"లేదు లేదు. అయినా నేను ఈ పంజరం నుంచి తప్పించుకునే ప్లాన్ మీదే వున్నాను. త్వరలోనే శ్వేతని తీసుకుని ఎక్కడికయినా వెళ్ళి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను" అంది.
"అదే మంచిది. ఎన్నాళ్ళని ఆ చెరసాలలో మగ్గిపోతావు?"
"అందుకే ....." ఆమె మాట పూర్తికాకముందే ఆమె కెవ్వుమని అరిచిన అరుపు వినిపించింది.
కంగారుగా "సుమా" అని పిలిచాను. రిసీవర్ వదిలిపెటినట్టు అది దేనికో వూగుతూ రాసుకుంటున్న శబ్దం. సన్నగా ఎవరిదో మగకంఠం వినిపించింది దూరంగా. నాకు ముచ్చెమటలు పోశాయి. ఆ కంఠం బహుశా కృపానంద్ దే అయివుంటుంది. ఫోన్ లో ఆమె మాట్లాడే మాటలు వినివుంటాడు. మైగాడ్! ఇక ఆమెను భగవంతుడు కూడా కాపాడలేదు.
రిసీవర్ పెట్టేసి గాభరాగా అన్నాను, "అవతల ఎవరో సుమని హింసిస్తున్నారు."
జాన్ కూడా ఉలిక్కిపడ్డాడు. "కృపానందేనా".
"కావచ్చు. ఆ కంఠం అలాగే వుంది".
"మైగాడ్! ఇప్పుడెలా? ఆమెనెవరు రక్షించాలి?" కంగారుగా అన్నాడు. నేను నిష్శాబధంగా తలవంచుకున్నాను. ఎలా? ఇప్పుడెలా? నిస్సహాయంగా అనుకున్నాను.
అప్పుడు తట్టింది ఆ ఆలోచన.
వెంటనే దయను పిలిచి జేబులోని కృపానంద్ అడ్రస్ చేతికిచ్చి చేయాల్సింది చెప్పాను. ఆమె అది అందుకుని రిసీవర్ ఎత్తింది.
తరువాత నేను చెప్పిన నంబర్ ప్రకారం పోలీస్ స్టేషన్ కి రింగ్ చేసింది. "హలో..... నేను పాండురంగా నగర్ నుంచి మాట్లాడుతున్నాను...."
"............."
"ఇక్కడ మా ప్రక్కింటి ఆవిడ భర్త తన భార్యని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమెను కాపాడండీ. అని అరుస్తోంది దయచేసి మీరు వెంటనే వచ్చి ఆమెను రక్షించాలి."
అవతల అడ్రస్ అడిగినట్టున్నారు. దయ నేనిచ్చిన కాగితంలోకి చూస్తూ చెప్పింది. ఆ తరువాత కంగారు ధ్వనించేటట్టూ అన్నది......ప్లీజ్ సర్! అవతల ఆమె శవంగా మారబోతోంది. మీరే ఎలాగయినా మా ఏరియా స్టేషన్ కి ఇన్ ఫర్ మేషన్ పంపించండి."
"............."
"తప్పకుండా సర్! ఆమె కేకలు ఎక్కువవుతున్నాయి" ఫోన్ పెట్టేసింది. తరువాత నా వైపు తిరిగి, "ఇన్ ఫర్ మేషన్ పంపిస్తాడంటారా?" అంది.
"తప్పకుండా పంపిస్తారు" జాన్ అన్నాడు.
"నీలో ఇంత వాగ్ధాటి వుందని ఇప్పుడే తెలిసింది".
* * *
అరగంట తరువాత ఆ గదిలో ఫోన్ మ్రోగింది...... చప్పున రిసీవర్ అందుకున్నాను.
".....సుమని".
"ఏమయింది సుమా?"
"అవన్నీ తరువాత చెప్తాను. మీరు వెంటనే అక్కడినించి తప్పించుకోండి. కృపానంద్ పోలీసులని జాన్ ఇంటికి పంపిస్తున్నాడు. క్విక్!" వెంటనే ఫోన్ పెట్టేసింది.
నేను చప్పున లేచి నుంచున్నాను... జాన్ ప్రశ్నార్థకంగా చూసాడు. నేను దయవేపు తిరిగి- "చిన్న హెల్ప్ చేయాలి" అంటూ క్లుప్తంగా చెప్పాడు. ఆమె వెంటనే అర్థం చేసుకున్నట్టు తలూపి గబగబా వెనక తలుపు తీసుకుని పక్కింటి వాళ్ళని గోడమీంచి పిలిచి విషయం చెప్పింది. ఈలోపులో నేను శ్వేతని ఎత్తుకున్నాను. దయ తిరిగి లోపలికి వచ్చి "ఉండనిస్తామన్నారు రండి" అంది.
జాన్ తిరిగి "కృపానంద్ గానీ, పోలీసులుగానీ వస్తారు జాగ్రత్త" అని చెప్పి వెనక గుమ్మం గుండా దొడ్లోకి నడిచాను. దయకి పాపనిచ్చి, గోడ ఎక్కాను. తరువాత అటువేపు దూకి, పాపని అందుకున్నాను. "జాగ్రత్త దయా" అని చెప్పి వెనుదిరిగాను.
