"అంటే నేనీ బ్రీఫ్ కేసులు తీసుకుని పారిపోతాననుకున్నారా ఇద్దరూనూ?"
శాస్త్రి "అది కాదు...." అంటూ ఏదో చెప్పబోయాడు. అప్పుడు పేల్చాడు ఇబ్రహీంఖాన్.
తను మోసగింపబడ్డానని, బ్రీఫ్ కేసులు తనకందించవలసిన వ్యక్తి చీకట్లో కల్సిపోయాడని, సిరిచందన తమ నుంచి తప్పించుకుందని, తన అనుచరుడు తనని మోసం చేసాడని, ఇన్ని కారణాలు కలగాపులగమై అతన్ని ఆ క్షణం రాక్షసుడ్ని చేసాయి. వరుసగా నాలుగుసార్లు రివాల్వర్ పేల్చాడు. శాస్త్రి ఛాతీ తూట్లు పడింది. మారు మాట్లాడకుండా అతను అక్కడే మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. మరుక్షణం అతని ప్రాణాలు గాలిలో కల్సిపోయాయి.
* * *
కారు నుంచి దూరంగా వెళ్ళి నిలబడ్డ మహర్షి కనుగొసల్నించి చూడసాగాడు. ఇబ్రహీంఖాన్ ఆ బ్రీఫ్ కేసులు తీసుకొని చెట్టుచాటుకు వెళ్ళటం అక్కడ బ్యాటరీలైటు వెలుగులో ఆ బిస్కెట్లని పరీక్షించటం గమనించాడు.
అవి డూప్లికేట్ వే అయ్యుంటాయి అనే అనుమానం మహర్షికి అసలు రాలేదు. అతడి మనసంతా సిరిచందన పరిస్థితి గురించి ఆందోళనతో నిండివుంది.
ఈ బిస్కెట్లు తీసుకుని వాళ్ళు సిరిచందనని వదిలిపెడితే అంతే చాలు అన్న భావనలో వున్నాడు.
ఈ లోపులో ఇబ్రహీంఖాన్ బ్రీఫ్ కేసు మూసేసి తనని పిలిచినా శబ్దం వినిపించింది. అతడు తిరిగి కారువైపు నడవసాగాడు. అతడు కారు దగ్గరకి వచ్చుంటే మరుక్షణం అతని ప్రాణాలు పోయుండేవి. కాని అదే టైం పొదల్లో అలికిడి వినిపించింది. అతడు తలతిప్పి అటు చూశాడు. అట్నుంచి ఒక ఆకారం దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తూ కనపడింది. అలా వస్తున్నదెవరో అర్థంకాక అతడు ఆగిపోయాడు. దగ్గరికొచ్చేసరికి అతడి కళ్లు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె సిరిచందన!
అతడేదో అనబోతూ వుంటే ఆమె గాలిలా వచ్చి అతని నోటిమీద చెయ్యి అడ్డుపేట్టి, సన్నటి స్వరంతో "ష్!" అంది.
అతడు కూడా పరిస్థితి అర్థమైనట్టు ఏమీ మాట్లాడకుండా ఆమెతో కలిసి రోడ్డు పక్కకి దిగిపోయాడు.
ఈ లోపులో మళ్ళీ రెండుసార్లు ఇబ్రహీంఖాన్ అరవటం , శాస్త్రితో అతడి సంభాషణ వినిపించాయి.
తమ కళ్ళముందే శాస్త్రిని ఇబ్రహీంఖాన్ చంపేయటం చూసి సిరిచందన భయంతో వణికిపోయింది. లతలా మహర్షిని అల్లుకుపోయింది. ఆ తరువాత బ్రహీంఖాన్ చీకట్లో కలిసిపోయేంత వరకూ వాళ్ళేమీ మాట్లాడుకోలేదు.
అతడు పూర్తిగా దూరంగా వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత మహర్షి కదిలి "ఏం జరిగింది సిరీ?" అని అడిగాడు.
అప్పుడు గుర్తించిందామె -తను అతని కౌగిలిలో వున్నట్లు! ఒకరినొకరు పొదివి పట్టుకొని వున్నారు. ఆ విషయం గుర్తించి ఆమె అతన్నించి దూరంగా జరిగింది.
