"చనిపోయిన విష్ణుశర్మ దగ్గర్నుంచి తీసింది ఆమే! తీసి నాకు చూపించింది. "ఇలాటివి మనం వుంచుకోకూడదు. వెంటనే పోలీసులకి తెలియబర్చటం మన బాధ్యత" అన్నాను. ఇన్ స్పెక్టర్ కి చూపించాము. రక్తంలో తడిసి కనిపించిన రెండు కాపీలూ అవే- మూడో కాపీ ఆమే తనతోపాటూ ఇంటికి పట్టుకెళ్ళింది. రేప్రోద్దున్నే మేమిద్దరం వచ్చి దాన్ని అందజేద్దామనుకుంటున్నాము".
"మీ ఇద్దరూ తప్ప ఇంకెవరూ చదవలేదా దాన్ని?"
"లేదు"
"మీకు నిశ్చయంగా తెలుసా?"
"నిశ్చయంగా తెలుసు. అసలు ఎవరికీ చూపించవద్దనీ- దాన్ని పోలీసులకి మాత్రమే ఇవ్వాలనీ, అలా ఇవ్వటం బాధ్యతగల పౌరులుగా మన కర్తవ్యం అనీ నేనామెకు చెప్పాను. హత్యలు జరిగిన తుర్వాత వచ్చిన పోలీసులకి ఈ వుత్తరం వెంటనే ఇవ్వకపోవటం కూడా తప్పే అన్నాను...... కానీ ఇన్ స్పెక్టర్ గారు! ఆ అమ్మాయి చిన్నపిల్ల .....పాపం తెలీదు".
"ఏముందీ ఆ వుత్తరంలో?"
శ్రీనివాసరావు చెప్పటం ప్రారంభించాడు. ఆ వుత్తరంలో వున్న ఒక్కొక్క సంగతే చెపుతూ వుంటే అవతలి వ్యక్తి మొహంలో విపరీతంగా మారుతున్న భావాల్ని గమనించి- రెట్టించిన ఉత్సాహంతో, మార్చిపోయిన సంగతులన్నీ గుర్తుతెచ్చుకుని చెప్పసాగాడు. వసంత్ దాదా గురించీ, వాళ్ళ ఆక్టివిటీస్ గురించీ, దళం అధికారుల గురించీ, ఇంకా..... ఇంకా చెప్పి, మాఫియా వాహనాల మీద పువ్వు గుర్తు చెప్పబోతుంటే విన్నది చాలన్నట్టు అతడు లేచి, "మనం ఆ అమ్మాయి దగ్గరకి వెంటనే వెళ్ళాలి-" అన్నాడు చప్పున.
"ఇప్పుడా? ఇంత రాత్రిపూటా?"
"అవును, ఇప్పుడే వెళ్ళి ఆ వుత్తరం తీసుకోవాలి".
శ్రీనివాసరావు ఆలోచించాడు. ఈ ఇన్ స్పెక్టర్ ని తీసుకువెళ్ళి, ఉత్తరం గురించి ప్రస్తావిస్తే ఉత్పల- "అది మీ దగ్గరే వుంది కదా" అని నోరు జారవచ్చు. తను ముందు కలుసుకుని అంతా చెప్పాలి. పోలీసుల్నించి బహుమతి సంపాదించే విషయమై తనెంత కష్టపడిందీ వివరించాలి. ఉత్తరం ఆమెకిచ్చేసి, "ఇది నీదే ఉత్పలా! న్యాయంగా ఈ బహుమతి నీకే దక్కాలి. నాకొద్దు నువ్వే తీసుకో" అనాలి. 'కాదు శ్రీనూ, ఇది నీదే- కాకపోతే మనిద్దరిదీ' అంటుంది. మనిద్దరిదీ అన్నచోట తన కళ్ళు చెమరుస్తాయి. 'ఈ మాత్రం ఆప్యాయతకోసం మొహం వాచివున్నాను ఉత్పలా' అంటాడు. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళతారు, ఒకే రిక్షాలో.....
"ఏమిటి ఆలోచిస్తున్నారు? లేవండి" కఠినంగా వినపడింది.
