"అవును. చదివాను. చాలా గొప్ప సాహసం చేసింది. ఆడపిల్లలంటే అలా వుండాలి. కాలేజీముందు నిరాహారదీక్ష చేసిందట కదా, ఏమైంది చివరికి?" అనడిగింది సునీత.
"ఏమవుతుంది! ఆ ఎమ్మెల్లే తాలూకు వాళ్ళొచ్చి కాళ్ళు పట్టుకున్నారు- క్షమించమని అడిగారు. ఇంకెప్పుడూ యిలా ఆడపిల్లల్ని మోసం చేయొద్దని వార్నింగిచ్చి వదిలేశాం" అన్నాడు కృష్ణమూర్తి. ఇద్దరూ భోజనం పూర్తిచేసి ముందు హాల్లోకొచ్చారు. సునీత వీడియోలో క్యాసెట్ పెట్టింది. వచ్చి సోఫాలో కూర్చుంది. అతడు ఆమె దగ్గరగా లాక్కొని వళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.
"మీ కాలనీలో ధాత్రి అనే అమ్మాయి వుంది కదూ" అంది సునీత.
"అవును, విష్ణు కూతురు. ఇప్పుడామె ప్రసక్తి ఎందుకు?" అడిగాడు కృష్ణమూర్తి.
"మొన్న మీ అబ్బాయినీ, ఆ అమ్మాయినీ ఎక్కడో కిళ్ళీకొట్ల దగ్గర చూశాను. ఈ ఆడపిల్లలతో జాగ్రత్తగా వుండాలి. మంచి మంచి అబ్బాయిల్ని చూసి వలలో వేసుకోవాలని ప్రయత్నిస్తారు".
"ప్రీతమ్ అలాంటివాడు కాదులే. అయినా ఆ ధాత్రి డాన్స్ లూ, మ్యూజిక్కూ అంటూ తిరుగుతూ వుంటుంది కదా, కిళ్ళీకొట్ల దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు పూర్తిగా పాడయిపోతున్నారు".
"అన్నట్లు వల్లో వేసుకోవటం అంటే గుర్తొచ్చింది. ఆ కౌసల్య కూతురు, ఆ అమ్మాయి పేరేమిటి?"
"నిఖిత".
"ఆ! నిఖిత......మీ కాలనీలోనే అవినాష్ అనే కుర్రోడు వున్నాడట కదా, వాణ్ని వల్లో వేసుకుందట. మీకు తెలుసా విషయం."
"తెలుసు. అవినాష్ తండ్రి వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడటలే".
"ఏమిటో ఈ ఆడపిల్లలు! చిన్న వయసులోనే అబ్బాయిలకి గాలం వేయటం, దానికోసం వాళ్ళతో కలిసి తిరగటం, తరువాత అబార్షన్ లని హాస్పిటల్స్ చుట్టూ తిరగటం......" అంటూ నిట్టూర్చింది సునీత.
"మగవాళ్ళూ అంత తెలివైన వాళ్ళేమీ కాదులే. ఆ అవినాష్ ఇంట్లో వాళ్ళని ఎదిరించైనా సరే ఆ నిఖితని చేసుకుంటానంటున్నాడట. పాపం శంకరం బాగా గొడవ పెడుతున్నాడు".
సునీత అతని ఛాతీమీద చెయ్యి వేసి వెంట్రుకల్ని వెలిచుట్టూ మెలితిప్పుతూ "ఏమిటో అసలు వాల్యూస్ అంటూ లేకుండా పోతున్నాయి" అంది. అతడు ఆమె అనాచ్ఛాదితమైన వీపుమీద చెయ్యివేసి, మెడనుంచి వెన్నెముకమీదుగా చేతిని కిందివరకూ రాస్తూ ఆమెని రెచ్చగొట్టసాగాడు. మరో అయిదు నిమిషాల్లో వాళ్ళిద్దరూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు.
ఆ గదిలో చీకటి దట్టంగా అలుముకుంది.
చీకటికి మాటలు రావు. నిశ్శబ్దంగా చూస్తోంది.
