స్వామినాయుడి మరణాన్ని అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. అంధ్రశోభ ఆఫీసులో సంతాపసభ జరిగింది. ఎడిటోరియల్స్ వ్రాయబడ్డాయి.
ఆ తరువాత ప్రపంచం యధావిధిగా ముందుకు సాగిపోయింది. స్వామినాయుడు కొడుకువచ్చి తండ్రి సీటు ఆక్రమించాడు. స్వామిపోయింది. స్వామినాయుడు కొడుకువచ్చి తండ్రి సీటు ఆక్రమించాడు. స్వామినాయుడి నిలువెత్తు ఫోటో ఆఫీసు గోడకి వేలాడదీయబడింది. వైజయంతి ఒకరోజు మాత్రం శలవుపెట్టి తిరిగి ఆఫీసుకు రావటం ప్రారంభించింది. పట్నాయక్ గురించిన వార్తలు మాత్రం అప్పుడప్పుడు వస్తున్నాయి, అతడు ఇంకా దొరకలేదని- అంతే! అది తప్ప అంతా మామూలుగానే వుంది.
ఆ రోజు సాయంత్రం వైజయంతి ఆఫీసుపని ముగించుకుని ఇంటికి వచ్చింది. అటాచ్డ్ బాత్ ఉన్న చిన్నగదిలో ఆమె ఒంటరిగా ఉంటూంది. అప్పుడు సమయం ఐదున్నర అయింది. స్నానం చేసి ఫ్రెష్ గా, ఫెమీనా తిరిగేస్తూ ఈజీచైర్ లో కూర్చొని వుండగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఈ సమయంలో తన కోసం వచ్చేదెవరా అని ఆశ్చర్యపడుతూ ఆమె లేచి తలుపు తీసింది.
కొద్దిగా పొట్టిగా, అయిదున్నర అడుగుల ఎత్తు, గుండ్రటి మొహం, బట్టతల, చూడగానే అంత తెలివైనవాడిలా అనిపించని వ్యక్తి గుమ్మం అవతల నిలబడి వున్నాడు.
ఇన్ స్పెక్టర్ జార్జి.
* * *
గుండె క్షణంపాటూ ఆగి కొట్టుకోవటం అంటే ఏమిటో అప్పుడే ఆమెకి అర్థమైంది. కానీ వెంటనే తమాయించుకుని, "లోపలికి రండి....." అంటూ ఆహ్వానించింది.
"ష్" మంటూ అతడు లోపలికి వచ్చిపెద్ద నిట్టూర్పుతో కూర్చున్నాడు. అతడి స్థూలకాయానికి కుర్చీ భారంగా శబ్దం చేసింది. మామూలు సంభాషణ కొంచెం సేపు జరిగేక "పట్నాయక్ మీకు తెలుసుగా.....?" అన్నాడు మళ్ళీ హుమ్మని మూలుగుతూ.
"తెలుసు."
"అతడు తప్పించుకు పోయేముందు ఆఖరిసారి మీరే చూసేరు. ఐ మీన్ బయటివాళ్ళు."
"అవును."
ఆమె ఎక్కడా కమిట్ అవదల్చుకోలేదు. పోలీసుల్తో అవసరమైన దానికంటే ఒక్కమాట ఎక్కువ మాట్లాడటం ప్రమాదకరమని ఆమెకి తెలుసు. కానీ ముందున్న భయం ఆమెకి పోయింది. ఈ ఇన్ స్పెక్టర్ అంత తెలివైనవాడిగా కనబడ్డంలేదు. అదీగాక అతడు మాటిమాటికీ ముక్కటం- మూలగటం ఆమెకి కాస్త గమ్మత్తుగా ఉంది కూడా.
"ఈ పట్నాయక్ తప్పించుకోవటం మీద రిపోర్టు ప్రిపేర్ చెయ్యాలి. జైల్లో అందరి దగ్గరా స్టేట్ మెంట్లు తీసుకోవటం జరిగి పోయింది- ఇక మీరు మాత్రమే మిగిలారు, ఆఖరిసారి అతడితో మాట్లాడిన బయటివారు."
ఆమె భయం పటాపంచలైపోయింది. 'కేవలం రిపోర్టు తయారు చేయటానికి మాత్రమే అతడు వచ్చాడన్నమాట' అనుకుంది. ఆ తరువాత రిలాక్స్ డ్ గా మాట్లాడసాగింది.
"అవునండీ, మా పత్రిక తరుపున ఇంటర్వ్యూకి వెళ్ళాను....." అంది.
"కానీ మీరు రెండోసారి మళ్లీ వెళ్ళారు కదా!"
