Previous Page Next Page 
తపస్వి పేజి 28

 

    కామెశ్వరీదేవి వంటి వారు వామన్ కంటే ప్రమాదకరమయినవారు. తమ డబ్బుతో సమాజాన్నే కొనగలమనుకుంటారు . కొంతవరకు కొంటారు కూడా! చివరకు ఎవరో ఒక ధీమంతుడు తన జ్ఞాననేత్రం తెరిస్తే ఆ మాటలలో పడి బూడిద అయిపోతారు. ఆ బూడిదలోంచి నిజస్వరూపాలు బయట పాడినప్పుడు .... లోకమంతా చీత్కారాలు చేస్తుంది.
    నోరేరుగని చిన్న పిల్లలు ఆకలితో ఎదురుచూస్తున్నారు. ఆహార పదార్ధాలు చాలీ చాలకుండా ఉన్నాయి.
    "సుధా! నీకొక చిన్న గిప్ట్.
    సుధ ఆశ్చర్యంగా చూసింది.
    సౌందర్య, ఆమె వెంట ఒక కూలి రేషన్ తో.
    సుధ కళ్ళు మెరిశాయి.
    "థాంక్స్" అంది.
    "నువ్వు నాకు థాంక్స్ చెప్పటం, నేను నీకు థాంక్స్ చెప్పటం అవసరమా! మన ఇద్దరికీ కావలసింది ఆ పిల్లల ఆకలి తీర్చడం."
    సుధ రెండు చేతులూ జాపి సౌందర్యాని కౌగిలించుకుంది. ఇద్దరి చిరునవ్వులు శరణాలయంలో పిల్లలని తరంగాలై చుట్టుముట్టాయి.
    ఆ పిల్లల ముఖాల్లోని వెలుగు అక్కడి ఆవరణ అంతా నిండింది.

