Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 26


    ఈ మొత్తం ఆపరేషన్ లో అతడు ఊహించనిది ఒకటుంది. సర్పభూషణరావు గానీ, ఏజంట్ క్యూ గానీ స్వర్ణరేఖ పరశోధనల గురించే వేచి వున్నారన్నది!  ఆమె  వాళ్ళ   ప్రయోగశాలలో చిన్న అసిస్టెంటు అనుకున్నాడే తప్ప ఆమే  రిసేర్చర్ అనుకోలేదు.

 

    అందుకే  హంసలేఖని చూసి అతడికి ఎ అనుమానమూ రాలేదు.

 

    అంతలో ఆమే బల్ల మీద గ్లాసు తీసుకుని ఒక గుక్క తాగింది. స్పాంటేనిటీ అతడికి వెన్నతో  పెట్టిన విద్య.

 

    "అరెరె ....." అన్నాడు కంగారుగా.

 

    "ఏమైంది.....?"

 

    "మీరు నా గ్లాస్  తాగారు."

 

    ఆమె గ్లాసు చప్పున కింద పెట్టేసి-

 

    "మైగాడ్...... సారీ....!" అంది.

 

    "ఫర్వాలేదు లెండి. నేనేమీ హనుమంతుడ్ని కాను కదా....?"

 

    "హనుమంతుడా.....?"

 

    "హనుమంతుడి చెమట చుక్క మింగిన చేప గర్భవతి అయిందట. అలా  నా ఎంగిలి తాకి ఏమైనా అవుతారేమో అని భయపడక్కర్లేదు."

 

    అతడు అల్లరిగా  అన్నాడు. ఆమెకి మాత్రం విద్యుద్ఘాతం తగిలినట్టయింది.

 

    స్నేహితురాలి మాటలు గుర్తు వచ్చాయి. కడుపు  మీద చెయ్యి  పెట్టుకుంది పసిపాప  ఏడుపు వినిపించింది. అప్పటి వరకూ దూరం నుంచి వీరి  మాటలు వింటూన్న స్వర్ణరేఖ వాళ్ళ దగ్గరకివస్తూ- "భలే కథలు చెప్తారే మీరు" అంది. సరిగ్గా నిమిషంలో అతడు వారికి సన్నిహితుడై పోయాడు. ఒక చిన్న జోకు, ఒక మెచ్చుకోలు, ఒక ఆత్మీయమైన ప్రశ్న చాలు కదా!

 

    "మా సిస్టర్ స్వర్ణ......" అంటూ పరిచయం చేసింది హంసలేఖ.

 

    "స్వంత సిస్టర్ ని కానులెండి. వాళ్ళ నాన్నగారి పెంపుడు కూతుర్ని" అంటూ దగ్గిరకొచ్చింది స్వర్ణరేఖ. "నా పేరు నేత్ర....." అంటూ పరిచయం చేసుకుని హంసలేఖ వైపు తిరిగి-

 

    "ఇంకేమిటి మీ అభిరుచులు?" అని అడిగాడు.

 

    "నా సబ్జక్ట్  కెమిస్ట్రీ. కాబట్టి అదన్నా నా కిష్టమే......" అంది హంసలేఖ.

 

    "కెమిస్ట్రీలో దేని మీద రిసెర్చి చేస్తున్నారు?"

 

    "రిసెర్చా- లేదే - ఇంకా చదువుతున్నాను."

 

    నేత్ర సూటిగా ఆమె వైపు చూశాడు. కాస్త తొందరగా టాపిక్ లోకి వచ్చానేమో అనుకున్నాడు. వెంటనే  మాట మార్చడానికి "ఆడపిల్ల కెమికల్ ప్రాపర్టీస్ చెప్పండి చూద్దాం" అన్నాడు.

 

    ఆమె తెల్లమొహం వేసి, "ఆడపిల్ల కెమికల్ ప్రోపర్టీసా?" అంది.

 

    "అవును."

 

    "నా కర్థం కావడంలేదు. ఏమిటి మీరు అడిగేది?" అంది. స్వర్ణరేఖ కూడా అతడివైపు ఆశ్చర్యంగా చూసింది.

 

    "కెమిస్ట్రీలో పరశోధనలు చేస్తూ మీకు మీ సంగతులే తెలియవా?" అని నవ్వుతూ చెప్పడం ప్రారంభించాడు నేత్ర.

 

    "కెమికల్ సింబల్ - WO

 

    అటామిక్ వెయిట్- కొద్దిగా అటూ ఇటూగా 120.

 

    దొరికే స్థలం - చీరెల షాపులో, బ్యూటీ క్లినిక్స్ లో, మొగవాడి  కలల్లో......

