"ఎలావుంది?" చాలా మామూలు పరామర్శ ఇదని నాకు తెలుసు. కానీ ఇంతకుమించి అతన్ని పలకరించటానికి వేరే మాట దొరకలేదు.
నా ప్రశ్నకి చిన్నగా నవ్వాడు. "నా విషయం సరే, ఆమె కలిసిందా రాత్రి" అనడిగాడు.
తను లేవలేని పరిస్థితిలో వుండికూడా నా విషయం గురించి అడగటం నన్ను కదిలించింది. అతని చేతిని నా చేతిలోకి తీసుకుని "అంతా సవ్యంగా జరుగుతుందనే అనుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి కాస్త నీ గురించి శ్రద్ధ తీసుకో, మందులు సక్రమంగా వాడు" అన్నాను.
"నాకేం ఫరవాలేదులే. ఇవన్నీ చిన్న విషయాలు. మరో సంవత్సరం వరకూ నేను బ్రతికే వుంటాను."
సంవత్సరం......హు .......అతనికి ఎన్నేళ్ళని? ఇంకా సంవత్సారాలు బ్రతకాల్సిన వ్యక్తి అందులో పంతొమ్మిది సంవత్సరాలు మిస్సవుతున్నానని తెలిసి కూడా ఆ ఒక్క సంవత్సరం గురించే ధీమాగా చెబుతున్నాడు.
ఆ తరువాత అతడితో కొంచెంసేపు సంభాషణ జరిపి బయటకొచ్చి, విశాఖపట్టణం ఫోన్ చేశాను.... "ఏమైంది మీరు వెళ్ళిన పని?" ఆత్రంగా అట్నుంచి అరుంధతి అడిగింది. జరిగినదంతా క్లుప్తంగా చెప్పాను.
"అంకిత్ కి కిడ్నీ దొరుకుతుందంటారా?" బేలగా అడిగింది.
"అదే పనిమీద తిరుగుతున్నాను. ఏమవుతుందో తెలీదు. ఆమె భర్త నన్ను కలిసి, కిడ్నీ ఇవ్వము అన్నాడు. ఈ లోపులో జాన్ సిక్ అయ్యాడు....." అంటూండగా అరుంధతి మధ్యలోనే అందుకుంది. "చూడండీ. అంకిత్ ని మనం పెంపకానికి తీసుకోవాలని ముందే ఎలా రాసి పెట్టి వుందో...... అలాగే వాడు బ్రతికేది లేనిదీ ఎప్పుడో రాసి పెట్టబడి వుంది. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. వాడు మనకి దక్కడేమో అనే దిగులుతో మీలో బాగా మార్పొచ్చింది. మీరోసారన్నారు గుర్తుందా .....మనం బావుంటేనే మన పిల్లలు బావుంటారని. అది గుర్తుపెట్టుకోండి" అంటూ ఫోన్ పెట్టేసింది.
అరుంధతి మాట్లాడాక నాలో చాలా మార్పు కలిగింది. అంతవరకూ నాలో వున్న టెన్షన్ అంతా చేత్తో తీసేసినట్లు, అన్ని మైళ్ళ అవతలినుండి వినిపించిన ఆమె కంఠం నుండి నాకేదో స్వాంతన లభించినట్టు నూతనోత్సాహం ఆవరించింది.
నా కారు నిశ్శబ్దంగా ఆ వీధి మలుపు తిరిగింది. ఆ రాత్రికి సుమతో పూర్తిగా మాట్లాడాలి. మళ్ళీ మళ్ళీ ఆమెను కలుసుకోడానికి కుదరకపోవచ్చు. ఈ లోపులోనే ఖచ్చితంగా ఆమె మనసు తెలుసుకోవాలి. ఈ సస్పెన్సు భరించలేను.
ఆ యింటిని దాటి నాలుగిళ్ళవతల చెట్టుక్రింద కారాపి దిగాను. వీధి పూర్తిగా నిర్మానుష్యంగా వుంది.
తల వంచుకుని ఆ యింటికేసి నడిచాను.
