Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 27

 

    ఏ విధంగా మయూరను కాల్చుకు తినాలన్నదే వేణు ఏకైక ధ్యేయం అయిపొయింది . వేణు ఎన్ని విధాలుగా ఎంత అభ్యంతరం చెప్పినా మయూర యతికి కావలసినవి చూడటం మానటం లేదు. ఈ మౌన తిరస్కారానికి మండిపడి పోతున్నాడు వేణు. ఆ రోజు మయూర చాలా శ్రద్దగా వంట చెయ్యటం గమనించాడు వేణు. ఆరోజే యతి గ్రామం నుంచి తిరిగి వస్తాడని స్పురించింది. మనసులో కసి చెలరేగింది. నలుగురు స్నేహితుల్ని తీసుకొచ్చి ఇంట్లోనే తాగేసాడు. నలుగురుతో కలిసి భోజనం చేసి పాత్రలన్నీ ఖాళీ చేసేసాడు. వాళ్ళ ముందే, మయూర పైన పెత్తనం చెలాయిస్తూ అదీ, ఇదీ అందియ్యమని అరిచాడు. మయూర ఆ అరుపులు వినిపించుకోలేదు. తాగిన మైకంలో వేణులోని పశువు విజ్రుంభిస్తున్నాడు. అంత రాత్రి వేళ అప్పుడు వంట ప్రయత్నం చేస్తున్న మయూరను చూస్తుంటే ఆ పశువు వేణు మనసును కొమ్ములతో కుమ్ముతూ విజ్రుంభిస్తోంది.
    "మాట్లాడవేం? ఎందుకిప్పుడు వంట? వంట చెయ్యటానికి వీలేదు -" మయూర చేతుల్లోంచి గిన్నెలు లాగేసుకుని మయూరను వంగదీసి గుద్దసాగాడు. ఆ సమయంలో వచ్చిన యతి "రాస్కెల్" అంటూ వేణు మీద పడ్డాడు. తాగి తూలుతున్న వేణు ఒక్క దెబ్బకే కిందపడ్డాడు.
    "ఎవడ్రా రాస్కెల్! నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటాను. నీ కెందుకురా!" అని అరుస్తున్నాడు వేణు.
    "నీ పెళ్ళాం! పెళ్ళామయినంత మాత్రాన యిష్టం వచ్చినట్లు బాదవచ్చని ఎక్కడ లేదు. పెళ్ళాం అంటే బానిస కాదు. మరొక్కసారి చెయ్యేత్తావా, జాగ్రత్త!" హుంకరించాడు యతి. వేణులో మొండితనం పెరిగింది.
    "ఏం చేస్తావు? ఏం చేస్తావురా చంపుతా! దాన్ని చంపుతా! నీ కళ్ళముందే చంపుతా! నా పెళ్ళాం! తాళికట్టిన  పెళ్ళాం! .....తాళి.....తాళి కట్టాను."
    ఏడుస్తూ నవ్వుతూ అంటూ మళ్ళీ మయూర మీదకు ఎగబడబోయాడు వేణు. యతి అడ్డుపడి మయూర చెయ్యి పట్టుకుని "మయూరా! ఈ నరకంలో ఒక్కక్షణం ఉండటానికి వీల్లేదు. నాతొరా!" అన్నాడు. మయూర నెమ్మదిగా చెయ్యి విడిపించుకుంది.
    "ఈయన దిగులుతో అత్తయ్యగారూ ఆస్పత్రి పాలయ్యారు. మావయ్యగారూ ఆ బెంగతో స్థిమితం లేకుండా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నేను నీతో రాలేను" అంది.
    నివ్వెరపోయాడు - యతి. తన అనాలోచిత ప్రవర్తనకు చాలా బాధపడ్డాడు. తనను కన్నబిడ్డలా ఆడుకున్న ప్రభాకర్ గారికి తాను చేసే ప్రత్యుపకారం ఇదా? అనుకుని చాలా సిగ్గుపడ్డాడు. కాని తన కర్తవ్యం ఏమిటి? తన కళ్ళ ఎదుట మయూర అనుభవిస్తున్న క్షోభను చూస్తూ ఇక్కడ వుండవలసిందేనా? మయూరతో చెప్పి వెళ్ళిపోవటానికే నిశ్చయించుకున్నాడు. అలసటగా మంచం మీద పడుకున్న అతనికి వెంటనే నిద్ర వచ్చేసింది. ఒకరాత్రి వేళ ఎవరో లేపినట్లయి మెలకువ వచ్చింది. మంచం పక్కనే నిలబడి వుంది మయూర. గాభరాగా లేచి కూర్చుని "ఏమిటి" అన్నాడు. మయూర నవ్వి "అంత గాభరా దేనికి? అన్నం తినకుండా పడుకున్నావు. లేచి అన్నం తిని పడుకో!" అంది. అప్పుడొక్కసారి జరిగినదంతా గుర్తుకొచ్చింది యతికి. అంత జరిగిన తరువాత ఆ రాత్రి వేళ మళ్ళీ వండిందా తన కోసం!
    "నేను అన్నం తినను. నేనసలు ఇక్కడ వుండను" అన్నాడు. నిజంగానే వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడని వణికినట్లయి నిలబడలేక వంగి , మంచాన్ని గట్టిగా పట్టుకుంది మయూర. "ఏమిటి? ఏమిటి?" అన్నాడు యతి. మయూర సమాధానం చెప్పలేదు. కొంతసేపటికి స్థిమిత పడింది.
