Previous Page Next Page 
దుప్పట్లో మిన్నాగు పేజి 26

 

     "ఉహూ, లేదు."
    -ఈ లోపులో టేపు చివరికి వచ్చింది. చివరి సంభాషణ వినవచ్చింది. తన గొంతు....
    "చాలా ధాంక్స్. మీరు చెప్పిన ప్రతిమాటా 'ఆంధ్రశోభ' పాఠకులకి అందిస్తాము. మీకు మా సానుభూతి కూడా. మీలాంటి గొప్ప సైంటిస్టుని కోల్పోతున్నందుకు మాకు చాలా విచారంగా వుంది."
    .....(లేచిన శబ్దం) .... "వెళ్ళొస్తాను...." (టప్)
    జార్జి లేచి టేపు ఆపుచేసి "ఇదీ మేడమ్ మొత్తం మీ ఇంటర్వ్యూ" అన్నాడు.
    "అంతేనా?"
    "అవునంతే."
    జార్జి ఒక నోట్ పుస్తకం బల్లమీద పెడ్తూ. "సెంట్రీ విష్ణుశర్మ చాలా చురుకైన కుర్రాడు మేడమ్. సెల్ లోకి ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు ప్రవేశించిన టైము, బయటకొచ్చిన టైము ఉజ్జాయింపుగా వేస్తారు. అతడు మాత్రం నిముషాల్తో సహా 'టైము బుక్' లో  వేశాడు. ఆ లెక్క ప్రకారం ఇరవై ఎనిమిది నిమిషాలు మీరు సెల్ లో వున్నారు.- కానీ మొదటి ;నమస్తే; నుంచి చివరి 'వెళ్ళొస్తాను' వరకూ ఇరవై రెండు నిముషాలే వచ్చింది టేపు. సెంట్రీని నీళ్ళకు దూరంగా పంపి ఆ ఆరు నిముషాలు మీరేం మాట్లాడారో చెప్తే మా పని సులువు అవుతుంది....." చాలా  తాపీగా, నెమ్మదిగా అన్నాడు ఇన్ స్పెక్టర్. ఇప్పుడతడు చెమటతో మాటిమాటికీ నిట్టూర్చే స్థూలకాయుడిలా లేడు. కళ్ళతో నవ్వుతున్నాడు. అతడి కళ్ళలో ఇంతకుముందు లేని షార్ప్ నెస్ వచ్చింది. ఆ చూపు ఎదురివారి గుండెల్లోకి దూసుకు వెళ్ళేదిలా వుంది.
    కళ్ళముందే భూమి రెండుగా విచ్చుకున్నట్లు అనిపించింది ఆమెకి. ఎంత సులభంగా తను ట్రాస్ లో యిరుక్కుపోయిందో ఆమెకి తెలుస్తూనే వుంది. ముద్దపప్పులా కనిపించే ఈ ఇన్ స్పెక్టర్ అలా కనబడటం ద్వారా  తనని 'రిలాక్స్' కానిచ్చి. ఆ ఏమరుపాటులో వుండగా తనకి కావలసిన సమాధానాలు రాబట్టుకున్నాడు.
