"చివరికతను అంతకు తెగించాడన్న మాట....." సాలోచనగా అన్నాను.
"అవును. అతను యాక్సిడెంట్ చేసి మరీ నాకు ఫోన్ చేశాడంటే బాగా క్రూరమైన వ్యక్తిలా వున్నాడు. నువ్వు నీ జాగ్రత్తలో వుండటం చాలా అవసరం" హెచ్చరించాడు.
"అది సరే..... నువ్వు హాస్పిటల్ నుండి ఇంటికెప్పుడు వెళ్ళావ్?"
"నువ్వు బయలుదేరి వెళ్ళాకే! అసలు నేను నీతో కలసి రావాలనే ఆ రాత్రి త్వరగా ఇంటికి వచ్చేశాను. అప్పటికే నువ్వు బయలుదేరి వెళ్ళావు...."
"నేను నా ఆత్రంలో ఫోన్ చేయకుండా వెళ్ళాను. కనీసం ఆ ఇంటిముందు తాళం వేసి వుందో లేదో గమనించకపోవడం నేను చేసిన పొరపాటు. చూసి వుంటే ఇంట్లో కృపానంద్ వున్నాడో లేదో తెలిసేది. ప్లానంతా అప్ సెట్టయింది. అతను నన్ను చూశాడు. హెచ్చరించాడు. కానీ మళ్ళీ ఏమైందో నా వెనకే కారు వేసుకుని వచ్చి ఈ యాక్సిడెంట్ చేశాడు."
"నువ్వు కొద్దిగా ఆలస్యంగా బయలుదేరితే బాగుండేది. ఎందుకంటే మేమింటికి వెళ్ళగానే సుమ ఫోన్ చేసింది. తన భర్త ఇంట్లోనే వున్నాడనీ- రావద్దనీ చెప్పింది. కానీ బ్యాడ్ లక్! చేయగలిగిందేముంది?" నిస్పృహగా అన్నాడు. తరువాత కొద్దిసేపు మా యిద్దరిమధ్యా మౌనం రాజ్యమేలింది.
తిరిగి తనే అన్నాడు....." ఈ పరిస్థితుల్లో ఆమెను కలవడం ఎలా.....?"
"నేనూ అదే ఆలోచిస్తున్నాను! ఇప్పుడు మరింత కట్టుదిట్టం చేస్తాడు. ఆమె ఇక మనకి కనిపించకుండా ఇల్లు మార్చినా మారుస్తాడు. ఏం చేయాలో నాకేమీ అర్థం కావటం లేదు."
"అవును! అతను అదే చేస్తాడు. మనం వెతుకుతున్నామని తెలిస్తే, తిరిగి ఏదయినా అపాయం తలపెట్టవచ్చు- ఎలా?"
నేను సమాధానం ఇవ్వలేదు. నన్ను పూర్తిగా నిస్పృహ ఆవరించింది.
12
మనమీద మన నమ్మకం మనల్ని శిఖరాల మీద నిలబెడుతుంది!
అపనమ్మకం- అడ్డుగా శిఖరాల్ని సృష్టిస్తుంది!
* * *
సాయంత్రం నాలుగవుతోంది!
హాస్పటల్ లోని నా గది గుమ్మానికి ఎదురుగా గోడకి వున్న కిటికీలోంచి ఎండ వెలుతురు పడుతుంది. ఎక్కడినుండో ఏ అదృశ్యదేవతో నాకు అభయం ఇస్తూన్నట్లుగా ఆ వెలుగు ఏటవాలుగా నా మంచం వరకూ వచ్చి ఆగిపోయింది.
ఆ వెలుతురు ధూళికణాలు అటూ - యిటూ కదులుతూ వున్నాయి. బహుశా అంకిత్ శరీరంలో కూడా విషపూరిత కణాలు ఆ విధంగానే కదులుతూ ఉండి వుంటాయి.
