Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు  పేజి 26


    శారదకు స్పృహ తప్పుతున్నట్లనిపించింది, భర్తతో పాటు చిన్న కొడుకూ దూరమవటం ...

    "దుర్మార్గుడా ! ఇప్పుడే పోలీసుల్ని పిలుచుకొస్తాను." అంది దుఃఖం ఆపుకుంటూ.

    "నీ ఇష్టం ! మిగిలిన నీ రెండో కొడుకు కూడా నా చేతుల్లో చావాలనుకుంటే ఆ పని చెయ్ -" అన్నాడు నరసింహం తాపీగా.

    శారద నివ్వెరపోయింది. భయం మళ్ళీ శరీరమంతా పాకింది.

    "పోలీసులకు నేనే ఫోన్ చేశాను, ఇంకాసేపట్లో వస్తారు. నీ కొడుకు నా దగ్గిర క్షేమంగా పెరగాలనుకుంటే - మోహన్రావ్ ని చంపిన నేరం నీ మీద వేసుకో ! మోహన్రావ్ తాగి నిన్ను కొడుతూంటే - సహించక రూళ్ళకర్రతో నువ్వే అతని తలమీద కొట్టానని చెప్పు ! అలా చెప్పకపోతే నీ రెండో కొడుకు కూడా నీకు దక్కడు. ఆలోచించుకో. కనీసం ఒక వంశాంకురమైనా మిగలాలంటే నువ్వు ఈ నేరాన్ని నీ మీద వేసుకోవాలి." శారదకు మళ్ళీ స్పృహ తప్పింది.

    తిరిగి స్పృహలో కొచ్చేసరికి హాస్పిటల్లో ఉంది. ఎదురుగ్గా పోలీస్ ఇనస్పెక్టరు కూర్చుని ఉన్నాడు.

    "ఏం జరిగిందమ్మా ? మీ భర్తనెవరు చంపారు?"

    శారద కొద్ది క్షణాలు ఆలోచించింది. తను ఏమాత్రం నిజం చెప్పినా కొడుకు దక్కడు. దాని బదులు తనే జైలు కెళితే నరసింహం వాడిని జాగ్రత్తగా చూసుకుంటాడేమో ! చిన్న ఆశ ...మాతృప్రేమ పొంగి పొర్లింది. ఆమె చెప్పింది రాసుకుని చార్జెస్ ఆమె మీద ఫ్రేమ్ చేయటానికి ఇనస్పెక్టర్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి నరసింహం వచ్చాడు.

    "తెలివిగల పని చేశావు శారదా ! ఇంక నువ్వు నిశ్చింతగా ఉండు. నీ కొడుకు నా దగ్గర జమీందార్లా పెరుగుతాడు ! కానీ ఒక్క విషయం గుర్తుంచుకో ! జరిగిందంతా మనిద్దరి మధ్యే సమాధి అయిపోవాలి ! జైల్లో వున్నప్పుడు గానీ, బయటికొచ్చాక గానీ - నీ కొడుకు నా దగ్గరున్నాడన్న విషయం మర్చిపోవాలి ! నువ్వు నోరు జారిన మరుక్షణం కృష్ణ నా దగ్గర ప్రాణాలు వదులుతాడు."

    కోర్టులో ఎక్కువ రోజులు నిలబడే అవసరం లేకపోయిందామెకు.

    జైలు జీవితం ప్రారంభమైపోయింది.


                        *    *    *

    ఆలోచన్లనుంచి తేరుకున్నాడు నరసింహం.

    తల విదిలించాడు.

    ఆ రోజు శారదమ్మ జైలుకి వెళ్ళగానే మురళీని తన్ని తగలేశాడు. జైల్లోకి వెళ్ళిన శారదమ్మకి తన కొడుకు విషయం భవిష్యత్తులో ముందు ముందు ఏమీ తెలీదనీ, అందువల్ల ఆ కురాడిని పెంచే బాధ్యత అవసరం తనకు లేవనీ అతడు భావించాడు. కానీ మురళి ఎంగిలాకుల్లో తింటూ హాస్టల్ లో వుండి చదువుకోగలిగే స్థితికి వస్తాడని భావించలేదు.