మనిషి మనస్తత్వం ఎంత గమ్మత్తయింది! అతడి కూతురు ఒక కుర్రవాడ్ని ప్రేమించి, కాలు జారి, నిరాహారదీక్షలు చేసి విఫలమైంది. దాన్ని అతడు తన విజయంగా చాటుకున్నాడు. తన కూతురిది ఏ తప్పూ లేనట్టు సమర్థించుకున్నాడు. అతని కొడుకు మరొక అమ్మాయితో కలిసి ఎక్కడో కనపడితే ఆ తప్పంతా ఆ అమ్మాయిదే అన్నట్లు మాట్లాడాడు. అదే పని అవినాష్, నిఖితలు చేసి వాళ్ళు వివాహం చేసుకోటానికి సిద్ధపడుతూ వుంటే, అది ఒక సామాజికపరమైన తప్పుగా చర్చించాడు. ఆమె కూడా మనస్ఫూర్తిగా తాను నైతిక విలువల్ని నమ్ముతున్నట్టే సంభాషణ జరిపింది. భర్త క్యాంపుకు వెళ్ళగానే హైస్కూలు కుర్రవాళ్ళనుంచి అందుబాటులో వున్న దాదాపు ప్రతి మగవాడితోనూ, సంపర్కం పెట్టుకుంటూ 'యువతరం నైతిక విలువలు కోల్పోతుంది' అని ప్రియుడి దగ్గర వాపోతోంది. నిజంగా వీరందరూ తాము బయటికి మాట్లాడేమాటల్ని మనసులో కూడా నమ్ముతారో లేదో తెలియదు. భర్త వున్న సునీత, భార్యాపిల్లలూ వున్న కృష్ణమూర్తి రహస్యంగా కలుసుకొని, నగ్నంగా ఒక పక్కమీద పడుకొని నైతిక విలువల గురించి ఈ విధంగా మాట్లాడటంలో అసహజ మేమీలేదు. దీనికన్నా ఇంకా చిత్రమేమిటంటే వీటన్నిటికీ తాము అతీతులమని వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా నమ్మటం! మనుష్యుల్లో చాలామంది ఈ కోవకి చెందినవారే కదా......!
చీకటికి మాటలు రావు వచ్చి వుంటే అది వెలుగుతో అని వుండేది" ఓ వెలుగా! మనుష్యులందరూ కళ్ళముందు నిన్ను కోరుకుంటూన్నారని మిడిసిపడకు. వాళ్ళ మనసుల్లో నేను నిరంతరం వుంటూనే వుంటాను కదా!"
* * *
పోస్ట్ మాన్ కవర్ అందించి వెళ్ళాడు. చూడగానే అది తన ఆఫీసు నుంచి వచ్చిన నోటీసని నిఖితకి అర్థమైపోయింది.
దాదాపు నెలరోజులుగా ఆమె సెలవులోనే వుంది. రూలు ప్రకారం ఆమెకి అంత సెలవు లేదు. అయినా జీతం నష్టంమీద సెలవు. తీసుకుంది. ఇప్పుడీ నోటీసులో ఇంక సెలవు పొడిగింపబడదనీ, వచ్చి జాయినవమనీ వుంది.
నిఖితకి ఏం చేయాలో తోచలేదు.
రాము ఆమెరికా ప్రయాణం మూలంగా తల్లి ట్రీట్ మెంట్ వాయిదా వేయవలసి వచ్చింది. ఎటువంటి పరిస్థితులలోనూ తల్లిదండ్రుల స్థితి ఎంత దయనీయంగా వుందో, వాళ్ళు మరణానికి ఎంత చేరువలో వున్నారో తెలియనివ్వకూడదని నిఖిత నిశ్చయించుకుంది. అటువంటప్పుడు రాము విదేశాలకి వెళ్ళాకముందే ఆవిడకి మళ్ళీ తిరగబెడితే ఆ విషయం అతడికి తెలిసే ప్రమాదం వుంది...... అన్నిటికన్నా ముఖ్యంగా ఇల్లు అమ్మేసిన విషయం!
నిఖిత ఆలోచనల్లో ఒకరకమైన సంక్లిష్టత వుంది. ఆమె నిరంతరం ఆత్మవిమర్శన చేసుకుంటూ ఏది మంచో, ఏది చెడో ఒక నిర్ణయానికి వస్తూ వుంటుంది. కేవలం తనకి లాభం కాబట్టి ఒకే రకమైన వాదనలని పెంపొందించుకోలేదు. అవతలి కోణంలోంచి కూడా ఆలోచించి, రెండూ బేరీజు వేసుకొని అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి తాను సంతృప్తి పడుతుంది.