    తనకి తెలీదనికాదు. తనూ చదివింది కాంప్లాన్ వ్రాసిన "హౌ టు విన్ అదర్స్" (అవతలివారిని గెలవటం ఎలా?) అన్న పుస్తకం. అందులో ఒకచోట రచయిత అంటాడు-
    "అవతలివారికి నీ చేతకానితనం మీద నమ్మకం కలిగించటానికి నువ్వొక బుద్ధావతారంలా కనిపించు. నీ తెలివిహీనత మీద నమ్మకం కలిగించు. దాంతో వాళ్ళు నీ మీద అధికారం సంపాదించామన్న నమ్మకంతో, తమని ఎల్లప్పుడూ రక్షించే హిపోక్రసీ ముసుగుని మర్చిపోతారు. వాళ్ళలోంచి అసలు వ్యక్తి బైటకొచ్చి నిన్ను డామినేట్ చెయ్యటానికి వాదనల రూపంలో ప్రయత్నిస్తాడు. వాడికి తలవొగ్గు. మరింత విజృంభిస్తాడు. ఇక దాంతో నువ్వు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో అతడిని చూడవచ్చు. నువ్వు నెగిటివ్ పల్సెస్ ఎమినేట్ (బహిర్గతం) చేస్తే అవతలివ్యక్తి పాజిటివ్ పల్సెస్ వెలువరిస్తాడు. నువ్వు పాజిటివ్ అయితే అతడు  నెగిటివ్ అవుతాడు. వాదనలో నీతో గెలవగలనన్న నమ్మకం అతనికి బాగా  కుదురుతుంది. కాబట్టి నువ్వేం చెప్పినా దానికి వ్యతిరేకంగా వాదిస్తాడు. అలా తీసుకెళ్ళి తీసుకెళ్ళి 'పాయింట్  ఆఫ్ నో రిటర్న్ ;దగ్గిర దెబ్బకొట్టు. ఇక తేరుకోడు..... ముఖ్యంగా నువ్వు రచయితవి కానీ, జర్నలిస్టువి కానీ అయితే అవతలివ్యక్తిని చదవటానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది......!" ఈ ఇన్ స్పెక్టర్ ఆ పుస్తకాన్ని చదివాడో లేదో తెలీదు కానీ, సరిగ్గా అలాగే తనని దెబ్బకొట్టాడు. కేవలం చదవటం వేరు- ఆచరించటం వేరు. తను కాస్త జాగ్రత్తగావుంటే సరిపోయేది. ఇప్పుడిక కాదని చెప్పినా లాభంలేదు.
    ఒక హంతకుడు తప్పించుకోవటానికి తాను సహాయం చేసింది. ఇంకో హత్య జరగటానికి పరోక్షంగా కారణమైంది.
    ఆక్సెసరి టు మర్డర్!!!
    ఆమె వణికిపోయింది.
    స్వామినాయుడు బ్రతికివుంటే అతడు రక్షించేవాడు. ఇప్పుడిక తనకెవరూ కనీసం సలహాకూడా ఇవ్వరు. తనకేదైనా జరుగుతే తన పత్రికే పెద్ద అక్షరాల్తో "వైజయంతి అరెస్టు" అని ప్రచురిస్తుంది. ఏం చెయ్యాలిప్పుడు? టైమ్ సంగతి తప్పని బుకాయించాలా? టేప్ ఆగిపోయినప్పుడు ఇంకేదయినా మాట్లాడమనాలా?
    అసలిదంతా కోర్టులో నిలుస్తుందా?
    నిలిచినా నిలవకపోయినా, తన కెరీర్ మాత్రం సమూలంగా నాశనమై పోతుంది. పోలీసులు కొద్దిగా బెదిరిస్తే కంపోజిటర్ నిజం చెప్పేస్తాడు. మిగతావన్నీ కూడా తనకి వ్యతిరేకంగానే వున్నాయి.
    "మీరు ఆలోచించటానికి ఈ మాత్రం టైమ్ చాలదనుకుంటాను. చూడండి మేడమ్! నిజం ఎప్పటికైనా బయటపడ్తుంది. పోలీసుల్తో అబద్ధం చెప్పి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఒక పోలీసాఫీసరుగా కాకుండా శ్రేయోభిలాషిగా చెప్తున్నాను- నిజం చెప్పేయ్యండి."
    ఇదే టెక్నిక్- "హౌ టు విన్ అదర్స్ " ఇతడు చదివాడు. సరిగ్గా  టైమ్ ఇచ్చి ఆటో సజెషన్ మొదలు పెట్టాడు. మైగాడ్...... ఇతడినా తను బుద్ధావతారం అనుకుంది.
    "నాక్కొంత టైమ్ కావాలి" అంది.
    "దేనికి?"
    "మా లాయర్ ని సంప్రదించాలి" అంది. అదృష్టవశాత్తూ 'ఆంధ్రశోభకి దిట్టమైన లాయర్లున్నారు.
    అతడు లేచి, "సరే మేడమ్! దీన్నిబట్టి మీకూ ఇందులో భాగం వుందని అర్థం అవుతుంది" అన్నాడు.
    ఆమె కంగారుగా "లేదు లేదు. నేను కేవలం ఇందులో పబ్లిసైజ్ కావటం ఇష్టంలేక వాళ్ల సలహా తీసుకోవాలనుకుంటున్నాను. పత్రికల మధ్య కాంపిటీషన్ సంగతి మీకు తెలియనిదేముంది? ఒక విలేఖరి ఇందులో వున్నట్టు తెలిస్తే దానికి నానా రంగులు పులుముతారు" అంది.
