Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 35


    "నాన్నా! నీకు మనవడు పుట్టబోతున్నాడు" అంది సుశీల తన అపరాధాలన్నీ ఇది చూసి క్షమించమన్నట్లు.
    వెంకట్రావు ఈ విషయం విని చాలా సంతోషించాడు.... "భాస్కర్ కి చెప్పానా అమ్మా?" అన్నాడు.
    "ఆయన నన్ను చూడటానికి ఒక్కసారే వచ్చారు. మళ్ళీ రాలేదు" అంది సుశీల మూతి ముడుచుకుని.
    "ఆ ధోరణి వదిలెయ్యి - ఇంటికొచ్చాక చెప్పచ్చులే! భాస్కర్ చాలా సంతోషిస్తాడు."
    బుధ్ధిగా తల ఊపింది సుశీల.
    "నాన్నా! ఈ విషయం ఆయనకు నువ్వు చెప్పద్దు - నేనే చెపుతాను, ఇంటికొచ్చాక. ఆయనతో ఎలా మాట్లాడాలో నాకు చాలా భయంగా వుంది. ఈ విషయం వింటే తప్పకుండా మెత్త బడతారు."  
    "అలాగే! ఈ తియ్యని వార్త మీ ఆయనతో నువ్వే చెప్పు - నేను చెప్పను" అన్నాడు నవ్వుతూ వెంకట్రావు.  
    ఆనాడే వెంకట్రావు వెళ్ళిపోయాడు.
    తలవని తలంపుగా వెంకట్రావు మీదకు మరో ఆపద వచ్చి పడింది. అతని దగ్గిర చాలా బ్లాక్ మనీ ఉందని ఎవరో రిపోర్ట్ చేశారు. ఇన్ కంటేక్స్ అధికారులు ఆకస్మాత్తుగా వెంకట్రావు ఇంటిని సోదా చేశారు.  
    అప్పుడు బయటపడిన విషయాలు అందరినీ దిగ్భ్రాంతుల్ని చేశాయి. వెంకట్రావు దగ్గిర నల్లధనం లేదు సరికదా, ఏ ధనమూ లేదు. అతనికి బేంక్ లో వెయ్యి రూపాయలు కూడా లేవు.... బొంబాయిలో టెక్స్ టైల్స్ లో భారీయెత్తున వ్యాపారం చేస్తున్న ఒక వ్యాపారస్థుడి దగ్గిర ఏజంట్ గా పనిచేస్తున్నాడు వెంకట్రావు. ఆ సందర్భంలోనే అతడు బొంబాయి వెళ్ళి వస్తూ ఉంటాడు. వ్యాపారస్థులతో కలిసిమెలిసి తిరుగుతుంటాడు కాని, అతనికే వ్యాపారమూ లేదు....  
    ఈ వివరాలన్నీ పేపర్లో వచ్చాయి. ఆరోజు రేవతి పని కట్టుకుని సుశీలని చూడటానికి వచ్చి, ఆప్యాయంగా "ఆరోగ్యం ఎలా ఉంది?" అని ప్రశ్నించి, "పేపర్ చూశారా?" అని అడిగి, అత్యంత సానుభూతితో "మీ ఆరోగ్యం ఇలా వుండగా ఎలా చూస్తారులెండి!" అనే సమాధానం చెప్పి, ఆ తరువాత వెంకట్రావుకి సంబంధించిన వివరాలన్నీ చదివి వినిపించింది.   
    సుశీల గుండె పగిలి ఏడుస్తోంటే, అభిమానంగా కన్నీళ్ళు తుడిచి "అయితే, మీ నాన్నగారి దగ్గిర ఏమీలేదని మీకు కూడా తెలియదా? లేకపోతే, ఆయన తన డబ్బుని ఎక్కడైనా రహస్యంగా దాచారా." అని అడిగింది.   
    "మీరు దయచేసి వెళ్ళిపొండి - కాసేపు నన్నేమీ మాట్లాడించకండి" అంది సుశీల విసుగ్గా.  