 

    ఫిజికల్  ప్రోపర్టీస్ : 1 సాధారణంగా సిలిండ్రికల్ షేపు. 2. బోయిలింగ్ పాయింట్ -  అకారణం (ఏ కారణం లేకుండానే మండిపోవచ్చు), 2. ఘనీ భవించు స్థానం - పురుష స్పర్శ, 4. మెల్టింగ్ (కరుగు) స్థానం - కాస్త ఆప్యాయంగా రొమాన్సులో ఎరుపు. అక్కడక్కడ నలుపు, 7. రుచి : సరిగ్గా వాడకపొతే చేదు, ముద్దు  పెట్టుకున్నప్పుడు తీపి. కొన్ని చోట్ల ఉప్పు.

 

    కెమికల్ ప్రాపర్టీస్ : 1. యాక్టివ్. 2. బంగారం, వెండి, నగలు, చీరెలతో త్వరిత సంయోగం, 3. పౌడరు, లిప్ స్టికు మొదలైన వస్తువుల్ని త్వరత్వరగా ఇముడ్చుకునే గుణం. 4. తనకన్నా అందమైన వస్తువు (స్త్రీ) పక్కన పెడితే వెలవెలబోయే తత్వం - ఉక్రోషం.

 

    ఉపయోగాలు: 1. కాలిస్ట్ తో కొన్ని అపురూపమైన భంగిమల్తో కలిస్తే, జనసాంద్రత పెరగటానికి ఉపయోగపడుతుంది.

 

    2. బజారులో కొన్ని వస్తువుల ధరలు పెరగటానికి ఉపయోగపడుతుంది.

 

    నష్టాలు : 1. రాబడి  రెడ్యూసింగ్ ఏజెంట్.

 

    2. చేతకాని మొగవాడి చేతుల్లో ప్రమాదకరం....."

 

    అంటూ పూర్తి చేశాడు. హంసలేఖ కళ్ళు విస్ఫారితం చేసుకుని చూసింది. కాలేజిలో రకరకాల జోకులు వేసుకుంటారు గానీ, ఇంత స్పాంటేనిటీ తో  గడగడా వప్పచెప్పడం ఆమెకి చాలా ధ్రిల్లింజి గా అనిపించింది. ఆమె ఇంకా దిగ్భ్రమ నుంచి తేరుకోకముందే, "ఏమిటి అలా చూస్తున్నారు" అని అడిగాడు. ఆమె  చప్పున కళ్ళు దించుకుని "ఏమీలేదు" అంది స్వర్ణరేఖ కూడా అతడివైపు మెచ్చుకోలుగా చూసింది. "మీకు ఇంగ్లీషు పొయెట్రీలో కూడా ఇష్టం వుందన్నారు కదూ-" అని అడిగాడు.

 

    అన్నదో లేదో గుర్తు లేదు. తలూపింది.

 

    "చాలా కాలం క్రితం కాలేజీలో చదువుకునే రోజుల్లో నేనూ కవిత్వం వ్రాసేవాడిని....." అన్నాడు.

 

    "నిజంగా?" ఉత్సాహంగా అంది...... "ఏదీ ఒకటి చెప్పండి చూద్దాం."

 

    తనని తానే  తిట్టుకున్నాడు నేత్ర. పిస్టల్స్ పేల్చటం, ప్రత్యర్థుల వలల్ని ఛేదించటం, ప్రమాదం అంచులవరకూ పరుగెత్తి బయట పడడమే బావుంటాయి కానీ, ఇలా మాటల్తో వ్యూహాన్ని పన్నటం పరమ నాసిరకం థ్రిల్ గా వుంది.

 

    "ఏం కవిత్వం వ్రాసేవారు?" రెట్టించి అడిగింది.

 

    "సోనెట్స్ గురించి అంతగా తెలీదు. కేవలం అంత్యప్రాస చూసుకునే  వాడిని. అంతే-"

 

    ఆ మాట అన్నాక  అయిదు నిమిషాల్లో వాళ్ళు మరింత దగ్గిర స్నేహితులై పోయారు. ఆమె  నిష్టూరంగా, "మీరు నాకు మీ  ఇంగ్లీషు కవిత్వం గురించి ఏమీ చెప్పలేదు-" అంది.

 

    "పోనీద్దురూ ఎప్పుడో కాలేజీలో చదివే రోజుల్లో అమ్మాయిల మీద  అల్లిన  కవిత్వాలు అవి-"

 

    "చెప్పకూడదా ఏమిటి?" గారాబంగా అంది.

 

    "తిట్టకూడదు"

 

    "తిట్టాను-"

 

    అతడొక క్షణం ఆమె వేసుకున్న బట్టలవైపు, ఆమెవైపు చూసి  ఆమె కళ్ళని చూపుల్తో స్పృశిస్తూ అన్నాడు.

 

    "మీరు స్కర్ట్ లో చాలా బావున్నారు. కానీ కుర్తా పైజమా అయితే  ఇనాక  బావుండేది-"

 

    "గేయం చెప్పమంటే నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నారు."

 

    "తప్పదా?"

 

    "తప్పదు."

 Previous Page Next Page