నేను మౌనంగా చూశానామె వంక. నా కల నిజమేనన్న మాట.....అని మనసులో అనుకున్నాను.
తిరిగి ఆమె అంది. "వదిలివేసినా మనసాగక మరునాడే వచ్చి చూద్దామనుకున్నాను. కానీ......." అంటూ, నిస్సహాయంగా భుజాలు కుదించి కిటికీలోంచి బయటకు చూడసాగింది. ఆ నిశ్శబ్దంలో ఆమె సన్నగా రోదించటం స్పష్టంగా వినిపిస్తోంది.
నేను సానుభూతిగా వినడం తప్ప ఏమీ అనలేకపోయాను. ఆమె బాధ తగ్గించటం కోసం నా కొడుకుని తిరిగి ఆమెకు అప్పగించలేను కదా!
తరువాత నా వంక తల త్రిప్పి "చెప్పండి. నన్ను వెదుక్కుంటూ ఇలా రావడానికి గల కారణం?" అనడిగింది.
"చెప్తాను" అంటూ లేచి, "ఒక్క నిముషం. క్రింద నా స్నేహితుడు వెయిట్ చేస్తున్నాడు. చెప్పేసి వస్తాను" అన్నాను.
తలూపింది. గబగబా బాల్కనీలోకి వెళ్ళి క్రింద నిలబడి వున్న జాన్ తో వెళ్ళి కారులో వెయిట్ చెయ్యమని సైగచేసి వచ్చాను.
తిరిగివచ్చి కూర్చున్నాక చెప్పాను. "నేను కలలో కూడా అనుకోలేదు. మిమ్మల్ని కలుసుకోవాల్సిన అవసరం కలుగుతుందని, కానీ విధిరాత నెవరు తప్పించగలరు. మిమ్మల్ని వెదకడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది" అన్నాను.
"అంకిత్ తల్లిని నేనే అని మీకు ఎందుకు అనుమానం వచ్చింది?"
నేను ఇబ్బందిగా చూసాను. నా కొచ్చిన కల గురించి చెప్పి........ "అంతేకాదు, అందులో, అంకిత్ లో మీ పోలికలు కనపడ్డాయి...." అన్నాను.
"మీ అనుమానం నిజమే. మిమ్మల్ని ఆ రోజు నా భర్త గుర్తుపట్టాడు. అప్పటివరకూ మనం రహస్యంగా కలుసుకుంటూ వున్నామని తనకి అనుమానం వచ్చింది. నా శిశువుని చంపేస్తానని కత్తి తీసుకున్నాడు. అంతకుముందే మిమ్మల్ని.........మీ ఇంటి దగ్గిర చూసాను. అదే సురక్షిత స్థలం అనిపించింది."
నా మొహం మ్లానమైంది. "పెళ్ళిచూపుల రోజు నేను మీ ఇంటికి వచ్చి చాలా తప్పు చేసాను" అన్నాను నాలో నేను మాట్లాడుకొంటున్నట్టు.
"దాని సంగతి వదిలెయ్యండి. ఇది నా దురదృష్టం. అంతే! ఇంతకీ- ఇన్నాళ్ళ తరువాత ఇంత కష్టపడి ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు?"
"అంకిత్ కీ....." పూర్తిగా చేయలేదు నేను.
"ఏమైంది?" ఆమె కళ్ళల్లో కొద్దిగా కలవరపాటు తొంగిచూసింది. మాయమయ్యింది.
"అంకిత్ కి కిడ్నీ దెబ్బతింది."
ఆమె ఉలిక్కిపడింది.
"అవును! కిడ్నీ దెబ్బతిని రెండు నెలలు పైగా వాడు మెషిన్ మీద ఆధారపడి జీవచ్ఛవంలా బ్రతుకుతున్నాడు."
"హాస్పిటల్ లో చేర్చించలేదా?"
'ఇప్పుడు హాస్పిటల్ లోనే వున్నాడు."
"మరి......." ఆమెకేమీ అర్థంకానట్టుంది. "నయం చేయలేని జబ్బా అది?"
"అవును. అయితే ఈ ప్రపంచంలో వాడిని డాక్టర్లు, మందులూ కాదు రక్షించేది!"
"మరి......"
"మీరే...." సూటిగా చెప్పేశాను.