శ్రీనివాసరావు ఆలోచన్ల నుంచి తేరుకున్నాడు. "నాకు ఉత్పల ఇల్లెక్కడో తెలీదు" అన్నాడు.
"తెలీదా?"
"తెలీదు. ఆ అమ్మాయి మా ఆస్పత్రిలో కొత్తగా జేరింది. వీథి మొదటి వరకూ దింపానంతే. ఇంతరాత్రి పూట ఆ వీథిలో ఎవర్నని అడుగుతాం?"
"ఏం వీథి అది?" అతడి మాటల్ని మధ్యలో కట్ చేస్తూ వచ్చింది అవతల్నుంచి ప్రశ్న.
"మహాత్మాగాంధీరోడ్డు. మీకు తెలుసుగా. చాలా పెద్ద వీధి అది. అందులో పట్టుకోవటం కష్టం"
"ఆ అమ్మాయి తండ్రిపేరు."
"విశ్వేశ్వరశాస్త్రి".
"ఆ అమ్మాయి అడ్రసు మీ ఆస్పత్రిలో వుంటుంది కదా"
శ్రీనివాసరావు తటపటాయించాడు. "ఉంటుంది. కానీ ఇంతరాత్రి....."
"పోలీసులకి కష్టం అంటూ ఏమీ వుండదు. ఎవరి దగ్గర వుంటుంది?"
"ఆస్పత్రి మానేజర్ రికార్డుల్లో వుంటుంది. ఆయనిల్లు కూడా నాకు తెలీదు".
"మేం తెలుసుకుంటాం?"
"ఎందుకుసార్. రేప్రోద్దున్న ఆ అమ్మాయిని మీ దగ్గరికి స్వయంగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీ అడ్రసు ఇవ్వండి".
"భర్తతో ఇంత అర్థరాత్రి సంభాషిస్తున్నది ఎవరా అని, శ్రీనివాసరావు భార్య బయట గదిలోకి తొంగిచూసింది.
జేబులో చెయ్యిపెట్టటం చూసి. ఆ సి.బి.ఐ. ఆఫీసరు విజిటింగ్ కార్డు తీస్తున్నాడేమో అనుకున్నాడు శ్రీనివాసరావు.
"మీతోపాటు ఆమె కూడా ఆ వుత్తరాన్ని పూర్తిగా చదివింది కదూ".
"చదివింది సార్. ఇద్దరం దాని గురించి చర్చించుకున్నాం కూడా".
"మీ ఇద్దరికీ తప్ప ఆస్పత్రిలో దీనిగురించి ఇంకెవరికీ తెలీదు. అవునా"
"అవును ఇంకెవరికీ-" అతడి మాట పూర్తికాలేదు. అవతలి వ్యక్తి జేబులోంచి చెయ్యి బయటకు వచ్చింది.
మొదట అతడి నోట్లోకి నీళ్ళు ఉప్పగా వచ్చాయి. కడుపు భగ్గున మండింది. చేతులకి జిగటగా తడి తగిలింది. ఆ తరువాత భార్య అరుపు కెవ్వున వినపడింది. అన్నిటికన్నా చివరగా.....
......బాధ తెలిసింది.
అదీ రెండు క్షణాలు మాత్రమే.
16
ఉత్పల చిన్నపిల్లలా తల్లి పక్కన ముడుచుకుని పడుకుని వుంది. ఇంటిల్లపాదీ చాలాసేపు ఆమెని బుజ్జగించవలసి వచ్చింది. ఆస్పత్రిలో అంతగా ఏమీ లేదుగానీ ఇంటికొచ్చాక అక్కడి భయంకర దృశ్యాలు ఒక్కటొక్కటిగా గుర్తొచ్చి ఆమెని బెదిరించసాగాయి.
ఆమె వయసెంతనీ? ఇరవై నిండాయో లేదో..... ప్రపంచపు అంత చీకటి కోణాన్ని మొదటిసారే చూడటం ....రక్తం .....పోలీసులు....
