"ఎందుకంత ఆశ్చర్యం? నాలాంటిది దైవ ప్రార్థన ఏమటని కదూ! అందులోను ఇలాంటి అవినీతి పనికి సిద్ధపడుతూ దైవ ప్రార్థన ఏమిటని కదూ?"
"అదికాదు-"
"ఇది అవినీతి అని నేననుకోవటం లేదు - అందుకే రావటానికి సిద్ధపడుతున్నాను. మీరు అవినీతి అనే అనుకుంటున్నారు - అయినా రావాలని ఆరాటపడుతున్నారు. మన ఈ దృక్పధాలలో భేదానికి కారణం తెలుసా? నేనొక రకంగా సంఘానికి వెలిగా బ్రతుకుతున్నదానిని - కాబట్టి సాంఘికమైన నీత్యవనీతులు నా మనసుకు పట్టవు - కానీ, మీరు సంఘంలోనే ఉన్నారు - మీ మనసు సాంఘిక నీతిని అంత తేలిగ్గా తోసి పారెయ్యలేదు - ఇందుకే - సరిగ్గా ఈ కారణంచేతనే నేను కొంత వ్యవధికావాలని అడుగుతున్నాను - నాకు దేవుడిలో నమ్మకం ఉంది. మార్గంలో నమ్మకం ఉంది - నరకంలో నమ్మకం ఉంది - నా దృష్టిలో స్వర్గం అంటే, రంభా, ఊర్వశీ, తిలోత్తమా, నాట్యాలు చేసే ఇంద్రసభకాదు. ఆ రోజు నా పరీక్ష ఫీజుకట్టి ఆ రసీదు నాకు పంపిస్తూ, దానితోపాటు మీరు వ్రాసిన ఉత్తరం చదువుకోగలిగినప్పుడు నేను పొందిన అనుభూతి - నరకం అంటే - నా కళ్ళముందు సుశీలగారు ఆత్మహత్యకు వెళుతున్నప్పుడు అనుభవించిన క్షోభ - దేవుడంటే కేలెండర్ లో కనిపించే నాలుగు చేతుల బొమ్మకాదు - ఏ మహాశక్తి ప్రోద్బలంతో ప్రాణికోటి సమస్తమూ తనను తాను వృద్ధి పొందించుకుంటూ ఎప్పటికప్పుడు మరింత ఉన్నత పధాలనందుకోగలుగుతోందో ఆ దివ్యశక్తి-"
"సారీ జ్యోత్స్నా! నేను ఎప్పుడూ, దేవుడు - ప్రార్థన - ఈ విషయాలు ఆలోచించలేదు. అలాంటి వాటిల్లో నమ్మకమూ లేదు. అంచేత అలా అన్నాను - శనివారంనాడు సుశీలను డిస్చార్జ్ చేస్తామంటున్నారు. శుక్రవారంనాడు మనం వెళ్ళిపోవాలి-"
"శుక్రవారం - అంటే ఇవాళ్టికి సరిగ్గా అయిదు రోజులు అలాగే! ఈ అయిదు రోజుల్లోగా, ఏదైనా అద్భుతం జరిగి నా నిర్ణయాన్ని మార్చకుండా ఉంటే తప్పకుండా వెళ్దాం!"
"థేంక్యూ!"
హుషారుగా బయటికివచ్చి ఆనంద నిలయం అన్న అక్షరాలు చూస్తూ ఒక్కక్షణం నిలబడ్డాడు.
'ఈ ఆనంద నిలయాన్ని వదిలిపోతున్నాను - ఇక మీదటైనా జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తాను' అనుకున్నాడు -
17
సుశీల తండ్రికి ఉత్తరం వ్రాయవద్దంది. తన పరిస్థితి తండ్రికి తెలియటం ఆవిడకు ఎంతమాత్రం ఇష్టంలేదు. కానీ, సర్వజన శేయోభిలాషి అయిన మాజీ తహసీల్దారుగారు వెంకట్రావుకి టెలిగ్రామ్ ఇచ్చాడు. వెంకట్రావు కూతుర్ని చూడటానికి వచ్చాడు.