"నేనా..... నేనే విధంగా రక్షించగలను. నేనేమీ డాక్టర్ ని కాదే?" అయోమయంగా అంది.
"డాక్టర్ కాకపోవచ్చు. కానీ మీరు అంకిత్ కన్నతల్లే కదా?"
"అది నిజమే....." ఆమె ఆగిపోయింది. "నాకేమీ అర్థం కావటం లేదు. సరిగ్గా చెప్పండి" అంది.
"సరే. అంకిత్ కిడ్నీలు రెండు పనిచేయటం ఆగిపోయాయి. వాడు బ్రతకాలంటే కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాలి. బయటివాళ్ళ కిడ్నీ తీసి మార్పిడి చేయిస్తే రిస్క్ అంటున్నారు. ఆ బయటి వాళ్ళిచ్చే కిడ్నీని అంకిత్ శరీరం రిజెక్ట్ చేయవచ్చు. లేదా అడ్జస్ట్ అయ్యేవరకూ బాగా మందులు వాడాలి. అలా మందులు వాడితే వేరే సైడ్ ఎఫైక్ట్స్ వస్తాయి. వాడిలో పెరుగుదల ఆగిపోవచ్చు. ఈ పరిస్థితిలో అంకిత్ కి కావలసింది తన రక్త సంబంధీకులు కిడ్నీ......" కొద్దిగా ఆగి వూపిరి వదులుతూ చెప్పాను. ".....అంకిత్ తల్లిగా మీ కిడ్నీ కావాలి. అందుకే వచ్చాను. వాడు బ్రతకటానికి ఇంతకన్నా మరో మార్గం లేదు" పూర్తిగా చెప్పేసి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూసాను. తెల్లగా పాలిపోయి వుంది. కాళ్ళలోకి శక్తినంతా కూడతెచ్చుకున్నట్టు కొంచెం ముందుకు నడిచి బెడ్ మీద కూర్చుంటూ, చాలాసేపు మౌనంగా వుండి "నేనింక నమ్మలేకపోతున్నాను. దాదాపు మరిచిపోతున్న నా కొడుకు గురించి- హఠాత్తుగా ఈ అర్థరాత్రి వచ్చి మీరేదో చెపుతూంటే, ఈ పరిస్థితి వింతగా అనిపిస్తోంది. ఇదంతా ఏదో కలలాగా తోస్తోంది. కొడుకు ఆచూకీ దొరికినందుకు సంతోషించనా- ఇలా అయినందుకు బాధపడనా?" అని రోదించసాగింది. నేను గ్లాసులోకి మంచినీళ్ళు నింపి ఆమెకు అందించాను. నిశ్శబ్దంగా అవి అందుకుని త్రాగేసింది. ఆమె దుఃఖం కాస్త ఉపశామించిండి.
గ్లాసు క్రిందపెడుతూ "కానీ..... కానీ నేను బయటికెలా రాగలను?" అంది. ఆమె స్వరంలో దుఃఖపు జీర ఇంకా అలాగే వుంది. చాలాసేపటి నుంచీ నన్నూ అదే ప్రశ్న తొలుస్తోంది. పెళ్ళాంమీద అంత అనుమానం వున్న మనిషి ఆమెకూ, ఆమె పాత ప్రియుడికీ పుట్టినట్టు అనుమానిస్తూన్న బిడ్డకి కిడ్నీ ఇవ్వడానికి భార్యని ఎందుకు పంపుతాడు? అయినా ఆశ చావనట్టు అన్నాను.
"ఎలాగయినా మీరు నాకీ సహాయం చేయాలి. మరో పదీ పదిహేను రోజుల్లోగా ఆపరేషన్ జరగకపోతే అంకిత్ దక్కడు" ప్రార్తిస్తున్నట్టుగా అన్నాను.
"ఎలా?......" ఆమె ఆలోచిస్తున్నట్టు తల కాస్త పైకెత్తి ఏదో స్థిరనిశ్చయానికి వచ్చినట్టు "ఆయన రేపు ఊరునుండి వస్తారు. రాగానే ఏదో విధంగా నచ్చచెప్పి చూస్తాను. కాదంటే అప్పుడాలోచిద్దాం" అంది.
