Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 31


    "నేను వెళ్ళిపోతాను. అదృష్టం బాగుండి చేతిమీద పెట్టుకున్నారు."

 

    "చేతిమీద పెట్టుకోవడం ఏమిటి.....?" ఆశ్చర్యంగా అడిగాడు.

 

    "చూడండి.... నా కిలాంటివి యిష్టం వుండవు. ఇలాతొకాలు జారితే కన్నెపిల్లకి కష్టం" అంది.

 

    "కాలు జారిందా....? అయినా చీకట్లో నడవడం ఎందుకు......? కాలు  జారిందని బాధ పడడం ఎందుకు......?"

 

    "నేను మీ పక్కనే వున్నాను. నడిచి కాలు జారడం గురించి కాదు నేను చెప్పేది. ముద్దు పెట్టుకుంటే జరిగే కాలు జారడం  గురించి."

 

    "ముద్దు పెట్టుకుంటే కాలు జారడం ఏమిటి.....? నువ్వేం మాట్లాడుతున్నావ్ లేఖా....? ఎవరైనా పడుకుని, నిలబడి, కూర్చుని ముద్దు పెట్టుకుంటారు కానీ, పరుగెత్తుతూ పెట్టుకోరు కదా కాలు జారడానికి" నిజంగానే అర్ధం కాక అడిగాడు నేత్ర.

 

    ఆమె లేచి "నేను  వెళ్తాను. అంత అపాయకరమైన విషయం గురించి ఈ చీకట్లో మాట్లాడడం నాకు భయంగా వుంది" అంది. ఆ అమ్మాయి భయాన్ని చూచి, నేత్ర ఇక బలవంతం చెయ్యలేదు మొదటికే మోసం వస్తుందని.

 

    "మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం.....?"

 

    "ఉహూ..... యిక కలుసుకోను."

 

    "అదేం....?"

 

    "ఇలా చీకట్లో దొంగతనంగా కలుసుకోవడం, పిరికిపందల్లా ఎవరైనా చూస్తారేమోనని భయపడడం నాకిష్టం వుండదు."

 

    "మరెలాటివి యిష్టం....?"

 

    "జాకీ ఛాన్, సిల్వెస్టర్  స్టాలిన్, ఛక్ నోరిన్, ఛార్లెస్ బ్రాన్ సన్ తెలుసుకదా. మొగాళ్ళంటే అలా వుండాలి" అన్నదామె. "మా  ఫ్రెండ్స్ అందరికీ జాకీఛాన్ అంటే ఎంతో యిష్టం. పడి ఛస్తారు. పోలీస్ స్టోరీ పదిసార్లు చూశారు. పెళ్ళికాని వాళ్ళు అతని ఫోటో లాకెట్ లో పెట్టుకుంటారు. పెళ్ళయిన వాళ్ళయితే మంగళసూత్రాల మధ్య పెట్టుకుంటారు."

 

    "చాలు...... వితంతువులు ఎక్కడ పెట్టుకుంటారో- ఆ డీటైల్స్ వద్దు" అన్నాడు అతడు కసిగా.

 

    ఆమె లేచి "నేను వెళ్ళొస్తాను" అంది. అతడామె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. క్షణం సేపు గాఢమైన నిశ్శబ్దం. "నీ చెయ్యి ఎంత వేడిగా వుందో.....?" ఆమె మాట్లాడలేదు.

 

    "నువ్వు చేస్తున్న ప్రయోగాలు దేని గురించి స్వర్ణలేఖా.....?" అని అడిగాడు.

 

    నిశ్శబ్దం.

 

    "నీ తండ్రి నీ గురించి లక్షలు ఖర్చుపెట్టి ప్రయోగశాలలు నిర్మిస్తున్నాడు. ఎందుకోసం.....? ప్రవేశీ గూఢచారి ఎందుకు మన దేశంలో వున్నాడు......? నామీద నీకేమైనా ప్రేముంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. ఏమిటి నీ ప్రయోగాల ఆశయం.....?" ఆమె చేతిని తన చేత్తో రాస్తూ అన్నాడు. నిజానికి ఆ  చెయ్యి ప్రతిమది.

 

    ప్రతిమ అటూ ఇటూ చూస్తుంది. హంసలేఖ (ఆమె దృష్టిలో స్వర్ణరేఖ) ఆ గదిలోనే  ఇంకా వుందో, వెళ్లిపోయిందో తెలియడం లేదు. తన చేతిని  అతని చేతిలోకి తీసుకుని, తెగ రాసేస్తున్నాడీ నేత్ర. అది తన చెయ్యి అని చెప్పాలంటే పక్కన ఆ అమ్మాయి వుందో లేదో తెలియడం లేదు.

 

    "రేఖా......" అన్నాడు నేత్ర ఆర్తిగా- "నువ్వంటే నాకు చాలా యిష్టం."

 

    నిశ్శబ్దం.

 

    "నీకు.....?"