గేటు ఎక్కడానికి కాలు పైకెత్తగానే జరిగిందది. ఎక్కడి నుంచి దూసుకువచ్చిందో ఊరకుక్క 'భౌ' మంటూ మొరిగింది. కాలు క్రింద పెట్టి అదిలించబోయాను. ఇంతలో మరోటి వచ్చి దానికితోడు పెద్దగా మొరగసాగింది.
అర నిమిషంలో అక్కడ నాలుగైదు కుక్కలు జతయ్యాయి.
ఎలాగయినా గేటు దూకి వెళ్ళాలన్న నా ప్రయత్నం అవి గమనించినట్టు మీది మీదికి రాసాగాయి. ఇంకొక్క క్షణంలో గేటు ఎక్కబోతాను అనగా అప్పుడు పడింది నా మీద లైట్ ఫోకస్ . నా గుండే ఆగినంత పనయ్యింది. ఎందుకంటే ఆ లైట్ వెలుగుపడింది ఎక్కడి నుంచో కాదు, కృపానంద్ ఇంటినుండి. నిస్సహాయంగా ఆగిపోయాను. వెనక్కి తిరిగి పారిపోవాలన్న కోరిక క్షణక్షణానికీ అధికమయింది. టార్చ్ ఫోకస్ చేసింది ఎవరో స్పష్టంగా కనిపించలేదు. కానీ లైట్ ఫోకస్ చూడగానే కుక్కలు దూరంగా పరుగెత్తి అక్కణ్నుంచి మొరగసాగాయి.
కొద్దికొద్దిగా ఆ వెలుగు గేటువేపు రాసాగింది. టార్చ్ పట్టుకున్న ఆ ఆకారం దగ్గరయిన కొద్దీ నాకు చెమటలు మరింత పట్టసాగాయి. గేటు మీద చేయి ఆనిచ్చి అటుకేసి చూడసాగాను. నాలో ఒక మొండిధైర్యం ప్రవేశించింది.
ఇప్పుడు పూర్తిగా ఆ ఆకారం నా అభిముఖానికి వచ్చింది. టార్చ్ ఖంగ్గుమంది అతని కంఠం.
వెంటనే నాకు ఏం చెప్పాలో అర్థంకాలేదు. పట్టుబడిన దొంగలా అతనివంక చూస్తూ "మీ.....మీ కోసమే వచ్చాను" అన్నాను. నేను అతని ముందు అంతగా తడబడిందీ, భయపడిందీ తప్పు చేసినందుకు కాదు. భార్యమీద అనుమానం మరింత పెరుగుతుందేమోనని.
"కాదు...... నువ్వు నా కోసం రాలేదు. నిజం చెప్పు" గద్దించాడు.
"లేదు. మీకోసమే....."
"షటప్. ఇంత రాత్రివేళ కలవడానికి నేనేమైనా మొగ వ్యభిచారినా.....?" గట్టిగా అరిచాడు..... "నువ్వు నా భార్య కోసమే వచ్చావు. అవునా?"
"కాదు" నేనూ గట్టిగానే అన్నాను. "ఆమె ఏలా వుంటుందో కూడా ఇటీవల కాలంలో చూడలేదు. ఫోన్ లో మాట్లాడ్డమే. అంతే అంతకుమించి మాకెలాంటి పరిచయం లేదు."
అతడు పగలబడి నవ్వాడు. "పరిచయంలేదా? పరిచయం లేకపోతే మా అడ్రసు పన్నెండు సంవత్సరాల తర్వాత నీకెలా తెలిసింది? నీ దగ్గిర పెరుగుతున్నవాడు నా భార్య కొడుకన్న నమ్మకం ఎలా కలిగింది? వాడు మీ ఇద్దరికీ పుట్టకపోతే ఇన్ని విషయాలు ఎలా కనుక్కోగల్గుతావు? ఇదంతా తెర వెనుక మీ ఇద్దరు ఆడిన భాగోతం కాదూ?"
నా దగ్గిర సమాధానం లేదు. కాదు...... కాదు...... సమాధానం వుంది. కాని అది తర్కానికి అందదు. నా కల గురించీ, నేను అడ్రసు పట్టుకోవటానికి పడిన కష్టం గురించీ ఎంత చెప్పినా అతడు నమ్మడు. అందుకే క్లుప్తంగా అన్నాను. "డైరెక్టరీలో మీ నెంబర్ చూసాను."