ఈలోగా మరొక విషయం బయటపడింది. సుశీలకు ట్రీట్ చేస్తున్న లేడీ డాక్టర్ మందలిస్తూ "ఎంత ఘోరం చేశావమ్మా!.... వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది. నువ్విప్పుడు గర్భవతివని నీకు తెలియదా?" అంది.
సుశీల ఆ విషయం విని ఆనందం పట్టలేకపోయింది.... సంతానం కోసం సుశీల ఎన్నెన్నో నోములు నోచింది. ఏదీ ఫలించలేదు. తన దురదృష్ట జీవితంలో ఆ సౌభాగ్యానికి కూడా నోచుకోలేదేమోనని కుమిలిపోయింది. ఇటీవల నెల తప్పింది. కానీ, అది కూడా ఒక జబ్బేమోనని భయపడింది. తన రోగాల గురించి అందరికీ తెలియటం సుశీల భరించలేకపోతోంది. రహస్యంగా లేడీడాక్టర్ కి చూపించుకోవాలని అనుకుంటోనే వుంది. ఇంతలో భాస్కర్ 'నా ఇష్టం' అంటూ విదిలించి కొట్టడంతో - ఆత్మహత్య చేసుకుని అతనికి బుద్ధి చెప్పాలనే పాపిష్టి ఆలోచన వచ్చింది.
భాస్కర్ తనను క్షమిస్తాడా? ఆస్పత్రికి ఒక్కసారి వచ్చాడంతే! దూరం నుంచి చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. భాస్కర్ అలా ఉంటే తనని చాలా బాధగా ఉంది. అంతకంటె తనని తిట్టి కొడితేనే బాగుంటుంది. తను తల్లి కాబోతున్నట్లు తెలిస్తే భాస్కర్ తనను తప్పకుండా క్షమిస్తాడు. అతనికి పిల్లలంటే చాలా ఇష్టం....
తనకు సంతానం కలుగుతుంది. కొడుకైనా, కూతురైనా ఫరవాలేదు. తన బాబు - తన రక్తం పంచుకు పుట్టిన బాబు - తనను ఎంతో ప్రేమిస్తాడు. తను నల్లగా ఉన్నా, తనకు చూపు లేకపోయినా తన బాబుకి తన మీద ప్రేమ పోదు.... రూపంతో సంబంధం లేని పేమ - స్వార్థంతో ప్రమేయం లేని ప్రేమ - మనిషి మనుగడకు అవసరమైన మనసు నిండిన ప్రేమ.... అలాంటి ప్రేమ - ఇన్నాళ్ళకు తనకు లభించబోతోంది. ఆ ప్రేమ బలంతో మిగిలిన దురదృష్టాలన్నీ ఎదుర్కోగలదు. తను మనిషిగా నిలవటానికి ఒక ఆధారం - చాలా దృఢమైన ఆధారం లభించబోతోంది.
ఈ విషయం భాస్కర్ కి చెప్పాలని సుశీల ఎంతగా ఆరాటపడుతోన్నా భాస్కర్ రాలేదు - వెంకట్రావు వచ్చాడు! సుశీలని చూశాడు.
"ఎంత పని చేశావు సుశీలా? దీని పర్యవసానం అంత బాగుండదమ్మా!" అన్నాడు.
సుశీల తల దించుకుంది. తను చేసిన పనికి సుశీల కూడా ఇప్పుడు చాలా పశ్చాత్తాపపడుతోంది. నలుగురిలోనూ ఎంత అప్రతిష్ట? అదీగాక తను మింగిన విషంవల్ల గర్భంలో శిశువుకి ఏదయినా అయితే? ఏం కాలేదని డాక్టర్ చెప్పింది.