"ఇదంతా తారకేశ్వరి ఎత్తు! ఈ పోరాటంలో యెలాగో ప్రధానమంత్రి గెలుస్తారని ఆమెకు తెలుసు. నాలుగురోజుల క్రితం ప్రధానమంత్రిని కలుసుకుంది. ఇద్దరిమధ్యా రహస్య సంభాషణలు గంటసేపు గడిచినాయ్".
"దేని గురించి....?"
"డాక్టర్ ఫాస్టస్ చనిపోయిన తరువాత భారతదేశం నీటి కాలుష్య నివారణ మీద అతడి ఫోర్జరీ సంతకంతో మరో రిపోర్టు చేయబడింది. దాని ప్రకారం నీటిలో డి-ఆలమ్ బదులు డి-కాల్షియమ్ కలపటంవల్ల నీటిని శుభ్రపరచవచ్చని చెపుతూంది. అంటే లోహియా మట్టికొట్టుకుపోతాడన్న మాట".
"దానివల్ల రామ్మూర్తికేం లాభం?"
"ప్రతి రాష్ట్రంలోనూ రామ్మూర్తి పది రోజుల్లోగా ఒక్కొక్క డి-కాల్షియమ్ ఫ్యాక్టరీ స్థాపించబోతున్నాడు. ఫ్యాక్టరీ అంటే పెద్ద ఫ్యాక్టరీ కాదు. తెల్ల సున్నంలో ఎర్రమట్టి కలపటం అంతే... పోతే ముఖ్యమంత్రి తలపెట్టిన ఈ కార్యక్రమం దేశానికి విస్తరింప చేయటం ద్వారా మొత్తం దేశ ప్రజల ఆదరాన్నీ, అభిమానాన్నీ ప్రధానమంత్రి సంపాదిస్తారు, సున్నం కలిపిన నీళ్ళని తాగుతూ ప్రజలు ఆహా-ఓహో అని సంతృప్తి పడతారు. ఓట్లు వేస్తారు..."
"మైగాడ్" అన్నాడు సింహం. వాణి ఎన్ సైక్లోపీడియాలాగా, మిగతా వివరాలు చెప్పటం ప్రారంభించింది.
ఈ రెండు నెలల్లోనూ మొత్తంసున్నం, ఎర్రమట్టి 10 లక్షల టన్నుల అమ్మకం జరుగుతుందని అంచనా. అంటే దాదాపు 75 కోట్ల రూపాయలు. అందులో 50 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ ఫండుకి, మిగతాది రామ్మూర్తికి... ఇదీ తారకేశ్వరీ ప్రధానమంత్రుల మధ్య కుదిరిన వప్పందం".
అకస్మాత్తుగా సింహం తన ముందున్న టేబిల్ మీదకు తలవాల్చి "దేశం... దేశం...." అన్నాడు డెస్పరెంట్ గా. ఎప్పుడూ హుషారుగా ఈ విషయాలేవీ తనకు పట్టనట్లు, తన పనేదో తను సరదాగా చేసుకుపోయే సింహాన్నే అంతలా కదిలించి వేసింది ఈ వార్త అంటే- కుళ్ళిపోయిన దేశపు రాజకీయాలకు పరాకాష్ట!
తన మాటలకి అక్కడ వాతావరణం స్థబ్దమవటం చూసి, పరిస్థితిని తేలిక చేయటం కోసం "ఇంతకీ మనం ఎవరిని సపోర్టు చేయాలో నిర్ణయించుకోలేదు" అంది వాణి. అతడు మాట్లాడలేదు. ముగ్గురూ అతడివైపు చూశారు.
అతడి చూపు అక్కడలేదు. గోడల్ని, అడ్డుల్ని ఛేదించుకుని ఎక్కడికో చూస్తూ వుంది. అతడలా వున్నాడంటే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడన్న మాట! అటువంటి స్థితి ఎప్పుడో గానీ రాదు. 'అందరిముందు' ఆలోచించే అవసరం అప్పటివరకూ అతడికి ఎప్పుడూ రాలేదు. వాళ్ళు అతడిని కదపటానికి భయపడ్డారు.
అవును. అతడు ఆలోచిస్తున్నాడు.
ప్రధానమంత్రీ... రాష్ట్ర మంత్రీ... వ్యక్తులు కాదు ప్రధానం! దేశం ముఖ్యం. ఈ రాజకీయాల రొంపి నుంచీ, ఏ మాత్రం ఉపయోగం లేని ఈ అనవసర హడావుడి సిస్టమ్స్ నుంచీ ప్రజల్ని రక్షించాలి! ఏదో ఒక అద్భుతమైన ప్రయోగం చేసి ఈ కోట్ల కోట్ల మిలియన్ ల భారత ప్రజల్ని మార్చాలి. ఏమిటా అద్భుతమైన ప్రయోగం?
