సుమ చేయలేదు.
ఆమె భర్త కృపానంద్ చేశాడు.
"నేను సుమ భర్తని" ఇంగ్లీషులో అన్నాడు. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ "నమస్తే....." అన్నాను.
"నేను మీతో మాట్లాడాలి".
"ష్యూర్. ఎక్కడికి రమ్మంటారు?" కొద్ది అనందంతో - ఉత్సాహంగా అడిగాను.
"నాలుగింటికి బిర్లామందిర్ కి రండి".
"అలాగే. కానీ మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలా?"
"నా కారు నెంబర్ చెప్తాను. రాసుకోండి" అని అతను చెప్తూండగా గబగబా పాకెట్ డైరీలో రాసుకున్నాను. "రండి, నా కారు దగ్గిరే వెయిట్ చేస్తుంటాను" చెప్పి ఫోన్ పెట్టేశాడు.
హమ్మయ్య! చిన్నగా నిట్టూర్చి జాన్ వైపు తిరిగాను. "కృపానంద్ ఫోన్ చేసాడు. నాలుగింటికి బిర్లామందిర్ కి వస్తే మాట్లాడతాడట" అన్నాను ఉత్సాహంగా.
"రియాల్లీ. అంటే అతను కిడ్నీ ఇవ్వడానికి వప్పుకున్నట్లేనా?" ఆత్రుతగా అడిగాడు.
"ఏమో. ఆ విషయం కదపలేదు. మాట్లాడాలని మాత్రం అన్నాడు."
* * *
బిర్లామందిర్!
చలువరాతి కట్టడం. తెల్లదనం శాంతికే కాదు. భక్తికి నిదర్శనం అన్నట్టు చిన్న కొండమీద ఠీవిగా వుంది. ఎక్కడినుండో అన్నమయ్య కృతి వినిపిస్తోంది.
కారు దిగి డోర్ వేస్తూ చూసాను.
నాకు కొద్ది దూరంలో కృపానంద్ చెప్పిన నెంబర్ గల కారు వుంది. దాని కానుకుని ఒక వ్యక్తి నించుని వున్నాడు. పొట్టిగా వున్నాడు. పల్చగా పెరిగి ట్రీమ్ చేసిన గడ్డం. మనిషి బాగా మారాడు. అతనే కృపానంద్...... అంకిత్ కన్నతండ్రి! నేను టి.వి.లో చూసిన వ్యక్తి.
కానీ నాకెందుకో అతనంటే విముఖత కలిగింది. బహుశ అతని గురించి ముందే తెలిసి వుండటంవల్ల అయివుంటుంది.
ఇటుకేసి నడిచాను. ఎదురుగా వెళ్ళాక చేయిజాస్తూ నా పేరు చెప్పి పరిచయం చేసుకున్నాను.
అతను కనీసం కర్టెసీ కోసమైనా చేయి అందివ్వకుండా తల పంకించి "రండి" అన్నట్టు ముందుకు కదిలాడు. షేక్ హాండ్ కోసం చాచిన నా చేయి ముడుచుకుని వెనక్కి జరిగింది. చాలా అవమానంగా అనిపించింది నాకు. కానీ, అవసరం కోసం అతన్ని భరించడం తప్పేమీ కాదనిపించింది. వెనకే నడిచాను.
కాస్త పైకి వెళ్ళాక, చిన్నగా వున్న గోడకి ఒరిగి నించుంటూ- "నా భార్యతో మాట్లాడారంటగా?" అన్నాడు.
"అవును" అనాలోచితంగా చెప్పాను.
"ఎక్కడ?" సూటిగా వచ్చిందా మాట ఠక్కున.
ఉలిక్కిపడ్డాను. అవును. ఆమెను ఎలా కలిసానని చెప్పాలి? అర్థరాత్రి గోడదూకి వెళ్ళి మాట్లాడానని చెప్పనా? ఏం చెప్పాలిప్పుడు......నా ఆలోచన పూర్తికాకముందే "ఎక్కడ మాట్లాడారు?" రెట్టించాడు. అర్థమయిపోయింది. అతని మనసులో అవమాన బీజం పడింది. ఆదిలోనే హంసపాదంటే ఇదేనేమో.....
"ఫో......ఫోన్ లో" అబద్దమాడాను.
"అవును..... చెప్పింది."
ఒక్కసారిగా నా వళ్ళు తెలికయింది. ఆమె కూడా అదే అబద్ధం చెప్పడం కాకతాళీయమె అయినా అది మా ఇద్దరి అదృష్టం కూడా.
"చెప్పండి.....ఏం కావాలి మీకు?" అదే స్వరం. గులకరాళ్ళని డబ్బాలో వేసి పూపినట్టు.....మనిషికీ, మనస్తత్వానికీ, కంఠానికీ అసలు పోలికలేదు.
"మీ భార్య మీతో అన్ని విషయాలూ చెప్పే వుంటుంది" ఏం చెప్పాలో తెలీక ఆ మాటన్నాను.
"అవును. చెప్పింది. మీకు కిడ్నీ కావాలి అంతేగా?"
"అంతే" నా మనసు చాలా తేలికవుతోంది. అతను విషయంలోకి రావడంతో.