    "ఈ విషయం ఇంతకాలం తరువాత మీకు అర్థమైందా మేడమ్? ఆంధ్రశోభ తరుపున మీరు చిన్న చిన్న  విషయాలకి కూడా నానా రంగులా పులిమినప్పుడు యీ విషయం తెలియదా!" అంటూ జార్జి నవ్వేడు. "సరే, మళ్ళీ రేపు వస్తాను. ఈలోగా మీ లాయర్  సంప్రదించండి. మీరు నన్నొక ప్రశ్న రేపు వస్తాను. ఈలోగా మీ లాయర్ ని సంప్రదించండి. మీరు నన్నొక ప్రశ్న అడిగారు- 'విలేఖరిగా కాదు మామూలుగా వ్యక్తిగా చెప్తున్నాను వినండి. మీరెంత లోతులో దీంట్లో కూరుకుపోయారో మీకు తెలియటం లేదు. ఓకే హంతకుడు తప్పించుకుపోవటానికీ, మరో హత్య జరగతానికీ పరోక్షంగా సహాయపడ్డారు. నాకు మీమీద జాలి. ఎందుకంటే మీరు ఇదంతా మీకోసం స్వార్థంతో చెయ్యలేదు. కేవలం స్వామినాయుడు  కోసం, అతడి పత్రికకోసం చేశారు. ఒక చిన్నపిల్లలా- హడావుడిగా వుత్సాహంతో చేసేశారు ఇదంతా. మీ వుత్సాహాన్ని నేను అర్థం  చేసుకోగలను. కానీ స్వామినాయుడు మాత్రం దాన్ని బాగా కాష్  చేసుకోవాలనుకున్నాడు ఫలితం  అనుభవించాడనుకోండి అది వేరే  సంగతి. మీరు  మీ లాయరుతో సంప్రదించండి. రేపే మనం మాట్లాడుకుందాం" అంటూ గుమ్మం దగ్గరికెళ్లి తలుపు తెరుస్తూ ఆగి- "ఈ పరిస్థితుల్లో మిమ్మల్నెవరూ రక్షించలేరు- ఒకే ఒక వ్యక్తి తప్ప" అన్నాడు.
    ఆమె తడారిని గొంతుతో "ఎవరు?" అని అడిగింది.
    "పట్నాయక్".
    అతడి వెనుకే తలుపు నెమ్మదిగా మూసుకుపోయింది.
                         *    *    *
    ఆమె చాలాసేపు అలానే కూర్చుండిపోయింది. చీకటి పడింది. ఆమెకి భోజనం కూడా చెయ్యాలనిపించలేదు. ఒకోసారి మనకు తెలియకుండానే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఇరుక్కు పోతామో ఆమెకిప్పుడు అనుభవపూర్వకంగా అర్థమైంది. మరుసటి రోజు జరగబోయేది తల్చుకుంటేనే ఆమెకి భయంగా వుంది.
    పక్కమీద పడుకుందే కానీ ఆమెకు నిద్ర పట్టలేదు.
    రాత్రి పన్నెండయి వుంటుంది.
    గడియారం శబ్దం తప్ప గదంతా నిశ్శబ్దంగా వుంది.
    అంతలో బయట అడుగుల చప్పుడు వినిపించింది. ఆమె అనుమానంతో లేవాబోతూంటే తలుపు నెమ్మదిగా కొట్టిన శబ్దం వినిపించింది.
    "ఎవరది" అందామె భయంతో.
    "నేను."
    అది పట్నయాక్ గొంతు.
    ఆమె ఒక్క ఉదుటున పక్కమీద నుంచి లేచి వెళ్లి తలుపు తీసింది.
    ఎదురుగా పట్నయాక్ వున్నాడు. ఎన్నో రోజుల్నుంచీ తిండీ-నిద్రా లేనట్టు శుష్కించిపోయాడు. తైలసంస్కారం లేక జుట్టు పీచులా వేలాడుతోంది. కళ్ళు లోతుకుపోయి వున్నాయి. "నీకు కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చానమ్మా. నా జీవితాశయం నెరవేర్చుకున్నాను" అన్నాడు.
