Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 3

    "షటప్... నువ్విక నోర్ముయ్... ఈ చుట్టు పక్కల నేను ప్రేమించడానికి వాళ్ళే ఉన్నారు... ఏం చెయ్యమంటావ్ ?" అన్నాడు చిట్టబ్బాయ్ ఇరిటేట్ అవుతూ.

    "నువ్వేం చెయ్యక్కర్లేదు... ఈ ఊళ్ళో ఉన్న కన్నెపిల్లలందరూ ననీ చుట్టూ చేరి డాన్స్ చేస్తారు" నన్నే ప్రేమించూ నన్నే పెళ్ళాడు అంటూ వెటకారంగా అన్నాడు కన్నారావు.

    "అయితే ఇప్పుడేం చెయ్యాలంటావ్?"

    "ఏ అమ్మాయినైనా నువ్వు ప్రేమించాలి... నిన్ను ఆ అమ్మాయి ప్రేమించేలా చేస్కోవాలి... తరువాత పెళ్ళి చేస్కోవాలి...."

    చిట్టబ్బాయ్ దీర్ఘంగా నిట్టూర్చాడు.

    "మోహన్ చాలా అదృష్టవంతుడు... మొన్నీ మధ్యనే ఉద్యోగంలో చేరాడు. పర్మనెంటు కాగానే పెళ్ళి చేస్కుంటున్నాడు..... వచ్చేవారం నుండి వాడికి ఈ వంటగొడవా, అంట్లు తోముకునే గొడవా ఉండదు."

    "నువ్వుకూడా త్వరగా పెళ్ళి చేస్కో... నీకూ అన్ని బాధలూ తప్పుతాయ్..."

    చిట్టబ్బాయ్ చిర్నవ్వు నవ్వుతూ గది సీలుంగుకేసి చూస్తూ ఇమాజినేషన్ లోకి వెళ్తూ మెల్లగా అన్నాడు.

    "అప్పుడు నేను ఇలా మాడిన కూరలు, ఉప్పులేని పప్పులూ, ఉప్పెక్కువైన సాంబార్లూ తినక్కర్లేదు..."

    "నేను కాదు... మనం అని అను..." కన్నారావు కూడా గది సీలింగు కేసి చూస్తూ ఇమాజినేషన్లోకి వెళ్తూ అన్నాడు.
    "అప్పుడు మనం కమ్మకమ్మని వంటకాలు తింటాం... తను నా కిష్టమైన ములక్కాడల సాంబారు చేస్తుంది... గోంగూర పచ్చడి చేస్తుంది.

    "నాకిష్టమైన కొబ్బరి పచ్చడి, బంగాళాదుంపల కూర కూడా వదినగారు చేస్తారు...."

    "శలవొస్తే పెసరట్లు నేతిలో ఎర్రగాకాల్చి వేడివేడిగా వడ్డిస్తుంది."

    "వదినగారు పెసరట్లు ముందు నాకే వడ్డిస్తారు..." ఇమేజిన్ చేస్కుంటూ సంబరంగా అన్నాడు కన్నారావు.

    "ప్రతిదానికి నువ్వు నాతో పోటీకి వస్తావేం?" ఇమేజినేషన్ లోంచే చిరాకు పడ్డాడు చిట్టబ్బాయ్.

    "పోటీ అంటావేం నీ బొంద... భర్తగా నీకుండే ఇంపార్టెన్స్ నీకుంటుంది, మరిదిగా నాకుండే ఇంపార్టెన్స్ నాకుంటుంది. వదినలు, మరుదుల్ని కన్న కొడుకుల్లా చూస్కుంటారు...  నువ్వు సినిమాల్లో చూడడంలేదా?..." సీలింగ్ వంక చూస్తూనే చిట్టబ్బాయ్ ని మందలించాడు కన్నారావు.

    సీలింగ్ వంకచూస్తూ చిట్టబ్బాయ్ నాలుక కొరుక్కున్నాడు.

    "అవును  ..... నేనా విషయమే మర్చిపోయాను...." అన్నాడు.

