Previous Page Next Page 
అతడు ఆమె ప్రియుడు పేజి 35


    ఆమె అతని చేతిని విదిల్చుకుంటూ "బి కాజ్ ఐ హేట్ యూ" అంది ఒక్కొక్క అక్షరాన్నీ వొత్తొత్తి పలుకుతూ.

    "ఎందుకు.... నేనేం తప్పు చేశాను?" అదే స్థాయిలో అడిగాడతను.

    "ఒక్క తప్పుకాదు.....అసలు మీరు ఒప్పుంటూ ఏం చేశారు గనక? కట్టుకున్న భార్యనీ, సమాజాన్నీ మోసం చేయటం తప్పు కాదా?" ఆవేశంలో ఆమె ముక్కుపుటాలు అదురుతున్నాయి.

    "అంటే.....?" రవితేజ భృకుటి ముడిపడింది.

    "మీకు నా వల్లే కళ్ళు పోయాయనీ..... నా వల్ల మీరు చీకటిలో దుర్భరంగా జీవితాన్ని కొనసాగించకూడదనీ..... మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నాను. ప్రతిక్షణం మిమ్మల్ని చూస్తూ నేను చేసిన పొరపాటును గుర్తు తెచ్చుకుని కుమిలిపోతూ ఎంత నరకం అనుభవించాను? అందుకు ప్రతిఫలం మీరేం చేశారు? అమాయకంగా మమ్మల్నందర్నీ నమ్మించి కళ్ళు లేనట్టు నాటకమాడారు. మీరూ, కమీషనరుగారూ కలిసి ఆ బంగారం కాజేయాలని ప్లాన్ వేశారు. ఇంకేం...... దొరికింది కదా మీ బంగారం మీకు? తీసుకోండి చెరిసగం, పంచుకొని మేడలు కట్టుకోండి......" కోపం కాస్తా దుఃఖంగా మారి, చేతుల్లో మొహం దాచుకొని రోధించసాగింది.

    ఆమె దగ్గరికి వెళ్ళి చేతిని తొలగించబోయాడు. "నో....నన్ను తాకకండి. నా భర్త ఒక నమ్మకద్రోహి, దేశద్రోహి అని చెప్పుకుని తిరగలేను. ఇకముందు నన్ను కలవటానికి ప్రయత్నించకండి" అని అతనికి దూరంగా జరిగింది.

    "అమ్మా సిరీ, నువ్వు చాలా పొరపడ్డావమ్మా" అంటూ కమీషనర్ అశ్వత్ధామ  ఆమె దగ్గరికి రాబోయాడు.

    "అవునంకుల్. నేను నిజంగానే పొరబడ్డాను. అందర్నీ.....అందర్నీ నమ్మటమే నేను చేసిన  పొరపాటు" అంటూ హిస్టీరిక్ గా ఏడుస్తూ అంది.

    "లేదు సిరీ! నువ్వు రవిని అపార్థం చేసుకుంటున్నావ్. గవర్నమెంట్ కి హాండోవర్ చేయకుండా ఆ రెండు  బ్రీఫ్ కేసుల్నీ బ్యాక్ లాకర్లో దాచింది నేనే. అలా  ఎందుకు దాచానో తెలుసా? ఒకవేళ అలా దొరకగానే అవి గవర్నమెంట్ కి  హాండోవర్ చేస్తే, ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ మళ్ళీ కనిపించకుండా తప్పించుకుంటుంది. అవి ఇంకా మా ఆధీనంలో వున్నాయని తెలిస్తే మా మీద ఎటాక్ చేయటానికి రావొచ్చు. అప్పుడు వాళ్ళని పట్టుకోవాలని మా ప్లాన్. ఈ విషయంలో తేజాకి ఎట్టి సంబంధమూ లేదు. అనవసరంగా అతన్ని అపార్థం చేసుకుని నీ జీవితాన్ని నరకం చేసుకోకు" అనునయంగా చెప్పారు అశ్వత్ధామ.

    "మరి కళ్ళు పోయినట్టు నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చింది?"

