తెల్లగా పాలిపోయింది యశోద మొహం. అతడికి తాగుడు అలవాటు చేసి, అలా కావడానికి తను కారణమేమోననుకుని మనసులో బాధ పడుతూనే ఉంది యశోద.
అతడింత అభాండం వేసేసరికి, భరించలేకపోయింది. పట్టరాని కోపంతో..." నేను నీకు తాగుడు అలవాటు చేసింది...." అని ఆగిపోయింది.
అంతలో వివేకం మేల్కొంది. అతడూ తననెంతగా హింసించిన, బెదిరిపోయిన అతడి మనసు మీద అతిసున్నితమైన చోట దెబ్బ వేయలేదు. ఏ అజ్ఞాత కారణం వల్లో విహ్వలమైన మనసును మరింత చెదరగొట్టలేదు.
అక్కడ ఒక్క క్షణం నిలవకుండా గదిలోంచి బయటి కొచ్చేసింది.
గుండె గుభిల్లుమంది వివేక్ కి! యశోద లేని ఆ గది అతడికి నోరు తెరుచుకున్న భూతంలాగ కనిపించింది. అక్కడ నిలవలేకపోయాడు...
మనసుకి భరించరాని వ్యధ కలిగినప్పుడు, వివేక్ తల్లి దగ్గర కూచోవటం అతనికి అలవాటు! ఆ అలవాటు కొద్దీ తల్లిగదిలోకి వెళ్ళాడు. నిశ్చింతగా నిద్రపోతుంది ప్రసూన. ప్రసూన మంచం పక్కనే మరో మంచం మీద యశోద నిద్రపోతోంది.
ఆమెని చూడగానే వివేక్ పొందిన రిలీఫ్ మాటలకందనిది! నడి వేసవిలో, మండు టెడారిలో, ఒయాసిస్సు కంట పడిన బాటసారిలా పొంగిపోయాడు... వెనక్కి తన గదిలోకి వెళ్ళాలనిపించలేదు.
అక్కడే కటికనేలమీద దిండైనా లేకుండా పడుకున్నాడు. కళ్ళు మూతలు పడి మనసు నిద్రలోకి జారుకుంటూండగా ఒక ఆలోచన వచ్చింది వివేక్ కి. తల్లీ.. తండ్రి వేరు వేరు గదుల్లో ఎందుకు పడుకుంటున్నారు?
అతడికి ఊహ వచ్చినప్పట్నుండీ అలాగే పడుకుంటున్నారు. కారణం ఏమై ఉంటుందీ? నిద్రలోకి జారిపోయాడు.
* * *
దుర్గయ్య కారు నడుపుతున్నాడు. వెనక సీట్లో వెనక్కి వాలి అలసటగా కళ్ళు మూసుకుంది యశోద తన కర్తవ్యం ఏమిటీ? ఆమెకి అర్థం కావటం లేదు. భవిష్యత్తు అయోమయంగా అనిపిస్తోంది. ఒకరికి చెప్పుకునే సమస్యకాదు. ఇతరులు పరిష్కరించగలిగే సమస్య కాదు.
ఆ రోజు ఉదయమే నిద్రలేచింది యశోద. మొదట కొంతసేపు తనెక్కడున్నదీ కూడా అర్థం కాలేదు! అంతగా మొద్దుబారిపోయింది మెదడు. పక్కన మరో మంచం మీద పడుకుని ఉన్న ప్రసూనని చూశాక ఏం జరిగిందో నెమ్మదిగా గుర్తుకొచ్చింది.
తర్వాత నేలమీద పడుకున్న వివేక్ మీద పడింది దృష్టి. అంతకు ముందు చెలరేగిన కోపమంతా కరిగిపోయి. జాలితో నిండింది మనసు.
తట్టిలేపింది అతడ్ని. కళ్ళు తెరుస్తూనే యశోదని చూసి గట్టిగా కౌగిలించుకున్నాడు. తల్లి కనబడక తల్లడిల్లిపోయిన పసివాడు ఆమె కనపడగానే బెంగతో హత్తుకుపోయినట్లు ఆమె గుండెలో తలదాచుకున్నాడు.
అతడి జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి మృదువుగా దువ్వింది. మౌనంగా ఒకరి మనసులు మరొకరికి సందేశాలు పంపుకున్నాయి. ఆ స్పర్శతో తెలివి తెచ్చుకున్నాడు వివేక్.
సిగ్గుతో యశోదని వదిలేసి తన గదిలోకి వచ్చేశాడు వివేక్. ఆ తర్వాత యశోదని పలకరించలేదు.