అక్కడొక యాభై ఏళ్ళవిడ వుంది. "రండి.....ఇటువేపు" అంటూ దారి తీసింది...... "నాతో దయ నిన్ననే విషయమంతా చెప్పింది. రండి" ఆవిడ మాట్లాడుతూనే అవుట్ హౌస్ తలుపు తెరిచింది. లోపలికి వెళ్ళాక ఫ్యాన్, బెడ్ లైటూ వేసి ఆ బెడ్ మీద పడుకోండి. నేను బయటనుండి తాళం వేసుకు వెళతాను" అని చెప్పి తలుపు దగ్గరకు లాగింది. తరువాత గొళ్ళెం పెట్టి తాళం వేస్తున్న శబ్దం. ఆవిడ వెళ్ళిపోతున్నట్టు ఎండుటాకుల శబ్దంక్రమక్రమముగా దూరమైంది.
ఆ తరువాత అంతా నిశ్శబ్దం.
బెడ్ మీద శ్వేతని పడుకోబెట్టి, ప్రక్కన కూర్చున్నాను. అంతా నిశ్శబ్దం.... అది నన్ను బాగా భయపెడుతోంది. ఏదో 'శబ్దం' కావాలి అనిపించసాగింది. అవుట్ హౌస్ చుట్టూ చెట్లు కూడా కదలకుండా నిశ్చలంగా వున్నాయి.
బయట కీచురాళ్ళ రొద తప్ప ఇంకేమీ వినిపించటములేదు. స్తబ్దత మాత్రం బాగా పేరుకుపోయింది.
టైమెంతయిందో చూసుకోవాలన్న స్పృహ కూడా కలగలేదు. అలాగే ఎంతసేపు కూర్చున్నానో నాకు తెలీదు.
బయట ఎవరో వస్తున్నట్టు, కాళ్ళక్రింద ఎండుటాకులు నలుగుతున్న శబ్దం. తాళం తీస్తున్నారు. ఒక్క క్షణం నా గుండె ఆగింది. వచ్చేది పోలీసులో, కృపానందో అయితే!?
ఆ ఆలోచన రాగానే స్ప్రింగ్ లా లేచాను. శ్వేతని ఎత్తుకుని తలుపు ప్రక్కన అనుకుని నించున్నాను. నేనాలా ప్రక్కన నిలబడటం, తలుపు తెరుచుకోవటమూ ఒకేసారి జరిగిపోయింది.
ఒక్కక్షణం నిశ్శబ్దం.
ఊపిరిని కూడా వదలకుండా బిగపట్టి నింసున్నాను. "వున్నావా?" వినిపించింది జాన్ కంఠం.
త్రోసుకుని వచ్చే నిట్టూర్పును భారంగా వదిలాను. ఒక్కసారిగా నా శరీరం ఆ నిటూర్పుతో రిలాక్సయింది.
తలుపుకు ఎదురుగా వచ్చి "ఏమయింది?" ఆత్రుతగా అడిగాను.
ఆ గది గుమ్మం దగ్గరున్న మెట్టుమీద నిస్పృహగా కూలబడుతూ, "పోలీసులతో సహా కృపానంద్ వచ్చాడు. ఇల్లంతా వెదికి, 'వాడెక్కడున్నా వెదికి పట్టుకుని తీరతాను' అంటూ రంకెలేస్తూ వెళ్ళాడు. అతడికి పోలీసుల్లో బాగా పలుకుబడి వున్నట్టుంది" అన్నాడు.
"మిమ్మల్నేమీ అనలేదుగా?"
"లేదు. సెర్చి వారంట్ లేనిదే లోనికి రానివ్వను అనగానే చల్లబడ్డారు. ఇంక బెదిరించటం అనేమాట మరిచిపోయుంటారు. సర్లే, రా వెళదాం" అన్నాడు.
ఇంతలో దయ కూడా వచ్చింది శ్వేతని అందుకుని వెనుదిరిగింది. జాన్ తాళం వేస్తుంటే నిస్త్రాణగా బయటికి అడుగుపెట్టాను.
అప్పటికే "హుష్..... పోలీసులు" అంటూనే వున్నాడు జాన్. నేనేదో అనబోతూండగా....కాంపౌండ్ అవతలనుండి "కౌన్ హై?!' అంటూ వినిపించింది చప్పున నేను లేచి జాన్ ని గోడచాటుకి లాగాను.
అప్పుడు పడింది టార్చ్ లైట్!
అంతకుముందే దయ ఆ మెట్టుమీద కూలబడి, లాగే ఏడుస్తోంది.
"క్యాహువా?" టార్చిలైటు వేసిన వ్యక్తి అడిగాడామెని.
"మీరేంటి మధ్యలో? మా ఆయన రాక నేనేడుస్తూంటే? ఈ మాయదారి కర్ఫ్యూలో ఎక్కడ చిక్కుపడ్డారో ఏమిటో!?" అంటూ మళ్ళీ ఏడవసాగింది.