అప్రయత్నంగా ఆ ఆలోచనకి వళ్ళు జలధరించింది. మరొక్క పదకొండు రోజులు మాత్రమే ఆపరేషన్ కి గడువు. కిడ్నీ కూడా యేదో వస్తువులా ఫారిన్ లో దొరికేదయితే....... దాని ఖరీదు నా ఆస్థి మొత్తమైనా తెచ్చి వుండేవాడిని.
మాంత్రికుడి ప్రాణంలా ఏ సప్త సముద్రాలో అవతల భయంకరమైన గుహలోనో ఉండి ఉంటే ప్రాణాలకి తెగించి, సాధించి వుండేవాడిని. కానీ ఇవేమీ కాక మానవ శరీరంలో అది ఒక భాగం అవటమే దురదృష్టం. అది అంకిత్ తల్లిదండ్రులదే కావటం అంతకన్నా దురదృష్టం!
నా ఛాతీమీద బరువుగా వున్న చేతిని సవరించుకుంటూ అన్యమనస్కంగా నేలమీదికి చూసాను. వెలుతురుని చెదరగొడుతూ ముందు తలమీద పడింది. తరువాత భుజాలు ..... నడుము ...... ఇప్పుడక్కడ వెలుతురు లేదు.
ఆశ్చర్యంగా తలెత్తాను.
నా ఎదురుగా గుమ్మంలో నిలుచుని వున్న మనిషిని చూడగానే కళ్ళు పెద్దవయ్యాయి. పూర్తి దిగ్ర్భామ ఆవరించింది. ఆ క్షణంలో ........ అక్కడ ఎప్పుడో చనిపోయిన అమ్మ నిలుచుని వున్నా నేనంత దిగ్భ్రమకి లోనయ్యేవాడిని కాదు. నా ఎదురుగా వున్నది ఎవరోకాదు- సుమద్యుతి.
ఇక జీవితంలో నాకు కనిపించదనుకున్న అంకిత్ తల్లి!!
నేను అలాగే ఆశ్చర్యంగా చూస్తూ వున్నాను. ఆమె వచ్చి పక్కనున్న స్టూల్ మీద కూర్చుంది. అది కలకాదని అప్పుడు నాకర్థమయింది! "ఇక్కడికి ఎలా రాగలిగారు?" అని అడిగాను.
"రాత్రి మిమ్మల్ని ఆక్సిడెంట్ లో గాయపర్చి, ఆ విషయమే ఘనకార్యంలా నాకు వర్ణించి చెపుతూ మానసికంగా హింసించి, అతని ఈగో సంతృప్తిపడ్డాక, అప్పుడు బ్రాందీ కావాలన్నాడు. ఇంట్లో అతడికో మినీ బార్ వుంది! బ్రాందీలో నిద్రమాత్రలు కలిపాను. రేపు ఉదయం వరకూ లేవడు....."
నమ్మలేనట్టూ నేను విస్మయంగా- "చాలా సాహసం చేసావు" అని అన్నాను- అప్రయత్నంగా ఏకవచనంలో సంభోదిస్తూ.
ఆమె నవ్వింది. అంకిత్ లాగే, ఆమె పలువరుస తళుక్కుమంది-
"నా కొడుకు కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా?"
ఆ మాటలకి బహుశా నా మొహం ఏదో మార్పు అసంకల్సితంగా వచ్చి వుండేది. వెంటనే అంది-" కంగారుపడకండి! అంకిత్ ని రక్షించుకునే వరకే నా బాధ్యత! ఆ తర్వాత వాడు మీ కొడుకు. మళ్ళీ ఆ తరువాత నేను మీకు కనపడను."
నేను అదోరకరమైన గిల్టీ ఫీలింగుతో తలదించుకున్నాను. "నిన్న రాత్రి నేను జాన్ గారింటికి ఫోన్ చేసాను కృపానంద్ ప్రయాణం కాన్సిల్ అయిందని చెప్పటానికి-! కానీ అప్పటికే మీరు బయలుదేరి పోయారన్నారు. నాకేం చెయ్యాలో తోచలేదు. మీ కారు తన 'డాష్' ఇస్తూంటే నిశ్శబ్దంగా రోధించటం తప్ప మరేమీ చేయలేకపోయాను. అప్పుడే నిర్ణయించుకున్నాను అంకిత్ కోసం ఏదయినా చేయాలని....."
