Previous Page Next Page 
ధ్యేయం పేజి 33


    "డ్రాప్ట్ తీసుకోవాలి. నా అకౌంట్ లో మూడు లక్షలుంది. డ్రాప్ట్ తీసుకొని ఈ రోజే స్పీడ్ పోస్టులో మా మామగారికి పంపాలి. ఇవ్వాళే మంచి రోజట. తీసుకొమ్మని నాన్నగారు మరీ మరీ చెప్పారు".

    "నువ్వెప్పుడూ బ్యాంకులకి వెళ్ళి ఇలాంటి పనులు చేయలేదుకదా. ఈ పని నీకెందుకు చెప్పారు. సుకుమార్ లేదా? లేకపోతే మీ నాన్నగారు రావచ్చుగా".

    "సుకుమార్ ఎంసెట్ పరీక్ష వ్రాయటానికి నెల్లూరు వెళ్ళాడు. డాడీకూడా ఆఫీసు పనుందని అక్కడికే వెళ్ళారు. ఈ రోజు రావలసింది. ఎందుకో రాలేదు. మమ్మీకేమో జ్వరం".

    "ఎంసెట్ పరీక్షకి నెల్లూరు వెళ్ళటం ఎందుకు? ఈ ఊళ్ళో వుందిగా?"

    "అక్కడేదో క్రాష్ కోర్సుల్లో చేరాడులే. అదీగాక నాన్నగారి ఫ్రండ్స్ చాలామంది వున్నారక్కడ. అందుకే ఆయన కూడా వెళ్ళారు".

    "ఎంసెట్ పరీక్షకి, ఫ్రండ్స్ కి సంబంధం ఏమిటి?" అని అడగబోయి తమాయించుకుంది నిఖిత. అవన్నీ చాలా అనవసరమైన విషయాలుగా తోచి "పద, బ్యాంక్ లో నీ పని చేసిన తర్వాత నేను ఆఫీసూకి వెళ్తాను" అంది . మరొక పది నిమిషాల్లో వాళ్ళు డ్రాప్ట్ అప్లికేషన్ ఫారం తీసుకొని నింపసాగారు. అప్పుడొచ్చింది. అనుమానం నిఖితకి!

    కట్నం తీసుకునే వాళ్ళెవరూ డ్రాప్ట్ రూపంలో పంపమని అడగరు. ఎవరికీ తెలియకుండా క్యాష్ గానే ఇమ్మని తీసికెళ్తారు. పోనీ అంత డబ్బు  కరెన్సీ రూపంలో వాళ్ళ ఊరికి తీసికెళ్ళటానికి భయపడి రామ్ లాల్ జైన్ అనేవాడి పేరుమీద డ్రాప్ట్ గా పంపమన్నారనుకుంది. కానీ అవతలివాళ్ళు అంత తెలివి తక్కువగా అనిపించలేదు.

    "రామ్ లాల్ జైన్ ఎవరు? మీ మామగారు కాదనుకుంటా కదా" అడిగింది నిఖిత. "నాకు తెలియదు. ఈ పేరునే పంపమని వివరాలన్నీ వ్రాసిచ్చి వెళ్ళారు".

    "మిమ్మల్ని ఈ రామ్ లాల్ జైన్ మోసం చేస్తే?"

    "అదీ నాకు తెలీదు".

    "మీ మామగారు ఏం చేస్తారు? బిజినెస్సా?"

    "కాదు, బ్యాంక్ మేనేజర్" అంది మహతి. నిఖిత ఇంక ప్రశ్నలు వేయలేదు. డ్రాప్ట్ తీసుకున్నాక మాత్రం దాని నెంబరు, రామ్ లాల్ జైన్ బ్యాంక్ అకౌంట్  నెంబర్  మహతి చూడకుండా విడిగా వ్రాసి పెట్టుకుంది. వాళ్ళిద్దరూ పని పూర్తిచేసుకొని బ్యాంకులో నుంచి బయటికి వస్తూ వుంటే ధాత్రి కనిపించింది.

    మహతి దాదాపు ధాత్రిని కౌగిలించుకున్నట్టు "ఎన్నాళ్ళకు..... ఎన్నాళ్ళకు" అని చెయ్యి గట్టిగా ఊపేసింది.

    ఆ తరవాత వాళ్ళిద్దరూ మహతి పెళ్ళి కబుర్లలో మునిగిపోయారు. మహతి గబగబా చెప్పేసింది. "పేరు శ్రీకర్ , ఇంజనీర్. బాగా డబ్బున్న వాళ్ళు. పెళ్ళి వచ్చే నెలలో. ఇంకా మిగతా వివరాలు చెప్పమంటావా?"

    "చెప్పు వింటాను".

