ఆమె చదివి ఆశ్చర్యంగా తలెత్తి తలుపు తెరిచి చూసింది. ఎదురింటి మూడో అంతస్తులో నేత్ర అలాగే నిలబడి వున్నాడు. అతడికి స్లో ప్రోసెస్ మీద నమ్మకం లేదు. కొంచెం కంగారుపడ్డా ఇటువంటి అమ్మాయిలు 'ఫాస్ట్ గైస్' నె ఇష్టపడతారని అతడి నమ్మకం. చొరవగా చొచ్చుకుపోవటం అతని అలవాటు ఆమె తనవైపు చూడగానే టీకి రమ్మన్నట్టు చెయ్యి వూపాడు. అయితే అందులో చౌకబారు బజారు కుర్రవాడి లక్షణం లేదు.
రిటైరయిన ఇద్దరు ఇరుగు పొరుగు పెద్ద మనుషులు ప్రహరీ గోడకి ఇటూ అటూ నిలబడి మర్యాదగా ఎలా మాట్లాడుకుంటారో అలా సౌంజ్ఞ చేశాడు హంసలేఖ ఇదంతా ఆశ్చర్యంగాను, థ్రిల్లింగ్ గానూ అనిపించింది. అతడు మరోసారి పిలిచాడు.
కొంచెం తటపటాయించి ఆమె 'వస్తున్నట్టు' సైగ చేసింది.
నేత్ర వెనుక నుంచి "కంగ్రాట్స్" అని వినిపించింది. చప్పునవెనుదిరిగి చూసాడు చప్పున.
ప్రతిమ! నవ్వులొలుకుతూ నిలబడి వుంది.
"మైగాడ్, నువ్వా!" అన్నాడు.
"గుడ్ ప్రోగ్రెస్" అంది. ఇద్దరూ తిరిగి గదిలోకి వస్తూవుండగా "నీ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవచ్చు" అంది.
"ఆ అమ్మాయి ఇటువంటి విషయాల్లో చెయ్యి తిరిగిందని నువ్వు చెప్పబట్టే ఈ ధైర్యం చేశాను."
"అభివృద్ధి సాధించామన్నమాట. ఏదీ...... నేను చూడనా....... ఆ అమ్మాయిని" అంటూ వంగబోయింది.
నేత్ర ఆమెని పట్టుకుని వెనక్కిలాగుతూ "నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళు. ఇంకో రెండు నిమిషాల్లో ఆ అమ్మాయి యిక్కడికి రాబోతూంది. నిన్ను చూసిందంటే, వీడికి అమ్మాయిల పిచ్చి చాలా వుంది అనుకునే ప్రమాదం వుంది" అన్నాడు.
"కానీ...... ఆ అమ్మాయితో నువ్వేం మాట్లాడతావో, ఎలా ప్రొసీడ్ అవుతావో చూడాలని వుంది నాకు" గారాబంగా అంది ప్రతిమ.
"ఇంకా నయం. అంతటితో ఆపావ్. యింకా ఏమీ చూడాలని లేదూ....?? వెళ్ళెళ్ళు!" అంటూ బలవంతంగా తోశాడు. ఆమె బయటకు వెళ్ళగానే కిటికీ దగ్గరకెళ్ళి టెలిస్కోప్ తీసి దాచేశాడు.
ప్రతిమ బయటకు వచ్చి లిప్ట్ బటన్ నొక్కింటి. పై నుంచి క్రిందికి వచ్చేది, క్రింది నుంచి పైకి వెళ్ళేది- రెండు లిప్ట్ లూ పక్కపక్కన వున్నాయి. ఈమె లిప్ట్ లోకి ప్రవేశించడం, మరో లిప్ట్ కింద నుంచి వచ్చి ఆగి తలుపు తెరుచుకోవడం ఒకేసారి జరిగాయి. అందులోంచి హంసలేఖ బయటకొచ్చి థర్డ్ ఫ్లోర్ లో అడుగు పెట్టింది. హంసలేఖ రావడం ఒక్క క్షణం ముందై వుంటే ప్రతిమ ఆమెను చూసి వుండేది. అప్పుడు ఈ కథ యింకో రకంగా వుండేది.
* * *
లిప్ట్ క్రిందికి దిగిన ప్రతిమ అక్కడే కొంచెంసేపు నిలబడింది. ఆమెకి వాళ్ళిద్దర్నీ అలా వదిలేసి వెళ్ళబుద్ధి కాలేదు. ఎంత కాదనుకున్నా స్త్రీ సహజమైన ఈర్ష్య ఆమె కాళ్ళని కదలనివ్వడంలేదు. కొంచెం సేపు అక్కడే వుంది.