మొత్తం జరిగినదంతా చెప్పింది.
తనని రక్షించటం కోసంఆమె అద్భుతమైన తెలివితేటలతో ఈ విధంగా శాస్త్రిని పూరిగొల్పింది అని తెలిసిన మహర్షి దాదాపు కదిలిపోయాడు. ఆమెని తిరిగి దగ్గరికి తీసుకోవాలనే కోర్కెని అతికష్టంమీద అణచుకొని, కృతజ్ఞత నిండిన కంఠంతో "నీకు నేనెలా థాంక్స్ చెప్పుకోవాలో తెలియటంలేదు. ఒకవేళ పోలీసులుఆడిన నాటకంవల్ల అవి డూప్లికేట్ బిస్కెట్లే అయ్యుంటే నా ప్రాణాలు పోయి వుండేవి" అన్నాడు.
అప్పటికి సిరిచందన టెన్షన్ తగ్గింది. తాము పూర్తిగా ప్రమాదంలోంచి బయటపడ్డామన్న నమ్మకం కుదిరింది. సన్నగా నవ్వుతూ "భర్త ఎంతపోలీసాఫీసరైనా, తన భార్య గురించి అంత రిస్క్ తీసికోడులే. పద వెళదాం ఇక్కడ వుండటం మనకి రిస్కు" అంది.
ఇద్దరూ కారు దగ్గరకొచ్చారు.
10
అరకురోడ్డు -డెభ్బైవ కిలోమీటరు దగ్గర కూర్చొని వున్నారు కమీషనర్ అశ్వత్ధామ, రవితేజ.
చుట్టూ కన్ను పొడుచుకున్నా కనిపించనంత చీకటి అలుముకొని వుంది.
మహర్షికి తెలియకుండా అతని వెనకే ఫాలో అవుతూ, అక్కటివరకూ వచ్చి ఆగారు.
"బ్రీఫ్ కేసులు అందగానే వాళ్ళు సిరిచందనని వెంటనే వదిలిపెడతారో లేదో" నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అన్నాడు రవితేజ.
"వదిలిపెడతారు" అన్నాడు కమీషనర్. "సాధారణంగా కిడ్నాపర్న్ బందీని తమదగ్గిర ఎక్కువసేపు ఉంచుకోవటానికి ఇష్టపడరు. వీలైనంత త్వరగా వదిలించుకోవటానికే ప్రయత్నం చేస్తారు.".
"మహర్షి ఆ డెబ్బై అయిదోకిలోమీటర్ రాయి దగ్గర ఆగాడో లేదో!" తను వేసిన ప్లాన్ కి పునాది కోసం మొదటి రాయి వేస్తూ రవితేజ అన్నాడు.
అశ్వత్ధామ అతడివైపు అనుమానంగా చూస్తూ "మీ డ్రైవర్ చాలా నమ్మకస్థుడనీ, అతడికి బ్రీఫ్ కేసులు ఇచ్చి పంపించవచ్చని చెప్పావుగా?" అన్నాడు.
"పది లక్షల విలువచేసే బంగారాన్ని చూస్తే ఎంత నమ్మకస్థుడికైనా ఆశ పుట్టడంలో ఆశ్చర్యం ఏమీ లేదు సర్"
కమీషనర్ నవ్వాడు. "ఒరిజనల్ బంగారం మన దగ్గిరే వుంది రవితేజ!"
యధాలాపంగా సంభాషణ జరిపిస్తున్న రవితేజ బాంబుపడ్డట్టు అదిరి పడ్డాడు. "ఏమిటి సర్, మీరంటున్నది?" అన్నాడు తడబడుతున్న గొంతుతో.
"మనం మీ డ్రైవర్ చేత పంపించింది డూప్లికేట్ బిస్కట్లు."
రవితేజ గొంతు తడారిపోయింది. "అంటే.... అంటే...." అన్నాడు.
"అవును. అంత విలువగల బిస్కెట్లని ఒక మామూలు డ్రైవర్ చేత పంపించటానికి నేనెందుకు ఒప్పుకున్నాననుకున్నావ్? అలాంటి ఆకారంలోనే ఉన్న డూప్లికేట్ బిస్కెట్లు తయారుచేయించాను. ఆ ప్రసక్తి రాలేదు కాబట్టి ఇంతసేపు నీతో చెప్పలేదు."