                                      17

    శశాంకగారు ఇటీవల వామన్ ను తరచుగా పిలిపించి కబుర్లు చెపుతున్నారు. శశాంకగారి కబురు అందగానే ఎన్ని పనులున్నా తప్పకుండా వెళతాడు వామన్. శశాంక గారిని చూస్తున్న కొద్ది ఆయనంటే గౌరవం కలుగుతుంది. భయం వేస్తుంది. వామనమూర్తి లాంటి వ్యక్తులు అయన కసలు ఎదురు మాట్లాడలేరు.
    "రా! వామన్! కూర్చో! ఎప్పుడూ వర్కు! వర్కు! ఆ కాంట్రాక్టు వ్యాపారమంత న్యూసెన్స్ మరేదీ లేదనుకో. ఎన్ని తలనోప్పులో! మధ్యమధ్యలో మీలాంటి వాళ్ళతో మాట్లాడుతుంటే మాక్కాస్త రిలీఫ్...."
    తన పని చూసుకుంటూనే గబగబా మాట్లాదేస్తున్నాడు. అయన.... అయన తనతో మాట్లాడదలుచుకున్నది అది కాదని వామన్ కు బాగా తెలుసు.
    "ఇహిహి' అని నవ్వాడు సమాధానంగా.
    ఆ నవ్వు వింటూ అయన వామన్ ముఖంలోకి ఒక్కసారి తేరిపార చూసి తనలో తను ఏదో ఆలోచించుకుంటున్నట్లు కొన్ని క్షణాలు అలా నిలబడి పోయాడు. వామనమూర్తి తబ్బిబ్బు పడిపోయాడు. ఎవరో తనను నగ్నంగా నిలబెట్టి పరిశీలిస్తున్నట్లు ముడుచుకుపోయాడు.
    "ఏవిటోనోయ్! జీవితంలో మనమెన్నో సాధించామనుకుంటాం! కానీ సరిగ్గా మనకేది కావాలో అది మాత్రం పొందలెం!"
    'అంతేనండి!"
    "నీ విషయమూ అంతేనా? నువ్వేది కావాలనుకుంటున్నావ్?"
    "ఏముందండీ! అందరు డాక్టర్లలాగే! డాక్టరుగా ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని.... విదేశాలకు కూడా వెళ్ళి విశ్వవిఖ్యాతి గడించుకోవాలని...."
    "ఓస్! ఇంతేనా! ఇవన్నీ చాలా చిన్న విషయాలోయ్. తలచుకుంటే క్షణాలలో సాధించవచ్చు!"
    అవును! అయన తలచుకుంటే క్షణాలలోనే సాధించగలరు. అందుకే ఆయనతో అన్నాడు ఆ మాటలు.....
    "ఇంత ఉన్నా, నిజమైన సంతోషం లేదు వామన్!"
    "అదేమిటండీ! మీకంటే అదృష్టవంతులెవరు?"
    "అందరూ అలాగే అనుకుంటారు. కానీ, ఒక్కొక్క సారి,  అదంతా సరేలే! నాకు కావలసింది సౌందర్య సంతోషం"
    "ఆవిడకేం తక్కువయిందండీ! ఆవిడసంతోషానికేం లోటు?"
    "ఆమెకు అన్నీ ఉన్నాయి నిజమే! కానీ కన్నతండ్రిగా అనుకూలమైన వరుడితో వివాహం జరిగినప్పుడే నాకు సంతృప్తి...."
    "ఆమెకు అనుకూలమైన వరుడు దొరకడం ఒక సమస్యా మీరు తలచుకుంటే !"
    "ఆ! అక్కడే వచ్చిన ఇబ్బంది, ఆమె సంగతి నాకు బాగా తెలుసు. తనంత తాను ఇష్టపడి చేసిన పనిలో తప్ప ఆమె ఆనందాన్ని పొందలేదు. పెళ్ళి విషయమూ అంతే! ఎవరిని ఇష్టపడుతుందో .... ఎప్పుడు ఇష్టపడుతుందో"
    ఒక్కసారి వామనమూర్తి వంక భావగర్బితంగా చూసి ఆగిపోయాడు.
    వామనమూర్తి ఆశ్చర్యంతో తలక్రిందులయిపోయాడు. ఒక్క విషయం అతడికి స్పష్టంగా అర్ధమయిపోయింది. శశాంకగారికి తనని అల్లుడిగా చేసుకోవటానికి ఏమీ అభ్యంతరం లేదు. కాని అందుకు ఆమె తనంత తాను ఒప్పుకోవాలి! ఇంకా కాస్త అందంగా చెప్పాలంటే ఆమె తనను ప్రేమించాలి. తను ఆమె ప్రేమను పొందగలగాలి!
    ఆమె తనకు భార్య అవుతుందా? ఒక్క చిరునవ్వుతో ఒక్క తిరస్కారపూరితమైన చూపుతో తనను పురుగులా విదిలించివేసే ఆమెతో తను జీవించగలడా? ఫారిన్ చాన్స్.... ఉజ్వల భవిష్యత్తు .... తనకేం! ఎంతో అంచంగా ఉంటాడు! ఉంటాడని అందరూ అంటారు. ఆమె తనకెందుకు ప్రేమించదు?