"డైరెక్టరీలో నెంబరు చూసి నా భార్యతో ఫోన్ మాట్లాడావా?"
"అవును!"
అతను మళ్ళీ పగలబడి నవ్వాడు. "ఫోన్ ......ఫోన్ లో కదూ నువ్వు మాట్లాడింది" అంటూ గట్టిగా నవ్వుతూ హఠాత్తుగా ఆపేసి క్రూరంగా చూస్తూ "నా ఫోన్ నంబర్ ఎంత చెప్పు?" అన్నాడు.
అనుకొని ఈ పరిణామానికి బిత్తరపోయాను. అవును! ఫోన్ నెంబర్ నిజంగానే నాకు తెలీదు. "మ ....మరచిపోయాను." తడబడ్డాను.
"ఒకవేళ నువ్వు నా ఫోన్ నెంబర్ చెప్పినా, నా భార్యతో ఎట్టి పరిస్థితిలోనూ ఫోన్ మాట్లాడలేవు."
"నేను ఫోన్ లోనే మాట్లాడాను."
"ఆపు నీ కట్టుకథ...... నా ఫోన్ డెడ్ అయి వారంరోజులు అయ్యింది."
ఒక భయంకరమైన అల అంతెత్తున నన్ను ముంచేసిన ఫీలింగ్, ఇక దేవుడు కూడా రక్షించలేడు.
"చెప్పు...... నేనీరోజు ఊరికి వెళుతున్నానని చెప్పినా భార్య నిన్ను రమ్మంది కదూ?" తిరిగి రెట్టించాడు.
"చూడండీ ......." నేనేదో చెప్పబోయాను.
"షటప్! ఇప్పుడు నా కర్థమవుతోంది. రాత్రి గోడ దూకిన నల్లపిల్లి ఎవరో?"
"మిస్టర్ కృపానంద్! నేను చెప్పేది వినండి. నా కొడుకు చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో కొనవూపిరితో....."
"గో టూ హెల్! నువ్వూ నమీ కొడుకూ! మరోసారి నువ్వీ వీధిలో అడుగు పెట్టినా, నా భార్యతో మాట్లాడాలని ప్రయత్నించినా నేనేం చేస్తానో నాకే తెలీదు. పోలీసు కేసవుతుంది జాగ్రత్త. ఇంకో విషయం, పన్నెండేళ్ళ క్రితం నీ కొడుకు నొక్కణ్నే చంపుదామనుకున్నాను. ఇప్పుడు మీ ఇద్దర్నీ చంపుతాను....."
నిశ్శబ్దంగా తల దించుకుని వెనుదిరిగాను. నా జీవితంలో మొట్టమొదటిసారి ........ఇలా దోషిగా తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారులో కూర్చుని అన్యమనస్కంగా డ్రైవ్ చేస్తున్నాను. మనసు అల్లకకల్లోలంగా వుంది. ఇక సుమని కలవడం పూర్తిగా అసాధ్యమే. అతనెక్కడికీ కదలకుండా ఆమెకి కాపలాగా వుంటాడు. గోడదూకి వెళ్ళిన విషయం కూడా అర్థమైంది కాబట్టి, ఇక నేనాదారిన ఆమెను కలుసుకోవడం అసలు కుదరదు.
ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయాయి.
మిగిలినవి కేవలం ఏడు రోజులు.
ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నా నేను వెనుక నా కారునేదో గుద్దినట్టయి వెనుదిరిగి చూసాను. వెనకేదో కారు వేగంగా వచ్చి మరోసారి గుద్దింది. నాకేం అర్థంకాలేదు. రోడ్డుకు అడ్డంగా తిరగబోయి నా కారుని కంట్రోల్ చేసుకుంటూ విండోలోంచి వెనక్కీ చూసాను. వేఅగంగా దూసుకొస్తున్న వెనుక కారునుంచి తప్పించుకోవటం కోసం నేను మరింత వేగం పెంచి రోడ్డుకు పూర్తిగా ఎడ్జ్ వరకూ వచ్చేసాను.
అదే నేను చూసిన తప్పు.