నేను మాట్లాడలేదు. ఆమె కొనసాగించింది. "మీ కోసం ఫోన్ చేసినప్పుడు జాన్ డెవిడ్ తో చాలాసేపు మాట్లాడాను. ఆయన రచనలు చాలా కాకపోయినా, కొన్ని చదివాను. మనిషిని చాలా కుదిపేస్తాయి. భయమేసి చదవటం మానేసాను."
ఆశ్చర్యంగా- "భయంవేసా?" అనడిగాను.
ఆమె విషాదంగా నవ్వింది. "భయానకం అని కాదు నా ఉద్దేశ్యం! మన బలహీనతల్ని అపహాస్యం చేస్తూంటాయి. రోజూ హింసిస్తూ, బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి తాళంవేస్తూ, అనుమానంతో వేధిస్తూ, అనుక్షణం మానసికంగా చిత్రవధచేసే సాడిస్టుకి భార్యనైన నేను .... ఆ పుస్తకాలు చదవడానికి అనర్హురాలిననిపించింది! నాలో ఏ మాత్రం ఆత్మవిమర్శనాజ్ఞానం వున్నా ఆ చెరనుంచి బయటపడాలి. కానీ చాలామందిలాగే చదివింది ఆచరించని కేటగిరి మనిషిని నేను. ఇక ఆ రచనలు చదివి ఏం లాభం అని మానేసాను. ఇంతకీ రక్షించుకోవటానికి మీరు పడుతూన్న కష్టమంతా వివరించాడు. వింటూంటేనే నాకు దుఃఖం వచ్చింది. ఆనందంతో వచ్చిన దుఃఖం అది. అంకిత్ మా దగ్గిర పెరుగుతూన్నప్పుడు వాడికి ఈ అనారోగ్యం సంభవించి వుంటే......మీరు పడుతూన్న శ్రమలో వెయ్యవవంతు కూడా మేము పడేవాళ్ళం కాదు. అంకిత్ మీ దగ్గిర సుఖంగా బ్రతగ్గలడు. ఇంతకుముందు వాడి గురించి నాకే మాత్రం ఆందోళన వున్నా అది పోయింది."
నేను పేలవంగా నవ్వుతూ...... "కానీ అటు వాడి ఆరోగ్యం క్షణం క్షణం క్షీణిస్తూంది" అన్నాను.
ఆమె లేచి వెళ్ళి కిటికీ..... కర్టెన్ వేసింది. అప్పటివరకూ మంచం మీద పడుతూన్న ఎంత అదృశ్యమై, చల్లగా అనిపించింది. నాకు అప్పటి వరకూ తోచలేదది. ఆమెవేపు కృతజ్ఞతగా చూసాను.
ఇలాంటి చిన్న చిన్న 'గమనింపు' లే మనిషికి మనిషిపట్ల వున్న అనుబంధాన్ని సూచిస్తాయనుకుంటాను.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?"
"నీ గురించే."
"నా విషయం వదిలెయ్యండి! అంకిత్ గురించి ఆలోచించాలి మనం......"
"నాకేదారీ కనబడటంలేదు."
"నేనొక నిర్ణయానికొచ్చాను" అన్నదామె.
"ఏమిటది?"
"కిడ్నాప్"
నేను ఉలిక్కిపడ్డాను.
"ఎవరిని?"
"నా కూతురు శ్వేతని."
"ఏమిటీ?" నా గొంతు కీచుగా ధ్వనించింది.
"అవును! అది చెప్పడానికే వచ్చాను."
"ఇంపాజిబుల్ ....." అరిచాను. "......అంకిత్ కోసం మరో చిన్న పిల్ల కిడ్నీ తీయించలేను. వాడు మరణించినా సరే."
