Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 33


    జ్యోత్స్న మ్రాన్పడి పోయింది. ఇటీవలి భాస్కర్ ఇంట్లో జరిగిన గొడవలు జ్యోత్స్నకు తెలియవు - తనకు భాస్కర్ రాసిన ఉత్తరం పోయినందుకు చాలా బాధపడింది. అది సుబ్బలక్ష్మి తీసిందేమోననే అనుమానం కలిగింది కాని, ఇంత దారుణానికి దారి తీస్తుందని అనుకోలేదు -
    నలుగురూ త్వరపడి సుశీలను ఆస్పత్రిలో చేర్పించారు.
    తడుముకుంటూ టాక్సీ ఎక్కుతూ, బాధ భరించలేక విలవిల లాడుతూ "నన్ను ఆస్పత్రిలో చేర్పించకండి- నేను చచ్చిపోతాను. ఎవరికీ నేను అడ్డుగా ఉండకూడదు-" అని ఏడ్చింది సుశీల.
    ఆ దుఃఖాన్ని చూసి ఐరావతమ్మ కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకుని 'ఊరుకోమ్మా! నిష్కారణంగా నిండుప్రాణాన్ని తీసుకుంటావా? నీ పిచ్చిగాని నీ స్థానం మరొకరికి ఎలా వస్తుంది? ఇలాంటి బజారు మనుష్యులు ఎందరైతే మాత్రం మొగవాడికి భార్యసాటి రాగలరు? నువ్వు చచ్చిపోతే మాత్రం నీ మొగుడు ఈ చెడిపోయినదాన్ని చేసుకుంటాడనుకున్నావా? అతనికేం కర్మ కాలిందమ్మా! ఏదో కాల క్షేపానికి వ్యవహారాలు నడిపిస్తారు కాని, ఇలాంటి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటారా?" అని ఓదార్చింది, మెట్లమీద నిలబడి బాధపడుతోన్న సుశీలను నిస్సహాయంగా చూస్తోన్న జ్యోత్స్న ను కొరకొరా చూస్తూ'....       
    సుశీలను ఆస్పత్రిలో చేర్పించాక ఎవరో వెళ్ళి భాస్కర్ కి కబురు అందజేశారు.
    భాస్కర్ కి కాళ్ళూ చేతులూ ఆడలేదు - మెదడు మొద్దుబారిపోయింది. ఎలాగో శరీరాన్ని ఈడ్చుకుంటూ ఆస్పత్రికి వచ్చాడు -
    అప్పటికి డాక్టర్లు సుశీలకి ప్రమాదం దాటిపోయిందన్నారు -
    భాస్కర్ ని చూసి సుశీల ముఖం తిప్పుకుని ఏడుస్తూ "పాపిష్టి దాన్ని - బ్రతికాను-" అంది.
    భాస్కర్ ఏమీ మాట్లాడలేదు - అతని అణువణువూ  క్రోధంతో జ్వలించి పోతోంది - సుశీల ఇంత ఘోరంగా - ఇంత భయంకరంగా తనమీద పగ తీర్చుకోగలదని అతనెన్నడూ అనుకోలేదు -  
    భాస్కర్ ఇంటికి వచ్చాక ఐరావతమ్మ మరింత విజృంభించింది-   
    "ఆ ఏడిచే ఏడు పేడో హోటళ్ళలోనే ఏడ్చుకుంటే పోలా! ఇలా సంసారులమధ్య కొచ్చి సంసారాల్లో చిచ్చుపెడితే ఏం జరుగుతుంది? ఈ జన్మలోనే కాదు. వచ్చే జన్మలో కూడా అనుభవిస్తారు. ఇంతకు పదింతలుగా కుళ్ళి కుళ్ళిపోతారు - ఆ మొగుడికైనా జ్ఞానం ఉండక్కర్లా? తననే నమ్ముకున్న ఇల్లాలిని అలా ఉసురు పెడతాడూ! కళ్ళు పోతే మాత్రం? ప్రమాదాలు చెప్పి వస్తాయి? రేపు తనకే ఏదన్నా జరిగితే ఆవిడ వదిలిపోతుందా? ఏనాటికైనా ఆపదలో అయ్యేది ఇల్లాలే, కాని, బజారు మనుష్యులా? అనుభవిస్తారు - అనుభవిస్తారు-"   
    పెద్దగొంతుతో ఐరావతమ్మ అంటున్న మాటలన్నీ భాస్కర్ కీ జ్యోత్స్నకీ వినిపిస్తోనే ఉన్నాయి.
    మచ్చల డాక్టర్ జ్యోత్స్న దగ్గిరకువచ్చి "చివరకు మీరు కూడా ఇలా చేస్తారని నేను అనుకోలేదు" అన్నాడు బాధగా....
    జ్యోత్స్న సమాధానం చెప్పలేదు - ఎవరికైనా, ఏదైనా సమాధానం చెప్పగలిగే దశలో లేదు.   
    ఆ రాత్రి పదిగంటలు దాటాక తలుపు తట్టిన చప్పుడయి భయంతో లేచి కూచుని "ఎవరూ?" అంది....   
    "నేను - భాస్కర్ ని తలుపుతియ్యి-"
    భాస్కర్ కంఠం గుర్తుపట్టింది జ్యోత్స్న - వెంటనే తలుపులు తెరిచింది - లోపలికి వచ్చాడు భాస్కర్ - పెద్ద జబ్బుపడి లేచిన వాడిలా ఉన్నాడు-  
    జ్యోత్స్న ముఖంలోకి చూసి రెండు చేతులూ జాపారు. ఒక్కమాట మాట్లాడకుండా ఆ చేతుల్లోకి వచ్చేసింది జ్యోత్స్న - ఆవిడని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు భాస్కర్ - ఆవేదనతో అవమానంతో, క్షోభతో మ్రగ్గిపోతున్న ఆ హృదయాలు రెండూ ఒక దానినొకటి మౌనంగా ఓదార్చుకున్నాయి.   
    "జ్యోత్స్నా! మన ఈ కౌగిలి అబద్ధమా?"
    "కాదు?"
    "పరస్పర సమాశ్వాసనలో మనం అనుభవించగలుగుతోన్న ఈ మాధుర్యం అబద్ధమా?"    
    "కాదు-"
    "నా హృదయం నీ హృదయానికి అందిస్తోన్న ఈ ప్రేమ సందేశం అబద్ధమా?"
    "కాదు! కాదు!"
    "అయితే మనం వెళ్ళిపోదాం!"
    "అలాగే!"
    "పోదాం పద?"
    "ఇప్పుడేనా?"
    "ఆలస్యమెందుకు?"
    "అలా కాదు - కొంచెం రోజులాగండి - నాకు కొద్దిగా గడువు కావాలి!"
    "దేనికి?"
    "ఇలాంటి విషయాల్లో నేను కర్తవ్యం నిశ్చయించుకోలేను- దైవం మీద భారం వేసి నేను ప్రార్థన చేసుకుంటాను -"  
    షాక్ తగిలినట్లు రెండడుగులు వెనక్కు వేశాడు భాస్కర్.
    "నువ్వు.... దైవ ప్రార్థన చేసుకుంటావా?"
    అతని ఆశ్చర్యాన్ని చూసి కష్టపెట్టుకుంటూ, ఆ కష్టాన్ని దిగ మ్రింగుకుంటూ నిరసనగా నవ్వింది జ్యోత్స్న -

 Previous Page Next Page