"కానీ మేము ఇవ్వం" బాణంలా తగిలిందా మాట.
ఒక్కసారిగా బిర్లామందిర్ మీంచి హుస్సేన్ సాగర్ లో దూకాలన్న కోరిక కలిగింది. అసలతను నన్నంతదూరం తోసేసినట్టే అయింది.
తిరిగి అతనే అన్నాడు. "నా భార్య కిడ్నీ ఇవ్వదు. నేను కూడా అసలెందుకివ్వాలి?"
మూర్ఖపు ప్రశ్న - కానీ ఇలాంటి ప్రశ్నలు భరించక తప్పదు.
"అంకిత్ ఆ కిడ్నీ లేకపోతే బ్రతకడు....." నన్ను పూర్తిగా చెప్పనివ్వలేదు.
"అసలా అంకిత్ ఎవరు? నా కొడుకే అన్న గ్యారంటీ ఏమిటి? వాడు నీ కొడుకే. నాకు నిశ్చయంగా తెలుసు....."
నాకెంత కోపం వచ్చిందంటే, "నువ్వు నీ తండ్రి అని చెప్పబడే పెద్దమనిషికే పుట్టావన్న గ్యారంటీ ఏమిటి?" అనడగాలనిపించింది. ఆవేశాన్ని అదిమి పెట్టి శాంతంగానే ఫోటోతీసి అందించాను.
అంకిత్ ఫోటో - ముమ్మూర్తులా సుమలా వున్న అంకిత్ ఫోటో.
అది చూసిం తరవాత కూడా అతనిలో పెద్ద కదిలికలేదు. గాలికి నుదిటిమీద పడ్డ జుట్టుని స్టయిల్ గా వెనక్కి తోసుకుంటూ, తిరిగి ఆ ఫోటో నా చేతికిచ్చి, "కావొచ్చు. ఈ పిల్లాడు నా కొడుకే కావచ్చు. కానీ నా భార్య రాదు, కిడ్నీ ఇవ్వదు. అనవసరమైన విషయాల్లో ఆమెని జోక్యం చేసుకోనివ్వను. మీరు వేరే డోనర్స్ ని వెదుక్కోవటం మంచిది. అది చెప్పడానికే పిలిపించాను......" అనేసి దిగి నుంచున్నాడు.
"ప్లీజ్..... కన్న ప్రేమని దాచుకుని అంకిత్ చావడానికి కారణం కాకండీ" వారించబోయాను.
"కన్న ప్రేమా? కనీసం వాడు పుట్టినప్పుడు ఎలా వున్నాడో కూడా చూడలేదు నేను. ఇన్నేళ్ళ తరువాత ఇంకా ప్రేమ మిగలివుందని ఎలా అనుకుంటున్నావు?"
"మరొక్కసారి ఆలోచించుకోండి. ప్లీజ్ కన్నతండ్రిగా కాకపోయినా కనీసం ఒక మానవత్వం వున్న మనిషిగా నయినా."
"నాకు మానవత్వం లేదు మిస్టర్. ఉంటే నా భార్యని గదిలోపెట్టి తాళం వేసుకుని వెళ్ళేవాడినే కాదు" చెప్పేసి చరచరా వెళ్ళిపోయాడు.
నేను షాక్ తో అలాగే నించుండిపోయాను. ఉన్న ఒకే ఒక ఆశ...... మొదటి..... చివరి ఆశ కూడా పోయింది. సమస్య మొదటికి వచ్చింది. పరిష్కారంలేని సమస్య. అంకిత్ ని ఇక భగవంతుడు కూడా రక్షించలేడు.
* * *
నాకు చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తొచ్చింది. దేవతలూ రాక్షసులూ కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని మధిస్తున్నపుడు ముందు రత్నాలు పుట్టాయట. అయినా వాటిని చూసి ఎవరూ ఆనందపడలేదట. తరువాత పుట్టిన భయంకరమైన విషాన్ని చూసి వారెవరూ కొద్దిగా కూడా భయపడలేదట. అమృతం పుట్టేవరకూ పాలసముద్రాన్ని చిలకటం మానలేదట.
అలాగే, విజ్ఞులు ప్రారంభించిన పని అంతమయ్యే వరకూ తమ నిర్ణయాన్ని వదిలిపెట్టరు, అని ఆ పద్యం యొక్క భావం. చిన్నప్పుడే నా మనసుకి బాగా హత్తుకుపోయిన మాటలవి.
నేనారాత్రి తిరిగి సుమను కలుసుకున్నాను. ఈసారి జాన్ రాలేదు. బయలుదేరే సమయానికి అతని నోటిలోంచి రక్తం పడటంతో నేనొక్కడినే బయలుదేరాను.
ఇంటిముందు తాళం తీసేవుంది. అంటే కృపానంద్ లోపల ఉన్నాడన్న మాట. అతనికి తెలీకుండా ఆమెను కలుసుకోవడం ఎలాగో అర్థం కాలేదు. ఇదివరకు వెళ్ళిన దారిగుండా వెళ్లి ప్రయత్నించాలనుకున్నాను. శబ్దం కాకుండా గేట్ మీంచి దూకి గోడప్రక్కగా వెనకవేపు వెళ్ళాను.
