నీకు వివేక్ చిన్నతనం నుంచీ తెలుసా?"
"బొడ్డుకొయ్యని రోజులనుంచీ, పట్టం వచ్చే వరకూ తెలుసు! ఆయన ప్రతీ మాటా! ప్రతీ చేస్టా తెలుసు"
"నీ పేరు?"
"యశోదా!"
అరిచాడు దేవిశంకర్. అది అరుపు కాదు సింహగర్జన. పట్టరాని క్రోధంతో ఎఱ్రగా కమిలినట్లు అయిపోయింది అతని ముఖం.
"సిగ్గు లేదూ! లోపలికి వెళ్ళూ!"
ఆ విదిలింపుకి, సహించలేక ఏదో సమాధానం చెప్పబోయిన యశోద, "లోపలికి రామ్మా!" అనే అత్తగారి పిలుపు విని, తగ్గిపోయి లోపలికి గదిలోకి వెళ్ళింది. ప్రసూన పిలుపుతో ఉన్నది ఆజ్ఞ కాదు. ఏదో వ్యాకులపాటు.
యశోద ప్రసూన దగ్గరగా వచ్చి, చెమ్మగిల్లిన కళ్లతో "ఇప్పుడు నేను చేసిన తప్పేమిటీ?. మావగారు ఎందుకలా నన్ను కసురుకున్నారు?" అంది.
"ఆ రౌడీ వెధవతో మనకి మాటలేమిటమ్మా?" అంది.
"రౌడీ వెధవా? అలా అనిపించాడు, అయితే మనింట్లో కొచ్చి హాల్లో ఎందుకు కూర్చున్నాడు?"
ప్రసూన తన పొరపాటును గుర్తించి, నాలిక కరుచుకుంది.
అప్పటికే యశోదకి చాలా అర్థమైపోయింది. అత్త కోడళ్ల చూపులు మౌనంగా మాట్లాడుకున్నాయి.
"ఎందుకయినా మంచిది, అతడికి దూరంగా ఉండమ్మా!" అంది ప్రసూన.
"మరి. అతడు కొత్త కోడలికోసం వచ్చానన్నాడే"
ఉలికిపడింది ప్రసూన.
"ఏమన్నాడు?" అని వ్యాకులపాటుతో అడిగింది.
"కొత్త కోడలికోసం వచ్చానని చెప్పాడు"
"నేనే ఆ కోడలినని చెప్పావా?"
"నా కోసమే ఇంత దూరం వచ్చినవాడికి, నేను పేరు చెప్పనంత మాత్రాన, నేనెవరో తెలీదా. తెలుసుకొనలేడా?"
"భగవంతుడా!"
"అతనెవరు? ఎందుకొచ్చాడు?"
"ఏమో! నాకూ తెలియదు. కానీ అతడెప్పుడు వచ్చినా. ఏదో అనర్ధం జరుగుతుంది!.
"ఇదివరలో అలా జరిగిందా?."
"అవును!.
"ఏం జరిగింది?"
కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, అంది ప్రసూన "అది నీకు సంబంధించిన విషయం కాదు. మీ మామగారికి సంబంధించిన విషయం."
ఇక మాట్లాడలేదు యశోద, ప్రసూన చెప్పదలచుకొనకపోతే, ఇక మాట్లాడి ప్రయోజనం లేదు.
"వాడి పాపిష్టి దృష్టి నీమీద పడనీయకమ్మా!" లోగొంతుకతో అంది ప్రసూన.
"భూగృహంలో దాక్కొమంటారా?"
"నేనే నీకు భూగృహం. నా పరిసరాల్లో ఉన్నంత వరకూ నిన్నెవరూ తేరి చూడలేరు."
"మీ అంత ఆప్యాయంగా ఏ అత్తగారు తన కోడలిని చూడదు. నా అదృష్టం. కానీ నేను పరిస్థితులకి భయపడను. క్లినిక్ కి వెళ్తాను. సాయంత్రం లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, వస్తారుగా."
"తప్పకుండా!"
ఆ వ్యక్తి ఎదుటి నుంచే హాలుదాటి, బయటికి వచ్చి వివేక్ కారులో కూర్చుంది. దుర్గయ్య కారు స్టార్ట్ చేశాడు.
ఆ వ్యక్తి తనని తినేసేలా చూడటం యశోద గమనించింది.
ఆ చూపులు ఆమెకి భయం కలిగించలేదు. ఒకటే ఆలోచన ఆమె మనసులో.
ఈ విచిత్ర వ్యక్తి ద్వారా. వివేక్ చిన్నతనపు విశేషాలు తెలుసుకునే అవకాశం ఉంటుందా?. అలాంటిది ఉంటే, ఎన్ని ప్రమాదాలనయినా లక్ష్య పెట్టక. అతడితో మాట్లాడి తీరాలి!
9
లేడీ డాక్టర్ తనని పరీక్షిస్తున్నంతసేపూ ప్రసూన గురించే ఆలోచిస్తోంది యశోద. సాధారణంగా అతి తక్కువగా మాట్లాడే ప్రసూన, కారులో దారి పొడుగునా మాట్లాడుతూనే ఉంది.
డాక్టర్ సలహాలు జాగ్రత్తగా పాటించు. టానిక్స్ అవి తీసుకొమ్మంటే, నిర్లక్ష్యం చెయ్యకు. అవసరమైతే ఉద్యోగానికి రాజీనామా ఇవ్వమంటే ఇవ్వు. ఆరోగ్యం కంటే ఉద్యోగం ఎక్కువ కాదు. అంతగా కావాలనుకుంటే, బాబుకో, పాపకో, ఏడాది నిండాక, మళ్ళీ చేద్దువుగాని. లేత నెలల్లో వేవిళ్ళొస్తాయి.
విపరీతంగా నిద్ర వస్తుంది. ఇవన్నీ పడుతూ ఉద్యోగం చెయ్యటం కష్టం. మనసుకీ, శరీరానికీ,విశ్రాంతి కావాలి. అంచేత...." ఈ ధోరణిలో సాగింది ఆవిడ సంభాషణ అంతా. ఏమి అనలేక చిరునవ్వుతో కూచుంది యశోద.
ఇప్పుడు లేడీ డాక్టర్ ప్రెగ్నెన్సీ అని చెపితే ఏమైపోతుంది ఆవిడ.
స్టెతస్కోప్ చెవుల్లోంచి తీసి, మెడ చుట్టూ వేసుకుంది డాక్టర్.
"కంగ్రాట్యులేషన్" అంది చిరునవ్వుతో డాక్టర్.
తెల్లబోయింది యశోద.
"దేనికీ?" అంది అయోమయంగా.
"తల్లివి కాబోతున్నందుకు, రెండు నెలలు, అబ్బాయి కావాలా? అమ్మాయి కావాలా?" అలవాటైన ధోరణిలో జోక్ చేసింది.
యశోద నవ్వలేదు... సిగ్గు పడలేదు.... అయోమయంగా చూసింది.
ఈసారి డాక్టర్ తెల్లబోయింది.