'నా దగ్గర పడుకోవే....' అంది తల్లి. తండ్రి నుదుటి మీద దేవుడి వీభూది కాస్త రాసేడు. అటువైపు తమ్ముడు పడుకున్నాడు. అందరూ తన చుట్టూ... తల్లి మీద చెయ్యివేసి దగ్గరకి తీసుకుంది.
ఇల్లు నిద్రలోకి జారుకుంది.
ఇంత మంది కుటుంబసభ్యులు తన చుట్టూ...... ఆప్యాయంగా, ఆత్మీయంగా......
ఆ అమ్మాయి కంట నీరు తిరిగింది.
కళ్లుమూసుకుని బలవంతంగా నిద్రలోకి జారుకోవటానికి ప్రయత్నిస్తూ మనసులోనే అనుకుంది. "పదిలంగా అల్లూకున్న పోదరిల్లూ మాదీ...."
సరిగ్గా అప్పుడు వినిపించింది... ముందు అస్పష్టంగా. క్రమక్రమంగా దగ్గరవుతూ-
మోటర్ సైకిలు చప్పుడు.
వచ్చి ఇంటిముందు ఆగిన శబ్దం. ఆమె పక్క మీద నుంచి లేచి వెళ్ళి కిటికీలోంచి చూసింది.
రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు సన్నగా ప్రారంభమయిన వెలుగురేఖ క్షణాల్లో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా దిగంతాలకి ఎలా వ్యాపిస్తుందో అలా ఆమెలో మొదలైన భయం లిప్తపాటు కాలంలో వళ్లంతా పాకి, జరగబోయే దృశ్యాన్ని ఆమె కళ్ళముందు చూపెట్టింది. అదొక అచేతనావస్థ. అన్ని జ్ఞానేంద్రియాలూ పని చేస్తున్నాయి. కాని ఏ ఒక్కటీ సహకరించటం లేదు. కాళ్ళు కదలటం లేదు. కనురెప్పలు కదలటం లేదు.
తలుపుతట్టిన చప్పుడు వినిపించి తండ్రి లేచి 'ఎవరదీ' అంటూ వెళ్ళి తీశాడు. బయటంతా చీకటిగా వుంది. వీధిలైటు వెలుతుర్లో మాత్రం మోటార్ సైకిలు మెరుస్తూ కనపడుతూంది. ఎదురుగా ఒక బలిష్టమైన వ్యక్తి వున్నాడు. "ఉత్పల వుందా?" అని అడిగాడు కర్కశంగా. అతడి కంఠంలో అదో రకమైన జీరవినిపిస్తూంది.
"ఎవరయ్యా నువ్వు. అర్థరాత్రి వచ్చి అంత అధికారంగా అడుగుతావ్, నా కూతురు గురించి?"
అతడు వినిపించుకోకుండా తండ్రిని పక్కకితోసి, లోపలికి ప్రవేశించాడు. హాలంతా కలియజూసి పక్క గదిలోకి వచ్చాడు. భీతహరిణేక్షినిలా చూస్తూంది. మెరుపులా అతడు వెనుక నుంచి స్టెన్ గన్ తీశాడు. టప్ టప్ మన్న చప్పుళ్ళతో వరుసగా గుళ్ళు ఆమె శరీరంలోకి దూసుకుపోయాయి. రక్తం చివ్వున చిమ్ముతూండగా ఆమె కూలిపోయింది. కొస ప్రాణం కళ్ళల్లోంచి బయటకు పోవటానికి ప్రయత్నిస్తూంటే, రక్తపు మడుగులో పడింది. వెనుక నుంచి చెల్లెలి కేక వినపడింది. తమ్ముడు పరుగెత్తుకు వచ్చాడు. అంతలో పడిపోయిన తండ్రిలేచాడు. మరోవైపు నుంచి తల్లి వచ్చింది.