అతడితో మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు యశోద. కానీ సర్దుకున్న సూట్ కేస్ మూలకు తోసేసింది యశోద. ఇప్పట్లో అతడిని వదిలి వెళ్ళలేదు. కొంత కాలం ఆగి చూడాలి పరిణామాల కోసం.
మామూలుగా క్లినిక్ కి బయలుదేరింది యశోద. క్లినిక్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి దుర్గయ్య ఎదురు చూస్తున్నాడు కారుతో.
"అమ్మా! అయ్యగారు నన్ను తొందరగా రమ్మన్నారు. మిమ్మల్ని ఇంటిదగ్గర దింపి కారు కావాలంట"
"అయ్యగారే పంపించారా! నిన్ను?" అడిగింది యశోద.
"అవునమ్మా! ఫ్యాక్టరీలో ఉన్నారు" చెప్పాడు.
తనలో తను నవ్వుకుంది యశోద. వివేక్ తనను వదులుకోవటానికి సిద్ధంగా లేదు. అంత మాత్రాన పరిస్థితులు సవ్యంగా సర్దుకుంటాయని అనుకోవటానికి వీల్లేదు.
క్రాస్ రోడ్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ రాకపోవటంతో కారు ఆగింది.
"హలో!" పక్కనే ఆగిన కారులోంచి జానీ పలకరించాడు.
"హలో" అంటూనే ఉలిక్కిపడింది. జానీ పక్కనే అతడి కారులో దేవిశంకర్ గూండా నౌకర్.
చిన్నతనం నుంచీ వివేక్ ని ఎత్తుకుని మోశానని చెప్పినవాడు.
"ఎందుకలా అయిపోయావ్! ఇతడిని చూశావా? వీడు జగదేకవీరుడు" నవ్వుతూ అన్నాడు జానీ.
అప్పటికే అతడు కూడా యశోదని చూశాడు నవ్వాడు వెకిలిగా. "అసలు పేరు వీరన్న... జగదేకవీరుడు. నేను పెట్టుకున్న పేరు. ఏ పనైనా చెప్పు! సాధించుకొస్తాడు. అంచేత నేను ముద్దుగా పెట్టుకున్నాను ఆ పేరు."
"నీకు ఇతడు సాధించి పెట్టవలసిన పనులేమున్నాయి?"
ట్రాఫిక్ సిగ్నల్స్ లో గ్రీన్ లైట్ వచ్చింది. దుర్గయ్య కారు స్టార్ట్ చేశాడు. క్రాస్ రోడ్ దాటగానే "కారాపు!" అంది యశోద. రోడ్డు వారగా కారు పార్క్ చేశాడు దుర్గయ్య. అతడి ముఖం అప్రసన్నంగా ఉంది. అప్పటికే కాస్త ముందుకు వెళ్ళిన జానీ వెనక్కి వచ్చి..." ఏదైనా ట్రబులా?" అని అడిగాడు.
"కాదు.... నీతో మాట్లాడాలని"
"వెల్ కమ్! కానీ ఇలా కార్లలో ప్రయాణం చేస్తూ, మాట్లాడుకోగలమా? ఏదైనా హోటల్ లో కూచుని మాట్లాడుకుందాం."
"ఆల్ రైట్ దుర్గయ్యా! హోటల్ అమృతాకి పోనీయి"
"అమ్మా! అయ్యగారు కారు తొందరగా తెమ్మన్నారు."
"నన్ను హోటల్ దగ్గర డ్రాప్ చేసి. నువ్వు వెళ్ళిపో"
దుర్గయ్యకి ఎంత మాత్రమూ ఇష్టం లేనట్లు అతని ముఖం చెపుతోంది. కానీ యజమానులతో తమ ఇష్టాఇష్టాలు ప్రకటించడానికి వీల్లేదు. రెండు కార్లూ హోటల్ అమృతా ముందు ఆగాయి.
తను దిగి "కారు అయ్యగారికి తీసికెళ్ళు" అని చెప్పింది యశోద.
జానీ ఇరవై రూపాయల నోటు వీరన్న మీదకి విసిరాడు.
"జగదేకవీరా! ఈ రోజు నీ ఇష్టం వచ్చిన చోటికి ఫో. రేపు రా!" అన్నాడు.
"చిత్తం!" అంటూ యశోదని చూసి వంకరగా నవ్వి వెళ్ళిపోయాడు వీరన్న భగ్గుమంది యశోద మనసు.