Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 30


    "ఖచ్చితంగా నిజం! యూరిన్ టెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అందులో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఎందుకా ఆశ్చర్యం?"
    యశోద మాట్లాడలేదు. ఆమెకి ఆనందించాలో బాధ పడాలో కూడా అర్థం కావటం లేదు. మెదడంతా మొద్దుబారిపోయినట్లయింది. డాక్టర్ దగ్గరగా వచ్చి. భుజం మీద చెయ్యివేసి. "వాటీజ్ రాంగ్?" అంది.
    త్వరత్వరగా తనను తను అదుపులోకి తెచ్చుకుంది యశోద.
    "నథింగ్! కొంచెం గిల్టీ ఫీలయ్యాను అంతే. థేంక్యూ"
    కన్సల్టింగ్ రూంలోంచి బయటికి వచ్చింది. డాక్టర్ వెనకాతలే వచ్చి "కంగ్రాట్స్ ప్రసూన గారూ" "మీరు నాయనమ్మగారు అయిపోతున్నారు" అంది ప్రసూన వెంటనే డాక్టర్ చేతిలో వందరూపాయలు పెట్టింది. దాని కోసమే మిగిలిన పేషెంట్స్ ని ఆపి వచ్చింది డాక్టర్. యశోద పసిపిల్ల అయినట్లు నడుంచుట్టూ చెయ్యివేసి, నడిపించుకుంటూ తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టింది ప్రసూన. యశోద రెసిస్ట్ చెయ్యలేదు. అసలు ఆమె మెదడు పని చెయ్యటం లేదు. కారులో కూర్చున్నాక ప్రసూన మళ్ళీ అంది.
    "ఇప్పటికయినా నువ్వు ఉద్యోగం మానేస్తే మంచిది"
    యశోద సమాధానం చెప్పకుండా సొమ్మసిల్లినట్లు సీట్ లో వెనక్కి వాలిపోయింది.
    "సరే! సరే! నువ్వు చాలా అలసిపోయినట్లున్నావు. విశ్రాంతి తీసుకో" బుజ్జగింపుగా అంది ప్రసూన.
    చాలా ప్రశాంతంగా కనిపించాడు వివేక్. ఆ ప్రశాంతత.... బద్దలవ్వబోయే ముందు అగ్నిపర్వతం లాంటిదని యశోదకి తెలుసు. ఆ రోజు తాగిలేడు. చాలా నార్మల్ గా మాట్లాడుతున్నాడు" అమ్మ చెప్పింది నిజమేనా?"     

