"క్షమించాలి అన్ని దేశాలకన్నా మంచి ఆర్ధిక వ్యవస్థ వున్నది జపాన్ కే అని మీకూ తెలుసు. నా ఉద్దేశ్యం మీరు 'అమెరికన్ డాలర్' అని ఉపయోగించబోయి, పొరపాటున 'జపనీస్ ఎన్' అని వుంటారని" అన్నాడు చైతన్య.
ముందున్న గ్లాసులో నీళ్ళు గటగటా తాగేడు భైరవమూర్తి. తన ముందు కూర్చున్నది సామాన్యుడు కాదని అతడికి తెలిసింది.
నిజానికి ఈ సమావేశం సఫలమవుతుందని అతడికి నమ్మకంలేదు. ఇంతకాలం వాళ్ళని మోదంచేసేరు. వాళ్ళ అజ్ఞానంమీదా, బలహీనతమీదా ఆడుకొన్నారు. వాళ్ళకి రావాల్సిందేమిటో ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు వప్పుకోక చేసేదేముంది?
భైరవమూర్తి ఆలోచనల్లో వుండగానే, గంగరాజు జేబులోంచి నోట్లకట్ట తీసేడు. "ఇది తీసుకుని ఇక మాట్లాడక" అంటూ ముందుకు తోసేడు.
క్షణంపాటు చైతన్యకి అర్థంకాలేదు. అర్థం అవగానే మొహం ఎర్రబడింది. విసురుగా కుర్చీ వెనక్కితోసి లేచి నిలబడి "అది లోపల పెట్టండి" అన్నాడు.
"పిల్చి పిల్లనిస్తానంటే-" అని ఏదో అనబోతున్న గంగరాజు, "ముందది లోపలపెట్టు" అన్న ఘర్జనతో, మాట మధ్యలో ఆపుచేసి చప్పున డబ్బు లోపల పెట్టేసేడు. కానీ అంతలో సర్దుకొని...... క్షణంలో తన సహజ దర్పాన్ని తెచ్చుకొని మిగతా వాళ్ళతో ..... "డోంట్ వర్రీ-మై పీపుల్ విల్ హాండిల్ హిమ్" అన్నాడు.
దాంతో చైతన్యకి సహనం నశించింది. "యూ ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ది బార్భేరియన్ సొసైటీ. ఐ డోన్ట్ యూ థింక్ యు హావ్ మొరేల్స్....." జీవితంలో ఎప్పుడూ రానంత కోపం వచ్చింది అతడికి. జుగప్స, అసహ్యం, కోపం మిళితమైన స్వరంతో.....మనిషి అస్థిత్వం గురించి అతడు చెబుతున్న రెండు నిముషాల పాటూ అందరూ కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయారు. అంత స్వచ్ఛమైన ఇంగ్లీషుని అంత ఏకధాటిగా మాట్లాడుతూ వుండగా వినటం అక్కడ చాలా మందికి అదే మొదటిసారి. "నన్ను హ్యాండిల్ సంగతి మీకు తెలీదు. తుఫానులో- భయంకరమైన సముద్రం మధ్యలోని పడవని నడపటానికి ఉపయోగపడే తెడ్లవి. మీరు కిరాయికి తెప్పించే రౌడీలకన్నా మా జాలర్లు పెద్ద రౌడీలు. మీకన్నా ముందే నేనే యీ పరిస్థితిని ఇంకోలా హేండిల్ చెయ్యాలనుకొని వుంటే మీ పిల్లలు ఈ పాటికి అనాధలై వుండేవాళ్ళు."
అందులోని సత్యం అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. రోజూ సముద్రంలో పోరాటం సాగించే జాలర్లు సహజంగా బలిష్టులు, దానికితోడు కొంచెం తాగిస్తే యిక మనుష్యుల్లా వుండరు. అలాంటివాళ్ళను కూడగట్టుకొని, పరిస్థితిని ఇంతవరకూ ఇంత శాంతియుతంగా తీసుకొచ్చిన చైతన్య అంటే.....తాత్కాలికమైనా.....అందరికీ గౌరవం కలిగింది.
భైరవమూర్తి చప్పున కుర్చీలోంచి లేచి, "అంతమాట అనకండి చైతన్యా! జరిగినదానికి నాకెంతో విచారంగా వుంది. అలా అని క్షమాపణ చెపుతూ వ్రాసి ఇమ్మన్నా ఇస్తాను" అన్నాడు.
చైతన్య నెమ్మదిగా కుర్చీలో కూర్చుంటూ "నో - నో" ఇట్సాల్ రైట్" అన్నాడు.
గంగరాజు ఏదో పనివున్నవాడిలా లేచి బయటకు వెళ్ళిపోయాడు.
"ఇప్పుడు రేటు డెభ్భయ్ చేస్తే- అది వాళ్ళ విజయంగా భావించి, కొంత కాలానికి ఎనభయ్ అడగరని నమ్మకం ఏమిటి?" అన్నాడో మెంబరు.