'ఒహో ఇతను అదికూడా వాకబు చేసేడన్నమాట-' అనుకుంది మనసులో "అవును. మొదటిసారి వెళ్ళినప్పుడు టేప్ రికార్డరు తీసుకెళ్ళటం మర్చిపోయాను. అందుకని మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది."
"అవునా విషయం అక్కడ చెప్పారు వైజయంతిగారూ! మీరు మాట్లాడినప్పుడు అతడు ఎలా ఉన్నాడు? ఉరి గురించి భయంగా ఉన్నాడా? తప్పించుకొనగలిననే ధైర్యంగా ఉన్నాడా?"
"'మా ఇంటర్వ్యూ రేపటి పేపరులో చూసుకోవాలన్నదే నా కోర్కె' అని అన్నాడు, కాబట్టి బహుశా తప్పించుకు పోవడం గురించి అతడికి తెలిసే ఉంటుంది" అంది.
జార్జి బట్టతల గోక్కుంటూ మళ్ళీ నిట్టూర్చాడు. తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు "మీరొచ్చి వెళ్ళేవరకు అతడుచాలా ఆవేశంగానూ, దాదాపు మృగంలాగానూ ప్రవర్తించాడు. మీరు వచ్చి వెళ్ళాక అతడిలో మార్పు వచ్చిందట, సెంట్రీ చెప్పాడు" అన్నాడు.
'ఈ సెంట్రీ చాలా తెలివయినవాడిలా వున్నడే' అనుకుంది మనసులో "నేను మొదటిసారి వచ్చి వెళ్ళినప్పుడా?" అని అడిగింది.
"రెండోసారి వచ్చి వెళ్ళాక."
"మార్పంటూ ఏదైనా వస్తే అది మొదటిసారి చూసేకే రావాలి కదా"- లాజికల్ గా అంది.
"అవునవును" అంటూ స్థూలకాయాన్ని కుర్చీలో అటూఇటూ జరిపి మళ్ళీ 'హు' అన్నాడు. తరువాత తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. కొంపతీసి ఇక్కడే నిద్రపోతాడా ఏమిటి అనుకుంది.అంతలో అదృష్టవశాత్తు అతడు కళ్లు తెరిచాడు.
తెరిచి అన్నాడు, "సొరంగం" చాలాకాలం క్రితం త్రవ్వబడింది. ఆఖరి మూడు అడుగుల మాత్రం మొన్న మొన్న తవ్వాడు."
వైజయంతి ఏమీ మాట్లాడలేదు. ప్రశ్న కాకపోతే తనకీ సమాధానం చెప్పాల్సిన అవసరంలేదు.
"పోతే సొరంగం చాలాకాలం క్రితమే తవ్వబడినట్టూ దాఖలా ఏమీలేదు. అతడే దాన్ని కూడా తవ్వి ఉండవచ్చుకూడా. పోతే ఆఖరి మూడు అడుగులు మాత్రం ఆ రోజే తవ్వినట్టు బుజువులున్నాయి- మట్టి తడి ఆరలేదు కాబట్టి! మొత్తానికి అదృష్టవంతుడు. ఉరి రోజు నాటికి సరిగ్గా బయటపడగలిగాడు. మీరేమనుకోకపోతేకాస్త మంచినీళ్ళు ఇస్తారా!"
యధాలాపంగా వింటున్న వైజయంతి చివరి ప్రశ్నకు తెప్పరిల్లి లేచి వెళ్ళి నీళ్ళు తెచ్చి అందించింది. అవి తాగగానే అతడి బట్టతలలోంచి చెమట ధారాపాతంగా కారసాగింది. కర్చీఫ్ తో దాన్ని తుడుచుకుంటూ "మీరు చెప్పవలసింది ఇంకేమైనా వుందా మేడమ్?" అని అడిగాడు.
ఆమె తల అడ్డంగా వూపింది.
"రిపోర్టు చిన్నదిగా వుంటే మా డి.ఎస్పీకి నచ్చదు. దొంగ దొరికినా దొరక్కపోయినా రిపోర్టు మాత్రం నాలాగా లావుగా వుండాలి."
ఆమె నవ్వింది. ఇతను సినిమాల్లో చేరివుంటే మంచి కమేడియన్ అయి వుండేవాడు. ఆమెకి కొంచెం చొరవ వచ్చింది. "మా స్వామినాయుడు గారి మర్డర్ కేసు ఏమయింది?" అని అడిగింది.
"నేనుకాదు ఆ ఫైలు డీల్ చేస్తున్నది, ఇంకో ఇన్ స్పెక్టర్. అయినా మీ పత్రికల వాళ్ళకి ఏమీ చెప్పకూడదు. ఏం చెప్పినా పత్రికల్లోకి ఎక్కించేస్తారు."
"విలేఖరిగా మీ ఇంటికి రాలేదుగా! మామూలుగా అడుగు తున్నాను చెప్పండి" నవ్వుతూ అడిగింది.