    "అలా రా దార్లోకి...." చిర్నవ్వు నవ్వుతూ అన్నాడు కన్నారావు సీలింగు వంక చూస్తూ.

    చిట్టబ్బాయ్ సీలింగ్ వంక చూసి ముసిముసిగా నవ్వాడు.

    "మరేమో నేను ఆఫీసుకు వెళ్తానుకదా... అప్పుడు తను నాకు చొక్కా అందిస్తుంది... నేనేమో చొక్కా తొడుక్కుంటే తను గుండీలు పెడ్తుంది. నేను తల దువ్వుకోబోతే నా చేతిలోంచి దువ్వెన లాక్కుని తనే దువ్వుతుంది... ఆఫీసుకు వెళ్ళేముందు నాకు తియ్యని ముద్దొకటి ఇస్తుంది" అన్నాడు చిట్టబ్బాయ్ ఇమేజ్ చేస్కుంటూ.

    "నేనేమో వరండాలోంచి అరుస్తుంటాను, ఒరేయ్ ఇంకా ఎంత సేపురా ఆఫీసుకి టైమైపోతుంది అని" అన్నాడు కన్నారావ్ సీలింగ్ వంక విసుగ్గా చూస్తూ.

    "అప్పుడు నేనేమో వీడొకడు పానకంలో పుడకలాగా... అసలు వీడిని ఎక్కడైనా గది చూస్కోమని చెప్పాలి! అంటాను తనని దగ్గరికి తీస్కుంటూ..."

    "కానీ అప్పుడు వదినగారు మాత్రం పాపం ఉండనీయండీ... ఇప్పుడు మనకి ఏం అడ్డని? అంటారు..."

    "శలవురోజు వచ్చిందనుకో...." సీలింగు వంక చూస్తూ ఇంకా ఏమేమో చెప్పసాగాడు చిట్టబ్బాయి.

    కన్నారావు కూడా సీలింగు వంక చూస్తూ మధ్య మధ్యలో ఏమేమో కామెంట్ చేయసాగాడు.

    సరిగ్గా ఆ సమయంలో ఇంటి ముందు నుండి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఠకీమని ఆగిపోయారు.

    "ఒరేయ్... ఆ యింట్లోంచి చూశావా దట్టంగా నల్లని పొగలు ఎలా వస్తున్నాయో!!..." అన్నాడు మొదటి వ్యక్తి.
    "అగ్ని ప్రమాదం ఏమైనానేమో!!..." అన్నాడు రెండోవ్యక్తి.

    ఆ క్షణంలోనే యింట్లోంచి "కెవ్వు... కెవ్వు" మని ఇద్దరు వ్యక్తులు చేసిన కేకలు వినవచ్చాయ్.

   
                                                              2    


    ఆ హోటల్లో... ఆ మూల టేబులు దగ్గర కూర్చున్నారు ఇద్దరూ. వచ్చిన దగ్గర్నుండీ విసుక్కుంటూనే ఉన్నాడు కన్నారావు.

    "హోటల్లో ఈ దరిద్రం భోజనం కంటే నావంటే బాగుంటుంది..." కంచంలోకి  భోజనం వంక ముఖం చిట్లించి చూస్తూ అన్నాడు కన్నారావు.

    "హోటల్ కి వచ్చేదాకా పీక్కుతినేశావ్... ఇప్పుడేమో ఇలా అంటున్నావ్... నీతో ఎలా చచ్చేది?" అన్నాడు చిట్టబ్బాయ్.

    "చాల్లే... మరి హోటల్ కి రాక మళ్ళీ మూడోసారి పప్పు మాడుద్డామనా?..."

    ఇంతలో ఒక సర్వరు అటుగా వెళ్తుంటే చిట్టబ్బాయ్ పిలిచాడు.

    "చూడవోయ్.... ఇందులో రసం ఏది? సాంబారు ఏది?" అని అడిగాడు భోజనం ప్లేట్లో సర్దిపెట్టి ఉన్న చిన్న గిన్నెల వంక చూపుతూ.