    ఈ నిర్ణయానికి వచ్చాక వామనమూర్తి ఎక్కువ టైం వెస్ట్ చేయదలచుకోలేదు. విదేశాలకు వెళ్ళగలిగితే ..... త్వరగా వెళ్ళితేనే మంచిది.
    సౌందర్యను "కోర్ట్ " చెయ్యటం ప్ర్రారంభించాడు. ఆమెకు పువ్వులు కానుకగా ఇవ్వడం.... ఆమె ఏది కట్టుకున్నా చాలా బాగుందని అనటమూ .... ఆమె ఆశయాలను అభిరుచులను, అదే ఒఅనిగా పొగడటమూ.... సినిమాలకు, షికార్లకూ తీసుకెళ్ళమూ.....
    కానీ, ఇదంతా ఎక్కువ కాలం సాగించలేకపోయాడు వామనమూర్తి. ఆమె తన ఉనికినైనా గుర్తించనట్లు అతి మాములుగా ఉండిపోవటం అతనికి ఎక్కడ లేని నీరసాన్నీ కలిగిస్తోంది. ఒక్కసారి సాహసించి ఆమె చేతి మీద చెయ్యి వేశాడు.
    ఆమె కోపం తెచ్చుకోలేదు. చిరాకు పడలేదు. కనీసం కనుబొమ్మలైనా ముడవలేదు. విచిత్రంగా చూసింది. వెంటనే అ చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. అలా ఎందుకు తీసుకున్నానా అని ఆ తర్వాత యెంత మధనపడినా మళ్ళీ ఆమె ఒంటి మీద చెయ్యి వెయ్యలేకపోయాడు. ఈ బాధంతా పడలేక ఆమెను స్పష్టంగా అడగటమే మేలనుకున్నాడు.
    ఆమెకు దూరంగా నిల్చుని తలవంచుకుని తడబడుతూ 'సౌందర్యా! నిన్ను ప్రేమిస్తున్నాను!" అన్నాడు - అనేశాడు.
    ఫకాలున నవ్వింది ఆమె.
    అప్పుడు తలెత్తాడు. మెరుస్తున్న ఆ కళ్ళలోకి చూడలేక తల తిప్పుకున్నాడు.
    'అది చెప్పడం దేనికి?"
    'అంటే?"
    "నాకు తెలుసు."
    "తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసా? సౌందర్యా! హృదయం మాట్లాడుతుందంటారు! ఇదే కాబోలు!"
    "నీ హృదయం మాటలు నాకు వినబడవు. అది కాదు. నువ్వు నీకు ఉపయోగపడే ఎవరినైనా ప్రేమిస్తావని నాకు తెలుసు. మా నన్నగారినీ , నన్ను ఉపయోగించుకోవాలని చూస్తున్నావని తెలుసు!"
    "అంత దారుణంగా మాట్లాడకు సౌందర్యా! నేను నిన్ను నిజంగా మనసారా ప్రేమిస్తున్నాను. నీలాంటి సౌందర్యమూర్తిని ఎవరు ప్రేమించకుండాఉండగలరు?"
    "అవును! నేను సౌందర్యను. అందరూ నన్ను ప్రేమించి నా శక్తితో తప్ప నన్ను స్వాధీనం చేసుకోలేరు. ఆ శక్తి లేని నువ్వు నన్నేం చేసుకోలేవు?"
    "ఏం మాట్లాడుతున్నావు సౌందర్యా?" అయోమయంగా అడిగాడు వామనమూర్తి.
    "నేను నిన్ను అసహ్యించుకోగలిగినా నిన్ను పెళ్ళి చేసుకోగలిగే దానిని వామన్. కానీ నువ్వూ కనీసం దుర్మర్గుడివి కూడా కాదు. ఆ మాత్రం శక్తి కూడా లేదు నీకు."
    వామన్ ముఖం కందిపోయింది. అయిన తన ప్రయత్నం మానలేదు.
    "మీ నాన్నగారు నీ సంతోషం కోసం చాలా ఆరాటపడుతున్నారు. మనం పెళ్ళి చేసుకుంటే ఆయనకు చాలా అనందం కలుగుతుందని అన్నారు."
    ఉలిక్కిపడింది ఆమె.
    "అలా అన్నారా?" నిజంగా అలా అన్నారా?"
    'అవును, అలాగే అన్నారు."
    పాపం, వామనమూర్తి అబద్దాలాడాలని అనుకోలేదు. చాలా రోజులుగా శశాంక గారి అభిప్రాయాన్ని తన కోణంలోంచి అలోచించి ఆ నమ్మకానికి నిజంగానే వచ్చేసాడు.

 Previous Page Next Page