ఆమె నటి కాకపోవచ్చు, కానీ అద్భుతంగా నటిస్తోంది. గోడచాటునుంచి ఆమెనే గమనిస్తున్నాను.
"ఒస్తరొస్తరు. ఫికర్ జెయ్యకండి. రేప్పొద్దున కర్ఫ్యూ గంటసేపు నికలా యిస్తున్నాం" చెప్పేసి, తన డారిన తను వెళ్ళిపోయాడు.
అతను బాగా దూరమయ్యాడనుకున్నాక ప్రాణం వచ్చిన మరబొమ్మల్లా లేచాము.
14
గెలుపుకీ ఓటమికీ మధ్య తేడా ఒక్కటే........సంతృప్తి!
* * *
ఉదయం తొమ్మిదింటికి కర్ఫ్యూ సడలించారు.
అదీ ఓ గంటసేపే.
జాన్ రెడీ అయి నా దగ్గరికి వచ్చి, "జాగ్రత్త. నేను వెళ్ళి స్టేషన్ లోనూ, బస స్టాండ్ లోనూ పరిస్థితి ఎలావుందో చూసి వస్తాను" అని చెప్పి వెళ్ళాడు.
దయ కాఫీ తెచ్చి అందిస్తూ. భగవంతుడు మనిషి కెందుకిన్ని పరీక్షలు పెడతాడో అర్థంకాదు" అంది.
"మీ దంపతుల సహకారమే లేకపోతే నేను ఒంటరిగా ఇన్ని కష్టాల నెదుర్కొలేకపోయేవాడిని" అన్నాను మనస్ఫూర్తిగా. పది నిమిషాలు కాకముందే జాన్ గాభరాగా లోపలికి వచ్చాడు. నుదురంతా చెమటలు పట్టి వుంది. నిస్పృహగా సోఫాలో కూలబడుతూ, "మంచినీళ్ళివ్వు" అన్నాడు.
ఏం జరిగిందని అడగాలని నాలుక చివరివరకూ వచ్చి అతని పరిస్థితి గమనించగానే ఆగిపోయింది. అతను మెల్లగా నీళ్ళుతాగి నా వంక చూస్తూ అన్నాడు.
"లాభంలేదు. నువ్వు హైదరాబాద్ దాటకుండా గట్టి వల పన్నాడు కృపానంద్!"
"పోలీసుల గస్తీ ఎక్కువయిందా?"
"కాదు. అదికూడా వుంది. అయితే అంతకన్నా పెద్ద ప్రమాదమిది. సిటీలో ఎక్కడ చూసినా నీ వాల్ పోస్టర్లు అంటించబడి వున్నాయి. కిడ్నాప్ వివరాలు వ్రాస్తూ నీ ఫోటో పెద్దగావేసి పట్టిచ్చిన వారికి పాతిక వేల బహుమానం, అని రాసి వుంది."
ఒక్కసారిగా సోఫాలో వెనక్కి వాలాను. అయిపోయింది. ఇక నేను సిటీ దాటే ప్రసక్తేలేదు. అలా అనుకోగానే నా నవనాడులూ కృంగిపోతున్న భావన ప్రారంభమైంది. నిశ్శబ్దంగా మోచేతి వంపులో ముఖం దాచుకుని కూర్చున్నాను. ఇంతా కష్టపడి ఇక్కడినుంచి అక్కడికి శ్వేతని చేర్చడానికి దారిలేక ఆగిపోవాల్సి వచ్చింది. బిగ్గరగా అరవాలనుకున్నాను.
"చచ్చిపో అంకిత్! నిన్ను బ్రతికించుకోవటానికి ఏ మాత్రం సహాయం చేయలేని ఈ తండ్రికి బిడ్డవైనందుకు సిగ్గుతోనయినా చచ్చిపో!" అని ఎలుగెత్తి చెప్పాలనుకున్నాను. సిగ్గేసి నిశ్శబ్దంగా వుండిపోయాను.
ఆ నిశ్శబ్దంలోంచి అప్పుడు వెలువడింది ఆ మాట. "శ్వేతని నేను వైజాగ్ చేరుస్తాను....."
నేను విభ్రాంతితో చూసాను. దయ నవ్వింది.
"అవును...... ఆ కృపానంద్ కి నువ్వూ, మా ఆయనా తెలుసు. పోలీసులుకూడా, పాపతో పాటూ వెళ్తూన్న "నీ" కోసం వెతుకుతూ వుండి వుంటారు. పాపని నేను తీసుకు వెళ్ళగలనని వాళ్ళు వూహించరు. ఆ పాపని మహారధికి అప్పగించే పూచీ నాది. సరేనా?"
"కళ్ళు"- మనసు బరువు దింపుకోవటానికి ఎంత బాగా పనిచేస్తాయి. ఆనందాన్నీ దుఃఖాన్నీ కూడా అవి ఆర్ద్రంగా బహిర్గతం చేయగలవు. ఆనందమో దుఃఖమో తెలియని స్థితిని కూడా కన్నీళ్ళతో ప్రక్షాళనం చేయగలవు. ప్రస్తుతం నా స్థితి అదే! ఆమె అంటోంది-