అంతలో ఆమె దృష్టి మెయిన్ ఫ్యూజ్ మీద పడింది.
ఒక ఆలోచనకి వచ్చినట్టు అక్కడికి వెళ్ళి ఎవరయినా గమనిస్తున్నారేమో అని అటూ ఇటూ చూసి ఫ్యూజ్ తీసేసింది.
* * *
కాలింగ్ బెల్ వినపడగానే నేత్ర వెళ్లి "కమిన్" అన్నాడు.
హంసలేఖ లోపలికి అడుగు పెట్టింది. అతడామెని ఆహ్వానిస్తూ "రండి" అన్నాడు. "మిమ్మల్ని చాలా కంగారు పెట్టాను."
హంస లేఖ గదిలో చుట్టూ చూస్తూ నిలబడింది.
"కూర్చోండి" అన్నాడు.
"మీరు వ్రాసింది నాకు అర్థం కాలేదు" అంది.
"ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది లేఖా......? మిమ్మల్ని కావాలనుకున్నప్పుడు చూడడం కోసం ఈ ప్లాట్ అద్దెకి తీసుకున్నాను. ఉన్నదున్నట్టు ఫ్రాంక్ గా మాట్లాడడం నాకలవాటు. ఒంటరివాడిని. ఇల్లెలాగూ అవసరం. పుణ్యం, పురుషార్థం, స్త్రీ దర్శనం కలుగుతుంది కదా ఇక్కడయితే."
ఆమె నవ్వి "మీకింకేం పని లేదా....?" అంది.
"నా పనే యిది. నిన్నూ, మీ నాన్నని కనిపెట్టి వుండడం."
"మా నాన్నగార్నా......?" ఆశ్చర్యంగా అడిగింది.
"అంతే మరి.... ఆయన చూడకుండా నిన్ను నేను చూడాలి కదా."
"భలే మాట్లాడతారే మీరు....."
"అన్ని ప్రశ్నలూ నువ్వే అడుగుతున్నావ్. నేనేం అడగొద్దా....?"
ఆమె నవ్వి..... "అడగండి" అంది.
"టీ తాగుతూ మాట్లాడుకుందాం. టీయా......? జిన్నా.......?"
ఆమె ఇబ్బంది పడి- "జిన్ను, వైనూ యిలాంటి అలవాట్లు నాకు లేవు" అంది.
అతడు కన్నార్పకుండా ఆమె వైపు చూశాడు. ప్రతిమ నిజమే చెప్పింది ఈమె అద్భుతమైన నటి.
"మనిషి తనకున్న అలవాట్లని ధైర్యంగా పైకి చెప్పుకోవడం నాకు నచ్చే గుణాల్లో ఒకటి. ఉదాహరణకి నేను ఒకప్పుడు మార్ఫియా తీసుకున్నాను. ఎంతో బావుంది. తరువాత కంట్రోల్ చేసుకోవడానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది" అంటూ బాటిల్ తీశాడు. "నెల రోజుల క్రితం ఎవరో స్నేహితుడు యిచ్చాడు. దీన్ని చూస్తే మనసు ఆగడం లేదు."
ఆమె అతడి వైపు సానుభూతితో చూసింది. తన అక్క జీవితం ఎలా అయిపోయిందో చెప్పాలనుకుంది. ఇంటి విషయాలు బయటికి చెప్పడం ఎందుకని మళ్లీ మానేసింది. కానీ నేత్రలాటి అందమైన ఆరోగ్యవంతమయిన కుర్రాడు ఇలా మత్తు పదార్థాలకి అలవాటు పడడం ఆమెకిష్టం లేకపోయింది.
ఇలాంటి అలవాట్లు మొగ్గగా వున్నప్పుడే తుంచెయ్యాలి.
ఈ ఆలోచన రాగానే ఆమె అతడి చేతిలో సిగరెట్ పాకెట్ తీసుకుని, అతడివైపు చూసి చనువుగా నవ్వి, దాన్ని కిటికీలోంచి బయటకు విసిరి కొట్టింది.
"చూసారా, ఉన్నంతసేపూ టెంస్టేషన్. ఒకసారి పోయిందనుకుంటే రిలీఫ్" అంది తేలిగ్గా.
ఆమె అలా చేస్తుందని వూహించని అతను విస్తుబోయాడు. ఏదో ఇరుకయిన భావం. కాని వెంటనే సర్దుకున్నాడు.
ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, గొంతులోకి మార్దవం తెచ్చుకుంటూ "నాకు నీతో జీవితాంతం స్నేహం చెయ్యాలని వుంది. నీ కభ్యంతరం లేదుగా" అన్నాడు. తన మాటలు తనకే కృతకంగా అనిపించాయి.