 

    "ఊ....." అంది ప్రతిమ ఇబ్బందిగా.

 

    అతడు ఆ చేతిని అలాగే దగ్గరకు తీసుకుని ఆమె భుజాల  చుట్టూ  చెయ్యివేసి, మొహం మీద మొహం పెట్టి, పెదవుల్లోకి రక్తం ప్రవహించేలా గాఢంగా బుగ్గమీద  ముద్దు  పెట్టుకుని, "చెప్పు. నీ తండ్రి  విదేశాలనుంచి ఎందుకు  అంత  ఆమ్లజలం తెప్పిస్తున్నాడు. ఈ విషయమై నీ అభిప్రాయం ఏమిటి.....?" అని అడిగాడు.

 

    "ఆ అమ్మాయి యిక్కడి నుంచి వెళ్ళిపోయిందేమోనని నా అభిప్రాయం" అంది ప్రతిమ మెల్లగా. నేత్ర షాక్ కొట్టిన వాడిలా ఆమెని వదిలేసి, "ఎవరూ అన్నాడు.

 

    అంతలో కరెంట్ వచ్చింది.

 

    నేత్ర ఆమెని చూసి తృళ్ళిపడి "నువ్వింత సేపూ యిక్కడే వున్నావా....?" అన్నాడు.

 

    "ఉన్నాను. మీ యిద్దర్నీ దగ్గర చెయ్యడానికి ప్యూజ్ తీసెయ్యడం తప్ప మరో మార్గం కనపడలేదు."

 

    "ఓసి దౌర్భాగ్యురాలా...... కరెంట్ తీసేసింది నువ్వా....? అన్నాడు నేత్ర. "అది లేకపోతే కాస్త యిం ఫర్మేషన్ బయటకొచ్చేది."

 

    "నువ్వేమో అసలు విషయానికి వెళ్ళకుండా ఐ లవ్ యూ.... ఐ లవ్ యూ అంటున్నావాయె. నాకేం చెయ్యాలో తోచలేదు. అందువల్ల నేనే నీ తరపున ఒక అడుగు ముందుకేసి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాను."

 

    "అందుకేనా కెవ్వున అరిచింది.....?"

 

    "ఆ....... అంతా నటన. నా ఫైల్లో పదిహేనో పేజీ చదువలేదూ....? ఆవిడగారి మొగ స్నేహితుల లిస్టు వుంది ఆ పేజీలో."

 

    "ఫైలు చదవడం నాకలవాటు  లేదు. పైగా......నాకా అమ్మాయి కళ్ళల్లో విజ్ఞానం ఏమీ కనపడడం లేదు - భయం తప్ప."

 

    "ఛరస్ మత్తులో కప్పబడిపోయిందది."

 

    "ఈ విషయంలో నువ్వు వేలు పెట్టకుండా నాకు వదిలేస్తే తప్ప ఈ ఆపరేషన్ కౌంటర్ స్ఫై సక్సెస్  కాదు."

 

    "అంతే.... యిదంతా నాకిష్టమై చేస్తున్నానంటున్నావా.....?"

 

    "చూస్తుంటే అలాగే కనపడుతూంది. నా చేతి మీద చెయ్యి వేసి నొక్కింది కూడా నువ్వేనా?"

 

    "నేనే! ఎంత త్వరగా అర్థం చేసుకున్నావ్ నన్ను......? నేను ప్రేమించిన వాడిని యింకొకరి కోసం వదలి పెట్టాను. ఇద్దరి మధ్య కూర్చుని ఒకరి ముద్దు మరొకరికి అందించాను. ఏ స్త్రీ చెయ్యని పని నేను  చేశాను. ఏ గూఢచారీ వెయ్యని ఫ్లాన్  నేను వేశాను రోషంగా అంది కన్నీళ్ళతో.

 

    "కొళాయి విప్పకు ప్లీజ్. నువ్వేం చెయ్యమంటే అది నేను కూడా చేస్తాను."

 

    ఆమె ఆశగా "నిజంగా చేస్తావా...?" అంది.

 

    "చేస్తాను"

 

    "అయితే రేపు సాయంత్రం ఆ అమ్మాయిని తీసుకొని బొంబాయి రోడ్డు మీద వెళ్ళు."

 

    "ఎందుకు.....?" అని అడిగాడు ఆశ్చర్యంగా.

 

    "చెప్తాను".

 

    "చెప్పు ముందు."

 

    "నువ్వు ప్రామిస్  చేశావు. చెయ్యాలంతే. ఆ అమ్మాయికి జాకీఛాన్ యిష్టమట. నువ్వు జాకీ ఛాన్ బాబువి అని నిరూపిస్తాను. తన లాకెట్ లోనూ బట్టల మధ్య వాడి ఫోటో తీసేసి నీ ఫోటో పెట్టుకునేలా చేస్తాను. ఇది నా దేశం మీద నేను చేస్తున్న శపథం" అంది ప్రతిమ.

 Previous Page Next Page