    "రవి కల్పించుకొని "కళ్ళు పోవటమనేది అబద్ధం కాదు. అయితే, మహర్షి తెచ్చిన మందువల్ల తిరిగి నాకు కళ్ళొచ్చాయి" అన్నాడు.

    "మరయితే అప్పుడు మీకేం కనిపించటంలేదని ఎందుకు అబద్ధం చెప్పారు?" సూటిగా ప్రశ్నించింది.

    రవితేజ క్షణకాలం తత్తరపడ్డాడు. ఏం చెప్పాలో తోచలేదు. అతను  మౌనంగా ఉండటంతో ఆమె అనుమానం ధృవపడటానికి ఆస్కారం దొరికింది.

    "చెప్పండి! మీరు సమాధానం  చెప్పలేరు. కానీ తప్పు చేయలేదని మాత్రం వాదించగలరు. మీరు అంధుడిగా కొనసాగించింది నా మీద డిటెక్టివ్ గా పనిచేయటం కోసమేగా, కాదని  నాకు. నా భర్త ఏ  తప్పూ చేయలేదని రుజువైన రోజు నేనే క్షమాపణలు కోరతాను. దయచేసి అంతవరకూ నన్ను మాట్లాడించే ప్రయత్నం చేయొద్దు" అని  విసవిసా నడుచుకుంటూ లోపలికెళ్ళి బెడ్ రూం  తలుపు ధడేలున వేసుకుంది. రవితేజ కూడా ఆమెతోపాటు వెళ్ళబోతూంటే అశ్వత్ధామ అతన్ని ఆపుచేసి, "రవీ, ఆమెని కొంచెం రిలాక్స్ అవనివ్వు. ఈ పరిస్థితిలో నువ్వేం చెప్పినా ఆమె కర్థంకాదు. కొంతకాలం వెయిట్ చేయటమే మంచి పద్ధతని నాకు తోస్తోంది" అన్నాడు.

    రవితేజ తన కోపాన్ని, ఉద్వేగాన్నీ కంట్రోల్ చేసుకుంటూ "సరే  సర్ , అన్నాడు.

    "నే వెళ్తాను. అక్కడ రోడ్డుమీద పడివున్న శవం గురించి ఏర్పాట్లు చేయాలి" అని కమీషనర్ అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో రవితేజకి ఇలాంటి పనులు చెప్పటం ఆయన కిష్టంలేకపోయింది. రవితేజ మరో గదిలోకి వెళ్ళి అతడు కూడా తలుపేసుకున్నాడు. కమీషనర్ కారు స్టార్ట్  అయి  వెళ్ళిపోయింది. మహర్షి ఒక్కడే చీకట్లో నిలబడిపోయాడు. అతడి మనసులో కూడా అదే చీకటి అలుముకున్నట్టు అనిపించింది. ఎక్కడ ప్రారంభమైన కథ  ఎటు వెళుతుందో అతనికి అర్థంకాలేదు.


                               11

    అర్థరాత్రి పన్నెండు గంటలకి ఎందుకో మెలకువ వచ్చింది మహర్షికి. అతడు కూడా ఆ రాత్రి గెస్ట్ హౌస్ లోనే పడుకున్నాడు. ఆ భార్యాభర్తల ప్రవర్తన చూస్తుంటే ఏదన్నా అఘాయిత్యం జరుగుతుందేమోనని భయం వేసింది. అందువల్ల వాళ్ళిద్దరూ చెరో గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకోగానే అతడు  అంతకుముందు సారి పడుకున్నట్టే వరండాలో పక్కవేసుకుని నిద్ర కుపక్రమించాడు.

    తనకెందుకు మెలకువొచ్చిందో అతడికి మొదట అర్థం కాలేదు. గుమ్మం దగ్గరికొచ్చి చూశాడు. రెండు గదుల తలుపులూ యాధాతధంగా బంధింపబడే వున్నాయి. అతడు తిరిగి పక్క దగ్గరికి నడుస్తూండగా శరీరంలో ఏదో మార్పు! ఒళ్ళు విరుచుకోవాలన్న కోరిక. తలంతా బరువుగా అయిపోయింది. బాగా దాహం వేయసాగింది.

