Previous Page Next Page 
అంకితం పేజి 25


    "అర్థమైంది డాక్టర్" లేచాను.

    వస్తుంటే మృణాళిని గది కనిపించింది. తలుపు దగ్గరికి వేసివుంది. లోపల ఎన్నోసార్లు ఆమెతో ఆత్మీయతని పంచుకున్నాను. ఈ రోజు మహారధితో మాట్లాడాక ఎన్నోసార్లు ఆమెతో ఆత్మీయతని పంచుకున్నాను. ఈ రోజు మహారధితో మాట్లాడాక ఏం చేయాలో తెలీని పరిస్థితి ఏర్పడింది. అది పొగొట్టగలిగేది కేవలం మృణాళిని సాంగత్యమే. కాని మృణాళిని లేదు. ఆమె ఇచ్చే అమృతంలాంటి కాఫీ వుండదు.

    అక్కణ్నుంచి అంకిత్ గదిలోకి వెళ్ళాను. అంకిత్ మెలకువగానే వున్నాడు. అయినా నాతో మాట్లాడలేదు. నన్ను చూడగానే మొహం అటు తిప్పుకున్నాడు.



                         *    *    *

    ఇంటికొచ్చి బట్టలు మార్చుకుంటూండగా ఫోన్ మ్రోగింది.

    వెళ్ళి రిసీవర్ తీశాను "హలో".......

    "నేనూ....... జాన్ ని......."

    క్షణంలో నేను అటెన్షన్ లోకి వచ్చేశాను.

    "సుమద్యుతి వూర్నుండి వచ్చిందా?" ఆత్రుతగా అడిగాను.

    "రావడమేమిటి? తన ఇంట్లోనే వుంది."

    "వాట్?" నా అరుపు గది గోడలమధ్య ప్రతిధ్వనించింది.

    "అవును! సుమద్యుతి తన ఇంట్లోనే వుంది. అయితే బయటనుండి మాత్రం తాళంవేసి వుంది. ఉదయం నేను వెళ్ళేసరికి రెండో అంతస్థు కిటికీలోంచి బయటికి చూస్తోంది! నేను ఆశ్చర్యపోయి కారాపి దిగేసరికి చప్పున కిటికీ తలుపు మూసేసింది. నా కనుమానం వేసి ప్రక్క ఇంటి వాళ్ళని వాకబుచేస్తే ఆమె భర్త అనుమానం మనిషనీ, ఆమెను బయటికి రానివ్వకుండా ఇంటికి ఎప్పుడూ తాళంవేసి వెళతాడనీ తెల్సింది."

    "ఓ గాడ్! అంటే మనం కేవలం పదడుగుల దూరంలోనే ఆమెను మిస్సయ్యామన్నమాట."

    "అవును! మరిప్పుడేం చేద్దాం?"

    "నువ్వటుకేసి ఇక వెళ్ళకు. నేను వెంటనే హైదరాబాద్ కి వచ్చేస్తాను. అప్పుడు డిసైడ్ చేద్దాం" చెప్పాను.

    "అలాగే."

    "నీ ఆరోగ్యం ఎలా వుంది?"

    అటువేపు కొద్ది నిశ్శబ్దం తర్వాత జాన్ నెమ్మదిగా అన్నాడు, అంకిత్ కిడ్నీ లాగా!" చెప్పి ఫోన్ పెట్టేశాడు.


                             11


    మనుష్యులందరూ మనుష్యుల్లా బ్రతుకుతా రానుకోవటం పొరపాటు. లా బ్రతకటం ప్రారంభిస్తే...... భూలోకమెప్పుడో స్వర్గమై వుండేది.


                        *    *    *

    హైదరాబాద్ దిగేసరికి రాత్రి పదయింది.

    స్టేషన్ దిగగానే జాన్ ఇంటికి వెళ్ళాను. నా ఉద్దేశ్యం ఈ రాత్రికే సుమని కలుసుకోవాలని.

    నన్ను చూడగానే జాన్ - "రా రా! నీ కోసమే చూస్తున్నాను" అని అన్నాడు. బ్రీఫ్ కేస్ ప్రక్కన పెట్టి సోఫాలో కూలబడుతూ- "కొద్దిగా కాఫీ ఇవ్వగలవా దయా" అన్నాను.

    "కాఫీదేముంది? ముందు భోంచేయండి" అందామె.

    "లేదమ్మా! ముందు మేమిద్దరం  వెళ్ళి సుమని కలవాలి. ఆ తరువాతే ఏదయినా...." అంటూండగానే నా మాట వినకుండా ఆమె లోపలి వెళ్ళిపోయింది.

    "అది సరే! మరి ఆమెని ఎలా కలుస్తాం? బయటనుండి తాళంవేసి వుందిగా" అన్నాడు జాన్.

    చిన్నగా నవ్వాను. "ప్రతిపనీ ముఖద్వారం గుండా చేయటం కుదరదని ఈ మధ్యే అర్థమయింది. దొడ్డి గుమ్మంగుండా ప్రయత్నం చేద్దాం."

    తర్వాత దయ ఇచ్చిన కాఫీ త్రాగేసి జాన్, నేనూ కారులో బయలుదేరాం. కారుఆ వీధి మలుపు తిరుగుతుంటే అరచేతుల్లో చెమట పట్టసాగింది. చుట్టూ చీకటి, ఖరీదయిన లొకాలిటీ అవటంవల్ల.....పదకొండింటికే అక్కడ నిర్మానుష్యంగా వుంది. కారునలాగే వీధి చివరికి తీసుకు వెళ్ళి ఓ చెట్టు క్రింద ఆపాను.

