ఏం చెయ్యాలా అని ఆలోచించింది రేవతి. తనే ఈ ఉత్తరాన్ని నలుగురిలో బయటపెడితే బాగుండదు. ఆ పని తను చేస్తే అసహ్యంగా ఉంటుంది. దీన్ని సుశీల చేతిలో పడేస్తే సరి.... ఇంకా అంతా ఆవిడే చూసుకుంటుంది. చూసేవాళ్ళకు న్యాయమూ, సహజమూ అనిపిస్తుంది.... బంధాలకు కట్టుబడే ఆ భర్తగారి పవిత్ర ప్రేమలో విలువ బజారున పడుతుంది.
భాస్కర్ లేని సమయం చూసుకుని ఆ వుత్తరం తీసుకుని సుశీల దగ్గిర చేరింది రేవతి.
"ఈ వుత్తరం చదవండి...." అంది వుత్తరాన్ని సుశీలకి అందిస్తూ.
సుశీల లోలోపల కుములుతూ, పైకి బింకంగా "నాకెందుకు? మరొకరి ఉత్తరాలు నేను చదవను" అంది.
రేవతి నవ్వి "మరొకరి ఉత్తరం నేనెందుకిస్తానండీ, మీకు? అది మీ పతిదేవుల ఉత్తరం - భాస్కర్ గారి ఉత్తరం. ఇది చదవటానికి మీకు సర్వ స్వతంత్రాలూ ఉన్నాయి" అంది.
సుశీల తలలో రైళ్ళు పరిగెట్టాయి. గుండెలలో ప్రళయ జ్వాలలు రేగాయి.
సుశీల దుర్మార్గురాలు కాదు - కానీ, లోక సామాన్యంగా మాత్రమే ఆలోచించగలదు. తనకు కళ్ళు పోయాయి. కళ్ళున్నప్పుడే భాస్కర్ నీ, తననీ చూసిన వాళ్ళందరూ, 'అతనికి తగిన భార్య కాదు' అని గుసగుసలాడుకోవటం తనకు తెలుసు. ఇక తనకు కళ్ళు పోయాక - భాస్కర్ దృష్టి మరొకవైపు మళ్ళటంలో ఆశ్చర్యమేముందీ? ఏ క్షణంలో భాస్కర్ మరొకరిని స్వీకరిస్తాడో, ఏ దుర్మూహూర్తంలో తన బ్రతుకు బండలయిపోతూందో అని హడిలిపోతూ ఉంటుంది సుశీల ఎప్పటికప్పుడు. అందుకే ఒక రాక్షసిలాగ పిశాచిలాగా - తన జీవితానికున్న ఏకైకాధారాన్ని కాపాడుకోవటానికి శక్తులన్నీ కేంద్రీకరించి పోట్లాడుతుంది.
"భాస్కర్ ఉత్తరమా? భాస్కర్ మీకు ఉత్తరం రాశాడా ఏమని రాశాడు? పెళ్ళి చేసుకుంటానని రాశాడా? ఆ పెళ్ళి చెల్లుతుందా నేను చెల్లనిస్తానా? మా నాన్నగారంటే ఏమిటో మీకు తెలీదు. ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు త్రాగించక పోతే...."
పులిలా గాండ్రిస్తోన్న సుశీల ధోరణికి చికాగ్గా అడ్డు తగులుతూ "సుశీలగారూ! మీకు మతి పోయిందా? మీ భాస్కర్ నాకు ఉత్తరం రాస్తాడా? రాస్తే నేను ఊరుకుంటానా? చెంప పగల కొట్టనూ ఇన్నాళ్ళనుంచీ చూస్తున్నారు, నా సంగతి మీకు తెలియదూ? ఈ మొగ పురుగులంటే నాకు అసహ్యం - ఎంతమంది కాళ్ళ చుట్టూ తిరుగుతున్నారో, మీకు తెలియదూ? వాళ్ళని చీడ పురుగుల్లా చూస్తాను" అంది.