    "నిజమేనని అంటోంది డాక్టర్"
    "నీకేమైనా అనుమానంగా ఉందా?"
    "అయోమయంగా ఉంది"
    "తండ్రి ఎవరు?"
    "తెలీదు!"
    "తండ్రి ఎవరో చెప్పలేనంత మంది స్నేహితులున్నారా నీకు?"
    దిగ్గున తలెత్తింది. నిప్పులు కక్కాయి చూపులు.
    జంకాడు వివేక్. వెంటనే ఏదీ మాట్లాడలేకపోయాడు. అలా చూస్తూనే ఉంది యశోద.
    "అయితే ఏం జరిగింది?"
    "తెలీదు!"
    సడన్ గా చాలా మార్పు వచ్చేసింది యశోద గొంతులో. సర్రున కత్తి దూసినట్లుగా పలుకుతోంది అది వివేక్ మనసులో క్రోధం పెరిగింది "మొగుణ్ణి కొట్టీ మొగసాల మీదికెక్కినట్లు ఎవరి మీద ఈ ప్రతాపం?" అనుకున్నాడు.  
    "మేరీమాతకు యేసుక్రీస్తు పుట్టినట్లు. పరిశుద్ధాత్మ వల్ల గర్భం వచ్చి ఉండవచ్చు."
    "అలా జరిగి ఉండకపోవచ్చు. నాకు క్రిస్టియానిటీలో నమ్మకం లేదు."
    "వేములవాడభీమకవి కూడా, ఇలాగే పుట్టాడట. ఎటొచ్చీ అతని తల్లి వితంతువు."
    "ఇవేవికావు! నీకు పెళ్ళయిన మరునాటి నుండీ సత్యన్నారాయణస్వామికి రోజూ మొక్కుకుంటున్నాను. మనవడో, మనవరాలో కావాలని. ఇదంతా ఆ సత్యన్నారాయణస్వామి దయ. ఈ ఇంట్లో మళ్ళీ పసిపాప పారాడుతుంది. బోసినవ్వుల ముత్యాలజల్లులు కురుస్తాయి. ఇది మీ ఇద్దరిదీ కాదు! నా అదృష్టం. నా నోముల ఫలితం"
    పాలగ్లాసుతో వచ్చి ప్రసూన సందర్భం అర్థం చేసుకోకపోవటంవల్ల కల్పించుకుని అంది.
    ప్రసూనని చూడగానే మెత్తబడిపోయింది యశోద.
    "అయ్యో! రోజూ పాలు తీసుకుని మీరు రావటం ఏమిటి అత్తగారూ!  నేనే వచ్చేదాన్నిగా!"
    "నా మనవడికి నా చేత్తోనే పాలు ఇచ్చుకున్న తృప్తి. ఇది నాకు దక్కనియ్యి. పేచీలు పెట్టకు. తాగు...."   
    పాలగ్లాసు అందించింది. ఏ మాత్రం తాగాలని లేకపోయినా, అత్తగారి మనసు కష్టపెట్టడం ఇష్టంలేక. అందుకుని తాగేసింది యశోద. సంతృప్తితో వెళ్ళిపోయింది. 
    ఆవిడ వెళ్తూ వెళ్తూ కొడుకూ, కోడలు ఇద్దరి తలల మీదా ఆప్యాయంగా చేతులు వేసి తనలో తాను ఆశీర్వదించుకుంది.
    ప్రసూన వెళ్లగానే యశోద తన సూట్ కేస్ తెరిచి, అందులో బట్టలు సర్దుకోసాగింది.
    వివేక్ మనసులో ఏదో భయం చలిజ్వరంలా వణికింది. యశోదని ఇప్పటికీ తను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమె తనని వదిలి వెళ్ళిపోవటం భరించలేకపోతున్నాడు. ఈ చేదు నిజం అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు.
    "యశోదా నాకు నిజం చెప్పు. ఇప్పుడు నీవున్న పరిస్థితులలో నువ్వు చేసింది పెద్ద తప్పేమీ కాదు"
    నిటారుగా నిలబడింది యశోద" నేను నిజమే చెప్పాను"
    "ఏది నిజం? అమ్మ సత్యన్నారాయణస్వామికి మొక్కుకోవటం వల్ల నీకు గర్భం రావడమా?"

    "అవును, అదే నిజం. సత్యన్నారాయణవ్రత కధ లాంటివి లోకంలో నిజంగా జరుగుతాయా? అనుకొనే దానిని... అంతకంటే అద్భుతాలు జరుగుతాయి."

    "నేను పిచ్చివాడినని అనుకోకు?"
    "నేనే పిచ్చిదానిని!"
    "ఎందుకూ? నన్ను పెళ్ళి చేసుకోవటం వల్ల."
    "కాదు! జరుగుతున్న దేమిటో అర్థం చేసుకోలేకపోతున్నందువల్ల!"
    "ఒకప్పుడు కాశీమజిలీ కధల్లో చదివే వాడిని. మేడపైన నిద్రపోతున్న రాజకుమారిని, ఆకాశమార్గాన వెళ్ళే గంధర్వుడు మోహించి. కిందకి దిగివచ్చి గర్భం చేసి వెళ్ళాడని...."

    "స్టాపిట్! ఇంక ఈ విషయంలో డిస్కస్ వద్దు... మా ఇంటికి వెళ్తాను. నువ్వు విడాకులెప్పుడిస్తే అప్పుడిస్తాను. నువ్వు దర్జాగా మరొక అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చు."
    చివరి వాక్యంలో ఒద్దనుకున్నా కొద్దిగా వ్యంగ్యం తొంగి చూసింది. అది బాణంలా గుచ్చుకుంది వివేక్ ని. అతడు సహించి ఊరుకోలేకపోయాడు.
    "నువ్వు కోరిన వాడిని పెళ్ళి చేసుకోవటం కోసం నువ్వు మరో పెళ్ళి ఎర చూపించనక్కరలేదు. ఇందుకేనా నాకు తాగుడు అలవాటు చేసి బార్ కి తరుముతున్నది. నేను బార్ కి పోగానే, పుట్టింటికని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు తిరిగి రావచ్చు."                          

 Previous Page Next Page