    వాటర్ జగ్ లోంచి నీళ్ళు వంపుకొని తాగాడు. గ్లాస్ తిరిగి అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగిన అతనికి నిలువుటద్దంలో తన మొహం కనిపించేసరికి అప్రయత్నంగా ఉలిక్కిపడ్డాడు.

    ఆ ముఖం...... ఆ ముఖం  ఎవరిది? తనదేనా? అనుకుంటూ ఆశ్చర్యంగా అతను అద్దం దగ్గరికి నడిచాడు. శారీరం రంగంతా నీలి రంగులోకి మారిపోయి..... ముఖమంతా మచ్చలు....... అవి..... భీమన్న నాగకోనలో చూపించిన పాము శరీరంపై వున్న మచ్చల్లా.......అచ్చం అలాగే ఉన్నాయి. అప్రయత్నంగా అతని శరీరం జలదరించింది.

    "అంటే..... అంటే మైగాడ్!" అనుకుంటూ అతను కుర్చీలో కూలబడ్డాడు.

    అంతలో ఎదుటి గది తలుపు తీసిన శబ్దం వినిపించింది.

    మహర్షి పడుకున్న వరండాలో లైటు వెలుగుతూండటం చూసి సిరిచందన అటువస్తూ "ఏమిటి మహర్షీ, నీకు నిద్రపట్టడం లేదా?" అని అడిగింది.

    అతను చప్పున కర్టెన్ మొహానికి, అడ్డుగా జరుపుకుని సమాధానం చెప్పలేదు. వెనక్కి వెళ్ళిపోవాలో, ముందుకు వెళ్ళాలో తెలీని పరిస్థితిలో కంగారుగా అక్కడే ఆగిపోయాడు.

    ఆమెకీ అదే పరిస్థితి ఎదురయింది. అతను కర్టెన్ జరపటం చూసి  అనుమానంగా రెండు క్షణాలు అక్కడే నించుంది. ఏ శబ్దమూ వినిపించకపోయేసరికి "మహర్షీ నువ్వున్నావా అక్కడ?" అని అడిగింది.

    అతను "ఊ" అన్నాడు క్లుప్తంగా.

    అతని ఆ ప్రవర్తనికి కారణం, అంతకుముందు తను తన భర్తతో ప్రవర్తించిన విధానమేమో అని ఆమెకి అనుమానం వచ్చింది. "నీకు తెలియదు మహర్షీ! రవితేజ ఆ స్మగ్లర్స్ కి ఫోన్ చేసి డూప్లికేట్ బిస్కెట్లు వస్తున్నాయని ముందే చెప్పాడు. అంటే....అంటే......" అని ఆగిపోయింది. అతన్నించి సమాధానం  లేదు. తను చెప్పింది అతడికి అర్థమైందో లేదో అన్న అనుమానం కలిగిందామెకి మహర్షి కర్టెన్ వెనకాల ఎందుకు నిల్చుండిపోయాడో అర్థంకాలేదు.

    ఆమె చప్పున కర్టెన్ తొలగిస్తూ "ఏమిటి మహర్షీ, అసలు నువ్వు...... అంటూ ఆగిపోయింది.

    మహర్షి మొహానికి చెయ్యి అడ్డు పెట్టుకోబోయాడు.

    కానీ, అప్పటికే ఆమె చూడటం, భయంతో గట్టిగా కేకలు పెట్టి స్పృహ తప్పి పడిపోవటం జరిగిపోయింది.

    అతనికి వెంటనే ఏం చేయాలో పాలుపోలేదు. ఆమె కేక విని ఎవరయినా వస్తారేమోనని భయంతో ఒక్కక్షణం అక్కడే ఆగిపోయాడు.

    ఈ లోపులో రవితేజ గది తలుపులు తీసుకుని బయటికి రావటం జరిగింది. అతడు చప్పున వరండాలోకి వెళ్ళిపోయాడు.

    రవితేజ వచ్చి సిరిచందన పక్కన మోకాళ్ళ మీద కూర్చొని, ఆమెని లేపటం కనిపించింది.

