"పదయింది... ఇంకా చదువేమిటమ్మా? విశ్రాంతి తీసుకోక!."
"నాకు చదువులోనే విశ్రాంతి"
"అవుననుకో! కానీ నా మనవడికి విశ్రాంతి కావాలి కదా!"
ఉలికిపడింది యశోద. ఎంతో ఉల్లాసంగా ఉంది ప్రసూన, పెళ్ళయి ఆ ఇంటికి వచ్చినప్పట్నుండీ ఆవిడ ముఖం అంత సంతోషంగా ఎప్పుడు చూడలేదు యశోద.
"ఈ పాలు తాగి పడుకో!. సుఖంగా నిద్ర పడుతుంది"
"థేంక్స్!. కానీ మీరే ఎందుకు తేవటం. ఎవరినైనా పంపితే సరిపోయేది కదా"
"నీకోసం కాదు. నా మనవడి కోసం, నా మనవడి పనులు నేనే స్వయంగా చేస్తాను. ఎవరినీ చెయ్యనివ్వను"
ప్రసూన ఇచ్చిన పాలు అందుకుని తాగింది.
"చాలా హాయిగా ఉంది ప్రాణానికి" కావాలని అంది.
ఎలాగైనా అత్తగారికి ఆనందం కలిగించాలని ఉంటుంది యశోదకి.
"నిజంగానా! అయితే రోజూ తాగాలి నువ్వు"
"తాగుతాను, కానీ నేనే మీ దగ్గరికి వచ్చి తాగుతాను!"
"నువ్వు... సరే రా! నా మనవడిని నా దగ్గరికే తీసుకొస్తానంటే వొద్దంటానా?"
చటుక్కున యశోద నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ప్రసూన. ఎవరి మీద తన ప్రేమని అలా ప్రకటించదు ఆవిడ, ముద్దు పెట్టుకున్న చప్పుడుకి కళ్ళు తెరిచి, తల్లిని చూసి వెంటనే కళ్ళు మూసుకున్నాడు వివేక్.
"దొంగవెధవ" ముద్దుగా నెమ్మదిగా అని, వెళ్ళిపోయింది ఆవిడ.
వెంటనే తలుపు గడియ వేసి, వచ్చాడు వివేక్.
యశోదని ఉగ్రంగా చూస్తూ "విడాకులు....! నీకు విడాకులు...." అన్నాడు వివేక్.
"విడాకులు దేనికీ? ఇప్పుడు నాకు విడాకులు కావాలని అడగలేదు కదా"
"అంటే! తర్వాత అడగాలనుకుంటున్నావా?"
మాట ముద్ద ముద్దగా వస్తోంది.
"ఆలోచించుకుందాం అప్పటి సంగతి!" విసుగ్గా అంది యశోద.
ఎన్ని చెప్పినా అతడు తాగుడు మానకపోవటంతో యశోదకి కోపంగా ఉంది. ప్రయత్నిస్తే మానగలడు. ప్రయత్నించడం లేదు యశోద ఆ మాట్లనగానే ఆమె ఒళ్ళో పడిపోయి, భోరుభోరున ఏడ్వటం మొదలు పెట్టాడు.
జాలిపడింది. అనునయంగా అంది.
"కానీ, వీడు... వీడు... తండ్రెవరు వీడికి? విడాకులు... విడాకులు..."
ముద్దగా మాట్లాడుతూ, రెండు పిడికిళ్ళు బిగించి యశోద పొట్టమీద గుద్దటం మొదలు పెట్టాడు వివేక్ బాధ భరించలేకపోయింది యశోద.
"ఏమిటిది? వదలండి!" అంది తీవ్రంగా. అంత మైకంలోనూ యశోద తీవ్రంగా అదిలించేసరికి తగ్గిపోయాడు.
"మరి అమ్మతో ఎందుకలా మాట్లాడావ్?" ముద్దగానే ఏడుపు గొంతుతో అడిగాడు.