రవితేజకి సంతోషించాలో, బాధపడాలో అర్థంకాలేదు. తను తయారు చేయించింది డూప్లికేట్ బిస్కెట్లకి, డూప్లికేట్ అన్నమాట. పదిలక్షలు చేతికందినట్టే అంది, జారిపోయాయి.
రవితేజ మొహం వెలవెలాపోయింది. అతని మొహంలో భావాలు కమీషనర్ కి కనిపించకుండా చీకటి రక్షించింది. అతికష్టం మీద తనని తాను నిభాయించుకున్నాడు.
ఒక రకంగా ఆలోచిస్తే ఇదీ తన మంచికే వచ్చింది అనిపించిందతనికి. ఇబ్రహీంఖాన్ వాటిని పరీక్షించి, అవి డూప్లికేట్ వని తెలిసి మహర్షిని చంపేస్తే. అప్పుడు అశ్వత్ధామకి కూడా అనుమానం రాదు. పోతే తనకి మాత్రం ఆ పదిలక్షల బంగారాన్ని సొంతం చేసుకొనే అవకాశం పోయింది.
ఈ విధంగా ఆలోచిస్తూ రవితేజ కంఠంలోకి మరింత టెన్షన్నీ, సంశయాన్నీ తెచ్చుకుంటూ "సర్, ఒకవేళ ఆ ఇబ్రహీంఖాన్ బ్రీఫ్ కేస్ తెరిచి, అందులో ఉన్నవి డూప్లికేట్ బిస్కెట్లని కనుక్కొని, సిరిచందనకి ఏదైనా ద్రోహం చేస్తే?" అన్నాడు.
"చెయ్యరు. కిడ్నాపర్సు అలా చెయ్యరు" అన్నాడు కమీషనర్ తన అనుభవాన్ని రంగరిస్తున్నట్టు. ".....మనమీద మరింత వత్తిడి తీసుకురావటం కోసం వాళ్ళు మనల్ని భయపెడతారు. మరీ అంతగా వాళ్ళకి అనుమానం వస్తే అది నీ డ్రైవర్ మీదకే వెళుతుంది" అంటూ యేదో చెప్పబోతూ ఉండగా దూరంనుంచి గాలిలో రివాల్వర్ పేలిన శబ్దం వినవచ్చింది. ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
"సర్, సిరిచందన....." అంటూ అతనేదో అనబోయాడు. ఈ లోపులో కమీషనర్ "స్టార్ట్ ది కార్, క్విక్" అని అరిచాడు. రవితేజ కారు స్టార్టు చేసి వేగంగా ముందుకి పోనిచ్చాడు. వాళ్ళు మరో మూడు కిలోమీటర్లు దగ్గరికి వెళ్ళేసరికి రివాల్వర్ శబ్దం నాలుగుసార్లు వినిపించింది. రవితేజ మరింత వేగంగా హెచ్చించాడు. ఆగమేఘాలమీద కారు చీకట్లని చీల్చుకుంటూ దూసుకుపోయింది. డెబ్బై అయిదో కిలోమీటరు రాయి దగ్గిర తమ కారు కనపడింది. రవితేజ వాహనాన్ని స్లో చేసి తమ కారు పక్కన ఆపు చేసాడు. ఆ కారు లైటు వెలుతురులో మహర్షి, సిరిచందన కనపడ్డారు.
అశ్వత్ధామ సిరిచందన క్షేమంగా ఉండటం చూసి కమీషనర్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. రవితేజ మాత్రం ఏ గాయమూ లేకుండా చీకటిలోంచి మహర్షి రావటం చూసి అవ్వాక్కయినట్టు అలాగే ఉండిపోయాడు.
* * *
రెండు కార్లూ వచ్చి గెస్ట్ హౌస్ ముందు ఆగాయి. మొదటి కారులోంచి మహర్షి, సిరిచందన దిగారు. రెండో కారులో రవితేజ, అశ్వత్ధామ ఉన్నారు. రవితేజ మొహం జేవురించి వుంది.