    ఆ తర్వాత అతడు ఆమెని రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ రూంలోకి తీసుకువెళ్ళటం చూసి మహర్షి గాఢంగా విశ్వసించాడు.

    ఇక తనకి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైందని అతనికి అర్థం అయ్యింది. తనున్నకొద్దీ భార్యాభర్తల మధ్య మరిన్ని గొడవలురావటం తప్పదు అనిపించింది.

    లేవగానే బట్టలు సర్దుకున్నాడు. సిరిచందన ఎదురుపడాలంటే అతనికి భయంగా వుంది. కానీ వెళ్ళేముందు చెప్పకుండా వెళ్ళిపోతే మనశ్శాంతి వుండదు. రాత్రి తన మొహం చూసి భయంతో స్పృహ కోల్పోయింది. ఇప్పుడు కూడా  అతని  మొహం లాగే ఉండి ఉంటుందన్న అనుమానంతో ఆమె జీవితాంతం బాధపడుతూనే వుంటుంది. తను మామూలు మనిషి నయ్యానని ఆమెకి తెలియజెప్పటం తన కర్తవ్యం!

    అతడు ఆమె గదికి బయలుదేరాడు.

    రవితేజ ఇంట్లో లేడు. మార్నింగ్ వాక్ కి వెళ్ళినట్టున్నాడు. ఆమె దిండుకాస్త వెనక్కి ఎత్తుగా వేసుకొని ఒరిగి వుంది. మొహం చాలా నీరసంగా వుంది. అతను వెళ్ళి మంచం పక్కనున్న స్టూల్ లాక్కుని కూర్చున్నాడు. ఆమె అతన్ని  చూడగానే ఆశ్చర్యపోయింది. అతని మొహాన్నే పరిశీలనగా చూడసాగింది.

    అతనికి ఎలా ప్రారంభించింది. "మహీ, ఆర్ యూ ఆల్ రైట్?" అంటూ.

    తను అడగాల్సిన ప్రశ్న ఆమె అడిగేసరికి అతడు తత్తరపడ్డాడు. తలెత్తి ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేక తలదించుకునే తలవూపాడు బావుందన్నట్టు.

    "నో! నీ ఆరోగ్యం బాగాలేదు!" ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది.

    అతడు నవ్వటానికి ప్రయత్నం చేస్తూ "నాకేమయింది బాగానే వున్నానే!" అన్నాడు.

    "మరి రాత్రి నీ మొహం  ఎందుకలా మారింది?" ఆమె నుండి ఆ ప్రశ్న  వస్తూందని అతడు ముందే ఊహించాడు. జవాబు చెప్పలేక మౌనంగా వుండి పోయాడు.

    "చెప్పు మహీ, రాత్రి నీ మొహం ఎందుకలా మారింది?"

    "ఎలా మారింది? నేను బాగానే  ఉన్నానే? రాత్రి కర్టెన్ నీడలో నా మొహాన్ని చూసి భయపడి స్పృహ తప్పావు. అంతే. నేను బాగానే ఉన్నాను. చూడు నా మొహాని కేమైంది?" చేత్తో తన మొహాన్ని తడుముతూ అన్నాడు.

    "నా కళ్ళు నన్ను మోసం చేయవు మహీ. రాత్రి కర్టెన్ తొలగించి చూసినప్పుడు నీ మొహం ఎంత భయంకరంగా మారిపోయి వుందో తెలుసా? మైగాడ్! కళ్ళు మొత్తం నీలిరంగులోకి మారిపోయి, మొహమంతా మచ్చలు..... మొహంపై పాము కుబుసం లాంటి పొర..... రామరాజు చెప్పిన లక్షణాలన్నీ ప్రారంభమై నట్టేనా? చెప్పు మహీ ........ మాట్లాడు"

    ఏం మాట్లాడగలడు? జీవితపు చరమాంకపు ఘడియలన్నీ విషపూరిత మైనాయని చెబుతాడా? తనకూ పాముకూ తేడా లేదని చెబుతాడా? ఏమీ చెప్పలేక "నాకేమీ కాలేదు సిరీ, అదంతా నీ భ్రమ" అన్నాడు.

 Previous Page Next Page