    "అత్తగారు లేరు. అదొకటి అదృష్టం. ఒకే ఒక ఆడపడుచు. పెళ్ళయి ఆమెరికాలో స్థిరపడింది. ఇకపోతే కట్నం అయిదు లక్షలు. ఆడపడుచుకి అరలక్ష. బంగారం పాతిక తులాలు. ఒక కారు. మేమే పెళ్ళి జరిపించాలాట".

    ధాత్రి మహతివైపు, ఆశ్చర్యంగా చూస్తూ "అంతా కలిపి పదిలక్షలు ఖర్చన్నమాట" అంది.

    మహతి కాస్త గర్వంగా, ఈజీగా "పదేం సరిపోతుంది. పన్నెండన్నా అవుతుంది. పెళ్ళి ఖర్చలంటే మామూలేగా మరి?" అంది.

    ఖర్చుపెట్టేది తమ తల్లిదండ్రులని, అదంతా అనవసరమైన ఖర్చని అనుకోవటం లేదు మహతి. తన స్టేటస్ సింబల్ గా భావిస్తూంది. ధాత్రి మొహంలో ఈర్ష్య ఆమెకి మరింత ఆనందాన్నిస్తూంది. "ఇప్పుడే మమ్మీకి చెప్పివచ్చాను. వాళ్ళడిగింది పాతిక తులాలే కదా అని కొంపతీసి అంతే ఇచ్చేవు. నా కోసం కనీసం యాభైతులాలన్నా పెట్టాలి అని దబాయించాను".

    అప్పటివరకూ వాళ్ళ సంభాషణంతా మౌనంగా. వింటున్న నిఖిత అర్థంకానట్టు "అదేమిటి?" అంది.

    "అదంతా వాళ్ళెలా సంపాయించారో తెలుసా? నన్ను చదివించక, ఒక మంచి చీర కొనక పైసా పైసా కూడబెట్టారు. ఇప్పుడు నేను అత్తారింటికి వెళ్ళిపోతున్నాను. కాబట్టి ముక్కుపిండి ఆ డబ్బంతా మా తల్లిదండ్రుల దగ్గరనుంచి వసూలు చేయాలి" కసిగా అంది మహతి.

    నిఖిత ఆమెవైపు సానుభూతిగా చూసింది. ఇదే మనస్తత్వాన్ని ఎవరన్నా కథగా చెబితే తను నమ్మనని కొట్టిపడేసేది. కాని ఇలాంటి అమ్మాయిలు కూడా వుంటారని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తోంది.

    "నేను వెళ్తానులే, ధాత్రి వుందిగా" అంది మహతి "నువ్వేళ్ళొచ్చు" అన్నట్టు.

    నిఖితకి మళ్ళీ నవ్వొచ్చింది. మహతి చెప్పే పెళ్ళి కబుర్లన్నీ వినటానికి ఓపిక గానీ, ఉత్సాహం గానీ తనకిలేవనీ ఆమెకి తెలుసు. ఇప్పుడు ధాత్రిలాంటి శ్రోత దొరికాక ఇక అవసరం లేదు. వాళ్ళిద్దర్నీ అలా వదిలిపెడితే దాదాపు వారంరోజుల పాటు కదలకుండా కబుర్లు చెప్పుకోగలిగిన్ని టాపిక్స్ వాళ్ళ దగ్గరున్నాయి.

    వారంరోజుల తరవాత మీరేం మాట్లాడుకున్నారని అడిగితే అందులో ఒక్క  మాటకూడా ఇద్దరిలో ఎవరికీ జ్ఞాపకం వుండదేమో!

    నిఖిత చెయ్యి వూపి "బై" అని అక్కడినుంచి వెళ్ళిపోయింది మహతి, ధాత్రి మిగిలారు. "నా పెళ్ళి సంగతికేంగానీ  నీ విషయాలేమిటి? ఏదైనా అఫైర్స్ ?...!" అంటూ నవ్వింది.

    ధాత్రికూడా నవ్వేస్తూ "మీ కాలనీలోనే వుంటాడు. నీకు తెలిసే వుంటుంది ప్రీతమ్ అని" అంది.

    "ఓహొ! అతడా? మోటార్ బైక్ మీద తిరుగుతుంటాడు. నీకు మన కాలనీలో వున్నప్పటినుంచే పరిచయం కదా?"

    "లేదు. అప్పుడు  చిన్నపిల్లలం కదా. మొన్న కనపడ్డాడు....."

    మరికొంచెంసేపు మాట్లాడుకొని వాళ్ళు విడిపోయారు.

    వాళ్ళ దగ్గరి నుంచి సెలవు తీసుకున్న నిఖిత ఆఫీసులో మేనేజర్ని కలుసుకుంది. ఆయన కోపంగా వున్నాడు. "ఇంకో నెలరోజులు సెలవు కావాలా? ఇప్పటికే లాస్ ఆఫ్ పేలో వున్నావు. అందుకే నోటీసిచ్చాం" అన్నాడు.