తల్లిదండ్రుల అనారోగ్యం గురించి అన్నయ్యకి తెలియకూడదని తమకంతా ఎందుకింత తాపత్రయం? అని తనను తాను ప్రశ్న వేసుకుంది ఆమె.
నిజం తెలిస్తే రాము ఏం చేస్తాడో? చదువూ గిదువూ ఏదీ వద్దని ఏ రెండువేల రూపాయలకో ఒక ఉద్యోగంలో చేరిపోతాడు. దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అది తన ఆర్ధిక ఇబ్బందుల్నీ, తల్లిదండ్రుల అనారోగ్యాల్నీ తుడిచిపెట్టగలుగుతుందా? లేదు. అయితే.....ఆ నిజాన్ని ఒప్పుకొని, వచ్చిన అవకాశాన్ని వదలిపెట్టకుండా రాము విదేశాలకి వెళ్ళిపోతే- అతడొక అవకాశవాదిగా, స్వలాభపేక్ష కలవాడిగా చిత్రీకరించబడతాడు. చావుబతుకుల్లో వున్న తల్లిదండ్రుల్ని బాధ్యతారహితంగా వదిలేసిన దుర్మార్గుడిగా నిందింపబడతాడు.
దురదృష్టవశాత్తూ ఈ ప్రపంచంలో -ప్రతి మనిషికీ-తర్కానికీ, సెంటీమెంట్ కీ జరిగే సంఘర్షణలో చివరి గెలుపు సెంటిమెంట్ దే అవుతుంది. బాధ, విషాదం, త్యాగాలతో వాస్తవం కప్పబడిపోయి, మనిషి ఆనందపు ముసుగు వేసుకొని, ఆ సెంటిమెంటే తన జీవిత పరమావధి అనుకుంటూ తృప్తిపడతాడు. అసలైన తృప్తి వాస్తవాన్ని గ్రహించటంలో వుందని, సెంటిమెంట్ లో లేదని అనుకోడు. ఎందుకంటే సెంటిమెంట్ కన్నా వాస్తవం జీర్ణం అవటం చాలా కష్టం.
దశరధ్ కూతురితో చెప్పాడు. "నిఖితా. రాము విదేశాలనుంచి తిరిగొచ్చేవరకూ మేముంటామో లేదో అన్నది అనుమానమే. ఈ కొద్ది రోజులూ మన ఆర్థిక బాధలు అనారోగ్యం అంతా మర్చిపోయి అందరం కలిసి ఆనందంగా గడుపుదాం. రాము ధైర్యంగా, సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళటానికి తగిన పరిస్థితులు కలిగిద్దాం' అన్నాడు.
నిఖిత అది కరెక్టు అన్నట్టు తలూపింది.
రాము కోసం స్వీట్లు చేసింది నిఖిత. అతడి బట్టలన్నీ ఉతికి, ఇస్త్రీ చేసి సిద్ధం చేసింది. మార్వాడి దగ్గరికి వెళ్ళి సేల్ అగ్రిమెంట్ పూర్తిచేసింది. ఈ పనులన్నీ చేస్తున్నా ఆమెని ఆలోచనలు వదలలేదు. ఎందుకు తను రాముకి ఈ విషయాలన్నీ చెప్పలేకపోతోంది? రాము చదువుకోవాలి. పెద్ద ఉద్యోగం సంపాదించాలి. జీవితంలో స్థిరపడాలి. అందుకని చెప్పలేకపోతూంది. ఈ విషయం అతనికి తెలిస్తే "నీకీ విదేశీ చదువులు వద్దు. చివరి రోజుల్లో అమ్మా, నాన్నని కనిపెట్టుకొని శుశ్రూష చేసుకుంటాను. నా చెల్లెలిని ఉద్యోగం చేసి తల్లిదండ్రుల్ని పోషించే స్థితినుంచి తప్పిస్తాను" అని పై చదువులకి వెళ్ళకుండా ఆగిపోతాడు.
ఒకవేళ తన అన్నయ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో తను వుండి, తనని విదేశాలకి పంపించవలసి వస్తే ఏం మాట్లాడతాడు?