"డిమాండ్ లేకపోతే మీరూ కొనరు" అన్నాడు చైతన్య. "అప్పుడు ధర అరవైకి దిగుతుంది. నేను కోరేదల్లా ఇన్ కంటాక్స్ కట్టే బదులు డబ్బుని జాలర్లకిమ్మని....."
"ఆ హామీ మీరు తీసుకోవాలి" ఎవరో అన్నారు.
"తప్పకుండా......"
సమావేశం ముగిసింది. ఒక్కొక్కరే లేచేరు.
అందరికన్నా వెనుక భైరవమూర్తి చైతన్యతోపాటు నడుస్తూ "చైతన్యా..... మీరు చాలా తెలివయిన వారిలా కనబడుతున్నారు ఈ విషయాలన్నీ బాగా తెలిసిన వారిలా వున్నారు. ఏం చదువుకున్నారు మీరు?" అని అడిగాడు.
"జీవితాన్ని."
* * *
"చాలా గొప్ప విజయం సాధించారే" అంది శారద..... అతను వచ్చేసరికి ఆమె దేవుడి కోసం మాల గుచ్చుతోంది.
చైతన్య నవ్వి, "నేను సాధించలేదు, ఇదంతా ఉటోపియా" అన్నాడు.
"అదేమిటి....."
"ఈ నికృష్ణమైన జాలర్ల జీవితాల్ని బాగుచెయ్యటం అంత సులభం కాదు. పరిస్థితులు ఇలా మారితే ఎంత బావుణ్ణు అని కల్పన చేసి అతడు ఒక ఊహాలోకాన్నీ - సంఘటన్లనీ నిర్మించేడు. అంతేకాని యివి మారతాయన్న నమ్మకం అతడికీ లేదు."
"అతడెవరు?" ఆశ్చర్యంగా అంది శారద.
"రచయిత. ఈ నవలా రచయిత."
"మిమ్మల్ని సృష్టించినవాడి గురించి మీకేం తెలుసు?"
"ఎలియనేట్ చేస్తున్నాను. బ్రేక్ట్ రచనలు ఏమైనా చదివేనా-?" ఆమె అడ్డంగా తలూపింది లేదన్నట్టు.
"అవి చదువుతేగానీ ఎలియనేషన్ గురించి అర్థంకాదు."
18
"నేనీ బాధ భరించలేను" అంది కిరణ్మయి.
"మీకు బాధా" అంది మిసెస్ సింగ్ "అందమైన భర్త, కావల్సినంత డబ్బు....."
అలా అనటంలో యింకా తెలుసుకోవాలన్న ఆతృత వుంది.
"మీకు తెలియదు" అంది కిరణ్మయి "ఆడదానికి కావల్సినవి అవికావు. అనురాగమూ, ఆప్యాయతా, సరదాగా షికారు తీసుకెళ్దామనీ భార్యతో మనసు విప్పి మాట్లాడదమనీ లేని భర్తతో వేగడం కష్టం".
"మన భర్తలకి మనతో గడపటంకన్నా డబ్బు సంపాదించటంలో ఆనందం ఎక్కువ" అంది మిసెస్ సింగ్.
"డబ్బు తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదనుకొనే వాళ్ళంటే నాకసహ్యం" అంది కిరణ్మయి.
నేనూ ముందు మీలా ఆలోచించి బాధపడేదాన్ని. ఇక వీళ్ళకోసం బాధపడటమే అనవసరం అని తోచి, నా బాధలన్నీ పోగొట్టుకోవటానికి లైట్ గా డ్రింక్ పుచ్చుకోవటం మొదలెట్టాను. చాలా బాగా పనిచేసింది" అంది మిసెస్ సింగ్.
"బాగా పనిచేస్తుందా.....?"
"ఆహా..... ఈ మగవాళ్ళంతా తాగేది ఆ రిలాక్సేషన్ కోసమే....."
కిరణ్మయి లేచివెళ్ళి ఫ్రిజ్ లోంచి రెండు సోడాలూ, బీరువాలోంచి రవి తాలూకు విస్కీ సీసా తీసుకొచ్చి బల్లమీద పెట్టింది.
మిసెస్ సింగ్ ఆశ్చర్యంగా, "విస్కీయా" అంది.
"ఏం?" అర్థంకానట్టు అడిగింది కిరణ్మయి.
"సాధారణంగా ముందు జిన్ తో మొదలు పెడ్తారు ప్రారంభించేవాళ్ళు -ఇది చాలా చేదుగా వుంటుంది".
కిరణ్మయి గ్లాసులో సోడా కలుపుతూ "ఫర్లేదు. ఈ బాధల్ని మర్చిపోవటానికి ఇంతకన్నా చేదైన విషం బాగా పనిచేస్తుందంటే అది తాగటానికి కూడా సిద్ధమే నేను.....చీర్స్".