"మీ భర్తకి చెప్తారా?" ఆమెకి పిచ్చిపట్టిందేమో అన్నట్టుగా చూసి "అతనెలా వప్పుకుంటాడని వూహిస్తున్నారు? అంత అనుమానమున్న వ్యక్తి కిడ్నీ ఇవ్వడానికి ఎలా వప్పుకుంటాడు?" అన్నాను.
"వప్పుకోవాలి. అతనిలో ఎ కాస్త మానవత్వం మిగిలివున్నా వప్పుకుని తీరతాడు."
"అసంభవం" అన్నాను.
"కాదనే అనుకుంటున్నాను" సాలోచనగా చూస్తూ అంది.
"అదంత తెలికయినా విషయం అనుకొంటున్నారో నాకేమీ అర్థంకావడం లేదు" అన్నాను.
"ధైర్యంకాదు. నమ్మకం..... ఏ తండ్రీ తన కొడుకు చావుబ్రతుకుల మధ్య వున్నాడంటే మౌనంగా వూరుకోడనే నమ్మకం" అని ఓ క్షణం ఆగి అన్నది. "పెళ్ళి అయిన మొదటిరోజునుంచీ నన్ను ఆయన హింసిస్తూనే వున్నాడు. పెళ్ళిచూపులనాడు వచ్చిన మీరు ఎవరో చెప్పమని వేధించే వాడు. బాబు పుట్టిన పదిరోజులకి వచ్చిన మీరు ఎవరో చెప్పమని వేధించే వాడు. బాబు పుట్టిన పదిరోజులకి దురదృష్టవశాత్తు వైజాగ్ లో మీరు కనపడ్డారు. అంతే! ఆ రాత్రి ఇంటిని నరకం చేసాడు. అందుకే మీ ఇంటిమెట్లమీద వదిలెయ్యవలసి వచ్చింది. అయితే ఆయనదంతా విచిత్రమైన మనస్తత్వం. ఇన్నాళ్ళ వైవాహిక జీవితంలో నాకే అర్థంకాలేదు. అంకిత్ ఎక్కడున్నాడో అని ఈ మధ్య రెండు మూడుసార్లు అడిగాడు మరో వైపు- అంకిత్ తండ్రి మీరేనని వప్పుకోమని హింసించటం మానలేదు. ఆయనకు మళ్ళీ తన కొడుకుమీదకు మనసు మళ్ళి వుండవచ్చు..... ఆయనకు నామీద విపరీతమైన ప్రేమ."
చాలాసేపు నేనామె చెప్పిన విషయమే ఆలోచిస్తూ కూర్చున్నాను. తర్వాత...... "మరి అంత ప్రేమించినవాడు ఈ తాళం వేసుకెళ్ళడం ఏమిటి?" అనడిగాను.
"ప్రేమకీ మనస్తత్వానికీ సంబంధంలేదు" నిర్లిప్తంగా అంది.
"మీరు చదువుకున్నవారు. వెనకాల మీ నాన్నగారి ఆస్తి కూడా వుంది. ఇంకా ఎందుకీ నరకంలో మగ్గిపోవటం? విడిపోయి స్వతంత్రంగా బ్రతకొచ్చుగా?" కొద్ది చనువు తీసుకున్నాను. ఎందుకో నాకామె పరాయి వ్యక్తిలా అనిపించలేదు.
"ప్చ్......! ఆ బెదిరింపు కూడా పనిచేయలేదు. అతన్నుండి విడిపోతే నన్ను శవంగా మారుస్తానని ఖచ్చితంగా చెప్పాడు. ఆ తర్వాత సంతోషంగా జైలుకి వెళతాడట....... చెప్పానుగా చాలా విచిత్రమైన మనస్తత్వం."
ఒక గట్టి నిట్టూర్పు విదిచాను. ఆమెమీద అంతులేని సానుభూతి కలిగిగింది. కానీ, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఆమె కేవిధంగానూ సాయపడలేను. ఆమె నుండి సాయం పొందటం తప్పించి.
కొద్దిసేపు మా ఇద్దరిమధ్యా మౌనం దొర్లిపోయింది.
"అతన్ని వప్పించటం అంత సులువుకాదేమో?" అన్నాను.
"అవును. అదంత సులభంకాదు. అతన్ని వప్పించకపోతే నేను బయటికి రాలేను. అదేదో వస్తువు కాదుగదా! మీరిప్పటిలా వస్తే వెంటనే ఇచ్చెయ్యటానికి....."