    తను ఇంత ప్రేమ చూపిస్తున్నా, సుశీల తన మీద విసుక్కోవటం భరించలేకపోయింది రేవతి.
    "మేనర్ లెస్ బ్రూట్! అందుకే దేవుడు చాలా బుద్ధి చెపుతున్నాడు" అనేసింది.
    రేవతికి దేవుడిలో నమ్మకం లేదు. నమ్మకంలేదనే అంటుంది. అయితే అప్పుడప్పుడు తనకి తెలియకుండానే దేవుణ్ణి ఇలా వాడుకుంటూ ఉంటుంది.
    ఎప్పుడెప్పుడు ఇంటికి వద్దామా, అని ఆరాట పడుతోన్న సుశీల డాక్టర్ ని బ్రతిమాలి - బ్రతిమాలి, తనను శనివారానికి బదులుగా శుక్రవారమే డిచ్ఛార్జ్ చేసేలాగ ఒప్పించింది. నర్స్ ల సాయంతో టాక్సీ తెప్పించుకుని ఇంటికి వచ్చేసింది. భాస్కర్ అంతకుముందు వచ్చినప్పుడు సుశీలకు డబ్బు ఇచ్చే వెళ్ళాడు. అంచేత డాక్టర్ బిల్లు చెల్లించి ఇంటికి రావటానికి సుశీల అవస్థ పడక్కర్లేక పోయింది.   
    ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిదు దాటింది. ఆ సమయానికి భాస్కర్ ఇంట్లో ఉంటే తనను చూసి ఏమనుకుంటాడో, ఏమంటాడోనని రకరకాలుగా ఊహించుకుంటూ వచ్చిన సుశీల ఇంటికి తాళం పెట్టి ఉందని తెలుసుకుని కొద్దిగా నిరుత్సాహ పడింది. ఐరావతమ్మ దగ్గిర తాళం చెవి అడిగి తీసుకుని ఆవిడ సాయంతోనే సామాను లోపల పెట్టుకుంది. కళ్ళు కనపడకపోయినా, బాగా అలవాటై పోయిన ఇల్లు కనుక తడుముకుంటూ స్నానం చేసింది. చీర మార్చుకుని, తల దువ్వుకుని, అలవాటు చొప్పున అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకోబోతూ విషాదంగా నవ్వుకుంది.
    భాస్కర్ వచ్చాక ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడితే తను చేసిన ఈ దారుణానికి అతనికి కలిగిన కోపం పోతుందా అని, ఆలోచిస్తున్న సుశీల అడుగుల చప్పుడు విని "ఏవండీ!" అంది వణుకుతున్న కంఠంతో, ఆప్యాయంగా.   
    మచ్చల డాక్టర్ కంగారుగా "నేనండీ! ఏకాంబరాన్ని.... భాస్కర్ ని కాను" అన్నాడు.
    "మీరా? ఇలా వచ్చారేం!"
    "భాస్కర్ రేపు మీరు వచ్చాక మీకియ్యమని ఇవాళ మధ్యాహ్నమే నాకొక ఉత్తరం యిచ్చాడు. మీరు ఇవాళే వచ్చేసరికి చూసి మీ ఉత్తరం మీకిద్దామని వచ్చాను."
    అదిరిపడింది సుశీల. భాస్కర్ తనకు ఉత్తరం వ్రాయటమేమిటి? ఎక్కడికి వెళ్ళాడు?
    గొంతు పెగల్చుకుంటూ "ఆ వుత్తరం చదవండి..." అంది సుశీల.
    భర్త భార్యకి రాసిన ఉత్తరం చదవటానికి మొహమాటపడుతూ "ఇంకెవరినైనా చదవమనండీ!" అన్నాడు మచ్చల డాక్టర్.
    "నాకు మీమీద ఉన్న నమ్మకం మరెవరిలోనూ లేదు. చదవండి" అంది సుశీల.

 Previous Page Next Page