Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 25


    యస్తేస్తనః శశయో యోమయో భూర్యోరత్నధా వసువిద్యాః సుదత్రః |
    యేనవిశ్వాపుష్యసి వీర్యాణి సరస్వతి తమిహదాతవోకః ఉర్వ్య న్తరిక్షమన్వేమి ||

                                     అయిదవ ప్రపాఠకము

                                     మొదటి అనువాకము

        (1 - 4 అనువాకములందు పునరాధేయము చెప్పబడినది.)

    1. పూర్వము దేవతలు అసురులు యుద్ధము చేసినారు. అందు దేవతలు జయించినారు. వారినుండి ధనమును గుంజుకున్నారు.

    రాక్షసులు మరల జయింతురేమో అనుకున్నాడు దేవతలు. ఆ డబ్బు అప్పుడు పనికి వచ్చునని అగ్ని దగ్గర దాచినారు.

    అగ్ని ఆ ధనమును తనది చేసికొనదలచినాడు. ఆ ధనముతో పారిపోయినాడు.

    అదృష్టవశమున దేవతలు మరల గెలిచినారు. గెలిచిన వారు అగ్ని వద్ద ఉన్న ధనము సాధించ దలచినారు. అగ్నిని వెన్నంటినారు. ఆ ధనమును బలవంతముగా లాగుకొనదలచినారు. అప్పుడు సోరోదీద్యరోదీత్తద్రుద్రస్య రుద్రత్వం - అగ్ని పెద్దగా ఏడ్చినాడు. అందువలన రుద్రత్వము - ఏడ్చు - ఏర్పడినది.

    అగ్ని అట్లు ఏడ్చుట వలన కన్నీరు కారినది. ఆ కన్నీరు - రజతగం హిరణ్యమభవత్ - వెండి యను ధనము అయినది. అందువలన యజ్ఞములందు రజతము అదక్షిణ్యము - ఇవ్వదగనిది - అయినది.

    యజ్ఞములందు కన్నీట పుట్టిన రజతమును దక్షిణగా ఇచ్చిన యజమాని ఇంట సంవత్సరము లోపల ఏడుపులు వినిపించును.

    తస్మాద్బర్హిశీన దేయగం - అందువలన - వెండిని - యజ్ఞములందు దానము చేయకూడదు.

    2. "నేను ముందు యజ్ఞహవిస్సునందు అసాధారణ భాగస్వామిని అగుదును. అప్పుడు మీకు ఈ ధనమును ఇత్తును" అని అగ్ని దేవతలతో అన్నాడు.

    అప్పుడు దేవతలు అగ్నికి "పునరాధేయము" అను హవిర్భాగమును ఇచ్చినారు. 'ఇది స్వర్గమునందు బలము కలిగించు' నని అగ్నితో అన్నారు.

    అగ్ని అందుకు సంతృప్తుడు అయినాడు. 'అస్మద్దేవతాకమైన పునరాధేయము చేసి అగ్నినాధానము చేసిన వాడు సమృద్ధి కలవాడు అగును' అని అగ్ని వక్కాణించినాడు.

    3. పూష ఆ అగ్నిని ఆధానము చేసినాడు. అందువలన అతనికి పశుసమృద్ధి కలిగినది. అట్లగుట చేత పశువులు పూషదేవతాకము లయినవి.

    త్వష్ట ఆ అగ్నిని ఆధానము చేసినాడు. అందువలన త్వష్టకు పశుసమృద్ధి కలిగినది. అట్లగుట చేత పశువులు త్వష్టదేవతాకములు అయినవి.

    మనువు ఆ అగ్నిని ఆధానము చేసినాడు. అందువలన మనువునకు ప్రజాసమృద్ధి కలిగినది. అట్లగుట వలన ప్రజలు మానవులు అయినారు.

    బ్రహ్మ ఆ అగ్నిని ఆధానము చేసినాడు. అందువలన ధాతకు ప్రజాసమృద్ధి కలిగినది. సంవత్సరోవైధాతా - ధాత సంవత్సరమగుచున్నాడు. తస్మాత్సంవత్సరం ప్రజాః పశవోను ప్రజాయన్తే - అందువలన ప్రతి సంవత్సరము ప్రజలు, పశువులు ఎక్కువగా పుట్టుచున్నవి.

