Previous Page Next Page 
13... 14.... 15 పేజి 27


                          అయిదో అధ్యాయం


    లక్ష్మి మొహం తెల్లగా రక్తం పాలిపోయినట్టువుంది. ఆమె చేతిలో వుత్తరం వణుకుతోంది. ఆ రోజే పోస్టులో వచ్చిందది. అందులో ఇలా వుంది...

    "తిండి, బట్ట, ఇల్లు, సంసారం, సమాజంలో స్థానం భర్త ఇస్తాడు. సుఖం మాత్రం ప్రియుడు ఇస్తాడు. నీ స్నేహితుడి గురించి ఆలోచనలు మానెయ్యక పోయినా, అర్థరాత్రిళ్ళు అతడికి ఫోన్ చేసి పిలిపించుకున్నా....నీ జీవితం నాశనం అయిపోతుంది జాగ్రత్త."

    పర్వత శిఖరం విరిగిపోయి నిలువునా సమాధి చేసిన అనుభూతి. వళ్ళంతా చెమటలు....ఆమె ఆ వుత్తరం చూసి ఎంతగా బెదిరిపోయిందంటే దాదాపు పావుగంట వరకూ కాళ్ళూ చేతులూ ఆడలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. ఇదంతా తన భర్తకి తెలిసినట్టు.....అతడు తనని నిలదీసి అడిగినట్టు, అబద్ధం చెప్పలేక తను నిజం ఒప్పుకున్నట్టు.....అతడు  తనకి విడాకులు ఇచ్చినట్టు.....సమాజమంతా తనని వేలెత్తి చూపుతున్నట్టు.....తను ఆత్మహత్య చేసుకున్నట్టు..

    ....క్షణంలో ఇవన్నీ వూహించుకుంది. ఎవరు వ్రాసివుంటారిది? ప్రహసిత్ అర్థరాత్రి తనింటికి వచ్చాడన్న విషయం ఎవరికీ తెలిసి వుంటుంది? ప్రహిసిత్ ఎవరికయినా చెప్పి వుంటాడా?

    ఆ ఆలోచన రాగానే వణికిపోయింది. పొరపాటున నోరు జారాడా? అలా అనుకోగానే ఆ విషయం తెలుసునేవరకూ మనసాగలేదు. ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ ఎత్తి మళ్ళీ ఆగిపోయింది.

    తమ టెలిఫోన్ ఎవరైనా 'టాప్' చేసారేమో!

    ఈ ఆలోచన  ఆమెకి మరింత భయం కలిగించింది. తలుపు తాళం వేసి పక్క విధిలో వున్న టెలిఫోన్ బూత్ కి వెళ్ళి అక్కడనుంచి ప్రహసిత్ ఫోన్ చేసింది.

    ఆమె దగ్గిరనుంచి రెండోసారి టెలిఫోన్ వస్తుందని వూహించని ప్రహసిత్ కంగారుపడ్డాడు. "ఏమిటి విషయం?" అని అడిగాడు.

    "నేను అర్జెంటుగా మిమ్మల్ని కలుసుకోవాలి."

    "ఏమిటి? ఎనీ  ప్రాబ్లెమ్?"

    "ఫోన్ లో చెప్పలేను. వెంటనే కలుసుకోవాలి" అంటూ తనెక్కడుందో చెప్పి అతడింకేదో అడగబోతూంటే ఫోన్ పెట్టేసింది.

    ప్రహసిత్ కంగారుపడ్డాడు. ఆమెకు కూడా అలాటి వుత్తరం వచ్చిన సంగతి తెలీదు. తనకు వచ్చిన వుత్తరం సంగతి ఆమెకి తెలిస్తే బెదిరిపోతుందని భయపడ్డాడు. అందుకే ఇంతకాలం ఆ వుత్తరం సంగతి చెప్పలేదు. ఇంతకీ ఆ వుత్తరం ఎవరూ వ్రాసారో తెలీదు. చుట్టూపక్కల వాళ్ళు ఎవరయినా వ్రాసారేమో అనుకున్నాడు. ఈసారి ఆమెని ఇలాటి ఇబ్బందిలో పడేయటం ఇష్టంలేకపోయింది. అందుకే తన కారులో వెళ్ళకుండా అదే దార్లో వున్న మరో స్నేహితుడి ఇంటి దగ్గిర తన కారు వదిలేసి, అతడి కారులో బయల్దేరారు. కిటికీలకి నల్లగ్లాసులున్నాయి.

    టెలిఫోన్ బూత్ దగ్గిర ఆమె ఎదురుచూస్తోంది. వెళ్ళి పక్కగా ఆపాడు. ఆమె కూర్చున్నాక కారు వేగంగా పోనిచ్చాడు. వెనుక పోనిచ్చాడు. వెనుక తనని ఎవరూ ఫాలో అవటం లేదని నిశ్చయించుకున్నాడు.

