలిక్కిపడి అటువేపు చూశాడు-

    బారెడు గడ్డం, మారెడు మీసాలూ, జడల్లా అల్లుకుపోయిన జుట్టూ, కాషాయ వస్త్రాలూ, మెడలో రుద్రాక్షమాల - గెటప్ తో నడి మంచం మీద విష్ణుమూర్తిలా పవళించిందో అవతారం. ఆ అవతారాన్ని చూసేసరికి మురళీకి మళ్ళీ విసుగూ, చిరాకూ పుట్టుకొచ్చేసినయ్.

    "అబ్బా ! మీరు చేయదలచుకున్న 'శాంతి' ఏదో త్వరగా కానీండి స్వామీ! లేకపోతే మీ పూజ గొడవలో మా రెండో శోభనం రాత్రి కూడా తెల్లారిపోయేట్లుంది." అన్నాడు కోపంతో.

    "అమాయకుడా !" అందా అవతారం చిరునవ్వుతో.

    "అయితే అవ్వచ్చు స్వామీ! ముందు మీ పూజలేవో త్వరగా కానిస్తే..."

    "పిచ్చివాడా!" అందా అవతారం అదే సైజు నవ్వుతో.

    మురళీకి  వళ్ళు మండుకొచ్చింది. 

    "తమరిక బయటకు దయచేస్తారా?" వినయంగా, వెటకారంగా అడిగాడు.

    "అర్చకుడా!" అందా అవతారం మరో కొత్త పదం వాడుతూ.

    "కొత్తపిలుపులు, పదాలు వాడే కార్యక్రమం ఆపి, ఇక తమ నివాస స్థలం బయటకు మార్చండి స్వామీ?"

    "ఎందుకు నాయనా!"

    "ఎందుకంటే - ఇది మా శోభనం గది కాబట్టీ, తమరి నివాసం బయట కాబట్టీ!"

    "అజ్ఞానీ! ఈ రోజు నుంచీ మా 'బస' ఈ గదే!"

    "ఏమిటీ? మీ 'బస' ఇక్కడా? మీకేం పిచ్చేక్కలేదు కదా!"

    "లేదు చిరంజీవీ! సంభవించిన తాజా పరిణామాలను నువ్వు గమనిస్తున్నట్లు లేదు-"

    "ఏమిటా పరిణామాలు ?"

    "ఈ ఇంట్లో జరిగిన మార్పులూ, చేర్పులూ, హోదాలూ, అంతస్తులూ- వగైరాలు నాయనా ?"

    మురళీ కోపంగా రాధవైపు తిరిగాడు.

    "చూశావా రాధా ! మీ వాళ్ళ మూఢనమ్మకాలవల్ల ఇలాంటి సన్యాసులను పూజలకూ, శాంతులకూ తీసుకొస్తే - వీళ్ళ మన విలువయిన సమయం ఇలా తినేస్తూంటారు."

    రాధ మాట్లాడలేదు. గోడవేపు తిరిగి, పైట నిండుగా కప్పుకుని సిగ్గుపడింది.

    "స్వామీ ! ఇంక మర్యాదగా బయటకెళతారా లేదా ?" చొక్కా చేతులు పైకి మడుస్తూ అన్నాడు మురళీ.

    "బయటకు వెళ్ళాల్సింది నువ్వే నాయనా! త్వరగా బయటికెళితే మా శోభనం నిర్విఘ్నంగా జరిగిపోతుంది."

    మురళీ అదిరిపడ్డాడు. గదిగోడలు కదిలిపోయాయి.

    "మీ శోభనమా ! నీకేం పిచ్చెక్కలేదు కదా ?"

    "అందుకే నిన్ను అజ్ఞానీ అన్నాను నాయనా! నేను రాధను చిన్నప్పుడే వివాహం చేసుకున్న ఆమె బావను! హిమాలయ పర్వతాల్లో గడిపి ఇంతకాలానికి తిరిగి వచ్చాను. నా పేరు మురళీకృష్ణ!"

    మురళికి కళ్ళు తిరిగినట్లయినయ్.

    "మోసం! దగా! అబద్ధం! నిజం చెప్పు! ఎవరు నువ్వు?"

    ఆ అవతారం నవ్వింది.

    "ఎవర్నువ్వు? ఆహ్హహ్హ - పిచ్చివాడా! ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోడానికే ఇన్ని సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేశాము. కాని సమాధానం దొరకక తపస్సు విరమించుకుని ఇక్కడికి చేరుకున్నాను. ఇక్కడ నా భార్య రాధ ఇంతటి అందాలు నింపుకుని, ఇంతటి దేదీప్యమైన కళతో, నా కోసమే పూజలు చేస్తూ, ఎదురు చూస్తూ గడుపుతోందన్న నిజం తెలిశాక, పశ్చాత్తాపంతో దహించుకుపోయి - ఆమెతో జీవితాంతం కలిసి సంసారాశ్రమం స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. సన్యాసాశ్రమాన్ని  ఈ క్షణం నుంచే వదిలేస్తున్నాను." అంటూ కాషాయ వస్త్రాలు విసిరవతల పారేసి, సిద్ధంగా వున్న పెద్దాపురం సిల్కు ధోవతీ, చొక్కా వేసుకున్నాడతను.

    మురళీకి మతిపోయినట్లయింది.

    "మావయ్యా!" అంటూ గావుకేక పెట్టాడు.

    మళ్లీ ఏమైనా ఫోన్ కాల్ వస్తుందేమోనని ఫోన్ దగ్గరే కూర్చున్న నరసింహం ఆ కేకకు అదిరిపోయి శోభనం గదిలోకి పరుగెత్తాడు.

    గది లోపలి దృశ్యం చూసి నరసింహం అదిరిపడ్డాడు.

    శోభనం గదిలో కూతురూ- అల్లుడూ మధ్య గెడ్డాలూ, మీసాలూ రుద్రాక్షమాలతో మరో అవతారం!

    "ఏమిట్రా? ఏమయింది?" ఆత్రుతగా మురళీ నడిగాడతను. ఆ గొడవంతా చూసి, రాధ భయంతో గదిలో నుండి బయటకు పారిపోయింది.

    "ఈ సన్యాసి ఎవడో - తనే చిన్నప్పుడు రాధ మెడలో తాళి కట్టానంటున్నాడు. ఇప్పుడు రాధతో సంసారం చేయడానికొచ్చాడుట!" ఉక్రోషంగా అన్నాడు మురళీ.

    రామలింగం, అన్నపూర్ణమ్మ, మిగతా ఆడంగులు కొంతమంది వచ్చి మూగారక్కడ.

    నరసింహానికి అర్ధం అయిపోయింది. ఇదంతా హరికృష్ణ ఎత్తు! హరికృష్ణ ఇలా మరో నాటకం ఆడుతున్నాడు. దీని అంతు తేల్చుకుంతే గాని, అసలు నాటక సూత్రదారి బయటపడడు. అయితే తొందరపడకూడదు. తొందరపడితే తమకే ప్రమాదం కలగవచ్చు.    

 Previous Page Next Page