    4. పునరాధానము చేయబడిన అగ్నియొక్క సమృద్ధిని తెలిసికొన్నవాడు నిశ్చయముగా సమృద్దుడు అగుచున్నాడు.

    5. అగ్నికి పూషాది దేవతలతో గల సంబంధము తెలిసి కొన్నవాడు బంధువులు కలవాడగుచున్నాడు.

    6. అగ్నికి మొదట ఆధానము చేసినారు. అప్పుడు అగ్ని అధిక భాగదేయము కోరినాడు. అట్లు కోరినవాడై యజమాని ప్రజకు, సంతానమునకు ఉపద్రవము కలిగించినాడు.

    కావున మొదట ఆధానము చేసిన అగ్నిని ఉద్వాసన చేయవలెను. మరల అగ్నిని ఆధానము చేయవలెను. అగ్ని - ఆ విధముగా చేసిన యజమానికి - సమృద్ధి కలిగించును.

    అథోశాన్తిరేవాస్యైషా - ఇదియే ఈ అగ్నికి శాంతి యగును.

    7. నక్షత్రములందు పునర్వసు పునరాధేయాగ్నికి సంబంధించిన దగును. ఆ విధముగా చేసినట్లయిన యజమాని నక్షత్రాభిమాని యందు ఆధానము చేసినట్లగును. అందువలన యజమానికి బ్రహ్మవర్చస్సు కలుగును.

    8. దర్భలచే పునరాధానము చేసిన సారము చెడదు. పుల్లలచే పునరాధానము చేసిన సారము చెడిపోవును.

    9. దర్భలచే పునరాధానము చేసినట్లయిన దర్భలకు కారణమగు జలములు, ఓషధుల నుండి అగ్నిని సముపార్జించినట్లగును. యజమాని సక్రమముగా పునరాధానము చేసినవాడగును.

    10. పురోడాశము అయిదుపాత్రలందు ఉంచవలెను. ఆ విధముగా చేసిన అయిదు ఋతువులనుండియే అగ్నిని సముపార్జించినట్లును - ఆధానము చేసినట్లును అగును.

    (ఒక వ్రతమును గురించిన వృత్తాంతము - వ్రతము వలన కలుగు నిశ్చితఫలము - దోషాచరణ వలన కలుగు ఉపద్రవము చెప్పుట ఇదియే మొదలుగా కనిపించుచున్నది.)

                                   రెండవ అనువాకము

    1. అగ్నిని ఉద్వాసన చేసిన యజమాని తన యజ్ఞమును, పశువులను నాశనము చేసికొనిన వాడు అగుచున్నాడు.

    పురోడాశము అయిదు పాత్రలందు సంస్కరించబడుచున్నది. అందువలన యజ్ఞము పాంక్తము పశువులు పాంక్తములు. కావున యజమాని - అగ్నిని ఉద్వాసనచేయని వాడు - పశువులను యజ్ఞములను పొందుచున్నాడు.

    (పంక్తి ఒక ఛందస్సు.)

    2. అగ్ని దేవతలందు వీరుడు. కావున యజమాని అగ్నిని ఉద్వాసన చేయరాదు. అట్లు చేసిన యజమాని అగ్నిహంత అగుచున్నాడు. పూర్వము సత్యనిష్ఠులగు విప్రులు అగ్నిహంత యజమాని వద్ద అన్నము తినుట మానుకున్నారు.

    యాజ్యాను వాక్యములు అయిదు. 2  చేతులు + 2 కాళ్లు + 1 తల వలన మానవుడు అయిదింటివాడు.

    కావున దేవతలందు అగ్రగణ్యుడగు అగ్నిని వేరుచేసినచో పునరాధానము చేయవలెను.

    3. అగ్ని శతాక్షరుడు. మానవుడు నూరేండ్లు జీవించువాడు. శతేంద్రియుడు. శతాయుష్యము శతేంద్రియములందు ప్రతిష్ఠించబడుచున్నది.

    4. యజమాని పునరాధానము చేయును. కోరికలు తీరవు. సమృద్ధి కలుగదు. అప్పుడు సర్వము అగ్నిదేవతాకమైన యజమానికి సమృద్ధికలుగును.

    5. అగ్నిని ఉద్వాసన చేసిన యజమాని మాట ఇంటి వరకే అగుచున్నది. వాక్కును అనుసరించి అతనికి పరాభవము కలుగుచున్నది.

 Previous Page Next Page