    ఊరి పొలిమేరలు దాటేవరకూ ఏమీ మాట్లాడలేదు. ఆమెని చూస్తూంటే ఏక్షణమైనా  బరస్ట్ అయ్యేట్టు వుంది. ఆమె కాస్త మానసికంగా సర్దుకునే వరకూ ఆగటం మంచిదనిపించింది. ఊరిచివర 'డాబా' లాటి రెస్టారెంట్ ఉంది. ఆ కాంపౌండ్ లో కారు ఆపాడు. అప్పుడు కూడా తమనెవరూ ఫాలో అవటం లేదని నిశ్చయించుకున్నాడు. రెస్టారెంట్ నిర్మానుష్యంగా వుంది. వెయిటర్ వచ్చాక 'రెండు ఐస్ క్రీం' అన్నాడు.

    "నాకేమీ వద్దు" అంది లక్ష్మి

    "ఫర్వాలేదు" అని, వెయిటర్ వెళ్ళిపోయాక ఆమెవైపు తిరిగి, "ఇప్పుడు చెప్పండి. ఏమిటంత అర్జెంటుగా రమ్మన్నారు?" అని అడిగాడు. ఆమె మౌనంగా, తన చేతిలోని వుత్తరాన్ని అతని ముందుకు జరిపింది.

    అది చదువుతూండగానే అతని మొహంలో రంగులు మారేయి. తన భావాలు బయటకు కనిపిస్తే ఆమె మరింత బెదిరిపోతుందని "మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరో చూసివుంటారు. వాళ్ళే వ్రాసి వుంటారు. ఇలాటి సాడిస్టులు వుండటం చాలా సహజం" అన్నాడు.

    వెయిటర్ ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టాడు. "తీసుకోండి" అన్నాడు ప్రహసిత్.

    "వద్దు" అన్నట్టు తల అడ్డంగా ఆడించింది. ప్రహసిత్ ఆమె వైపు సానుభూతిగా చూసాడు, ముందుకు వంగి,  "చూడండీ....." అన్నాడు. "మనం మన మనసుకి సాక్షి! అంతేకాని ఎవరేమనుకుంటారు అని భయపడకూడదు. మిమ్మల్ని చూసి ఓర్వలేని వారెవరో ఈ వుత్తరం వ్రాసి వుంటారు. అంతకన్నా దీనివల్ల వచ్చే ప్రమాదం ఏమీ వుండదు. అనవసరంగా మనసు పాడుచేసుకోకండి" అని ధైర్యం చెప్పటానికి ప్రయత్నించాడు. పైకి అలా అన్నాడేకానీ, ఆమె భయాన్ని అర్థం చేసుకోలేనంత అనుభావరహితుడు కాదు అతడు. అలాటి వుత్తరమొక్కటి ఆమె  భర్తకి చేరితే దాని పరిణామం ఎలా వుంటుందో వూహించగలడు. అదంతా సరే. ఆమె సంగతే అర్థం కావటం లేదు. ఏమీ మాట్లాడటం లేదు. మూర్తీభవించిన ఇంట్రావర్ట్ లా వుంది. ముకుళించుకుపోయి కూర్కొనివుంది. ఇలాటి ఇంట్రావర్ట్  లతో దేన్నైనా చర్చించటం కష్టమే. తమ  అభిప్రాయాలు అసలు చెప్పరు. మనసులో ఏమీ ఆలోచిస్తున్నారో అసలు వెల్లడి చేయరు.

    వెయిటర్ బిల్ తీసుకువచ్చి పెట్టాడు. దాన్ని 'పే' చేసి, వచ్చి కారులో కూర్చున్నారు. ఇప్పుడు విషయం తెలిసింది కాబట్టి ఈసారి మరింత జాగ్రత్తగా తమనెవరాయినా పరిశీలిస్తున్నారెమోనని గమనించాడు.

    ఎవరూ లేరు.

    తన భయానికి తనకే నవ్వొచ్చింది. అప్పుడంటే అర్థరాత్రి. ఆమె భర్త లేనప్పుడు తనువెళ్ళటం ఎవరో చూసి వుంటారు. ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది?

    ఊళ్ళోకి వెళ్ళాక "ఎక్కడ దింపను?" అని అడిగాడు.

    "ఇక్కడ దిగిపోతాను" అంది. అతడు కారు పక్కకి తీసి ఆపుచేసాడు. ఆమె కారు దిగుతూండగా చుట్టూ చూసాడు.

    అంతా హడావుడిగా ఎవరి పనుల్లో వారున్నారు.


