Previous Page Next Page 
13... 14.... 15 పేజి 31


    మధూహ స్థబ్దురాలై వింటోంది.

    "అటువంటి పరిస్థితుల్లో నేను తటస్థపడ్డాను. ఆమె వివాహిత అని తెలియక, పొరపాటున నా  ప్రేమని బయటపెట్టాను....ఆమె తన సంసారాన్ని ఎంత ప్రేమిస్తుందంటే......ఆమెలోని రెండో 'ఆమె' నన్ను అమితంగా ద్వేషించసాగింది. మరోవైపు మొదటి 'ఆమె' ఆ ప్రేమని కాదనలేకపోయింది. అందుకే ఆ అర్థరాత్రి నాకు ఫోన్ చేసింది. వెంటనే రెండో ఆమె ఆకాశరామన్నగా మారి మా ఇద్దరికీ వుత్తరాలు వ్రాసింది......."

    "నేనిదంతా నమ్మలేకపోతున్నాను."

    "ఈ స్కిజో ఫ్రేనియా మీద ఆలెఫ్ర్ డ్ హిచ్ కాక్ ఒక అద్భుతమైన సినిమా తీసాడు. ఒక తల్లి అంటే యువకుడి అపరిమితమైన ఇష్టం. ఎంతిష్టమంటే, తల్లి శవాన్ని కాల్చటం కూడా ఇష్టంలేక అస్థిపంజరాన్ని ఇంట్లో వుంచుకుంటాడు తల్లికొడుకుల ఇద్దరి సంభాషణ కొడుకే మాట్లాడుతూ వుంటాడు. చాలా చిత్రంగా, తల్లి తరపున మాట్లాడేటప్పుడు కొడుకు కంఠం కూడా ముసలి స్త్రీలాగే మారిపోతుంది. ఆ కొడుకు ఒక స్త్రీ ప్రేమలో పడతాడు. అది సహించలేక తల్లిగా వెళ్ళి ప్రియురాల్ని చంపేస్తాడు."

    వింటున్న మధూహ అప్రయత్నంగా వణికింది. అది గమనించి డాక్టర్ ప్రహసిత్ అన్నాడు "ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీలేదు. ఈ పారానాయిడ్ సైకాలజ్ ప్రతిమనిషిలోనూ కొద్దిగా వుంటుంది. తనకిలేని విలువలు అవతలివారికి కూడా లేవని ఎత్తిచూపటం కూడా పారానాయిడ్ మనస్తత్వంలోకే వస్తుంది. దాన్నే ద్వంద్వప్రవృత్తి అంటారు....."

    "ఇప్పుడేం చేయాలి?"

    "ఈ విషయానికి సంబంధించినంత వరకూ చేయటానికి ఏమీలేదు. ఈ  వుత్తరాన్ని తీసుకెళ్ళి ఆమెకి చూపించి, నువ్వే దీన్ని వ్రాసావన్నా ఆమె నమ్మదు. స్కిజోఫ్రెనియా లక్షణమే అది......"

    "కానీ  ఈ వుత్తరం పట్ల ఆమె  అమితంగా భయపడుతోంది. ఏదో ఒక విధంగా ఆ భయాన్ని పోగొట్టాలి."

    "నువ్వు తాత్కాలికమైన ఉపశమనాన్ని ఆలోచిస్తున్నావు. అసలు రుగ్మతని పొగొట్టకుండా ఈ చిక్సితలేమీ ఉపయోగపడవు."

    "ఏమిటి అసలు రుగ్మత?"

    "నిరాసక్తత! వైవాహిక జీవితంలో అసంతృప్తివున్న వారందరూ ఏదో ఒక విధమైన మానసిక రుగ్మతకి లోనవుతూనే వుంటారు. భజనలు, బాబాలు, షాపింగులు, మీటింగులులాటి రకరకాల దారులు చూసుకుని, వ్యాపకాలు కల్పించుకుని ఆ రుగ్మతనుంచి బయట పడటానికి ప్రయత్నిస్తారు."

    "మీరు స్త్రీ వాదం గురించి మాట్లాడుతున్నారా?"