"మనిషికి దేవుడు రెండు కిడ్నీలిచ్చాడు. అందులో ఒకటి లేకపోయినా వందేళ్ళు బ్రతగ్గలిగే వీలు కలిగించాడు."
"అయినా సరే......స్వంత నిర్ణయం తీసుకోలేని ఒక పాప కిడ్నీని నా స్వార్థం కోసం వినియోగించుకోలేను."
"ఆ పాప పెద్దయినా సరే....... స్వంత నిర్ణయాలు తీసుకోగలిగే స్థాయిలో వుండదు."
నాకు అర్థంకాలేదు. "అంటే?"
"శ్వేతలో మానసిక ఎదుగుదల లేదు" తలవంచుకుని నెమ్మదిగా అంది. నేను నిశ్చేష్టుడినై చూస్తూ వుండగా ఆమె అదే నెమ్మదైన స్వరంతో చెప్పటం సాగించింది....... "అంకిత్ పుట్టుక విషయమై గొడవ జరిగాక తిరిగి నేను గర్భవతినయ్యాను. ఈసారి కృపానంద్ కి 'అనుమానం లేదుగానీ ప్రమాదం మరోవైపు నించి వచ్చింది- అబ్బాయే కావాలంటాడు. స్కానింగులో అమ్మాయిగా తేలింది. అబార్షన్ చేయించుకొమ్మని బలవంత పెట్టాడు నేను వప్పుకోలేదు. నాకు తెలియకుండా గర్భస్రావం కోసం మందు తినిపించాడు".
మృణాళిని గుర్తొచ్చింది.
ఛివాలున తలెత్తాడు. ఆమె విషాదంగా నవ్వుతూ అంది. "స్త్రీ సమస్య గురించి ఎందరో ఎన్నో పరిష్కారాలు చెప్పారు. కానీ చాలా మంది స్త్రీలు అవకాశం ఉన్నా కూడా తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోలేరనటానికి నేనే నిదర్శనం. నా తండ్రి చాలా ఆస్థి ఇచ్చాడు. కాబట్టి నా సమస్య ఆర్ధికపరమైనది కాదు. నేను చదువుకున్నాను తప్ప అటువంటి సాడిస్టు నుంచి బయటపడటానికి చొరవ చూపించటం లేదు. దీనికి సామాజిక కట్టుబాట్లు, నైతికపరమైన నియమాలూ అని ఆత్మవంచన చేసుకుంటున్నాను...." ఆగి అంది. "మరోసారి నా అబార్షన్ కోసం ప్రయత్నిస్తే విడాకులు తీసుకుంటున్నానని బెదిరించాను. నా కోసం కాకపోయినా నా ఆస్థికోసం వూరుకున్నాడు. అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. మానసిక వెకల్యంతో శ్వేత పుట్టింది. గర్భస్రావం కోసం మింగించిన నాటుమందు ప్రభావం అన్నారు. డాక్టర్లు. ఒకవైపుకి వాలిపోయిన మెడతో, ఎదుగుదల లేని మెదడుతో, నా ఎనిమిదేళ్ళ శ్వేత! జీవిచ్ఛవంలా మరణం కోసం ఎదురుచూస్తోంది. అంకిత్ కోసం ఆ అమ్మాయి కిడ్నీ ఉపయోగపడితే అంతకన్నా కావల్సింది ఏముంది?"
"వద్దు" అన్నాను అంతా విని చివరికి. ఆమె ఆశ్చర్యంగా చూసింది. "నేను నీ కథ విని కదిలిపోయాను సుమద్యుతీ! స్త్రీకి నిజంగా ఇలాంటి కష్టలుంటాయని ఎవరైనా చెప్తే నమ్మకపోవుదునేమో! అయితే ఇక్కడ విషయం నీకు సంబంధించినది కాదు. నా మనసుకి సంబంధించినది. ఎందుకో ఆ పాప కిడ్నీ తీసుకోవాలనిపించటం లేదు."