"మొదటి రాత్రి మజా దొరకలేదు చిన్న దొరకి. ఇంకా గండాలున్నాయ్... దొరా ! బెదిరిపోకు ..." అంటూ దస్త్రం విప్పాడు.
మురళి ఆశ్చర్యంగా నరసింహం వంక చూస్తూ "వీడికెలా తెలుసు" అని అడిగాడు.
"ఎవడో నలుసు పెద్దదొర మనసు బాధిస్తున్నాడు దొరా ! వాడెవడో కాదు ! చిన్న దొర రక్తం పంచుకున్నోడు - కాటేయాలని కాపు గాస్తున్నాడు. భద్రం దొర ! వాడికి విష కోరలున్నాయ్ - రక్తం కనుగుడ్లున్నాయ్."
నరసింహం గాబరాగా లేచి నిలబడ్డాడు. అతని మొఖం పాలిపోయింది.
రామలింగం దీన్నంతా అర్ధం కానట్టు చూస్తున్నాడు.
నరసింహం మరింత గాభరాపడి -
"ఏయ్, పోరా, ఇక్కడి నుంచి పో ముందు" అన్నాడు కంగారుగా.
"చెంపలేసుకో దొర ! కోయదొరను అవమానిస్తున్నావ్ ! సత్యం చెబుతాను మేము. సచ్చాడు సచ్చాడనుకున్నోడు సావనే లేదు దొరా! అండ పిండ బ్రహ్మాండమై కోడెత్రాసు పడగై బుసలు కొడుతున్నాడు. ఈయాలా రేపు కూడా దొరకి శోభనం జరగదు."
నరసింహం వాడి చేతిలో డబ్బులు పెట్టి పో! ఇక ఇంకేం వాగకు"
కోయదొర వెళ్ళిపోయాడు.
"వాడేమిటి, ఇవాళ అశుభం జరుగుతుందని అంటున్నాడు భయంతో కూడిన మొహంతో అడిగాడు రామలింగం.
"వాడి మొఖం వాడేదో వాగుతున్నాడు. అవన్నీ మనం పట్టించుకోకూడదు.
"మరి వాడెవడో రక్తం కళ్ళజూసేవరకు నిద్రపోడు అంటున్నాడు, ఎవరు వాడు.
"అన్నీ పిచ్చివాగుడ్లేరా.
"ఒకవేళ మనకు ఫోన్లు చేసేవాడు ఈ కోయదొర చెప్పినవాడు కాదుగదా?"
"వాడెవడో దొంగ వెధవని చెప్తున్నాను కదా ! కోయవాళ్ళ మాటలు నిజాలవుతాయా?"
సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది.
నరసింహం గుండె వేగంగా కొట్టుకుంది. చక చక వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు.
"హలో నరసింహం ! హౌ ఆర్ యూ ! కోయదొర ఏమంటున్నాడు?"
"ఎవరు నువ్వు ?"
"ఇంకా గుర్తు పట్టలేదా ? సరే కోడ్ మాట్లాడనా ముందు ?"
"కోడ్ లు తెలుసుకున్నంత మాత్రాన మాకొచ్చే నష్టం ఏమీ లేదు. దమ్ముంటే నా ఎదురుగా వచ్చి నిలబడు మసి చేసేస్తాను రెండు క్షణాల్లో" అన్నాడు నరసింహం కోపంగా.
"ఆహ్హహ్హహ్హ ! నన్ను మసి చేస్తావా ? ఎందుకీ ప్రగల్భాలు నరసింహం! ఇప్పుడు వచ్చిన కోయదొరని నేనే. కావాలంటే మరోసారి వస్తాగా వుండు" ఫోన్ పెట్టేశాడు.
ఒక చోట కూర్చుని రామలింగం, నరసింహం మాట్లాడుకుంటున్నారు.
ఆ గుసగుసలు పూర్తవగానే తనను గదిలోకి వెళ్ళమని సిగ్నల్ ఇస్తుందేమోనని ఆశపడ్డాడు మురళి.
కాని పావుగంట గడిచినా వాళ్ళ గుసగుసలు పూర్తికాలేదు.
అరగంట కూడా అయిపోయింది. మురళీకి కోపం, చిరాకూ, విసుగూ, ఇంకా అలాంటి బాపతు ఫీలింగ్స్ బోలెడు కలిగాయి.
తనూ తలుపు దగ్గరకు నడిచి అసలక్కడ ఏం జరుగుతుందోనని చూశాడతను. ఈసారి రామలింగం అన్నపూర్ణమ్మతో ఏదో గుసగుసలాడుతూ కనిపించాడు. ఉండుండి అతని ముఖ కవళికలు మారిపోతున్నాయ్.
ముందు అచేతనుడవటం, తర్వాత నిశ్చేష్టుడవటం, ఆ తరువాత కృంగిపోవటం కనిపించిందతనికి.
అలా ఇంకెంతసేపు వారి భంగిమలు గమనించాల్సి వచ్చేదోగాని, వెనుక గాజుల చప్పుడు వినిపించేసరికి వెనక్కు తిరిగిచూశాడు. రాధ అద్భుతమైన అలంకరణలతో శోభనం గదిలోకి వెళుతూ కనిపించింది.
ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె వెనుకే గదిలోకి పరుగెత్తాడతను.