    అంతంత పెద్ద పెద్ద  పదాలు నాకు తెలియవు. ఏ మనిషికయినా వ్యక్తిత్వం ద్వారా సంతృప్తి లభిస్తుందనీ, ఆ వ్యక్తిత్వం రావాలంటే కృషి చేయాలనీ, అలాటి కృషి చేయటానికి పట్టుదల కావాలనీ మాత్రమే తెలుసు. అలాటి పట్టుదలలేని వాళ్ళే కలల్లో తెలిపోవటమో, నిరాశలో కృంగిపోవటమో చేస్తారనీ తెలుసు. దీనికి మీరు ఏ వాదం అని పేరుపెట్టుకున్నా సరే..."

    కారు మధూహ ఇంటిదగ్గర సందులో ఆగింది.

    "రండి. కాఫీ తాగి వెళ్దురు గానీ."

    "ఇప్పుడా?"

    "రండి. అమ్మకూడా సంతోషిస్తుంది......"

    మధూహ అత్తామామలు మరణించినప్పుడు ప్రహిసిత్ అన్ని పనులూ తనపై వేసుకుని చేసాడు. అప్పటినుంచీ అతడు దగ్గిరయ్యాడు.

    ప్రహసిత్ ముందుగదిలో కూర్చోబెట్టి ఆమె లోపలికి వెళ్ళి కాఫీ కలపమని తల్లికి చెప్పింది. ప్రహసిత్ టేబిల్ మీద పేపర్ చేతిలోకి తీసుకుని చదవటం ప్రారంభించాడు. లోపల మధూహ తల్లి, కూతురికి రెండు ప్లేట్లలో స్వీట్లు పెట్టి అందించింది. "ఇవెక్కడివమ్మా?" ఆశ్చర్యంగా అడిగింది మధూహ. అంత ఖరీదైన షాపులో స్వీట్లు కొనేటంత తాహతు తమకి లేదని ఆమెకి తెలుసు ".......లక్ష్మి తీసుకొచ్చిందమ్మా" తల్లి చెప్పింది.

    "ఎందుకు?"

    బయట పేపరు చదువుతూన్న ప్రహసిత్ వాచీ చూసుకున్నాడు. క్లినిక్ మధ్యలో వదిలి వచ్చాడు. పేషెంట్లు ఎదురుచూస్తుంటారు. తొందరగా వెళ్ళాలి అని అతను అనుకుంటూ వుండగా మధూహ స్వీట్స్ తో వచ్చింది. ఆమె మొహంలో సంతోషాన్ని చూసి, "ఏంటి విశేషం?" అని అడిగాడు.

    "కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు."

    "ఏమిటట?"

    "లక్ష్మి ప్రెగ్నెంట్"

       
                                                                       6


    లక్ష్మి వెక్కి వెక్కి ఏడుస్తోంది!

    మధూహ ఓదార్చే ప్రయత్నం ఏమీ చేయలేదు. దుఃఖం వల్ల బాధ తగ్గితే, దుఃఖించటమే మంచిది. అందుకే ఆమె ఏడుస్తూంటే చూస్తూ వుండిపోయింది.

    కొంచెం సేపటికి లక్ష్మి తేరుకుంది. "...ఇలా అవుతుందని నేను అనుకోలేదు."

    "పోనీలే. ఏం చేస్తాం? అంతా అలా వ్రాసిపెట్టివుంది" అన్నదే కానీ మధూహకి లక్ష్మి ఎంత బాధపడుతూందో తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా, తల్లి కావటంలేదనే అసంతృప్తిని మనసులోనే దాచుకుని, పూర్తిగా ఆశలు వదిలేసుకున్న తరుణంలో ఒక మంచివార్త తెలిసి, అది నెరవేరబోతూన్న సమయంలో 'అబార్షన్' అవటం.....!

    మధూహ ఓదారుస్తున్నట్టు "కనీసం నువ్వు తల్లికాగలవు అని నిర్ధారణ అయింది కదా. ది చాలు. మరొకసారి ప్రయత్నం చెయ్యవచ్చు" అంది.

    "వారం రోజుల క్రితమే స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ విశాల్ ఎంతో అభినందించాడు కూడాను."