    అంత కష్టపడి పైకొచ్చాడంటే - స్వతహాగా మంచి కుర్రవాడేనన్నమాట - ఇది మొదటి విషయం.

    మురళి తన తల్లిని కలుసుకోలేదు. కలుసుకోనంత కాలం తనకి ఫర్వాలేదు. శారదమ్మ ఎక్కడుందో తనకి తెలీదు. శారదమ్మ భర్తనీ, చిన్న కొడుకునీ తను చంపిన విషయం శాశ్వతంగా కప్పబడి పోవాలంటే శారదమ్మని అంతం చేయాలి. ఆ లోపులో ఆమె మురళిని కలుసుకుని జరిగినదంతా చెప్పకూడదు. అలా చేస్తే తనకి మరో శత్రువు ఎక్కువ అవుతాడు. అప్పుడు మురళిని కూడా అడ్డుతొలగించుకోవలసి వస్తుంది. ఇది రెండో విషయం.

    అన్నిటికన్నా ముఖ్యమైనదీ, మూడో విషయమూ - రాధ !!!

    తన కూతురు చాలా సెంటిమెంటల్. ఇంతకాలం పెళ్ళి చేసుకోనంటూ భీష్మించుకు కూర్చుని వుంది. అదృష్టవశాత్తు మురళి తిరిగి తారసపడ్డాడు.  ఇప్పుడు తను ఈ పెళ్ళి కాదంటే పూర్తిగా మొదటికే మోసం వచ్చి, తన కూతురు తనకి దక్కకపోవచ్చు.

    ఇవన్నీ ఆలోచిస్తే ఈ పెళ్ళి జరగటమే మంచిదనిపిస్తుంది. అప్పుడు తన అల్లుడు - ఆ శారదమ్మ కొడుకు తన కళ్ళముందే వుంటాడు. ఏనాటికో ఒకనాటికి శారదమ్మ బయటపడకపోదు. అప్పటికి ఆవిడ కొడుకు తన అల్లుడిగా మంచి పొజిషన్ లో వుంటాడు కాబట్టి-ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని తవ్వి తియ్యాలని చూస్తే- అప్పుడే ఆవిడ సంగతి చూసుకోవచ్చు.

    ఇదంతా ఆలోచించి నరసింహం మురళి రాధల వివాహానికి వప్పుకున్నాడు.


                                10


    రామలింగం, నరసింహం, మురళీ సోఫాలో కూర్చున్నారు. మధ్యలో టీపాయ్ మీద నిశ్చయతాంబూలాలున్నాయి. "ఒకసారి అయిన పెళ్ళికి మళ్ళీ తాంబూలాలేమిటి" అని నరసింహం అంటూండగా ఫోన్ మోగింది మురళి ఫోన్ ఎత్తి "హలో" అన్నాడు.

    "గుడ్ ! పెళ్ళి సెటిల్ అయిందనుకుంటాను." అట్నుంచి వినపడింది. మురళి మొహం చిట్లించి "ఎవర్నువ్వు" అని అడిగాడు.

    "కృష్ణని... ఇంకా వివరంగా చెప్పాలంటే పదేళ్ళక్రితం రాధ మెడలో సూత్రం కట్టిన వాడిని."

    మురళి చేతిలోంచి రిసీవర్ అప్రయత్నంగా జారి పడింది. అంతా చూస్తున్న నరసింహం చప్పున దాన్ని అందుకుని "హలో" అన్నాడు.

    "నువ్వు లైన్లో కొచ్చావన్నమాట ! గుడ్... నరసింహం ! జాగ్రత్తగా విను... నువ్వు బాగానే పథకం వేశావు గానీ- ఇప్పుడు నేను రంగంలోకి దిగుతున్నాను నీ పాపం బ్రద్దలు చేస్తాను."

    "ఎవర్నువ్వు" కోపంగా అరిచాడు నరసింహం.       

 Previous Page Next Page