అదీ నిజమే!" వప్పుకోక తప్పలేదు. కానీ , గత్యంతరంలేని అంగీకారం ఇది. కిడ్నీ ఇవ్వడానికి ఆమె సుముఖత వ్యక్తం చేస్తుందనే అనుకోలేదు. కానీ ఒక దారి తెచ్చుకొంటే మరోదారి మూసుకుపోయినట్టు మధ్యలో కృపానంద్ ప్రస్తావన రావడమే మింగుడు పడకుండా వుంది.
"మరి నేనెప్పుడు కలపను?" లేస్తూ అడిగాను.
"మీరు రావద్దు. నేను రేపు ఫోన్ చేస్తాను. నెంబర్ ఇచ్చి వెళ్ళండి" అంది. ".......బహుశా రేపు ఆయన వస్తారనుకుంటాను."
"కానీ నేను మిమ్మల్ని ఎలా కలుసుకున్నానని అతనికి అనుమానం వస్తే?"
"అదంతా నేను చూసుకుంటాగా....."
నేను బయటకు వచ్చాను. రాత్రి ఒంటిగంట దాటింది. బాల్కనీ మీదనుంచి నీటిగొట్టంద్వారా దిగి, కారు వద్దకు వచ్చాను. జాన్ కారు స్టార్టుచేస్తూ ఏమైంది?" అని అడిగాడు.
జరిగినదంతా క్లుప్తంగా చెప్పాను. కృపానంద్ మనస్తత్వం గురించి విని, "మైగాడ్......" అన్నాడు....... "కేవలం మేము మా రచనల్లో మాత్రమే ఇటువంటి క్యారెక్టర్స్ సృష్టిస్తామని అనుకుంటూ వచ్చాను. నిజజీవితంలో కూడా వుంటారన్నమాట" నేను సమాధానం ఇవ్వలేదు. జాన్ కొనసాగించాడు. "జీవితంలో ఎంత మెలోడ్రామా వుందో చూడు..... నీకు వాళ్ళు కనపడటం......అతడి అనుమానం. అతడిపట్ల నీ అభిప్రాయం కల రూపంలో రావటం...... అది నిజమవటం....." ఆగి అన్నాడు. "భగవంతుడనే వాడుంటే నీకు తప్పక సహాయం చేస్తాడు. నీ కష్టాన్ని వృధా పోనీయదు. నిజంగా ఎంత కష్టపడ్డావు నువ్వు? ఏ ఆధారమూ లేకుండా.......కేవలం చిన్న నమ్మకంతో........! అది ఈ రోజు నిజమైంది. చాలా శుభసూచకం!! అంకిత్ కోసం నువ్వు ఇంత చేస్తున్నావు. భగవంతుడు నీకోసం ఆ మాత్రం చేస్తాడు....."
నా కళ్ళు తడయ్యాయి. జాన్ డేవిడ్ ఆకాంక్ష నెరవేరితే అంత కన్నా కావాల్సింది ఏముంది?
ఇంత చీకటిలో కూడా చిన్న ఆశాకిరణం ఒకటి కనబడుతోంది! మాటల సందర్భంగా సుమద్యుతి అన్న వాక్యం ఇది!" .......ఆయన చాలా విచిత్రమైన మనిషి నేనంటే విపరీతమైన ప్రేమ. ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో తెలీదు....."
అదే నా కొడుకుని రక్షించాలి!!
* * *
దాదాపు రెండుగంటల వరకూ ఫోన్ రాలేదు. హాల్లో కూర్చుని ఫోన్ కోసం వెయిట్ చేయసాగాం. ఇంతవరకూ ఫోన్ రాలేదంటే బహుశా కృపానంద్ టూర్ నుండి వచ్చి వుండండు. ఇవాళ అతను రాకపోతే పదిహేను రోజుల్లో రెండురోజులు వృధాగా గడిచిపోయినట్టే.
మిగిలినవి పదమూడురోజులు మాత్రమే!
చేసేపనిమీద ఏమాత్రం శ్రద్ధలేకపోయినా అదేపని చేయటమంత మూర్ఖత్వం మరోటి లేదేమో. కానీ నాకంతకన్నా గత్యంతరం లేదు.
మధ్యాహ్నం రెండున్నరవుతూండగా ఫోనొచ్చింది.