                                   2

    అక్కణ్ణుంచి ఆమె ఆటోలో ఇంటికి వెళ్ళేసరికి అక్కడ మధూహ ఎదురు చూస్తోంది. "ఇల్లు తాళం వేసి వుండేసరికి ఇప్పుడే వెళ్ళిపోదామనుకుంటున్నాను" అంది.

    లక్ష్మికి తన స్నేహితురాల్ని చూడగానే ఎందుకో చాలా రిలీఫ్ గా అనిపించింది. ఆమె చాలా వరకూ గుంభనంగా వుంటుంది. కానీ ప్రస్తుతం ఆమె చాలా  విపరీతమైన మానసిక వత్తిడిలో వుంది.తనకీ, భర్తకీ వున్న 'దూరం' గురించి కూడా చెప్పకుండా ఆపుకోలేని స్థితిలో వుంది.

    మధూహ చేతిలో ఆకాశరామన్న వుత్తరం పెట్టి మొత్తం జరిగినదంతా చెప్పింది. అందులో సగం మధూహకి తెలిసిందే. అయినా తెలియనట్టే విన్నది. ప్రహసిత్ కూడా అలాటి వుత్తరం ఒకటి వచ్చిందని చెప్పలేదు లక్ష్మికి. ఆ వుత్తరాన్నే చూస్తూ వుండిపోయింది.

    రెండు చేతివ్రాతలూ ఒక్కటే!

    కానీ......కానీ...

    ఆ చేతివ్రాత ఎక్కడో చూసింది! ఎక్కడ? అదే అంతు పట్టటం లేదు. తనకీ.....లక్ష్మికి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అని ఆలోచించింది. ఇంత పని గట్టుకుని ఎవరు వ్రాస్తారు?

    లక్ష్మి మాత్రం తనకీ తన భర్తకీ మధ్య జరిగిన కథంతా ఇంకా చెపుతూనే వుంది. దానికన్నా మధూహ ఆలోచన వేరే చోట వుంది. ఈవ్రాత తను ఎక్కడ చూసింది? తనకు తెలిసిన వాళ్ళలో ఇంత రాక్షస మనస్తత్వం వున్న వాళ్ళు ఎవరు? ఏమి ఆశించి ఈ వుత్తరం వ్రాసారు? లక్ష్మినుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? లేదా లక్ష్మి శ్రేయోభిలాషులా?

    ఈలోపులో లక్ష్మి అడిగింది. "నన్నేం చేయమంటావు చెప్పు?"

    ఆలోచన్లలో వుండి మధూహ సరిగ్గా వినిపించుకోలేదు. లక్ష్మి అదే ప్రశ్న రెట్టించి, "ఏం చెయ్యాలో అర్థం కావటంలేదు. సుఖంగా వుండేదాన్ని అనవసరంగా ఇందులో ఇరుక్కుపోయాను" అంది.

    మధూహకి ఒళ్ళుమండింది. "సుఖంగా వున్నావా? ఆ విషయం గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పు" అంది.

    ఈ సారి బిత్తరపోవటం లక్ష్మి వంతయింది. మధూహ అదే ఆవేశంతో అన్నది....."అవును. ఇంతకాలం నీది విష్ణుదీ ఆదర్శమైన దాంపత్యమని, వేళ్ళమీద లెక్కపెట్టదగ్గ సుఖమైన సంసారాల్లో ఒకటనీ అనుకున్నాను! కానీ ఇప్పుడు నువ్వు చెపుతున్నది వింటూంటే, ఈ ప్రపంచంలో చాలామందిలాగే నువ్వుకూడా లోపల ఎన్ని స్పర్థలున్నా పైకి  సంతోషంగా కనపడే దంపతుల్లాగే ప్రాజెక్టు చేయటానికి తాపత్రయపడుతున్నావని అర్థమైంది."

    లక్ష్మి కొద్దిసేపు మౌనంగావుండి నెమ్మదిగా అంది..... "మరేం చెయ్యమంటావు? మేము సుఖంగా లేము అని అందరితో చెప్పుకొమంటావా?"

    "అవసరం లేదు. కానీ ఇందులో నీ తప్పేమీ లేదని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావే అదీ తప్పు! నువ్వూ అర్థరాత్రి ప్రహసిత్ కి ఎందుకు ఫోన్ చేసావ్? అంటే నీలోనే అంతర్గతంగా ఆ కోరిక వున్నదన్నమాట....."

    లక్ష్మిదెబ్బతిన్న లేడిలా చూసింది. అప్రయత్నంగానే ఆమె కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి. వణుకుతూన్న కంఠంతో, "నా మంగళసూత్రం మీద ఒట్టేసి చెపుతున్నాను. నాకు అటువంటి కోరికేమీ లేదు" అంది.