"ఆవిడ ముఖం చూస్తూ, ఆ సంబరం తుడిచెయ్యలేకపోతున్నాను. రేపు మన మిద్దరం కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అసలు నిజం డాక్టరే ఆవిడకి చెపుతుంది. ఆవిడతో పాటు నేనూ ఆశాభంగం నటిస్తాను."
"ఆల్ రైట్! ఆల్ రైట్!.... కానీ వీడు... వీడు... వీడు... వొద్దు. నేను భరించలేను. నాకొద్దు"
యశోద వళ్ళో తలపెట్టుకుని సణుగుతూనే, నిద్రలోకి జారిపోయాడు.
* * *
ఆ రోజు క్లినిక్ కి డ్యూటీకి వెళుతూ హాల్లో కొత్త వ్యక్తిని చూసింది యశోద. అతడు పెద్దమనిషిలా లేడు. సినిమా విలన్ లాగ, గళ్ల లుంగీతో చుట్టకాలుస్తూ, కోర మీసాలతో లేడు. కానీ చూపులు వెకిలిగా... యాసగా... క్రూరంగా... ఉన్నాయి. చవకరకం ఫేంటూ, షర్టూ వేసుకున్నాడు. సిగరెట్ కాలుస్తూ, చుట్ట పొగవదిలినట్లు వదులుతున్నాడు. నిశ్చయంగా అతడు బంధువూ కాడు. స్నేహితుడూ కాడు.
"ఎవరు మీరు?" మర్యాదగానే అడిగింది.
"నేను నేనే గానీ, నువ్వెవ్వరు బుల్లా?"
గద్దలా చూస్తూ అన్నాడు అతడు. శరీరం జలదరించింది యశోదకి. జుగుప్సతో, అవ్యక్తమైన భయంతో! దేవిశంకర్ వయసే ఉంటుంది అతడికి. ఇంకా పెద్ద వాడేమో! తల బాగా నెరిసింది. ముఖం మొరటు బారింది. కళ్ళు తాగుడికి బాగా అలవాటుపడిన వ్యక్తిలాగ బాగా ఉబ్బి ఎఱ్రబారి ఉన్నాయి.
"ఎవరికోసం వచ్చారు?" కొంచెం కటుస్వరంతో అడిగింది.
"ఇంటికో కొత్త కోడలమ్మ వచ్చిందటగా! ఆమెగారి కోసం వచ్చాను!."
"నేనే కొత్త కోడలమ్మని! ఏం కావాలి నీకు?"
ఈలవేశాడు, అసభ్యంగా నఖశిఖ పర్యంతం చూపుల్తో తడిమాడు.
"ఓయ్! వోయ్! వోహో! నువ్వా? బాగానే ఉంది యెవ్వారం" వెటకారంగా నవ్వుతూ అన్నాడు.
"ఏయ్! ఎవరు నువ్వు? ఏమిటా మాటలు, నాతో నీకేం పని?" కసిరింది.
"ఏందమ్మో అట్టా కసురుతుండావు? శంకరయ్య తప్ప, నన్ను మరోరు కసిరే పనిలేదు. ఆయనా నేనూ ఇంతప్పటి నుండీ గోళీలు ఆడుకునే వోళ్ళం. నీ మొగుడు భూమ్మీద పడ్డ కాడి నుంచీ నేను భుజాల మీద మోశా! నాకు తెలియని గుట్టుమట్లేవి లేవు ఈ ఇంట్లో!"
ఈ మాటల్తో అలర్ట్ అయింది యశోద.
"నీ మొగుడు భూమ్మీదపడ్డ కాడి నుంచీ మోశా.."
"నాకు తెలవని గుట్టూ మట్లేవి లేవు..!"
వివేక్ మనసుని చెదరగొట్టిన, బాల్యంలోని అజ్ఞాత విషయాలేమైనా ఇతడు చెప్పగలడేమో! ఆ క్షణంలో తనలో పెరుగుతున్న అసహ్యమూ, జుగుప్స అన్నీ వదిలి అతడి ముందుకు వచ్చి కూర్చుంది.