అతడు రహస్యం చెప్తునట్టూ "స్వామినాయుడింట్లో పట్నాయక్ వేలిముద్రలున్నాయి" అన్నాడు. ఆమె మొహంలో ఏ మార్పూ లేదు. మనసులో మాత్రం 'ఓహో తెలిసిపోయిందన్న మాట' అనుకుంది.
అతడు అన్నాడు, "పట్నాయక్ జైలుముందున్న సెంట్రీ విష్ణుశర్మ, మామూలు పోలీసుకన్నా చాలా తెలివైనవాడు. అతడు నొక్కిచెప్తున్నాడు. "పట్నాయక్ లో మార్పు చివరిరోజే వచ్చిం'దని అదేమిటో మాకు అంతుబట్టడంలేదు."
"చావు దగ్గిరపడుతున్న కొద్దీ మనిషిలో మార్పు సహజమే కదా" అంది.
"ఆ మార్పు మీరూ గుర్తించారా?"
"ఆఁ ఇంటర్వ్యూలో గుర్తించాను."
"అవునన్నట్టూ మీరు ఆ ఇంటర్వ్యూ అసలు ప్రచురించలేదేం?'
ఈ ప్రశ్న అడుగుతాడని ముందే దానికి సిద్ధపడింది. అందువల్ల తడుముకోకుండా "అతడి ఇంటర్వ్యూ పెద్దగా ఉపయోగపడేలా కనబడలేదు. అన్నీ జోకులేసేడు."
"తప్పించుకోగలనని తెలుసున్న మాట. అందుకే తృళ్ళుతూ పేలుతూ జవాబులిచ్చి ఉంటాడు".
"అంతే అయి వుంటుంది" అని తేల్చేసింది.
ఆమెకు ఈ సంభాషణ మీద ఉత్సాహం పోయింది. ఇఅతడు తీరిగ్గా లోకాభిరామాయణం మాట్లాడేటట్లు ఉన్నాడు. 'ఇక వెళతారా' అని డైరెక్టుగా అడగలేక వాచీ చూసుకుంది. అతడు దాన్ని గుర్తించలేదు. అయినా అంత సున్నితమైనా వాటిని గుర్తిస్తే పోలీస్ డిపార్టుమెంటులోకి ఎలా వస్తాడు?
"మా డి.యస్పీ....." అన్నాడు. "అతగాడికి ఫైలు పెద్దది అయితేగాని బావుండదు. మీకు వీలైతే ఆ ఇంటర్వ్యూ కాపీ ఒకటి ఇవ్వగలరా? ఫైల్లో పెడతాను."
"వ్రాయలేదు."
అతడు జేబులోంచి కాసెట్టు తీసి "ఇదేనా ఆ కాసెట్టు" అన్నాడు. ఆమె విస్మయంతో "ఇదెవరిచ్చారు మీకు?" అని అడిగింది.
"మీ ఆఫీసులో తీసుకున్నాను మేడమ్. తరువాత మా ఆఫీసుకెళ్ళి ఈ టేపు పెట్టుకుని వింటూ మొత్తం ఇంటర్వ్యూ అంతా వ్రాసుకున్నాను. ఆరు పేజీలు వచ్చింది. మీరన్నట్టూ అన్నీ జోకులే వేసేడు." -అంటూ కాగితాలు అందించాడు. ఆమె కళ్ళు వాటివెంట పరుగెత్తినయ్. "-మిస్టర్ పట్నాయక్! నేను ఆంధ్రశోభ ఆఫీసు నుంచి వచ్చాను, మీతో ఇంటర్వ్యూ కోసం...."
"......అడగండి చెప్తాను."
"మీరు రామన్ ని హత్య చేశారా?"
".....చేశాను."
"ఒక సాటి మనిషిని హత్య చేయటం దారుణం అని మీరు భావించటం లేదా....."
ఇలా సాగింది ఇంటర్వ్యూ. ఆమె కాగితాలు తిరిగి అందిస్తూ "...ఇదే" అంది. ఇంటర్వ్యూ చాలా పకడ్బందీగా రికార్డు చేసినందుకు మనసులోనే సంతోషించింది. అతడు ఇంత ఓపిగ్గా ఇదంతా వ్రాసుకున్నందుకు కూడా సంతోషించింది.
"మీరన్నది నిజమే మేడమ్. ఈ ఇంటర్వ్యూలో ప్రజలకి నచ్చేది ఏదీ లేదు" అంటూ తిరిగి నిట్టూర్చాడు. ఈ కుర్చీ అతడికి సరిపోవటం లేదు.