    ఆమె బరస్ట్ అయింది. అప్పటివరకూ నొక్కిపట్టి వుంచిన రోషం, కోపం, దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించినట్టయి, "ఎందుకొచ్చారిక్కడికి? గెటౌట్....." అని అరిచింది.
    "నా మూలాన నువ్వు చిక్కులో ఇరుక్కున్నవట కదా."
    అతడు చాలా తాపీగా అన్నాడు, "నేను చావు బ్రతుకుల మధ్య వున్నప్పుడు నన్ను పరామర్శించటానికి నువ్వు వచ్చి నప్పుడూ నేనలాగే అనుకున్నాను. అప్పుడు నన్నో మృగంలా భావించి వుంటావు. అవతలివాడి చావు మనకెప్పుడూ ఆనందమే కదా వైజయంతీ! రేపు చచ్చిపోయేవాడి మనసులో ఏముందో- వాడు ఎంత  బాధపడుతూ వుంటాడో తెలిసికూడా దాన్ని కాష్ చేసుకోవటానికి వచ్చావు నువ్వు.పైకి మాత్రం 'మీ గురించి ప్రజలకి  చెప్పడానికి మా పత్రిక ఉపయోగపడుతుంది' అన్నావు- ఇది ఆత్మవంచన కదా, నిజాయితీగా ఆలోచించి చెప్పు. మీరందరు స్వామినాయుడి తొత్తుల్లా బ్రతికారు ఇంతకాలం. మీ ఇండివిడ్యువాలిటీని మర్చిపోయారు. ట్రూత్ టెల్లర్ ని కనుక్కున్నా సైంటిస్టుగా కన్నా, స్వామినాయుడిని చంపిన హంతకుడిగా నేను ఎక్కువ సంతృప్తిని పొందాను, మిమ్మల్నందర్నీ అతడి  బారి నుంచి తప్పించినందుకు...."
    ఆమె విస్తు పోయింది. దుఃఖాన్ని కూడా మర్చిపోయింది. ఈ కొత్త కోణంలోంచి ఆలోచించటం మొదలుపెట్టాక ఒక్కసారిగా తన దుఃఖం అర్థరహితంగా కనిపించింది. గుమ్మానికిఅడ్డు తొలగి, "లోపలికి రండి" అన్నది. ఆమెలో అదే గొప్పతనం.
    "లేదు వెళ్తాను. నా గురించి గాలింపు జరుగుతోంది. అయినా ఇలా తప్పించుకు తిరగాలన్న ఆశ కూడా నాకు లేదు. వాళ్ళకి లొంగిపోతాను."
    "ఇంతదానికి నన్నెందుకు ఇరుకులో పడేశారు?"
    "చాలా సులభంగా నువ్వీ సమస్యల్నుంచి బయటపడగలవు."
    ఆమె ఆశ్చర్యంగా "ఎలా?" అని అడిగింది.
    "'సెల్' లో వున్న  రాతిపలక మీద అక్షరాలు నేనే చదివి సొరంగం గురించి కనుక్కున్నాననీ, నీకే విషయమూ తెలీదనీ నేను పోలీసులకి చెప్తే సరి.అయినా ఒకసారి నేను వాళ్ళకి లొంగిపోతే, ఇక ఈ చిన్న చిన్న వాటిని గురించి వాళ్ళు పట్టించుకోరు."
    ఆమె కంటినిండా నిండిన నీటితో, "నా ...... గురించి మీరు లొంగి పోతారా" అని అడిగింది.
    "నీ గురించికాదు. నాకీ ప్రపంచంలో బ్రతకాలన్న ఉత్సాహం లేదు. నా ట్రూత్ టెల్లర్  వాళ్ళకి అనవసరం. కేవలం ఒక్క కోర్కేతోనే నేను బ్రతకాలనుకున్నాను. నీ దయవల్ల అది కూడా  తీరిపోయింది."
    "మీరు స్వామినాయుడిని ఎందుకు చంపారు?"
    "నాలో రాక్షసుణ్ణి రెచ్చగొట్టింది అతడే-"
    "ఎందుకు? ఎందుకు చేసేడతడు ఇదంతా?"
