Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 33


    రాధ ఫాన్ ఆపేసింది.

    "అమ్మో ! టైము మూడయిపోయింది. ఇంకాసేపట్లో తెల్లారిపోతుంది. ఇలారా - త్వరగా !" అన్నాడు మురళి టైమ్ చూచుకుంటూ.

    రాధ మంచంమీద కూర్చుంది సిగ్గుపడుతూ.

    మురళీ ఆవేశంగా ఆమెను కౌగిట్లోకి లాక్కున్నాడు. అంతే. ధడా ధడా శబ్దంతో ఆ విసురుకి పట్టెమంచం తాలూకు కింద పడబోయి అతి కష్టంమీద నిలదొక్కుకుని లేచి నిలబడ్డారు మళ్ళీ.

    "అలా మంచం విరిచేస్తే ఎలాగండీ ! నాన్నగారు మొన్నే రిపేర్ చేయించారు" అందామె నిష్టూరంగా.

    "మీ నాన్నకేమయినా బుడ్డి ఉందా ?" కోపంగా అడిగాడతను.

    "ఏమిటండి ఆ మాటలూ ? మర్యాదగా మాట్లాడలేరూ ?"

    "సారీ ! మీ నాన్నగారికి బుడ్డి లేదా రాధా ? శోభనం గదిలో ఇలాంటి మంచం ఏర్పాటు చేస్తాడా ?"

    "చేసింది ఆయనకాదు, మీ బాబాయ్ గారే. పైగా అది మా వంశ సాంప్రదాయమండి. ఈ గదీ, ఈ మంచం."

    "వద్దు. వద్దు. హిస్టరీ వద్దు" నీరసంగా కుర్చీలో కూలబడుతూ అన్నాడు.

    "పోనీ ఇంకోపని చేద్దామంటారా ?"

    "ఏమిటది ! మంచం మనమీద వేసుకుందామా ?"

    "అబ్బా - ఏమిటండీ ఆ మాటలు ? పరుపు కింద వేసేస్తే సరిపోతుంది."

    ఈ ఆలోచన బావుండి మురళీ లేచి మంచంమీద పరుపుచుట్టి ఎత్తి కింద పడేసి విప్పబోతూ - కెవ్వున అరచి ఎగిరి గంతేశాడు.

    ఆ కేకకు రాధ అదిరిపోయి కుర్చీ ఎక్కి నిలబడింది.

    మురళీ ఆ గదంతా  రెండు నిమిషాలపాటు ఎగిరి పూనకం వచ్చినట్లు ఊగుతూ, డాన్స్ చేస్తూన్నట్లు  స్టెప్స్ వేస్తూ చివరకు చొక్కా విప్పి విసిరిపారేశాడు.

    రాధ బెంబేలు పడిపోయి "ఏమిటండీ ?" అంది గాబరాగా.

    మురళి మరో రెండు రౌండ్లు పూర్తిచేసి, వగరుస్తూ కుర్చీ ఎక్కి నిలబడి "ఏదది ?" అనడిగాడు.

    "ఏమిటది ?" అడిగింది రాధ తెల్లబోతూ.

    "అదే బొద్దింక !"

    రాధకు నవ్వాగలేదు.

    "ఆహ్హహ్హ ! బొద్దింక కోసమా- ఇంతసేపు డాన్స్ లూ, రన్నింగూ చేశారు?"

    "అవును! బొద్దింక చొక్కాలో దూరటమంటే మాటలేమిటి ?" అన్నాడు.

    రాధ పగలబడి నవ్వసాగింది.

    "మీరెక్కడి మగవారండీ! ఆఫ్టరాల్ ఓ పురుగుని చూసి భయపడేవాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే చూస్తున్నాను."

    రాధ కుర్చీ దిగి పరుపు పరిచి పక్క వేసింది.

    "అయ్యో! టైము నాలుగయిపోయిందండి ! ఈ కాసేపయినా..."

    "నేను నా కంఠంలో ప్రాణం ఉండగా కుర్చీ దిగను.  ఆ బొద్దింక ఈ గదిలో లేదని నమ్మకం కుదిరేంత వరకూ ఇంతే !"

    రాధ బొద్దింక కోసం వెతకటం మొదలుపెట్టింది.

    "లేదండీ, వెళ్ళిపోయిందది !"

    "ఎక్కడికెళ్ళి ఉంటుంది ?"

    "వాళ్ళింటికి !"

    "వాళ్ళిల్లెక్కడ ?"

    "పక్కింటాళ్ళ  వంటిళ్ళు."

    "మరిక్కడి కెందుకొచ్చినట్లు ?"

    "షికారుకి !"

    అప్పుడే బయట ఆడంగుల గొంతులు వినిపించినయ్.

    "మీరు గట్టిగా నొక్కి పట్టుకోండి, నేను తీస్తాను."

    గది తలుపులు రెండూ కిర్రుమంటూ కదిలినయ్.

    "ఇంకొంచెం గట్టిగా లాగండి ! వెధవ తలుపులు బిగిసి పోయినయ్.

    తలుపులు ధళ్ మంటూ కదిలినయ్.

    "ఎవరంటావ్ ?" రహస్యంగా రాధనడిగాడు మురళి.

    "ఇంకెవరూ ! మా వాళ్ళే !"

    "ఏం చేస్తున్నారు?"

    "తలుపులు తెరిచేస్తున్నారు!"

    "ఎందుకు ?"

    "తెల్లారి పోతోంది కదా ..." నవ్వుతూ అందామె.

    మురళికి ఏడుపొచ్చేసింది. "అంటే ... అంటే"

    "ఇవాళ్టికి మన కథ కంచికే ..."

    "ఇదన్యాయం -"

    "ష్ ! అలా గట్టిగా అరవకండి, వింటే నవ్వుతారు."

    పెద్ద సుత్తితో తలుపు గొళ్ళెంమీద కొడుతున్న శబ్దం వినిపించసాగింది.

    అయిదు నిమిషాల్లో గొళ్ళెం వచ్చేసింది.

    "నేను వెళ్తున్నానండి !" అంది రాధ.

    "నువ్వెళ్ళటానికి వీలులేదు." ఉక్రోషంగా అన్నాడతను.

 Previous Page Next Page