అతడు దీన్నంతా ముందే ఊహించినట్టు తాపీగా వెనుదిరిగాడు. అతడి చేతిలో గన్ మళ్ళీ నిప్పులు గక్కింది. తమ్ముడి శరీరం గాలిలోనే ఛిన్నాభిన్నం అయిపోయింది. తండ్రి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చివరి క్షణాల్లో కూడా భర్తని వదలనన్నట్టు పరమసాధ్వి అయిన తల్లి శరీరం కవచంలా తండ్రిని కప్పటానికి ప్రయత్నించి తూట్లు పడిపోయింది. చెల్లిప్రాణాలు ఎప్పుడో పోయాయి. ఇంకెవరైనా వున్నారేమో అని అతడు ఇల్లంతా కలయజూసి అక్కణ్ణుంచి కదిలాడు. మొత్తం కుటుంబ సభ్యుల శరీరాలన్నీ చెల్లాచెదురుగా పడివుండగా- విసిరేసినట్టున్న ఆ శరీరాల నుంచి ఒకటైన ఆ రక్తం నెమ్మదిగా ప్రవహించి, వరదలా తనని చుట్టు ముడుతూ వుండగా- తన ప్రా....ణం... పోయింది.
అంతా కనురెప్పపాటుకాలంలో జరిగినట్టు ఊహించుకున్న ఉత్పల చిగురు టాకులా వణికిపోయింది.
"నో...... వీల్లేదు...... ఇలా జరగటానికి వీల్లేదు- అని గట్టిగా అరవబోయింది కానీ భయంవల్ల ఆమె మాట గొంతులోనే ఆగిపోయింది. ఈ లోపులో తండ్రి లేచివెళ్ళి తలుపు తీస్తున్నాడు.
'వద్దు నాన్నా వద్దు'.
ఆమె ఎలుగెత్తి కేక వేయబోయింది. గొంతు కండరాలు సహకరించలేదు... ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ లోకి నలుగురు వ్యక్తులు గాలిలా దూసుకువచ్చి.... చుట్టూవున్న వాళ్ళు ఏం జరుగుతూందో గ్రహించేలోపులో మారణకాండ జరపటం ఆమె కనుల ముందు ఇంకా సజీవ చిత్రంలా నిలిచేవుంది. అతడు లోపలికి రాగానే ఏం చేస్తాడో తెలుసు.
ఆమె ఏదో అనే లోపులో తండ్రి తలుపు తీశాడు.
"అర్థరాత్రి డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి...... కానీ తప్పదు.... నేను సి.బి.ఐ. నుంచి వచ్చాను. ఉత్పలగారున్నారా?"
అతడి కంఠంలో కర్కశత్వం లేదు. మృదువుగా వుంది. మర్యాదగా, నమ్రతగా వుంది. ఎవరినైనాసరే మోసం చెయ్యగలిగేదిలా వుంది.
అతనంటున్నాడు...... 'రాత్రి ఆస్పత్రిలో దారుణంగా హత్యలు జరిగాయి. వాటి నిమిత్తం ప్రశ్నించటానికి వచ్చాను. ఉత్పలగారున్నారా?"
.......
లేదు... లేదని చెప్పు నాన్నా.
......
"ఉంది. పిలుస్తానుండండి...."
.....
అయ్యో....... ఎంత పని చేశావ్ నాన్నా! ఇప్పుడు అతడు లోపలికి వస్తాడు. నన్ను చూడగానే చంపేస్తాడు. ప్రత్యక్ష సాక్షులైన మీ అందరి ప్రాణాలు తీస్తాడు. లేక తనతోపాటూ నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళాలంటాడు. అర్థరాత్రి కూతుర్ని ఒంటరిగా పంపటం ఇష్టం లేక నువ్వూ వస్తానంటావ్. ఇద్దర్నీ ఊరి బయటకు తీసుకెళ్ళి నన్ను మొదట......
.....
వీల్లేదు. ఇలా జరగటానికి వీల్లేదు.
"అమ్మా- ఉత్పలా"
చప్పుడు చేయకుండా ఉత్పల ఆ గదిలోంచి పక్క గదిలోకి వెళ్ళింది. చిన్న వరండాలా వుంది. పాత బట్టల పెట్టె వుంది అక్కడ. ఆమె దాని వెనుకకి చేరుకుంది. నెమ్మదిగా దాని వెనుక ఇరుక్కుపోయింది.