    "ఏది పల్చగా ఉంటే అది రసం, రెండోది సాంబార్!" అని జవాబు చెప్పాడు సర్వర్.

    "రెండూ పల్చగానే ఉన్నాయే!" అన్నాడు చిట్టబ్బాయ్.

    "నీళ్ళలా బాగా పల్చగా ఉన్నది రసం. ఓ మాదిరి పల్చగా ఉన్నది సాంబార్ సార్..." అని చెప్పి అదోమాదిరిగా చూస్తూ వెళ్ళిపోయాడు సర్వరు.

    ఏం బాబూ ఇదే మొదటిసారా హోటల్ కి రావడం అన్నట్టుగా ఉన్నాయ్ వాడి చూపులు.

    వాడి సమాధానంకి అసలే చికాకుగా ఉన్న కన్నారావుకి ఇంకా కోపం వచ్చింది.
   
    "ఛీ.... దరిద్రం తిండి... అసలు దీన్ని కుక్కలు కూడా ముట్టవ్. అసలు వీళ్ళంతా హోటల్ కి వచ్చి ఈ ముష్టి తిండిని ఎలా మెక్కుతారో?" అన్నాడు.

    చిట్టబ్బాయ్ మెల్లగా కన్నారావు చేతిని గోకాడు.

    కన్నారావు ఏమిటన్నట్టు కళ్ళెగురవేశాడు.

    చిట్టబ్బాయ్ పక్క టేబులువేపు సైగచేసి చూపించాడు. కన్నారావు అటు తిరిగి చూశాడు. పక్కటేబులు దగ్గర కూర్చున్నాయన వీళ్ళిద్దరి వంకా గుర్రు గుర్రుగా చూస్తున్నాడు.

    "ఎందుకలా చూస్తున్నాడు మనవంక?" చిట్టబ్బాయ్ ని అడిగాడు కన్నారావు.

    "ఎందుకంటావేంటి?".... అతను ఈ భోజనాన్ని ఆబగా జుర్రుకుని చేతిని ముందూ వెనకా నాక్కుంటూ తింటున్నాడు... నువ్వేమో దరిద్రం తిండి, ముష్టి తిండి అంటూ గట్టిగా తిడ్తున్నావు... నువ్వలా తిడ్తుంటే అతనికి తింటానికి ఇబ్బందిగా ఉంది..." చెప్పాడు చిట్టబ్బాయ్.

    "తిట్టక మెచ్చుకోనా?.... ఇది ముమ్మాటికి ముదనష్టపు తిండే..."

    ఆ పక్క టేబులాయన ఎంగిలి చేత్తోనే జుట్టుపీక్కుని "సర్వర్!" అంటూ అరిచాడు.

    సర్వరు ఆయన దగ్గరికి పరుగెత్తుకు వెళ్ళాడు. అతను సర్వరుకి ఏదో చెప్పాడు. సర్వరు సగంతిన్న అతని కంచాన్ని తీస్కువెళ్ళి దూరంగా ఉన్న ఇంకో టేబులు మీద ఉంచాడు. ఆయన మరోసారి చిట్టబ్బాయ్, కన్నారావుల వంక క్రూరంగా చూసి ఆ టేబులు దగ్గర కూర్చుని మళ్ళీ కంచం మీదికి ఎగబడ్డాడు.

    కొన్ని క్షణాలు అతనివంక వింతగా చూసి "నేను ఇక తినలేన్రా. నాకింక వద్దు..." అన్నాడు కన్నారావు.

    "నాకు కూడా వద్దు..." అన్నాడు ప్లేట్లో చేయి కడిగేస్తూ చిట్టబ్బాయ్."అసలు మనకీ బాధ ఎప్పుడు తప్పుతుందో?..."

    "ఇందాక చెప్పానుగా... ఎవరైనా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేస్కోమని!" అన్నాడు కన్నారావు తను కూడా చెయ్యి కడుక్కుంటూ.

 Previous Page Next Page