"చీర్స్....."
అరగంట గడిచేక మిసెస్ సింగ్ తూలుతూ నిలబడింది..... "వెళ్ళొస్తాను" అంటూ.
"మంచిది" కిరణ్మయి సోఫాలోంచి లేవకుండానే అంది. "థాంక్స్ మంచి మందు చూపెట్టేరు. చాలా థాంక్స్, వెళ్ళిపోగల్రు కదా....."
"ఆ - ఫర్లేదు. డ్రైవర్ వున్నాడు" అంది.
ఆమె వెళ్ళిపోయాక కూడా కిరణ్మయి ఆపుచేయకుండా అలానేత్రాగసాగింది. తాగేకొద్దీ ఆమె మనసు దూదిపింజెలా తేలిపోసాగింది. తమ రాకతో చైతన్య అదృశ్యం, చివరకు తోడబుట్టిన చెల్లెలు కూడా వేరు పడటం - భర్తతో అనుకున్నట్టు సుఖసంసారం జరక్కపోవటం ఇవన్నీ ఆమె మనసులో సుఖం లేకుండా చేసినయ్.
.....రవి వచ్చే సమయానికి ఆమె సోఫాలో అస్తవ్యస్తంగా పడుకొని వుంది. ముందు టీపాయ్ మీద సీసాలూ, గ్లాసులూ చూస్తూంటే అతడికి మొదట ఏమీ అర్థంకాలేదు. అర్థం అయిన రెండు నిమిషాల్లో కాలూ..... చెయ్యీ ఆడలేదు. చివరికి ఎలాగో నోరు పెగుల్చుకుని "ఏమిటిది కిరణ్" అన్నాడు.
ఆ మాటలకి ఆమె కళ్ళు విప్పింది. మూత పడ్తోన్న కళ్ళని అతి బలవంతం మీద తెరచి వుంచటానికి ప్రయత్నం చేస్తూ, "ఓ నువ్వా రవీ! గుడ్ ఈవెనింగ్- గుడీవెనింగ్ రవీంద్రనాథఠాక్కూర్" అంది. ఆమె మాటలు ముద్దగా వస్తున్నాయి.
అతడు చప్పున ఆమె దగ్గరకు వచ్చి జబ్బ పట్టుకొని లేవదీసి కూర్చోబెట్టటానికి ప్రయత్నించాడు. ఆమె మళ్ళీ జారిపోతూ "ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు తాగుతావో- మరి ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు రవీ? నీ డియరెస్టు లవ్వర్ని కదా....." అంది ముద్దగా.
"లే కిరణ్" అన్నాడు. అతడిలో సహనం చచ్చిపోతోంది.
"హాయిగా వుంది రవీ! నువ్వూ తాగు..... ఫ్యాక్టరీ అమ్మేయ్. అంతా అమ్మేయ్ పూర్తిగా తాగేద్దాం బాధల్ని మర్చి-"
ఆమె చెంప ఛెళ్ళుమంది. కొద్దిసేపు శ్మశాననిశ్శబ్దం ఆ గదిలో తాండవించింది. ముందుగా తెరుకొంది కిరణ్మయి.
"కొట్టేవా రవీ......." అంది. "మానాన్న అమ్మని కొట్టేవాడు. అది బీదతనంలో వచ్చిన అసహాయతా- కోపం- అన్నీ - కలిసి కొట్టేవాడు. మరి డబ్బుండి కూడా నువ్వు..... నువ్వు ఎందుక్కొట్టావ్ రవీ?" మగతగా అడుగుతోంది.
అతడికేం తోచలేదు. చప్పున ఆమెని రెండు చేతుల్తోనూ ఎత్తి బాత్ రూమ్ వైపు నడవసాగేడు.
పెద్దగా నవ్వింది కిరణ్మయి. "ఇలాగే మా అమ్మని నాన్న ఎత్తుకొన్నాడు రవీ..... భోజనం చేస్తుంటే రాత్రికి బియ్యంలేవనీ...... అదంతా తన ఖర్మనీ అమ్మ గొణిగింది. తింటూన్న కంచం విసిరి కొట్టేడు. అమ్మపడిపోయింది. నుదురు పగిలి అంతా రక్తమే...... మేం చిన్నపిల్లలం..... నేనూ శారద.....భయంగా చూస్తూ నిలబడ్డాం......హాస్పిటల్ కి తీసుకెళ్ళే లోపులోనే చచ్చిపోయిందమ్మ..... అమ్మా..... అమ్మా" ఆమె కంఠం రుద్ధమైంది. "నీకు తెలీదు రవీ, బీదతనం ఎంత భయంకరమైందో" ఆమె గొణుగుతోంది.
టబ్ లో పడుకోబెట్టి షవర్ తిప్పేడు. ఒక్కసారిగా చన్నీళ్ళు మీదపడేసరికి వళ్ళు జలదరించి చిన్నగా అరిచింది.