Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 27


    భాస్కర్ చీదరించుకుని "నన్నడుగుతావేం! మీ అమ్మగారి నడుగు." అన్నాడు.
    సుబ్బలక్ష్మి అందరిళ్ళలో సమాచారాలు చిలవలు పలవలతో తన చవటి ధోరణిలో సుశీలకు చెపుతూ ఉంటుంది. సుశీల ఆశక్తితో మధ్య మధ్య ప్రశ్నలు వేస్తూ వింటూ ఉంటుంది. ఇదొక మంచి కాలక్షేపం అయింది తనకి. ఈ చనువులో సుబ్బలక్ష్మి అప్పుడప్పుడు సుశీలని చిల్లర డబ్బులు అడిగి తీసుకుంటూ ఉంటుంది. ఇదంతా గమనించినా, సుశీలకి అంతకంటె కాలక్షేపమేముందని ఊరుకుంటున్నాడు భాస్కర్.   
    సుబ్బలక్ష్మి వెకిలిగా నవ్వుతూ "అహఁ! అమ్మగారి నడగటానికి వీల్లేదు. అమ్మగారు లేకుండా చూసి మిమ్మల్ని అడగమన్నారు, జ్యోత్స్న గారు" అంది.
    ఉలికి పడ్డాడు భాస్కర్.
    "జ్యోత్స్న అడగమందా? డబ్బు ఎలా అడగాలో నీకు సలహాలిస్తోందా, జ్యోత్స్న?"
    "నాకు కాదండీ! ఆవిడకే కావాలి! పాపం, పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బు లేదుట! ఉద్యోగం పోయిందిగా? చాలా అవస్థ పడుతోంది."
    జ్యోత్స్న ఉద్యోగం పోయిన సంగతి భాస్కర్ కి తెలిసింది. అందుకు కారణమూ తెలిసింది.
    "నిజం చెప్పు! నన్నడిగి నిన్ను డబ్బు తెమ్మందా, జ్యోత్స్న?"
    "అలా అనలేదనుకోండి! నన్నే అడగమన్నారు! నేనే తీసుకుంటాను. నేనే తీరుస్తాను. అడుగుతున్నది మాత్రం జ్యోత్స్నగారి కోసం...."      
    అదొకలా నవ్వుతూ అంది సుబ్బలక్ష్మి. ఆ నవ్వు చూసేసరికి మండిపోయింది భాస్కర్ కి.
    "జ్యోత్స్న కోసమంటే అసలియ్యను నేను. ఆవిడకు సహాయం చేసేవాళ్ళు చాలామంది వున్నారు. నేను సహాయం చెయ్యక్కర్లేదు.
    తెల్లబోయి చూసింది సుబ్బలక్ష్మి. అప్పటివరకూ ఆవిడ జ్యోత్స్న కోసం అంటే భాస్కర్ తప్పకుండా ఇస్తాడనే నమ్మకంతో ఉంది.  
    సుబ్బలక్ష్మి ఆశ్చర్యం చూసి లోలోపల నవ్వుకున్నాడు భాస్కర్. అంతటితో ఊరుకోలేదు. "ఇప్పుడే హెచ్చరిస్తున్నాను. ఇకముందు ఇలాంటి వెధవ్వేషాలు వేశావంటే మీ అమ్మగారితో చెప్పి బుద్ధి చెప్పిస్తాను" అన్నాడు.    
    సుబ్బలక్ష్మి హడిలిపోయింది. సుశీల నోరంటే సుబ్బలక్ష్మికి చాలా భయం. సుబ్బలక్ష్మి ఊరికే ఇక్కడి మాటలక్కడా, అక్కడి మాటలిక్కడా జేరేస్తుందే కాని, ముఖాముఖి నిలబడి బాహాటంగా పోట్లాడలేదు.   
    గడగడలాడుతూ రెండు చేతులూ జోడించి "నన్ను క్షమించండి. ఈ సంగతి అమ్మగారితో చెప్పకండి" అంది.
    "నువ్వు నోరు మూసుకుంటే నీ సంగతి బయటికిరాదు. నువ్వు ఎవరి దగ్గిర ఏం వాగినా, తప్పకుండా మీ అమ్మగారికి తెలిసిపోతుంది. ఆ తరువాత నీ బుర్ర రామకీర్తన పాడుతోంది మీ అమ్మగారు."    