నిన్నటి పైప్ లైన్ పట్టుకుని పైకి చేరుకున్నాను. ఇదివరకు వచ్చినప్పుడు కృపానంద్ లేడు కాబట్టి కొద్ది ధైర్యం వుంది. ఇప్పుడు అతనుగానీ నన్ను చూస్తే మాత్రం ప్లానంతా బెడిసికొడుతుంది. నా గుండె చేసే శబ్దంవల్ల ఛాతీమీద రోమాలు కూడా అదురుతున్నాయి. నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆమె గది కిటికీ వరకు నడిచాను. అతను నన్ను చూస్తాడేమో అనే భయం ఒకటి.
చివరికి ధైర్యంచేసి లోపలికి చూశాను.
సుమద్యుతి ఒక్కతే కూర్చుని వుంది. నిన్నటిలాగే అదే కుర్చీలో రాసుకుంటోంది. కొద్దిగా మెడసాచి లోపలికి పరిశీలనగా చూశాను. కృపానంద్ ఆ గదిలో లేడు.
నెమ్మదిగా పిలిచాను.
నా పిలుపుకోసమే ఎదురు చూస్తున్నట్టు ఆమె చప్పున వెనుదిరిగింది, నన్ను చూడగానే ఆమె కళ్ళల్లో ఏదో పెన్నిధి దొరికిన ఆనందం. వెంటనే లేచి ఆ గది తలుపులు మూసేసింది.
తరువాత కిటికీ దగ్గరికి వచ్చి, "అతను క్రింద హాల్లో ఏవో ఫైల్స్ చూస్తూ మేలుకునే వున్నాడు" అంది.
"మీతో మాట్లాడటమెలా?" నిస్సహాయంగా అన్నాను.
"బాధపడకండి రేపు ఇదే టైమ్ కి రండి. అతను రేపుండడు, విజయవాడ వెళుతున్నాడు."
"మీతో చాలా మాట్లాడాలి" అర్థింపుగా చూస్తూ అన్నాను. ఆమె నా వంక సానుభూతిగా చూస్తూ క్షణకాలం అలాగే నిలబడింది.
కొద్దిసేపటికి ఆమె కళ్ళల్లో ఏదో స్థిర నిశ్చయం కనబడింది. "నా బిడ్డని రక్షించుకోవడానికి నేనేదయినా సరే చేయడానికి వెనుకాడను....." ఇంకా ఏదో ఏదో అనబోయింది. ఇంతలో తలుపు శబ్ధమయింది.
ఒక్కసారిగా ఇద్దరం ఉలిక్కిపడ్డాం.
ఆమె వెంటనే రియాక్టయ్యింది "వెళ్ళండి......రేపు రండి....." చిన్న స్వరంతో చెప్పికిటికీ తలుపులు మూసేసింది.
నేను వంగి ఘా విప్పేసి చేతులతో పట్టుకున్నాను. తరువాత పిల్లిలా అడుగులువేస్తూ బాల్కానీ వరకూ వచ్చి రైలింగ్ పట్టుకుని దిగబోతుండగా అప్పుడు జరిగింది.
బాల్కనీ వేపున్న తలుపు తెరుచుకుంది.
ఒక్కక్షణం నాలో చలనం ఆగిపోయింది. ఊపిరి బిగబట్టి అంతెత్తు నుండి క్రిందికి దూకేసాను. మోకాలు కలుక్కుమంది. దూకటం ఆలస్యం...... విండో షేడ్ కింద కదలకుండా బిగుసుపోయి నించున్నాను.
పైనించి కృపానంద్ కంఠం "ఎవరదీ?" అంటూ వినిపించింది. నా శరీర కంపన స్పష్టంగా తెలిసిపోతోంది. ఊపిరి తీయటం కూడా ఆపేసి జరగబోయే పరిణామం వూహిస్తూ అలాగే నిలుచున్నాను.
తరువాత ఆమె కంఠం విన్పించింది 'ఏమిటి?' అని.
"ఏదో శబ్దమయింది" కృపానంద్ అంటున్నాడు.
"అదా...... అదీ ఖచ్చితంగా ఆ నల్లపిల్ల అయి వుంటుంది. రాత్రి కూడా వచ్చింది. అబ్బ, ఎంత భయంకరంగా వుంటుందో......"
తరువాత తలుపు మూసుకున్న శబ్దమయింది.
నిట్టూర్చి కదిలాను అక్కడ నుండి.
....... ఉదయం జాన్ కోసం హాస్పిటల్ కి వెళ్ళాను, తన హాస్పిటల్లో తనే పేషెంట్ లా బెడ్ మీద పడుకుని వుండటం చూడగానే నా మనసు కలుక్కుమంది. బాధగా బెడ్ ప్రక్కన వున్న స్టూల్ మీద కూర్చున్నాను.
కొద్దిగా తేరుకున్నట్టున్నాడు. ముఖం కాస్త తేటగా వుంది. దిండు మీద వెనక్కి అనుకుని పడుకుని వున్నాడు.