"వెళ్ళు నిఖితా. ఇక్కడ వ్యవహారాలన్నీ నేను చేసుకుంటాను. రెండు సంవత్సరాలంటే ఎంతసేపు! నువ్వొక్కసారి బాగా చదువుకొనివస్తే మన పరిస్థితులన్నీ చక్కబడతాయి".
కానీ తను వెళుతుందా? వెళ్ళదు. "అమ్మా నాన్నలతో నేనిక్కడే వుండిపోతానన్నయ్యా. నా కోసం మీరందరూ ఇన్ని కష్టాలు పడుతూ వుంటే నేను విదేశాలకి వెళ్ళి చదువుకోలేను" అంటుంది.
అన్నయ్యని విదేశాలకి వెళ్ళమని ప్రోత్సహించిన తను, ఈ విషయం తెలిస్తే, తనా పరిస్థితిలో వుంటే..... వెళ్ళలేదు.
కానీ ఇప్పుడు అన్నయ్యకి ఈ విషయం తెలియనివ్వకుండా పంపిస్తోంది.
ఈ తర్కం ఏమిటో ఆమె లేత మనసుకి అందడంలేదు.
తార్కికంగా ఆలోచించేవాడెప్పుడూ మెటీరియలిస్ట్ గానే కనిపిస్తాడు. విమర్శలని ఎదుర్కొంటాడు.
కానీ కొలిమిలో కాలిన ఇనుమూ స్వచ్ఛమైనట్లు అతడు కూడా స్వచ్ఛంగా పరిణతి చెందుతాడు.
నిఖిత ఇప్పుడు ఆ ' ఎవల్యూషన్' లోనే వుంది.
* * *
ఆఫీసువాళ్ళు యిచ్చిన నోటీసు పట్టుకొని మెట్లు దిగుతున్న నిఖితకి మహతి ఎదురైంది. కొత్త చీరలో బాగా ముస్తాబై అందంగా మెరిసిపోతోంది మహతి. "నీ కోసమే బయలుదేరాను" అంటూ కలిసి నడవసాగింది. ఆమె మొహంలో ఆనందం చూసి "మొత్తానికి మీ వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వటానికి ఒప్పుకున్నారన్నమాట" అంది నిఖిత.
"చచ్చినట్లు ఒప్పుకున్నారు. ఎవరికోసం ఒప్పుకుంటారు! నేను బాగా దెబ్బలాడాన్లే. తమ్ముడి మెడిసన్ సీటుకోసం అయితే లక్షలు ఖర్చు పెట్టటానికి వెనకాడటం లేదు. కానీ నా కోసం అంత గొడవ చేస్తారేం అని డైరెక్టుగా అడిగేశాను" అంది గర్వంగా.
"అదేమిటి, మీ తమ్ముడు చదివేది బి.ఏ. కదా! అతడికోసం లక్షలు ఖర్చు పెట్టటం దేనికి?"
"వాడు వట్టి బి.ఏ. అయితే వచ్చే లాభమేముంది చెప్పు. కొంచెం ఖర్చుపెడ్తే డాక్టరీయో, ఇంజనీరింగో చదివిస్తే వాడి మామగారి దగ్గర నుంచి దానికి రెట్టింపు వసూలు చెయ్యొచ్చు".
ఏ డొనేషనో కట్టి సుకుమార్ ని మెడిసన్ చదివిస్తారేమో అనుకుంది నిఖిత మనసులో. ప్రస్తుతం మెడిసన్ చదవటానికి అంతకన్నా పెద్ద వ్యూహాలు వున్నాయని ఆ అమ్మాయికి తెలియదు.
నిఖితతో మహతి "ఇప్పుడో నాకో పెద్ద సమస్య వచ్చిపడింది. అందుకే నీ దగ్గరికి వచ్చాను" అంది.
నిఖిత వస్తున్న నవ్వుని ఆపుకుంది. "నిజమైన సమస్యలంటే ఏమిటో ఈ పిల్లకి ఇంతవరకూ అనుభవంలోకి రాలేదసలు. పేరంటాని కెళ్ళటానికి ఏ చీర కట్టుకోవాలి అన్నది కూడా బహుశా మహతికి సమస్యగానే తోస్తుందేమో" అనుకుంది.
"ఏమిటో చెప్పు."
"నాతో బ్యాంక్ కి రాగలవా?"
"దేనికి? డబ్బులు వెయ్యాలా. తియ్యాలా?" అడిగింది నవ్వుతూ నిఖిత.