Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 34


    "వివేక్! నేను పసిపిల్లని కాదు, ఏది మంచో! ఏది చెడో!. నాకు తెలుసు!"
    "అవునులే! నేను ఇలాంటి సమయంలో నీలో పెరుగుతున్న శిశువు తండ్రి నీతోనే ఉండాలని కోరుకోవటం సహజం."   
    సహించలేకపోయింది యశోద. వివేక్ చొక్కా కాలరు పట్టుకుని, కోపంగా ఊపుతూ అంది...
    "నువ్వు మనిషివి కావు. పశువ్వి! నీలో ఉన్నది ప్రేమ కాదు. పచ్చి పైశాచికత్వం."
    మానసిక క్షోభ భరించలేక, మంచం మీద బోర్లాపడుకుని, కుమిలి కుమిలి ఏడ్చింది.
    చిత్రంగా ఆమె అలా ఏడుస్తోంటే, వివేక్ కి ఏదో సంతృప్తి కలిగింది. పైకి ఏడవకపోయినా అతడి మనసు లోలోపల మరిగిపోతుంది... కన్నీళ్ళకి అతీతమైన దుఃఖం అతనిది. తన మనసు అంతగా క్షోభిస్తున్నా యశోద మాత్రం నవ్వుతూ నిర్లక్ష్యంగా తిరగటం, అతనికి సహింపరానిదిగా ఉంది.