కిడ్నాప్ జరిగిన స్థలంలో సిరిచందన ప్రవర్తనకి అతడు డీప్ షాక్ లోకి వెళ్ళిపోయాడు. అశ్వత్ధామే అతన్ని గెస్ట్ హౌస్ వరకు తీసుకురావలసి వచ్చింది.
మహర్షితో వస్తున్న సిరిచందనకి ఎదురుగా వెళ్ళి అతడు ఆమెని దగ్గరకి తీసుకోబోయాడు. ఆమె జడపదార్ధం లాగా కదలకుండా ఉండటం చూసి, అతడికి ఆశ్చర్యం కలిగింది. రాగానే తన గుండెలపై వాలి "మళ్లీ మిమ్మల్ని చూస్తానను కోలేదండీ" అంటూ రోదిస్తుందని ఊహించిన అతను, నిర్లిప్తంగా ఉండటంతో అనుమానంగా ఆమె చుబుకాన్ని పైకెత్తి కళ్ళల్లోకి వెతుకుతూ "సిరీ" అని పిల్చాడు.
ఆమె రోషంగా తలెత్తి ఏదో అనబోయింది. అంతలో కమీషనరుగారు రావటంతో అప్రయత్నంగా ఆగిపోయింది.
"ఏం జరిగింది?" అని అడిగాడు అశ్వత్ధామ కంగారుగా.
ఈ లోపులో మహర్షి జరిగిందంతా చెప్పాడు. దూరంగా పడివున్న శాస్త్రిశవం దగ్గరికి వెళ్ళి కమీషనర్ పరీక్షించాడు. తిరిగివస్తూ "అతని ప్రాణం పోయింది" అన్నాడు.
"పదండి వెళ్దాం. అంతా గెస్ట్ హౌస్ కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు" అన్నాడు రవితేజ కదుల్తూ.
సిరిచందన అతనితోపాటు కారు దగ్గరికి వెళ్ళకుండా మహర్షితో "పద, నన్ను గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేద్దువుగాని" అంది.
"బాంబుపడ్డట్టు అదిరిపడ్డాడు రవితేజ. "అదేమిటి సిరీ! రా మనం వెళదాం, అతను కారు తీసుకుని గెస్ట్ హౌస్ కి వస్తాడ్లే" అన్నాడు.
సిరిచందన అతని మాటలు వినబడనట్టు "పద మహర్షీ" అని వెళ్ళి కారులో కూర్చుంది.
వెనకనుంచి రవితేజ "నీకేమైనా మతిపోయిందా?" అంటూ ఆమెతోపాటు కారు దగ్గరికి నడవబోయాడు.
ఆమె బిగ్గరగా "ప్లీజ్, డోంట్ కమ్! మీ కారులో మీరు రండి" అని మహర్షివైపు తిరిగి వచ్చి" డ్రైవ్ చేస్తావా? నన్ను తీసికెళ్ళి పోమ్మంటావా ఈ కారుని?" అని అడిగింది.
మహర్షి ఇబ్బందిలో పడ్డట్టు ఇద్దరివైపూ చూశాడు. ఆ పరిస్థితిని ఎక్కువసేపు కొనసాగనివ్వకుండా ఉండాలన్నట్టు అశ్వత్ధామ కల్పించుకొని "నువ్వు తీసుకురా ఆమెని" అని, రవితేజ వైపు తిరిగి "రా రవితేజా, మనం ఈ కారులో వెళదాం. అక్కడికెళ్ళి విపులంగా మాట్లాడుకోవచ్చులే" అన్నాడు.
అదీ జరిగింది. రవితేజ అవమానంతో కారులో ప్రయాణిస్తున్నంతసేపూ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. కమీషనర్ కూడా అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. ఆయనకీ కూడా సిరిచందన ప్రవర్తన ఎందుకలా వుందో అర్థంకాలేదు. గెస్ట్ హౌస్ ముందుదిగి ఆమె లోపలికి వెళ్ళబోతూంటే రవితేజ "సిరీ, ఎందుకంత కోపంగా ఉన్నావ్" అని ప్రశ్నించాడు చేయి పట్టుకుని.