అందరూ ఎందుకెళ్తారో. అందుకే నానుంచీ నేను తప్పించుకు పారిపోవటానికి!."
నిజంగా తెల్లబోయాడు దేవిశంకర్.
"అంటే?"
"ఎందుకో నాకు తెలియదు. కానీ మనుష్యులంతా తమ నుంచి తాము తప్పించుకు పారిపోవటానికే ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్ళూ అలా పారిపోయే అవసరం నాకు రాదనుకున్నాను. కానీ నాకూ వచ్చింది."
దేవిశంకర్ కి అర్థమయింది. కళ్లప్పగించి చూశాడు కొడుకు వైపు.
"నువ్వు ఇంతకు ముందు ఎన్నడు నాతో ఇలా మాట్లాడలేదు."
"ఆ అవసరం రాలేదు"
"ఇప్పుడా! అవసరం ఏమొచ్చిందో చెప్పగలవా?"
"చెప్పలేను. ఊహించగలను."
"సెలవియ్యి!"
ఆ వెటకారం పట్టించుకోలేదు. సీరియస్ గా అన్నాడు" మనలో ప్రతీ ఒక్కరికీ వొరిజినల్ సెల్ఫ్ ఉంటుంది. అది మన ఐడియల్ సెల్ఫ్ అనుకోవచ్చు! దీనితో పూర్తిగా ఏకీభవించలేని సోషల్ సెల్ఫ్ ఉంటుంది. అదే మన వ్యక్తిత్వం. సమాజంలో మన ఉనికి! సోషల్ సెల్ఫ్ కీ, వొరిజినల్ సెల్ఫ్ కీ ఎంతో సంఘర్షణ ఎక్కువైనప్పుడు వొరిజినల్ సెల్ఫ్ ని ఎదుర్కోలేక వోటమిని అంగీకరించలేక మననుంచి మనం తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నిస్తాం."
"నిన్న నేను అలా పారిపోవాలనుకున్నాను."
తెల్లబోయి చూసింది యశోద. ఈ విషయాలన్నీ యశోదకి తెలిసినవే. అయినా వివేక్ ఇంత అనలిటకల్ గా ఆలోచిస్తాడని అనుకోలేదు. వివేక్ ప్రవర్తన ప్రసూనకి కూడా నచ్చలేదు. కానీ అతడు ఆ క్షణంలో మాట్లాడిన మాటలు మాత్రం నచ్చాయి. పెదవుల మీద విరిసిన హాసరేఖ బయటికి కనబడకుండా ముఖం కిందకి దించుకుంది.
వివేక్ మాటలు దేవిశంకర్ కి సరిగ్గా అర్థం కాలేదు. అతడు చుట్టుపక్కల వాళ్లని డామినేట్ చేస్తాడు.
కానీ ఆ డామినేషన్ వివేకంతో కాదు. గడుసుతనంతో.. ఎదుటి వాళ్ల మనసులు మమతతో వశపరుచుకోవడానికి ప్రయత్నించడు. అహంకారంతో పెత్తనం చెలాయించాలని చూస్తాడు. వివేక్ మాటలు అతడి అహంకారాన్ని రెచ్చగొట్టాయి.
"దీనికంతటికీ వెనక ఎవరున్నారో నాకు తెలుసు" గుర్రుగా యశోదని చూస్తూ అన్నాడు దేవిశంకర్.
"యూ ఆర్ రాంగ్! యశోద ఉన్నదినా వెనక కాదు. నా పక్కన అలాగే యశోద పక్కన నేనూ ఉన్నాను."
దిమ్మెరపోయాడు దేవిశంకర్.
"ఇదంతా నేను సహించనని నీకు తెలీదేమో?"
"ఆ విషయం నేనూ ఆలోచించలేదు. ఇంతవరకూ సహించమని నేను కోరటం లేదు కదా"
"అయితే?"
లేచాడు దేవిశంకర్. వివేక్ లేవలేదు. తండ్రినే చూస్తున్నాడు. వాక్యం పూర్తి చెయ్యమన్నట్లు.....
"మరోసారి నువ్విరకంగా నా కంట పడితే పరిణామాలు సవ్యంగా ఉండవు!"
"మీరు ఆ రకంగా నా కంట పడటం ఇష్టం లేదు. కానీ నేనేం చెయ్యగలిగాను! ఎవరమూ ఏమి చెయ్యలేము."
లోలోపల వణికింది ప్రసూన. తననింత ధిక్కరించి మాట్లాడే వ్యక్తిని దేవిశంకర్ క్షమించడు. అది కొడుకే అయితే ఏమవుతుందో?.
దేవిశంకర్ ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ యశోద వంక కౄరంగా చూసి మరీ వెళ్ళాడు.
* * *
సైకాలజీ పుస్తకం చదువుకుంటూ వాలు కుర్చీలో పడుకుంది యశోద. పుస్తకం చేతిలో ఉన్నా మావగారి కౄరమైన చూపు గుర్తొచ్చి శరీరం గగుర్పొడిచింది. భయంతో..... అనాలోచితంగా ఏదో వాగురలో చిక్కుకున్నట్లు బెదురు కలుగుతుంది.
తలుపు మీద చిన్న టిక్ చేసిన చప్పుడయింది. విని కూడా వెంటనే లేవలేకపోయింది. గొంతు తడారిపోసాగింది. చప్పుడు మళ్ళీ అయింది.
"లోపలికి రావచ్చునా?" ప్రసూన గొంతు వినిపించింది.
"రండి!" వెంటనే అంది యశోద.
ప్రసూన. యశోదా వివేక్ ల బెడ్ రూంలోకి అప్పటి వరకూ రాలేదు.
"కూచోండి!"
ప్రసూన కూర్చునే వరకూ నిలబడే ఉంది. తర్వాత కూర్చుంది.
"అదేం పుస్తకం?"
"ఏదో సైకాలజీకి సంబంధించింది."
"ఎన్ని సైకాలజీలు చదివినా మనుషుల మనసులు అర్థం కావు! ఈ మనిషి మనసు ఈ రకంగా ఉంటుందని అంచనా వేయలేము."
యశోద మాట్లాడలేదు.
"నిన్న మీ ఇద్దరూ వెళ్ళినది బ్లూ స్టార్ హోటల్ కేనా?"
సమాధానం చెప్పలేదు యశోద.
"ఒకపని చెయ్యటానికి ఉన్న ధైర్యం దాని గురించి మాట్లాడటానికి లేదా? మాట్లాడు! నేను అందుకోసమే వచ్చాను. నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను!"
"అక్కడికే వెళ్ళాం" నెమ్మదిగా చెప్పింది యశోద.
"అలాంటి చోట్లకి వాడు వెళ్లకుండా వాడి పసితనం నుంచీ ఎంతో ప్రయత్నించి ఆ ప్రకారంగా పెంచాం. అంతా క్షణంలో బూడిదై పోయింది. దీని వెనుక ఏదైనా కారణం ఉందా? ఏదో బలమైన కారణం ఉందని అనిపిస్తోంది...."
దిగ్గున తలెత్తి చూసింది యశోద.
"అంటే......? చిన్నప్పట్నుండీ పాపం, పుణ్యం ఇలాంటివి మీ అబ్బాయికి నూరి పోశారా? ఇలాంటి పనులు పాపమని! ఇవి చేస్తే నరకంలో శిక్షలనుభవిస్తారని.....!"