నన్ను వెంటాడుతున్న కారు వేగంగా వచ్చి సర్రున కోస్తూ నా కారుని ప్రక్కనుండి గ్రుద్దింది. డోర్ విరిగి అవతల పడింది. కంట్రోల్ చేసుకుంటూ బ్రేక్ మీద కాలు పెట్టేలోపలే మరోసారి గ్రుద్దింది. అంతే నా కారు ఫుట్ పాత్ మీదికి దూసుకెళ్ళి కుడి ప్రక్కకు ఒరిగింది. సరిగ్గా అప్పుడే ఆ కారు మరోసారి గుద్దింది.
అయిపోయింది. చివరిసారిగా అంకిత్ ని గుర్తుచేసుకోబోయాను. అప్పుడే నా శరీరం కూడా ప్రక్కకు దొర్లింది. అక్కడ డోర్ ఊడిపోయి వుండటంతో రోడ్డు మీద పడ్డాను. ముందు తల అదిరింది. తరువాత వీపూ, కాళ్ళు రోడ్డుమీదికి జారాయి. మీద పడబోతున్న కారునుండి తప్పించుకోవటం కోసం ప్రక్కకు దొర్లాను.
కానీ అప్పటికే ఆలస్యమైంది. దొర్లిన కారు టైరు నా కుడిచేతి మీద ఎక్కింది. ఎముక విరిగిన చప్పుడు. తరువాత అంతా నిశ్శబ్దం. స్పృహ తప్పేముందు నా ఎదురుగా నిలబడి పగలబడి నవ్వుతున్న ఆకారాన్ని కళ్ళు చిట్లించుకుని చూశాను.
అతడు కృపానంద్!
దగ్గిరగా వచ్చి వికృతంగా అన్నాడు. "నాతో డీల్ చేయాలంటే మరిన్ని తెలివితేటలు అవసరం" నాకు స్పృహ తప్పుతోంది. అతడు ఏం చెపుతున్నాడో అర్థంకాలేదు. కానీ అతడు చివరిమాట చెప్పాక, అంత మత్తులో కూడా అది అర్థమైంది.
"నా ఫోన్ డెడ్ అవలేదు" అన్నది అతడి చివరిమాట.
* * *
నాకు స్పృహ వచ్చేసరికి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను. చేయి కదపబోయాను. బరువుగా అనిపించింది. ఆశ్చర్యంగా చేతివంక చూసుకున్నాను. మోచేయివరకూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కట్టువేసి వుంది. ఒంటిమీద ఎక్కడా చిన్న గాయం లేదు.
నిస్పృహగా తల విదిలించాను. డోర్ తెరుచుకుని అప్పుడే ఆ గదిలోకి వస్తున్న జాన్ నన్ను చూడగానే "లేచావా...... ఇప్పుడే డాక్టర్ తో మాట్లాడి రావడానికి బయటికి వెళ్ళాను" అంటూ దగ్గరగా వచ్చి, స్టూల్ లాక్కుని కూర్చుంటూ, "ఎలా వుంది?" అన్నాడు. చాలా మార్దవంగా పలికిందా మాట.
ఓ పేలవమైన నవ్వు నవ్వి, నా చేతిని చూపిస్తూ "యిలా ....." అన్నాను.
ఒక్కక్షణం జాలిగా నావంక చూసి, "అన్ని సమస్యలూ నీకే రావాలా? దెబ్బమీద దెబ్బన్నట్టు, ఇప్పుడే నీకీ యాక్సిడెంట్ అయింది. అసలు ఆ కృపానంద్ గాడి మీద మనం పోలీస్ రిపోర్టివ్వాలి" అన్నాడు. అదిరిపడ్డాను.
"కృపానందా .....? అతనే ఈ యాక్సిడెంట్ చేసినట్టు నీకెలా తెలుసు?"
"అతనే చెప్పాడు."
"వాట్?!"
"అవును! నీకు యాక్సిడెంట్ చేసిన వెంటనే, నాకు ఫోన్ చేసి నీ మిత్రుడు చావు బ్రతుకుల్లో వున్నాడు, వెళ్ళి రక్షించుకో. నా భార్య జోలికి మళ్ళీ వచ్చాడంటే ఈసారి ప్రాణాలే తీసేస్తానని చెప్పు. ఇది శాంపిల్ మాత్రమే అన్నాడు."