    "నువ్వు ముందు లేచి అన్నానికి రా! అన్నం తిన్నాక మాట్లాడుదువు గాని, ఎక్కువ సేపు నిలబడ లేక పోతున్నాను" అంది.
    "అదేం ? నీకు వంట్లో------"
    "ఇప్పుడు కొత్తగా వంట్లో ఏం లేదు- ఇంచుమించు ఏడాదికి పైగా బ్రతికి కూడా చచ్చిన దానిలా మంచంలో పడుకొని వున్నాను. కోలుకోవద్డా?"
    "ఎప్పుడు? ఏమిటి?" అని అడగలేదు. యతి మయూరను ఇంకా కష్టపెట్టలేక అన్నానికి వచ్చాడు. నిజానికి అతడికి తినాలని లేదు. కాని తిననంటే మయూర భరించలేదని అతనికి తెలుసు.
    అతనికి అన్నం వడ్డిస్తూ మయూర చెప్పటం ప్రారంభించింది.
    "ఆ రోజుల్లో నాకసలు ఏమి తెలిసేది కాదు అసలు మనసు పనిచేస్తున్నట్లే వుండేది కాదు. కానీ, ఆ సమయంలో కూడా ఏదో ఒక అభిమాన పూరితమైన స్పర్శ నాకు తెలిసేది. ఆ జడ స్థితిలో నుండి నేను మనిషిగా బయటపడ్డా నంటే అదంతా మామయ్యగారి చలవే!"
    యతి తింటున్నాడు. మాట్లాడలేదు.
    "యతీ! ఇప్పుడు నా మనసుకి బాధలేదని , చాలా సుఖంగా వున్నాననీ చెప్పలేను. కానీ చిత్రంగా జీవితంలో అతి చిన్న దశలోనే నేను ఎన్నో అనుభవించేసాను చిన్నప్పుడు సుఖం అనుభవించేననే అనుకున్నాను. కానీ నిజానికి అది అజ్ఞానం. ఆనాడు నాకు సుఖానికీ, దుఃఖానికీ తేడా తెలియదు. నేను కోరింది దొరుకుతుంది. అదే సుఖమనుకున్నాను. ఆ తరువాత దుఃఖం . నిజమైన దుఃఖం . తీవ్రమైన దుఃఖం . నీదైన సంపద. నువ్వు అపురూపంగా దాచుకొన్న సంపద. నీ ఆత్మలో ఒక భాగమైన సంపద - బలాత్కారంగా దోచుకున్నప్పుడు కలిగే దుఃఖాన్ని అనుభవించాను. ఆ తరువాత నా జీవితం .......యతి! నా శత్రువుకైనా ఆ స్థితి వద్దు. పశువులైనా అలా బ్రతకటానికి ఇష్టపడవేమో! మందులతో, సూదులతో బలవంతానా ఆహారం ఎక్కించి ప్రాణం నిలపటం ప్రాణం నిలపటమే తప్ప మరో శక్తి లేకపోవటం. మనసుకి ఆలోచించే శక్తి లేకపోవటం. అదంతా లీలగా లోపల పోరలకి తెలుస్తూ ఉండటం - ఏదో చెయ్యాలనే తపన. లేవలేని బల హీనత - ఏవేవో ఆలోచనలు రావటం - ఏ ఆలోచనలోనూ మనసు ప్రసరించక పోవటం - ఇదంతా ఎంత నరకమో! అనుభవించిన నేను తప్ప ఎవరూ ఊహించలేరు. ఆ దశ తరువాత ఇప్పుడు ఈ బాధ ఎంత సుఖంగా వుందో నేను చెప్పలేను. అవును! నేను బాధపడుతున్నాను. కానీ బ్రతుకుతున్నాను."
    వినలేకపోయాడు యతి. ఆ స్థితిలోనే మయూర ఉండాలనుకోవటం అసలు సహించలేక పోయాడు.
    "ఎందుకు సహించాలి నువ్వింత బాధ! ఎందుకీ రంపపు కోత నీకు?" అన్నాడు ఉద్రేకంగా. మయూర మెత్తగా నవ్వింది.
    "ఈ జీవిత ప్రవాహం వెంటపడి కొట్టుకుపోయే వారికే బాధా వుండదు. ఒక ధ్యేయంతో ప్రవాహానికి ఎదురీదే వాళ్ళకే బాధలన్నీ. కానే అది వాళ్ళకు బాధగా వుండదు. ఒక విషయం చెప్పు. ఉరి తీయబడటం తక్కువ బాధా? కోరి కోరి ఆ బాధను భరించటంలో పులిగారు పొందిన అనందం ఏమిటి? ఎప్పటికప్పుడు పోలీసులను ఎదుర్కోవడం , బడి ముసుగులో సమావేశాలకు అవకాశం కల్పించే లలితగారు పొందుతున్న బాధలలోని అనందం ఎలాంటిది?
    యతి తెల్లబోయాడు అతనికి సమాధానం తోచలేదు. గొణుగు తున్నట్లు "అదీ ఇదీ ఒకటేలా అవుతుందీ" అన్నాడు.
    "కాదనీ నువ్వనుకుంటున్నావు. ఒక ధర్మానికీ, ఒక ఆశయానికి మధ్య సంఘర్షణను ఎదుర్కొంటున్నాను . నేను అత్తయ్య, మావయ్యలకు బాధ కలిగించ లేను. నీకు కావలసినవి అందిస్తూ పొందగలిగే ఈ కొద్దిపాటి ఆనందాన్ని వదులుకోలేను. ఇందులో అధర్మం ఏమి లేదని నా అంతరాత్మకు తెలుసు గనుక...."

 Previous Page Next Page