అతడి మనసులో ఒక ఊహ మెదిలింది. చిన్న ఊహ... కానీ ఆ ఆలోచన రావడంతోనే అప్రయత్నంగా వళ్ళు గగుర్పొడిచింది. "నేను చేయగలనా ఈ పని" అనుకున్నాడు. మనిషి తల్చుకుంటే చేయలేనిది ఏదీ లేదని అతడికి అతడి జీవితమే చెప్పింది. ఎందుకు చెయ్యలేడు? ఈ వ్యవస్థని ఒక బాంబువేసి పేల్చేసినట్టు ఎందుకు ఛిద్రం చెయ్యలేడు? ఈ ఎత్తులన్నిటికీ అతీతంగా ఒక పెద్ద ఎత్తు వేసి-
తన అనుచరులు ముగ్గురూ తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నారని గమనించి, అతడు లేస్తూ అన్నాడు-
"ఎలక్షన్స్ కి ఇంకా టైమ్ వుంది. అప్పటికి ఏం చెయ్యాలో నేను చెపుతాను- ఈ లోపులో ఒక వ్యక్తిగతమైన కక్ష తీర్చుకోవాలి! మన దేశానికి అతిథిగా వచ్చిన డాక్టర్ ఫాస్టస్ ని చంపి, దాన్ని స్టాంపు పేపరు మీద వ్రాసి మనకు బహుమతిగా పంపించిన వంకచెక్కా రామ్మూర్తి.... అతడి మీద అంత స్వీట్ గానూ పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు".
9
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అంది ఆ అమ్మాయి. పద్దెనిమిదేళ్ళ వయసు ఆమెలో అక్కడక్కడా కొద్దిగా గుండ్రంగా వంపులుతిరిగి అందంగా ఇమిడిపోయింది. ఆమె తెల్లగా వుంది. డబ్బువల్ల వచ్చిన నాజూకుతనం, వయసు తెచ్చిన అల్లరితనానికి తోడై ప్రవర్తన తెచ్చిన చిలిపితనంతో రంగరించుకుంది. ఆ అమ్మాయితో ఆ మాట అనిపించుకోవటానికి ఈ ప్రపంచంలో ప్రతీ అబ్బాయీ ఉవ్విళ్ళూరుతాడు. ఎగిరి గంతేస్తాడు.
ఆ అమ్మాయి పేరు శైలజ! వంకచెక్కా రామ్మూర్తి కూతురు.
"చెప్పవా?"
"ఏమిటి?"
"నేను నిన్ను ప్రేమిస్తున్నా- అని ఒక్కసారి అను చాలు".
ఒకసారి ఏమిటి - వేలసార్లు లక్షల సార్లు- ఈ ప్రపంచంలో గ్రహాలూ... నక్షత్రాలూ వున్నన్నిసార్లు ఆ మాట అనాలని నా మనసు ఉవ్విళ్ళూరుతూంది. కానీ ఎవరిని ఎన్నుకోను? ఎవర్ని ఎన్నుకొని అనను ఆ మాట? అమ్మా- అమ్మా- ఈ ప్రేమని వెల్లడించే మొట్టమొదటిమాట- "అమ్మా" అన్నది- ఆ మాట మొదటిసారి నీతో ప్రారంభించి, ఆ తరువాతే ఈ ప్రేమ యొక్క మరొక స్వరూపంలోకి వెళ్ళాలనిపిస్తూంది. ఏ చెత్త కుప్పల మీద వెతుక్కుంటున్నావమ్మా నా గురించి. చీకటి గుహల అంతర్భాగాల్లో నన్ను పారేసుకున్న వ్యధలు నిన్ను తొలిచేస్తూంటే, ఏ పెంటల మధ్య కూర్చుని విలపిస్తున్నావమ్మా నా గురించి.
"శైలూ! నేను నీకో మాట చెప్పనా?"
"ఏమిటి"?
"నిన్ను చూస్తూంటే నాకో బాగా అల్లరిచేసే చిన్నపిల్ల గుర్తొస్తుందే తప్ప మరేదీ గుర్తురాదు".
అతడి చెయ్యి మెరుపుకన్నా వేగంగా కదలగలదు. కనురెప్పపాటులో పిస్టల్ తీసి ఎదుటి వ్యక్తిని చంపగలడు. అయినా ఆ క్షణం అతడు వూహించని వేగంతో ఆమె వచ్చి అతడి బుగ్గమీద కసుక్కున కొరికి "ఇప్పుడు చెప్పు. ఇంకా చిన్న పిల్లలాగే కనపడుతున్ననా నేను" అంది.
అతడు మాట్లాడలేదు.
ఆమె అన్నది- "రాత్రి మూడింటికి మెలకువ వచ్చింది. నీ ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ఏం చేశానో తెలుసా?"
అతడు అనుమానంగా "ఏం చేశావ్?" అని అడిగాడు.
"నువ్వు అనుమానపడేది ఏమీ చెయ్యలేదులే" అంది. "ఈ ప్రపంచానికి కనబడని ప్రతి చోటా నా శరీరం మీద బాల్ పాయింట్ పెన్ తో నీ గురించి ఇలా వ్రాసుకున్నాను" అంటూ మోచేతి జాకెట్ బోర్డర్ ను కాస్త పైకెత్తి చూపించింది. తెల్లటి భుజాన, కుచ్చిళ్ళు తప్పిన పాదాల చీలమండల నుంచి పైకి, చెట్ల మీద అస్తవ్యస్తంగా పాకిన లతల్లాటి అక్షరాలు- "ఐలవ్యూ ఐలవ్యూ ఐలవ్యూ" అని.