    "ట్రూత్. ఈ ట్రూత్ అనేది చాలా విచిత్రమైనది వైజయంతీ! మనిషికే మాత్రం సంతృప్తినివ్వదు సరికదా, పైగా బాధపెడుతుంది కూడా. ఈ విషయం నాకర్థమయ్యేసరికే పరిస్థితి చెయ్యిదాటిపోయింది. ఈ మిషను ప్రతీ ఇంటిలోను వెలిసిందనుకో. ఏమవుతుందో ఆలోచించు! మనిషి జీవితం ఎంత అస్తవ్యస్తం అవుతుందో యోచించు. ప్రతీ భర్తా, భార్య మనసులో చీకటి కోణాల్ని చూస్తాడు. ప్రతీ భార్యా భర్త జీవితం రెండో వైపుని చూడగలుగుతుంది. రాజకీయ నాయకుల అసలు స్వరూపాన్ని ఓటర్లు, గ్రహిస్తారు. భక్తురాళ్ళు మహాత్ములుగా చలామణి అవుతున్న వాళ్ళ మనసు కనుక్కుంటారు. ముఖ్యంగా.... అన్నిటికన్నా ముఖ్యంగా ట్రూత్ టెల్లర్  బయటికి రాగానే  ముందు తగిలే దెబ్బ దేనికో తెలుసా? పేపర్లకి!!! అందమైన అబద్ధాన్ని కూడా అద్దాల ఫ్రేములో అందంగా బిగించి ప్రజల బలహీనతల్తో ఆడుకునే ఆంధ్రశోభ లాంటి పత్రికలకి....అందుకే స్వామినాయుడు నన్ను మర్డర్ కేసులో ఇరికించాడు. అసలైన "ట్రూత్" నేనిప్పుడు చెప్తాను విను వైజయంతీ! ప్రొఫెసర్ రామన్ ని చంపింది నేను కాదు. నేను కనుక్కున్నా ట్రూత్ టెల్లర్ ప్రపంచంలోకి రావటం స్వామినాయుడి కిష్టంలేదు. దాంతో రామన్ చేత ఆ స్టేట్ మెంట్ ఇప్పించాడు. ప్రపంచం దృష్టిలో మా ఇద్దరిమధ్యా బద్ధవైరం  వున్నట్టూ భ్రమ కలిగించాడు. ఆ వైరం తారస్థాయికి చేరుకోగానే రామన్ ని హత్య చేయించాడు. ఇదంతా నీకు ఆశ్చర్యంగానూ నమ్మశక్యం కాకుండానూ వుండొచ్చు. కానీ, తమకు ఏమాత్రం కొద్దిగా లాభం వున్నట్లు తోచినా, దానికోసం మనుష్యులు ఎంతవరకు తెగిస్తారో నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. అందుకే ఈ ప్రపంచానికి ఇవ్వకుండా నా ట్రూత్ టెల్లర్ ని నాతోపాటు తీసుకుపోతున్నాను.....వైజయంతీ! నా శత్రువుని చంపే వీలు కలిగించావు. నీకు నా కృతజ్ఞతలు....శలవు" అని- ఆమె ఏదో చెప్పబోతూంటే, తలుపు తీసుకుని బయట చీకటిలో కలిసిపోయాడు.
    ఆమె నిశ్చలంగా కూర్చుండిపోయింది. నాలుగైదు సెకండ్లు కూడా గడిచివుండదు. పట్నాయక్ బహుశా ఇంటి కాంపౌండ్ దాటుతున్నాడేమో!
    "హేయ్! ఆగు!" అన్న స్వరం కర్కశంగా వినిపించింది.
    అది ఇన్ స్పెక్టర్ జార్జిది.
    ఎవరో పరుగెడుతున్న చప్పుడు......కలవరం.
   వైజయంతి భయభ్రాంతురాలైంది. కానీ లేవలేకపోయింది. శక్తినంతా ఎవరో పీల్చేసినట్టుగా నిస్సత్తువగా అలాగే కూర్చుండి పోయింది. ఇద్దరు వ్యక్తులు పరుగెడుతున్న ధ్వని.
    ఆ అడుగుల చప్పుడు కొద్దిగా దూరం అయ్యాక నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ గాలిలోంచి ఒక చప్పుడు, అలల్లో తెలివచ్చింది-
    "ఢాం....."
    రివ్వాలర్ పేలిన చప్పుడు అది.

                *శుభం*

 Previous Page Next Page