"ఈ ఇంటర్వ్యూ అంతా వ్రాసుకుంటుంటే నాకో అనుమానం వచ్చింది మేడమ్" అంటూ ఒక వాక్యం చూపించాడు. ఆమె దాన్ని తిరిగి చదివింది. "సాటి మనిషిని హత్య చేయటం దారుణం అని మీరు భావించటం లేదా?" అన్న వాక్యం అది. ఆమె చదవటం కొనసాగించింది. "జీవితం మొత్తం ధారపోసి నేను కనుక్కున్నా ట్రూత్ టెల్లర్ ని తనదని అతననటం అంతకన్నా దారుణం....."
"కొద్దిగా మంచినీళ్ళు మీ గ్లాసుతో ఇస్తావా?"
"తప్పకుండా" (సెంట్రీ గొంతు)
"........ట్రూత్ టెల్లర్ కనుక్కున్నది మీరే అనుకుందాం. దాన్ని అతడు తనదే అన్నాడు అనుకుందాం. అయితే హత్య చేసెయ్యటమేనా?' చదవటం ఆపి- ఆమె తలెత్తి "ఇందులో మీకేం అనుమానం వచ్చింది?' అని అడిగింది.
"రాగానే నేను మిమ్మల్ని మంచినీళ్ళు అడిగాను మేడమ్. కానీ 'మీ గ్లాసుతో' అని అడగటం విచిత్రంగా కనిపించింది. బహుశ నా ఉద్దేశ్యంలో, ఒక ఖైదీ గ్లాసుతో తాగటం ఎందుకని మీరు అలా అడిగి వుంటారు. అవునా?"
"అవును. ఆ సెల్ లో జెర్మన్ సిల్వర్ గ్లాసు చాలా అసహ్యంగా వుంది."
"మీ దగ్గిర ఇంట్లో టేప్ రికార్డర్ వుందా మేడమ్?"
"వుంది ఏం?"
"ఏం లేదు. ఈ క్యాసెట్ ఇంకోసారి వినిపిద్దామని"
"ఎందుకు?"
"మధ్యలో ఒకచోట టేప్ ఆగిపోయినట్టూ 'టప్' మన్న చప్పుడు వుంది. తరువాత మళ్లీ ప్లే నొక్కారు. మీకేమైనా జ్ఞాపకం వుందా?"
వైజయంతికి మొట్టమొదటిసారిగా భయం వేసింది. అయినా వెంటనే తమాయించుకుని-
"మధ్యలో ఎక్కడో క్యాసెట్టు సరిగ్గా లేక ఆగిపోయి వుంటుంది. అది మామూలేగా" అంది.
"మామూలే మేడమ్. అలా ఎక్కడైనా ఆగిపోయిందేమో, మీకు జ్ఞాపకం వుందా అని అడిగానంతే."
"ఎక్కడయిందో జ్ఞాపకం వుందా?"
"అయినట్టూ..... అయినట్టూ......ఆఁ, ఒకసారి అయింది. ఆఁ' ఆఁ కరక్టే- మళ్ళీ కంటిన్యూ చేశాను కూడా."
అతడు చొరవగా లేచి, బల్లమీదున్న ఆమె టేప్ రికార్డర్ లో తనతో పాటూ తెచ్చిన క్యాసెట్ పెట్టాడు.
మొదటినుంచి సంభాషణ వినబడింది ఫైల్లో అతడు వ్రాసుకున్నది. "మొత్తం జీవితం అంతా ధారపోసి నేను కనుక్కున ట్రూత్ టెల్లర్ తనదని అతననటం అంతకన్నా దారుణం-" పట్నాయక్ గొంతు.
"కొద్దిగా మంచినీళ్ళు మీ గ్లాసుతో ఇస్తావా?" తన గొంతు.
"తప్పకుండా" సెంట్రీ గొంతు.
"టప్" టేప్ రికార్డర్ ఆగిందో క్షణం.....నిశ్శబ్దం- మళ్ళీ తన గొంతు.
"ట్రూత్ టెల్లర్ కనుక్కున్నది మీరే అనుకుందాం. దాన్ని అతడు తనదే అన్నాడని అనుకుందాం. అయితే హత్య చేసెయ్యటమేనా?"
జార్జి టేపు ఆపుచేస్తూ "ఇక్కడేనా మేడమ్, మీరు అన్నట్టు టేపు ఆగి పోయింది?' అని అడిగాడు.
"అక్కడే కానీ వెంటనే దాన్ని తిరిగి 'ఆన్' చేసి ఇంటర్వ్యూ ప్రారంభించాను. మీరే చూశారుగా, సంభాషణ కంటిన్యూ అయింది. ఎక్కడా బ్రేక్ లేదు" ధీమాగా చెప్పింది.
"ఇంకెక్కడా టేపు ఆగలేదుగా- ఇప్పుడు జరిగినట్టూ."