"అవును! నా చుట్టూ తిరిగే మొగవాళ్ళకి లెక్కలేదు. కానీ ఎలాంటివాళ్ళు వాళ్ళు? నాకు పెళ్ళి కాలేదు కదా, తీరని కోరికలు ఉండకపోతాయా - అనే దరిద్రపు ఊహలతో.... వెకిలిగా - యావగా - నా ముందు కూర్చుని - నా గాంభీర్యం చూసి తమ మనసు బయట పెట్టలేక.... తమ నీచపు కోరికలు అణచుకోలేక.... నీళ్ళు నములుతూ కూర్చునే చీడపురుగులు! కానీ, భాస్కర్ లాంటివాళ్ళు నా చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఇలాంటివాళ్ళు సహృదయంతో, నా బోటివాళ్ళతో ఎంతో గౌరవంతో మాట్లాడతారు. ఒకవేళ నిజంగా ప్రేమ కలిగితే సాహసంతో దేనినైనా ఎదిరించి, ఎంతకైనా సిద్ధపడి మనసారా స్వీకరిస్తారు. అంతేకాని అల్పంగా, నీచంగా ఒక్కనాటికీ ప్రవర్తించరు భాస్కర్ అంటే నాకు తెలియకుండానే గౌరవం కలుగుతోంది.... ప్రేమిస్తున్నానేమో కూడా తెలియదు. అసలు ఇంతవరకూ నేను ఎవరినీ ప్రేమించలేదు. నాకు జరిగిన అన్యాయానికి, అందరి మీదా మండిపోతున్న నా మనసు ప్రేమించే శక్తిని పోగొట్టుకుందేమోనని భయంగా కూడా ఉంది. అయినా భాస్కర్ నన్ను అవమానించాడు. ఆ అవమానానికి బదులు తీర్చుకోకుండా ఉండలేను!" అని గొణిగింది రేవతి లోపలి గొంతు.
"అయితే, భాస్కర్ ఆ వుత్తరం ఎవరికి రాశాడు? అది మీ దగ్గరకెలా వచ్చింది?" నీరసంగా అడిగింది సుశీల.
"భాస్కర్ ఈ వుత్తరాన్ని హోటల్ లో అర్థనగ్న ప్రదర్శనలిచ్చే జ్యోత్స్నకి రాశాడు."
"ఏం రాశారు? నేను చదవలేకపోతున్నాను - చదివి వినిపించండి!"
రేవతి ఆ ఉత్తరంలో ప్రతి వాక్యమూ చక్కగా భావాలన్నీ వ్యక్తమయ్యేలాగ చదివింది. చదివి, సుశీల రియాక్షన్ కోసం చూసింది. సుశీల శిలలా కూచుంది.
రేవతి భయపడుతూ "సుశీలగారూ! విన్నారా?" అంది.
సుశీల శాంతంగా "ఆ వుత్తరం మీకెలా వచ్చిందీ?" అంది.
రేవతి కొద్దిగా తడబడి "జ్యోత్స్న సుబ్బలక్ష్మి చేత నా వద్దకు పంపించింది, ఎలాగైనా మీకు అందజేయమని...." అంది.
సుశీల శరీరం వణికిపోవటం స్పష్టంగా కనిపించింది రేవతికి. సుశీల ఇంకేమీ మాట్లాడలేదు.
ఆ అంధురాలి గుండెలో ఏ అగ్ని పర్వతాలు బద్ధలవుతున్నాయోనని హడిలిపోయింది రేవతి. "వస్తాను" అని అక్కడుండకుండా వచ్చేసింది.
సుశీల పుట్టుగుడ్డి కాదు - మధ్యలో పోయింది చూపు. ఆ కణం చేత ప్రతి అడుగుల సవ్వడినీ గుర్తించేటంత సునిశితత్వాన్ని వీడలేదు ఆవిడ శ్రవణేంద్రియాలు - భాస్కర్ వచ్చింది సుశీలకు తెలియలేదు. అలాగే కూచుంది.