Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 27


    "నేనెవరో కావాలా ! అయితే జాగ్రత్తగా విను. శారదమ్మ కొడుకుని-" రిసీవర్ పెట్టేసిన చప్పుడు వినిపించింది.

    నరసింహం నివ్వెరపోయాడు. కొద్ది క్షణాలవరకూ నోట మాట రాలేదు.

    "ఎవరు మాట్లాడింది !" అతడి మొఖంలో ఆందోళన గమనించి అడిగాడు రామలింగం.

    "ఎవడో - ఇడియట్" అన్నాడు నరసింహం కోలుకుని.

    "వాడు ఇడియట్ కాదు మామయ్యా" అంటూ ఏదో చెప్పబోయాడు మురళీకృష్ణ.

    "ష్ !" అన్నాడు నరసింహం అతనిని వారిస్తూ.

    "బావా మరి నాకిక శెలవా?" లేచి నిలబడ్డాడు రామలింగం.

    "మంచిది రామలింగం !"

    రామలింగం గేటు దాటగానే మురళీకృష్ణ ఆత్రుతగా నరసింహం దగ్గరకొచ్చి కూర్చున్నాడు.

    "ఆ ఫోన్ చేసిన వాడెవడో అచ్చం నా పోలికలే మావయ్యా! చాలా రోజుల్నించి నాలాగా నటిస్తూ నన్ను చాలా తిప్పలు పెడుతున్నాడు. అదివరకోసారి చెప్తే కొట్టి పారేశారు - పోలీస్ స్టేషన్ లో."

    నరసింహం కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తరువాత ఏదో నిర్ణయించుకున్నట్లు తలూపుతూ "ఇదంతా ఎవడో కావాలని తమాషా చేస్తున్నాడులే ! నువ్వేం పట్టించుకోకు ! ఇద్దరికి ఒకే పోలికలుండటానికి ఇదేమైనా సినిమానా ?"

    మురళీకృష్ణ చిరాకు పడ్డాడు.

    "అబ్బా- నా మాట వినండి ! వాడు అచ్చం నాలాగానే ఉన్నాడనడానికి ఎన్నో ఋజువులు కనిపించాయ్. ఇదివరకయితే హోటల్లోనూ, బార్బర్ షాపులోనే వేషాలేశాడు. ఇప్పుడు ఏకంగా నా రాధకే ఎసరు పెడుతున్నాడు. ఫోన్లో ఏమన్నాడో తెలుసా ? చిన్నప్పుడు రాధ మెడలో వాడే తాళికట్టాడుట-నేను కాదట."

    నరసింహం లేచి మురళీకృష్ణ దగ్గరకొచ్చి ఆప్యాయంగా భుజం తట్టాడు.

    "వాడి విషయమేమిటో  నేను తేల్చుకుంటానులే ! నువ్వు గాభరాపడకు"

    కాని ఆ విషయం అంత సులభంగా తేలలేదు.


                         *    *    *


    రాధ పూర్తి అలంకారంతో వచ్చి సోఫాలో కూర్చుంది.

    "నిన్న మీరు ప్రెజెంట్ చేసిన ఈ నెక్లెస్ ఎంతో బాగుందంటున్నారు మా వాళ్ళంతా" అందామె కృష్ణతో.

    మురళీకృష్ణ ఉలిక్కిపడ్డాడు. నరసింహం ఆశ్చర్యంగా అతనివైపు చూశాడు.

    "నే...నే...ను ప్రెజెంట్ చేశానా ?"

    ఆమె సిగ్గుపడింది. "అప్పుడే మర్చిపోయారా ? నిన్న మనం మార్నింగ్ షో సినిమాకెళ్ళినప్పుడు ఇవ్వలేదూ ?"

    మురళీకృష్ణ మరింత ఖంగారుపడ్డాడు.

    "నిన్న మనం మార్నింగ్ షో కెళ్ళామా?"

    "బాగుండి ! అదికూడా గుర్తులేదన్నమాట ?"

    అంతా వింటున్న నరసింహానికేమీ పాలుపోవటంలేదు. మురళీకృష్ణ నిన్న పొద్దున్న ఇంట్లోనే వున్నాడు.

    ఇంతలో మురళీకృష్ణ ఒక్క ఉదుటున లేచి నిలబడ్డాడు.

    "రాధా ! ప్లీజ్ ! ఇలా రా" అంటూ ఆమెను పక్కగదిలోకి తీసుకెళ్ళాడు.

    రెండునిమిషాల తర్వాత పాలిపోయిన మొఖంతో తిరిగి వచ్చాడతను.

    "ఏమిటి కృష్ణా! ఆ పిల్ల అలా అంటుంది? నువ్వు నిన్న ఇంట్లోనే ఉన్నావుగా?"

    మురళీకి ఏడుపొక్కటే తరువాయి.

    "వాడెవడో నా కొంప ముంచుతున్నాడు మావయ్యా ! చెపుతోంటే నువ్వు కొట్టిపారేస్తున్నావన్నీ. ఇప్పుడు చూడు! రాధను మార్నింగ్ షో సినిమాకు తీసుకెళ్ళాడట. ఆ నెక్లెస్ ప్రెజెంట్ చేశాడట! ఇంకా ఘోరమయిన విషయం ఏమిటంటే...ఏమిటంటే...?"

    "ఏమిట్రా ? ఏం జరిగింది చెప్పు ?"

    "అబ్బా ! ఎలా చెప్పను ఏ అల్లుడూ మామకిలాంటి విషయాలు చెప్పే దుస్థితికి రాకూడదు. వాడు...వాడు...సినిమా మధ్యలో రాధ పెదాలమీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడట."

    నరసింహం మొహం కోపంతో ఎరుపెక్కి పోయింది.

    "అమ్మాయి వాడి చెంప పగలగొట్టాల్సింది" అన్నాడు మండిపడుతూ.

    "ఆ - అలాగే. ఇంతకు ముందోసారి నేనే వాడనుకుని నా చెంప పగలగొట్టింది. ఈసారి వాడే నేననుకుని ముద్దిచ్చింది. వాడో - నేనో ఏది ఎవరో, ఎవరికేదివ్వాలో తెలుసుకోవడానికి రాధేమయినా కంప్యూటరా ? మైగాడ్ ! ఇదంతా ఎక్కడకు దారి తీస్తుందో ?" అని తల పట్టుకుని బయటకు నడిచాడతను.

    నరసింహమేదో ఆలోచిస్తూ అలాగే చాలాసేపు వుండిపోయాడు.

    మనిషిలాంటి మనిషి వుండటం ఎలా సాధ్యం ? రాధనే మోసం చేశాడంటే వాడెవడో అచ్చుగుద్దినట్లు మురళీ పోలికలతోనే వుండి వుండాలి.

    చప్పున ఏదో ఆలోచన స్పురించినట్లయి నిటారుగా అయ్యాడు. మొట్టమొదటిసారి భయం వేసింది. పన్నెండేళ్ళ క్రితం సంఘటన గుర్తొచ్చింది.

    తను మోహన్రావ్ ని చంపుతుండగా, అతని కొడుకు చూడటం - తను వాడిని వెంబడిస్తే-వాడు కాలువలోకి దూకటం, తను పిస్టల్ పేల్చటం, నీళ్ళు ఎర్రబడటం అంతా స్వయంగా తన కళ్ళతో చూశాడే, ఆ కుర్రవాడు చచ్చిపోలేదా ?

 Previous Page Next Page