    "విశాల్ క్లినిక్ మీద నాకు కొన్ని అపోహలుండేవి. నీ విషయంలో అవన్నీ  జరగకపోతే ఎంతో సంతోషించాను. పాపం  ఆ డాక్టర్ మాత్రం ఏం చెయ్యగలడు" అంటూ మరి కొంచెంసేపు మాట్లాడింది. ప్రహసిత్ కి వచ్చిన వుత్తరం గురించీ, స్కిజోఫ్రెనియా గురించి ఆ పరిస్థితుల్లో చెప్పటం వ్యర్థమనిపించింది. అదీగాక ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్ష్మి ఇక "తనకి తాను" వుత్తరాలు వ్రాసుకొకపొవచ్చు.

    కొంచెం ఓదార్చి మధూహ వెళ్ళిపోయింది.

    సాయంత్రం విష్ణు వచ్చాడు. ఈ విషయం తెలిసినప్పుడు అతను బాధపడలేదు. ఆ మాటకొస్తే, లక్ష్మి గర్భవతి అయిందన్నప్పుడు కూడా అతడు అంతగా సంతోషించినట్టు కనపడలేదు. ఫోన్ లో ఎవరితోనో, ఏముంది? నేను మగవాడినని ప్రపంచానికి బుజువయింది. అంతేకదా" అంటూండగా విన్నది. ఫోన్ పెట్టేసాక, "......కొడుకో కూతురో పుట్టబోతుంటే మీకు సంతోషంగా లేదా? అసలు మీకు ప్రేమలూ, ఆప్యాయతలూ లేవా?" అని అడిగింది. అసలామె అంత మాట్లాడదు. భర్తతో అస్సలు  మాట్లాడదు. కానీ ఇంత సంతోషకరమైన వార్త విని కూడా అతడింత నిర్లిప్తంగా వుండటంతో ఆపుకోలేక పోయింది.

    అతడు అదే నిర్లప్తమైన స్వరంతో, "ప్రపంచంలో ప్రతీవాళ్ళూ పిల్లల్ని కంటారు. దానికేమీ ప్రత్యేకమైన అర్హతలవసరంలేదే" అన్నాడు.

    "అది లేదనేగా ఇంతకాలం బాధపడ్డాం" అంది కసిగా.

    అతడు స్వరంలో మర్చేమీ లేకుండా, ".....నువ్వు బాధపడ్డావేమో మరి....నేనెప్పుడూ బాధ పడలేదు." అన్నాడు. ఆ మాట మాత్రం నిజం. అతడు లేనిదాని గురించెప్పుడూ బాధ పడినట్టు కనిపించడు. అదే ఆమె అనుకుంది. 'అవును. ఆనందాలు ఎలా వెతుక్కోవాలో మీకు బాగా తెలుసు.' ఆ మాట పైకి అనలేదు. అంటే అతడేమి చెపుతాడో ఆమెకి తెలుసు. అందులో తప్పేముంది? అంటాడు. అందుకని అదేమీ అనకుండా, "ఇంకెవరయినా అయితే ఈవార్త విని ఎంతో సంతోషించి వుండేవారు" అంది.

    "పుట్టిన వాళ్ళు ప్రయోజకులవుతే నేనూ సంతోషిస్తాను. వాళ్ళు ప్రేమిస్తే నేనూ ప్రేమిస్తాను. అంతేకానీ, కేవలం  నాకు పుట్టిన అర్హత కారణంగా ప్రేమించను" అన్నాడు. ఆమెకి మరింత కోపం వచ్చి "అవును. భార్యనే ప్రేమించలేరు మీరు" అనుకుంది మనసులో.

    కానీ ఇప్పుడు.....

    గర్భం పోయిందని తెలిసినప్పుడు కూడా అతడు అదే నిర్లప్త స్వరంతో....."పోనీలే. దానికెందుకు విచారించటం" అని మామూలుగా అనెయ్యటం ఆమెకి విచారం కన్నా ఆశ్చర్యాన్ని ఎక్కువ కలిగించింది. అసలిలాటి మనుష్యులుంటారా? అన్న అనుమానం కూడా వచ్చింది.

    "నేనొక  పదిరోజులు మా పెద్దమ్మగారి వూరు వెళ్ళొస్తాను" అంది.