    ఇప్పుడు యశోద కూడా ఏడుస్తుంటే, తనతోబాటు ఆమె కూడా క్షోభిస్తున్నందుకు కొంత శాంతిగా ఉంది. మనసుకి కానీ ఆ సంతృప్తి క్షణికమే! పొంగి వచ్చే దుఃఖాన్ని అణుచుకుంటూ, యశోద ఏడుస్తోంటే చూడలేకపోయాడు.
    దగ్గరగా వెళ్ళాడు ఓదార్చాలని కానీ, యశోద తోక తొక్కిన తాచులా, బుస కొట్టి ఛీత్కారం చేసింది. చెదిరిపోయాడు పారిపోయాడు.  
    యశోద పుట్టింటికి వచ్చి మూడు రోజులయింది, కానీ అత్తగారింటికి వెళ్తానని అనడం లేదు. పార్వతికీ, దక్షిణామూర్తికీ ఆందోళనగా ఉంది. అత్తగారిల్లూ, పుట్టిల్లూ ఒకే ఊళ్ళో ఉండటం వల్ల యశోద తరచూ పుట్టింటికి వచ్చిపోతుండటం మామూలే.
    యశోద వరసగా నాలుగు రోజులు రాకపోతే, పార్వతి బెంగపెట్టుకుని ఫోన్ చేసేది. కానీ ఎప్పుడు వచ్చినా, రెండు మూడు గంటలకంటే ఎక్కువ ఉండేది కాదు యశోద.
    ఒక్కరాత్రి కూడా పుట్టింట్లో పడుకోలేదు. పార్వతి పైకి నిష్టూరాలాడినా, కూతురూ అల్లుడూల అన్నోన్యం చూసుకుని మురిసిపోయేది. అలాంటిది మూడురోజులయినా అత్తవారింట ప్రస్తావన లేకపోవడం పార్వతికీ, మూర్తికీ ఆశ్చర్యం కలిగించింది. భయమూ వేసింది...
    కట్టుబట్టలతో, హాండ్ బాగ్ తో వచ్చింది యశోద. తనకు కావలసినవన్నీ పుట్టింట్లోనే కొనుక్కుంది.
    యశోద ఒకేసారి అరడజను చీరలు, వాటికి సరిపోయే జాకెట్లు, వగైరాలు కొనుక్కోవడం పార్వతికి ఆందోళన కలిగించింది.
    "ఒకసారి యశోదతో మాట్లాడి. విషయమేమిటో తెలుసుకో!" అన్నాడు మూర్తి.
    "నేనూ అదే అనుకుంటున్నాను... వొట్టి మనిషి కూడా కాదు.... మనకి యశోదని బాగా తెలుసు. తొందరపడి, ఆవేశంలో నిర్ణయం తీసుకునే పిల్ల కాదది."
    "అందుకే మరింత బెంగగా ఉంది. ఛాదస్తంగా అమ్మమ్మల కాలం నాటి నీతులు చెప్పి, దాని మనసు బెదరగొట్టకు. విషయం తెలుసుకో! అంతే" హెచ్చరించాడు మూర్తి. తలూపింది పార్వతి.     
    "అమ్మమ్మల కాలం అయినా, ఏ కాలం అయినా ఆడదాని జీవితంలో పెద్ద మార్పు లేదు" అనుకుంది నిరాశగా.
    క్లినిక్ నుండి పుట్టింటికే వచ్చింది యశోద. టీ, టిఫిన్లు, అయిన తర్వాత అసలు విషయంలోకి వచ్చింది పార్వతి.
    "ఇన్నిరోజులు ఇక్కడ ఉండిపోయావ్. అల్లుడుగారు నీకోసం బెంగపెట్టుకోరా?"
    ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎదురు చూస్తూనే ఉంది యశోద, సమస్య అతి సున్నితమైనది. దీనికి తను ఒక్కర్తే అయితే, ఎలాగయినా తట్టుకోగలదు. తల్లికి ఎలా వివరించాలో అర్థం కావటం లేదు.
    "ఎన్ని రోజులయిందేం మహా? మూడురోజులేగా!" గారాలుపోతూ చిన్న పిల్లలాగ అంది యశోద.
    "ఇదివరకు మూడు గంటలు కూడా ఉండే దానివి కాదు!. మూడు రోజులు కాదు. నీవు ఎన్నాళ్ళు మాతో ఉన్నా మాకు సంతోషమే!. కానీ...."
    "అడిగెయ్యి.... మనసులో ఉంచుకోకు"
    "అక్కడేం గొడవలు రాలేదు కదా, అని"
    తప్పదు, ఇప్పుడిక కొంతయినా నిజం చెప్పాలి.
    "వివేక్ తో నాకు కొంచెం అపార్ధాలొచ్చాయి... కొంత కాలం ఇక్కడుంటాను. అవి సర్దుకొనే వరకూ"
    గుండె ఝల్లుమంది పార్వతికి. అల్లుడంటే, ఆవిడకి మంచితనానికి ప్రతిరూపం, అలాంటివాడితో అపార్థాలా? ఏమిటీ ఈ కాలం పిల్లలు? భర్తతో అపార్ధాలు వచ్చాయని ఎంత తాపీగా, ఎంత నిశ్చింతగా చెపుతుంది? వచ్చి కూతురి పక్కన కూచుంది పార్వతి "అపార్ధాలొస్తే వెంటనే సర్దుబాటు చేసుకోవాలిగానీ, ఇలా దూరం వచ్చేసి మరింత పెంచాలనుకుంటారా? ఇంతకీ ఎందుకు వచ్చాయి అపార్ధాలు?"    
    "అపార్ధాలు ఎందుకొస్తాయి?. ఒకరినొకరు అర్థం చేసుకోపోతే వస్తాయి....!" నవ్వటానికి ప్రయత్నించింది.   
    పార్వతి వదల్లేదు "ఏ విషయంలో వచ్చాయి అపార్ధాలు? ఎందుకు జరిగింది? నాకు వివరంగా చెప్పు..."
    "నేను జానీతో మాట్లాడానని అతడు అనుమానించాడు..."
    గుండె ఝల్లుమంది పార్వతికి. మిగిలిన ఏ విషయాల మీద అపార్ధాలు వచ్చినా ఫర్వాలేదు. కానీ ఇలాంటి అనుమానాలయితే కొంపలు మునుగుతాయి.
    "నువ్వు జానీతో ఎందుకు మాట్లాడావు?"
    "ఏం మాట్లాడితే? ఒకళ్ళపై మరొకళ్ళకి అనురాగమూ, విశ్వాసమూ ఉండాలి. మాట్లాడినంత మాత్రాన అపార్ధాలు రావాలా? ఏ విషయంలో మాత్రం అపార్ధాలూ, తర్జన భర్జనలూ, గొడవలూ ఇవన్నీ దేనికీ? ఇష్టమైతే కలిసి ఉండాలి! లేకపోతే విడిపోవాలి."   
    హడిలిపోయింది పార్వతి. ఇప్పటి వరకూ ఆవిడ ఇవన్నీ ఏవో చిలిపి తగువులనుకుంటోంది. విషయం ఏదో ఉంది. యశోదకి నచ్చజెప్పి కాపురం నిలబడేలా చూడాలి.
    "యశూ! ఏమిటమ్మా, ఇది? విడిపోయే ప్రస్తావన దేనికీ? ఏం జరిగింది?"
    తల్లి ఆందోళన అర్థమయింది యశోదకే మనసు కృంగిపోయింది. ఈ సమస్యలో తను ఒక్కర్తీ లేదు. ఇటు తల్లీ అటు అత్తగారూ ఉన్నారు.    
    "ఏమి లేదమ్మా! అన్నీ సర్దుకుంటాయి. కొంచెం టైం కావాలి. నన్ను ఇక్కడ కొన్ని రోజులు ఉండనియ్యలేవా?"
    "అలా మాట్లాడకు యశూ! నువ్వు ఎన్నాళ్ళున్నా నాకేం కష్టం? కానీ నీ సంసారం....."
    "అది నా సంసారం మాత్రమేనా? అతని సంసారం కాదా? నిలుపుకోవాలనే ఆశ, ప్రయత్నం ఇద్దరిలోనూ ఉండక్కరలేదా?"
    పార్వతికి ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ఈ భాష కొత్తది. ఇప్పుడిప్పుడే సమాజంలోకి వస్తోంది యశోద.

 Previous Page Next Page