    తన కష్టాల్ని పరాయివాళ్ళ దగ్గర విప్పి చెప్పుకోవటం నిఖితకి ఎప్పటికీ నచ్చని విషయం. అయినా అది అవసరం కాబట్టి తన తల్లిదండ్రుల గురించి చెప్పక తప్పలేదు. ఆయన వినటం అయితే ఓపికగా, సానుభూతిగా విన్నాడు. "నేను రికమెండ్ చేస్తాను. కానీ పై నుండి ఇప్పటికే రెండుసార్లు నీ గురించి మెమో వచ్చింది" అన్నాడు.

    "నేను వెళ్ళి జనరల్ మేనేజర్ని కలుస్తాను సార్" అంది.

    "వద్దులే. నేను మాట్లాడతాను. నువ్వు సెలవు అప్లికేషన్ వ్రాసివ్వు" అని చెప్పాడు. ఆమె ఆయనకి ఆప్లికేషన్ వ్రాసిచ్చి ఇంటికి వెళ్ళి పోయింది.

    ఆమె వెళ్ళగానే ఆయన ఫోన్ అందుకొని శంకరానికి ఫోన్ చేశాడు. "ఇప్పుడే నిఖిత వచ్చి మరో నెలరోజులు శెలవు కావాలని అప్లికేషన్ వ్రాసిచ్చి వెళ్ళింది" అని చెప్పాడు.

    "మరి నేను చెప్పిన విషయం గుర్తుందా?" అట్నుంచి అడిగాడు శంకరం.

    మేనేజర్ నవ్వాడు. "గుర్తుంది. ఆ విషయం అంతా నేను చూసుకుంటానులే. అయినా నా వుద్దేశ్యంలో మీ అబ్బాయి ఈపాటికే అక్కడ అమెరికాలో కొత్త వాతావరణంలో పడి ఈ అమ్మాయిని మర్చిపోయుంటాడు. ఎనీ హౌ నేను చూసుకుంటానన్నానుగా" ఫోన్ పెట్టేశాడు.


                                   5

   
    మహతితో మాట్లాడి ధాత్రి ఇంటికి వచ్చేసింది. ఆ అమ్మాయికి తను మాట్లాడింది తల్చుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మహతి అంత  చొరవగా 'నీ కెవరన్నా బాయ్ ఫ్రెండ్స్ వున్నారా?' అని  అడగటం, తను ప్రీతమ్ గురించి చెప్పటం కొత్తగా, కొద్దిగా ఆనందంగా, థ్రిల్ గా అనిపించింది.

    ఒకప్పుడు అమ్మాయిలు తమకెవరన్నా బాయ్ ఫ్రెండ్స్ వుంటే ఆ విషయం స్నేహితులకి తెలుస్తుందేమో అని భయపడుతూ వుండేవారు. ఇప్పుడు ఇద్దరమ్మాయిలు కొత్తగా పరిచయం అయి వివరాలు తెలుసుకుంటూ 'నీ కెవరైనా బాయ్ ఫ్రెండ్స్ వున్నారా' అని అడిగితే లేరని చెప్పటం నామోషీగా కనిపిస్తోంది.

    కేవలం ఆ కారణం వల్లే ప్రీతమ్ ని తన బాయ్ ఫ్రెండ్ గా ధాత్రి చెప్పుకున్నా, ఆ సమాధానం ఆమె మనసులో తొలి అంకురాన్ని వేసింది. ప్రీతమ్ కి అప్పటివరకూ ఆమె చాలా డబ్బు ఇచ్చినా, వాళ్ళిద్దరి మధ్యా ఈ విధమైన రొమాన్స్ ప్రసక్తి  ఎప్పుడూ  రాలేదు. ఒక రహస్యాన్ని పంచుకుంటున్న ఇద్దరు దొంగలు కూడా ప్రాణ స్నేహితులవ్వచ్చు. ఆ విధంగా వాళ్ళు 'డ్రగ్' కోసం  మంచి  స్నేహితులయ్యారు.

    తండ్రి చేతిలో నిరంతరం డబ్బులుండటం ధాత్రికి లాభించింది. తనకోసం ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడే ప్రీతమ్ కోసం ఆమె ప్రస్తుతం ఏ పని చేయాటానికైనా సిద్ధంగా వుంది. ఆమెకి కంటినిండా కునుకు పడుతోంది. మనసు గాయపడినప్పుడల్లా స్వాంతన లభిస్తోంది. జీవితంలో మంచి స్నేహితుడు దొరకటం కన్నా అదృష్టం ఇంకేముంటుంది? తన బాధలు పంచుకునేవాడు, తనకి ఓదార్పు నిచ్చేవాడు..... అటువంటి వాడికోసం తనేమైనా చేయగలదు.