    "వెళ్ళు" అన్నాడు అతడు క్లబ్ కి బయల్దేరుతూ. ఆమెకి ఉక్రోషమొచ్చింది. కాస్త దుఃఖం కూడా కలిగింది. ఆ రోజెందుకో అతడిని నిలదీసి చాలా ప్రశ్నలు వేయాలనిపించింది. తను ఆ ఇంట్లో వుండటానికీ లేకపోవటానికీ తేడా ఏమీ వుండనట్టు అతను మాట్లాడటం ఆమె కోపాన్ని బాధనీ కలిగించింది. ఆ ప్రశ్నే అడిగింది.

    అతడామెవైపు ఆశ్చర్యంగా చూసాడు. భార్య అలా మాట్లాడటం, అన్ని ప్రశ్నలడగటం మొదటిసారి. ఆగి, నిదానంగా, "నీకు వెళ్తే బావుంటుందా? వెళ్ళకపోతే బావుంటుందా?" అని అడిగాడు.

    "మీకేది బావుంటుంది?"

    "రెంటికీ పెద్దగా తేడా వుండదు"

    లాగిపెట్టి కమ్చీతో కొట్టినట్టయింది. కళ్ళనిండా నీళ్ళు నిండుకున్నాయి. అదురుతూన్న పెదవులతో ఏదో ఆవేశంగా అనబోయింది. అతడు గుమ్మం దగ్గిర ఆగి, "వెళ్ళాలనుకున్నది నువ్వు. వెళ్తే బావుండేది నీకు. నాకేదైనా ఒకటే అయినప్పుడు, వెళ్లటం కోసం ఇంత వాదన దేనికి?" అని అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

    ఆమె ఆ సాయంత్రమే వూరు బయల్దేరింది. అతనికి ఫోన్ చేసి కూడా చెప్పలేదు. అతనన్నట్టు చెప్పినా చెప్పకపోయినా తేడా ఏమీ వుండదు. అతడు స్టేషన్ కి రావటమన్న ప్రసక్తే రాదు.

    రాత్రి తొమ్మిదింటికి రైలు బయల్దేరింది. అయితే గంటప్రయాణం చేసాక విద్యార్థులు దాన్ని ఆపుచేసారు. మరుసటిరోజు బంద్ అట. దానికి ప్రారంభంగా ఈ  రైల్ రోకో కార్యక్రమం!

    రైలు తిరిగి బయల్దేరిన చోటికే వచ్చేసింది. ఆమె ఇంటికొచ్చేసరికి రాత్రి పన్నెండయింది.

    గేటు తీసుకుని లోపలికి వెళ్ళబోతూ విద్యూద్ఘాతం తగిలిన దానిలా ఆగింది!

    లోపల్నుంచి రెండు స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకటి తన భర్తది. రెండోది ఎవరో స్త్రీది. హొటల్ లో కలిసిన అమ్మాయిది కాదు. వేరే ఇంకో అమ్మాయిది. డూ యూ లవ్ మి? అని అడుగుతోంది. ఐ డోన్డ్ లవ్ ఎనీబడీ.....అంటున్నాడు.

    ఆమె శబ్దం కాకుండా వెనుదిరిగింది. స్టేషన్ నుంచి తీసుకొచ్చిన ఆటో ఇంకా అక్కడే వుంది. అదెక్కి అడ్రసు చెప్పింది.

    పావుగంట ప్రయాణం చేసి ఆటో ఆమె చెప్పిన చోట ఆగింది. దిగి డబ్బులు చెల్లించి, మెట్లెక్కి బెల్ కొట్టింది.

    అర్థరాత్రి దాదాపు ఒంటిగంట అవుతూండగా కాలింగ్ బెల్ కొట్టిన లక్ష్మిని చూసి ప్రహసిత్ అవాక్కయ్యాడు.

    ఆమె స్థిరంగా, క్లుప్తంగా "ఈ రాత్రి నేను ఇక్కడ మీతో గడపదల్చుకున్నాను" అదే  ఆఖరి నిర్ణయం అన్నట్టు దాన్ని ఎవరూ మార్చలేరనట్టు చెప్పింది.

    క్షణం తటపటాయించిన అతడు ఆమె లోపలికి రాగానే తలుపులు వేసేసాడు. 

 Previous Page Next Page