    "అహ? నేను ఎవ్వరిదగ్గిరా ఏం వాగను. ఒట్టు!" అని భాస్కర్ చేతిలో చెయ్యి వెయ్యబోయింది సుబ్బలక్ష్మి. భాస్కర్ ఉరిమి చూసేసరికి చెయ్యి వెనక్కు తీసుకుంది.     
    జ్యోత్స్న  దగ్గరికి వచ్చి ఏడుస్తూ "భాస్కర్ గారు డబ్బు ఇయ్యలేదమ్మా!" అంది.
    "ఇయ్యలేదా?" హతాశురాలై అడిగింది జ్యోత్స్న.
    "ఇయ్యలేదు. పైగా నానా మాటలూ అన్నారు. 'ఆవిడ కేం? నానా తిరుగుళ్ళూ తిరుగుతుంది. డబ్బుకి తక్కువా?' అన్నారు."
    "నిజమా?"
    "నిజం! ఇంకా వాగావంటే మీ అమ్మగారికి చెప్పి బుద్ధి చెప్పిస్తాను అన్నారు - అమ్మో! ఆ సుశీలమ్మకి తిక్క రేగిందంటే ఇంకేమైనా ఉందా? ఈ నాలుగు వాటాలకీ ఒక్కసారి నిప్పు పెట్టేస్తుంది."  
    జ్యోత్స్న మాట్లాడలేదు. కానీ పాలిపోయిన జ్యోత్స్న ముఖం చూస్తోంటే సుబ్బలక్ష్మికి జాలివేసింది.
    "మీరిలా ఊరుకోకండమ్మా! మాజీ తహసీల్దారుగారిని అడగండి. పోనీ, మచ్చల డాక్టర్ ని అడగండి. ఎవరైనా మీరు అడిగినదానికి రెట్టింపు ఇస్తారు. అప్పుడు కాని, ఈ భాస్కర్ గారికి బుద్ధిరాదు" అని సలహా కూడా చెప్పింది.  
    "ఛీ!" అని లేచిపోయింది జ్యోత్స్న.
    పరీక్షకి కూచోలేనేమో ననే దిగులు క్రుంగదీస్తోంది జ్యోత్స్నని. పుస్తకాలు తీసి చదవటానికి కూడా మనస్కరించటం లేదు. ఈ పరిస్థితుల్లో జ్యోత్స్నకి ఒక ఉత్తరం వచ్చింది.
    తనకు ఉత్తరం వ్రాసేవాళ్ళెవరా అని ఆశ్చర్యపోతూ ఉత్తరం విప్పింది. కవరులోంచి ఒక రసీదు జారిపడింది. అది తీసి చూసింది జ్యోత్స్న. పరీక్షఫీజు కట్టిన రసీదు. ఉత్తరం భాస్కర్ రాశాడు.      
    "జ్యోత్స్న మై డియరెస్ట్!
    మళ్ళీ ఉద్యోగం పోగొట్టుకున్నావా? పూర్ డియర్! ఇలాంటి నిన్ను ఆడిపోసుకుంటోంది లోకం!
    పరీక్ష ఫీజ్ కట్టేసి రసీదు పంపిస్తున్నాను. బాగా చదివి పరీక్షలు బాగా రాసిన శుభవార్త నాకు తెలియజెయ్యి. చూడు, నాకు థాంక్స్ చెప్పటానికి ప్రయత్నించకు.... ఇన్నాళ్ళకి ఈ మాత్రంగా నీకు సహాయపడగలిగినందుకు ఎంత ఆనందంగా వుందో నీకెలా తెలుస్తుందీ? ఈ ఆనందంలో నేను అనుభవిస్తోన్న అపూర్వమయిన హాయిని అప్పు తీర్చేసి నాశనం చెయ్యకు. అయినా నాకీ మాత్రం ఋణపడిఉంటే నీకు వచ్చిన నష్టమేమిటి? నాకు ఋణపడి ఉన్నాననే అనుకుంటున్నావా? నా దగ్గిర ఏది తీసుకోవటానికైనా నీ కధికారముందని నమ్మలేవా?

 Previous Page Next Page