    ప్రీతమ్ మమ్మీ, డాడీ  చాలా స్ట్రిక్ట్  అని ధాత్రికి తెలుసు. డబ్బు విషయంలో వాళ్ళు మరీ  పిసినారులని (తల్లిదండ్రుల గురించి) ఆమెకి చెప్పాడు. అతడి బాధ నర్థం చేసుకొని ధాత్రే అడక్కుండా అతనికి డబ్బుసాయం చేస్తోంది. మొదట్లో బాగానే వుండేది. కాని కొంతకాలం అయిన తర్వాత ఆమె దగ్గర కూడా డబ్బు అయిపోయింది. మరో మార్గంలేక తండ్రి జేబులోంచి తీయడం మొదలుపెట్టింది.

    మొదటిసారి డబ్బు తీసినప్పుడు ధాత్రికి చాలా భయం వేసింది. రెండు రోజుల దాకా డబ్బు పోయిన విషయం గమనించలేదని తెలిసి ఆ అమ్మాయికి  ధైర్యం వచ్చింది. అప్పటినుంచి అది ఇక నిరంతరం కార్యక్రమం అయిపోయింది.

    ఆ రోజు ప్రీతమ్ కి డబ్బు ఇస్తానని రాత్రి ప్రామిస్  చేసింది. నిజానికి ఆమె దగ్గర కూడా 'డ్రగ్' అయిపోయింది. ప్రస్తుతం ఆమె డ్రగ్ లేకుండా రాత్రిపూట నిద్రపోయే స్థితిలో లేదు. ఆ రోజు కూడా మామూలుగా వెళ్ళి తండ్రి జేబులో పర్స్  బయటికి తీసింది. నోట్లోతో నిండుగా వుంది అది. ఆమె కొన్ని నోట్లు బయటికి లాగుతూ వుండగా  మరుక్షణం ఒక చెయ్యి ఆ నోట్లనీ, పర్సునీ కూడా విసురుగా లాక్కుంది. ధాత్రి భయంగా తల తిప్పి చూసింది.

    తల్లి!

    శ్రీలక్ష్మి నిప్పులు కక్కుతున్న కళ్ళతో కోపంగా చూస్తూ పర్స్ తిరిగి భర్త షర్ట్  జేబులో పెట్టేసింది. "మమ్మీ......" అంటూ ధాత్రి ఏదో చెప్పబోయింది. శ్రీలక్ష్మి కూతుర్ని అక్కడినుంచి బయటి గదిలోకి  లాక్కొచ్చేసింది. కూతురు దొంగతనం చేస్తున్నందుకు ఆమె తిట్టలేదు. కూతురి ఈ బలహీనత భర్తకి తెలిస్తే అతడు దాన్ని ఏ రకంగా సాధిస్తాడో అని ఆమెకి భయం.

    ఆ తప్పు కూడా తనమీదే తోసేసి, తననే దండిస్తాడు.

    ఎంత చిత్రమైన స్థితి! ఇళ్ళల్లో ఏ  తల్లికీ వుండకూడని స్థితి.

    ధాత్రి దిగులుగా కూర్చొని వుంది. ప్రీతమ్ విసుగ్గా పచార్లు చేస్తున్నాడు. మొట్టమొదటిసారి తన స్నేహితుడికి డబ్బు ఇవ్వలేకపోయినందుకు ధాత్రికి చాలా గిల్టీగా వుంది. "చాలా ప్రయత్నించాను ప్రీతమ్ కానీ దొరకలేదు" అంది.

    ప్రీతమ్ వచ్చి ఆమె సమీపంలో కూర్చుంటూ "నువ్వుమాత్రం ఏం చేస్తావు ధాత్రీ? చేయవలసిన ప్రయత్నమంతా చేశావుగా. అయినా ఎంతకాలమని నీ దగ్గర ఇలా డబ్బు  తీసుకోవటం! ఈసారి నేను ప్రయత్నం చేస్తాను. నీకు కొనిపెడతాను" అన్నాడు.

    ధాత్రి కళ్ళవెంట నీళ్ళు గిర్రున తిరిగాయి. తన కోసం అంత కష్టపడుతున్న తన స్నేహితుడి కోసం ఏదైనా చేయాలనిపించింది. ఆ విషాదమైన మొహాన్ని తన గుండెలకి హత్తుకొని 'నేను నీకున్నాను' అని చెప్పాలనిపించింది. కష్టాల్లో ఒకరినొకరు తోడుండటమేగా స్నేహమంటే! తమది స్నేహం కన్నా గొప్ప అనుబంధం.

 Previous Page Next Page