"లేకపోతే ఏమిటి ? దీన్నెలాగయినా సరే బయటకు గెంటాల్సిందే. ఇలాంటి తంతుల్ని పిల్లులూ, బల్లులూ చూస్తే అష్టావక్రులు పుడతారు ! ఏదో నవల్లో చదివాను."
"అయితే దానిని కిటికీలోంచి తోలేద్దాం" అతను లేచి కిటికీ దగ్గరకు వెళ్ళబోతుంటే ఆమె చప్పున అడ్డు పడింది.
"ఆగండి ! కింద గాజు పెంకులున్నాయ్, ఊడ్చేస్తాను" అంటూ వాటిని తుడిచివేసే కార్యక్రమం ప్రారంభించింది. శోభనం గదిలో చీపిరికట్ట రడీగా ఉంచిన అత్తగారి దూరాలోచనకు జోహారులర్పిస్తూ కిటికీ తలుపులు తెరవబోయాడు, అవి తెరుచుకోలేదు.
"అయ్యో - చెప్పటం మర్చిపోయానండి ! అవి తెరుచుకోవు" అంది రాధ.
"ఎందుకని ?
"తెరుచుకోకుండా మా మామయ్య మేకులు కొట్టేశారు."
"అదేం రోగం ఆయనికి ?"
"ఏమిటా మాటలు ! మర్యాదగా మాట్లాడలేరూ ? ఆ కిటికీ తెరిస్తే తెల్లవారు ఝామునే, వెనుక సందుగుండా తిరిగే వారందరికి కనబడుతుందని ఆయనలా చేశారు."
మురళి ఉసూరుమంటూ కూలబడ్డాడు. "పోనీ ఇనుప కమ్మీ గాని సుత్తి గాని వున్నాయా ?"
"శోభనం గదిలో ఆవెందుకుంటాయండీ ?"
"చీపురు కట్ట ఉండగాలేనిది అవెందుకుండవ్" అంటూ గదంతా వెతకసాగాడతను. అతని కళ్ళకు టేబుల్ మీదున్న మైసూర్ పాక్ లు కనిపించాయి.
"అవి మీ అమ్మగారు చేసినవేనా ?" అడిగాడతను.
"అవునండీ ! ఎందుకు ?"
"సుత్తిబదులు వాటిని వాడొచ్చని" అంటూ ఓ మైసూర్ పాక్ తీసుకుని తలుపుమీద కొట్టసాగాడు. ఆ శబ్దాలువిని బయట గదిలో పడుకున్న అన్నపూర్ణ లేచి కూర్చుంది.
"ఇందాకట్నుంచీ గదిలో రక రకాల శబ్దాలు వినపడుతున్నాయండీ ! సంగతేమంటారు ?" రామలింగాన్ని నిద్రలేపి అడిగింది.
గాఢ నిద్రలో వున్న రామలింగానికి అరికాలి మంట నెత్తి కెక్కింది. ఆమెవంక విసుగ్గా చూశాడు. "శోభనం అన్నాక సవాలక్ష చప్పుళ్ళు వినిపిస్తాయి. ఆ రోజులు మర్చిపోయావా ఏమిటి?" అన్నాడు అటు తిరిగి పడుకుంటూ.
ఇద్దరూ మళ్ళీ నిద్రావస్థలో కెళ్ళడానికి ప్రయత్నించసాగారు.
అరగంట సేపటి తర్వాత కిటికీ తలుపు ఊడి వచ్చింది.
"ఇప్పుడా పిల్లిని ఎలా పట్టుకోవడం" అడిగాడు మురళి.
"మీరు మ్యావ్ అని అరవండి ! ఇంకో పిల్లి అనుకుని బయటకొచ్చేస్తుంది !" అద్భుతమయిన ఉపాయం చెప్పినట్లు మెరుస్తూన్న కళ్ళతో అంది.
మురళికి ఆ ఉపాయం నచ్చలేదు గాని గత్యంతరం లేక మంచం క్రిందకు తలవంచి 'మ్యావ్' అని అరిచాడు.
"అలా మగగొంతుతోనే అరవకండి ! బెదిరిపోతుంది. అచ్చం పిల్లి లాగా దాని గొంతుతోనే అరవండి" అందామె సలహా ఇస్తున్నట్లు.
పెళ్ళయి రోజన్నా కానిదే అప్పుడే సలహాలు మొదలుపెట్టిన రాధ మీద పీకలదాకా కోపం ముంచుకొచ్చింది. అయితే అవసరం తనది కాబట్టి దాన్ని దిగమింగుకుని అచ్చం పిల్లిలాగా 'మ్యావ్, మ్యావ్' అంటూ అరవసాగాడు.
అతను 'మ్యావ్' అన్నప్పుడల్లా పిల్లి కూడా 'మ్యావ్' అని అరవసాగింది తప్ప బయటకు రాలేదు.
అన్నపూర్ణ మళ్ళీ లేచి కూర్చుంది బయటిగదిలో.
"ఏమండీ! శోభనం గదిలో నుంచి ఈసారి పిల్లి అరుపులు వినబడుతున్నాయండి" అంది అనుమానంగా మళ్ళా భర్తని లేపి.
ఆమె మళ్ళీ నిద్రకుపక్రమించింది. లోపల్నుంచి రెండు పిల్లులు అరుస్తూన్నట్లు శబ్దాలు ఇంకా వినిపిస్తూనే వున్నాయి.
"ఏమిటది - అంత అరిచినా బయటకొచ్చి చావటంలేదు?" కోపంతో అడిగాడు మురళి.
"ఇంకొంచెం ప్రేమగా 'మ్యావ్' అనండి, వచ్చేస్తుంది- పాపం బుజ్జిముండ " అంది రాధ.
హఠాత్తుగా పిల్లిచూపు కిటికీ దగ్గర కనిపించిన బల్లిమీద పడేసరికి అది ఎగిరి దూకటం - ఆ దృశ్యానికి భయపడిన రాధ పిల్లికోసం వంగివున్న మురళి వీపుమీద కాళ్ళు పెట్టి మంచం మీదకు పక్షిలా ఎగరడం - మురళి ఆ బరువుకి బోర్లాపడి పోవటం క్షణాల్లో జరిగిపోయింది.
పిల్లి ఇదేమీ పట్టించుకోకుండా కిటికీ చువ్వల్లోనుంచి బయటకు జారుకుంది.
మురళి లేచి కూర్చోగానే రాధ అతని మొఖానికి పట్టిన చెమటలు చూసి, "సారీ - ఆ పిల్లిని చూచి భయపడి మీ మీదనుంచి మంచం మీదకు ఎక్కేశాను. ఫాన్ ఆన్ చేస్తానుండండి" అంటూ ఫాన్ ఆన్ చేసింది.
అది చిన్న శబ్దాలతో తిరగటం ప్రారంభించి క్రమేపీ పిండిమరలా శబ్దాలు చేయసాగింది.
"ముందా ఫాన్ ఆపేసెయ్ ! లేపోతే మనిద్దరం ఏదో ఇండస్ట్రీ పెట్టామనుకుంటారు బయట అందరూ" గాబగారా అన్నాడతను.