    "లేకపోవచ్చు. లేదా......అలాటి కోరికవున్నా, తరతరాలుగా నీ నరనరాల్లో జీర్ణమైపోయిన సంస్కృతి నిన్ను నైతికమైన బంధాల్తో కట్టి పడివేసి వుండవచ్చు.....ఈ కోరిక అనేది ఎంత 'జాణ' అంటే, అసలది తన స్వరూపాన్ని మనకెప్పుడూ స్పష్టంగా తెలుపదు. మనకు మనమే 'అది మనలో లేదు' అని స్పష్టంగా నమ్మేటంతగా మనలో నిబిడీకృతమై వుంటుంది. దాన్ని ఆత్మవంచనతో కప్పిపుచ్చేసి, మనమెంతో గొప్పవాళ్ళమని మ.....న....స్ఫూ....ర్తిగా మనమే నమ్మటం కన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు."

    "ఇప్పుడు నన్నేం చేయమంటావ్?"

    "ఆ కోరికని మనసులోంచి బయటకు తియ్యి. ఎదురుగా నిలబెట్టు. అంతేకానీ దాన్ని మనసులోనే పెంచి పెద్దచెయ్యటమో....అక్కడే కృశించిపోతుందిలే....అని నిర్లిప్తంగా వుండిపోవటమో చేయకు. దానితో యుద్ధం చెయ్యాలంటే దానితో ముఖాముఖి తలపడాలి. అంటే.....దాన్ని బయటకు తీసి స్పష్టంగా చూడగలగాలి. అలా చెయ్యటాన్నే 'సెల్ఫ్ రియలైజేషన్' అంటారు...." ఆమె ఆగి, కొనసాగించింది.

    ".......ఒకసారి ఆ రియలైజేషన్   వచ్చాక ఏంచేస్తావూ అన్నది నీ ఇష్టం. నీ  కోరికే గానీ గెలిస్తే  ప్రహసిత్ తో గడుపు. నాభర్త నలుగురితో తిరుగుతున్నప్పుడు నేను ఒకరితో తిరిగితే తప్పేమిటి....అన్న వాదన అది. దానివల్ల నీకు సుఖం రాలేదనుకో. అసలా ఆలోచనే బావోలేదనుకో. 'నేను భారతీయ స్త్రీని. భర్త ఎలాటివాడయినా అతడి సహచర్యంలోనే  నాకు సంతృప్తి' అని గాఢంగా నమ్ముతున్నావనుకో. అప్పుడు అలాగే వుండు."

    లక్ష్మి రచయిత్రి. ఆమె ఇంట్రావర్ట్ అయివుండవచ్చు. కానీ ఆలోచన లేనిది మాత్రం కాదు. అవతలి వారు చెప్పినదంతా విని వూరుకుని, ఆపై మర్చిపోయే సామాన్య లక్షణం ఆమెలో లేదు. అందుకే అడిగింది. "అంటే....అసలు మనసనేదే లేకుండా, ఘర్షణ లేకుండా ఏది దొరికితే దానితో ఆనందిస్తూ బ్రతికెయ్యమంటావా?"

    "ఘర్షణలేకుండా మనసే లేదు. కానీ నువ్వనుకునే ఘర్షణ వేరు. నేను చెప్పే ఘర్షణ వేరు. ఇన్నాళ్ళూ నీ కాపురం ఇంత దరిద్రంగా వుందని నువ్వు  చెప్పేవరకూ నాకు తెలీదు. నీ యొక్క అంతర్గత శక్తులనన్నిటినీ......నీ కాపురం బయటవాళ్ళకి మంచిగా కనపడేటందుకే వినియోగిస్తూ వచ్చావు. మనసులోనే కుమిలిపోతూ, దానికే "ఘర్షణ" అని అందమైన పేరు పెట్టుకున్నావు. నీలో నువ్వు కములి పోవటం ఘర్షణ ఎలా అవుతుంది? ఘర్షణ అంటే నీలో రెండు శక్తులు నిజాయితీగా  పోరాడాలి. అందులో ఒకటి నెగ్గాలి. దాన్ని నువ్వు ఏవిధమైన గిల్టీ ఫీలింగ్ లేకుండా ఆచరించాలి. తరువాత బాధపడననే నమ్మకం నీకు మనస్ఫూర్తిగా కలగాలి. మరోలా చెప్పాలంటే ఘర్షణ యొక్క అంతిమ లక్ష్యం "ఆనందం" అయివుండాలి. వేదన కాదు.....దీనికే ఒక మంచిపేరు వుంది లక్ష్మీ. ప్రతివారూ తెలుసుకోవాల్సిన పేరు అది."

 Previous Page Next Page