    "ఇక్కడాపావేం?" అడిగాడు జాన్.

    "ఇంటిముందు కారాగి వుంటే కృపానంద్ గానీ వచ్చిచూస్తే ఇంకేమయినా వుందా? అదీగాక చుట్టుప్రక్కలవాళ్ళు చూసినా ప్రమాదమే" చెప్పేసి కదిలాను. నా వెనకే జాన్ గబగబా వస్తూ "చాలా థ్రిల్లింగ్ గా వుంది. ఏదో అడ్వంచర్ సినిమాలోలా అనిపిస్తోంది" అన్నాడు.

    "ఆమెగానీ వప్పుకోకపొతే ట్రాజెడీ సినిమాలా వుంటుంది మన పరిస్థితి" చెప్పాను అనాసక్తంగా. నాకెందుకో టెన్షన్ గా అనిపించలేదు. ఈ పని సవ్యంగా జరగదు అనిపిస్తోంది. నా మూడ్ గమనించినట్టు జాన్ గట్టిగా నవ్వేసి, చప్పున సైలెంటయిపోతూ........ "పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన బెట్టుకెళ్ళడమంటే ఇదే" అన్నాడు.

    "అంటే......?"

    "నన్ను నీ వెంట తీసుకురావడం!"

    ఈసారి నేను కూడా చిన్నగా నవ్వాను. ఇంటిగేటు ముందాగి తలుపువేపు చూశాను. తాళం వుంది. అంటే కృపానంద్ రానట్టే. జాన్ సైగచేసి అటూ యిటూ చూశాడు. తరువాత శబ్దం కాకుండా గేట్ ఎక్కి లోపలివేపు దూకేశాను. జాన్ కూడా నా వెనకే లోపలికి దూకేశాడు. అడుగుల చప్పుడు వినిపించకుండా మెల్లమెల్లగా ఇంటి వెనకవేపు నడిచాను. అటువేపు పైపు లైన్ వుంది. జాన్ ని క్రిందే వుండమని చెప్పి, కిటికీ మీద కాలుపెట్టి పైప్ పట్టుకుని కొద్దిగా పైకి ప్రాకాను. కిటికీపై వున్న షెడ్ స్టోన్ మీద కాలు పెట్టి బాల్కనీకి వున్న రాడ్ పట్టుకుని మెల్లమెల్లగా గాల్లో ఊగుతూ ఆ రాడ్ పైవరకూ చేతులు కదిలించాను. అరసెకనులో బాల్కనీ రైలింగ్ పై వున్న ఫ్రెమ్ మీద పడ్డాయి నా చేతులు కదిలించాను. అరసెకనులో బాల్కనీ రైలింగ్ పై వున్న ఫ్రేమ్ మీద పడ్డాయి నా చేతులు. అయితే......ఇక ఆలస్యం చేయలేదు. చప్పుడు కాకుండా బాల్కనీలోకి దూకేసాను.

    క్రిందికి తొంగిచూసి, జాన్ ని జాగ్రత్తగా చూస్తూండమని సైగచేశాను. బాల్కనీలోంచి గదులన్నిటి చుట్టూ సన్నటి వరండా వుంది. ఆమె బెడ్ రూం ఎక్కడ వుంటుందో తెలీదు. కుడివేపు నడిచాను. కిటికీలన్ని మూసేసి వున్నాయి. వెలుగు కనిపించిన గదివేపు నడిచాను.

    నా అదృష్టం, ఆ కిటికీ తీసేవుంది.

    నెమ్మదిగా నడిచి కిటికీలోంచి తొంగిచూసాను. గదిలో ఇంకా లైటు వెలుగుతూనే వుంది. టేబుల్ దగ్గర అటువేపు కూర్చుని ఏదో రాసుకుంటోంది సుమద్యుతి!!

    ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయిన అనుభూతి.

    ఈమె కోసమే......ఈమె కోసమేగా ఇంతకాలం వెతికింది.

    కానీ......కానీ ఏమని పిలివాలి?

    నన్ను చూడగానే ఆమె దొంగననుకుని అరిస్తే?!

    నాకు ధైర్యం చాలలేదు. గుండె గబగబా కొట్టుకోసాగింది. తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ వల్ల నా గొంతు కూడా నా స్వాధీనంలోంచి తప్పిపోయిందేమో అనిపిస్తోంది. కానీ 'సమస్య' గుర్తు రాగానే నా సందిగ్ధం దూరమైంది. కిటికీలోంచి చూస్తూ సన్నటి స్వరంతో......'సుమా' అని పిల్చాను.

    ఆ నిశ్శబ్దంలో...... అంత రాత్రిపూట..... నా కంఠం నంచి వచ్చిన శబ్దం బాంబులా పేలి, ఎవర్నైనా భయభ్రాంతుల్ని చేసేట్టు వుంది. సుమద్యుతి చేతిలోంచి కలం జారి నేలమీద పడిపోయింది. చప్పున తల తిప్పి కిటికీవైపు చూసి, కెవ్వున అరవబోయింది...... "అరవకండి...... నేను దొంగని కాను" అన్నాను.

    ఆమె అలాగే అపనమ్మకంగా చూస్తూ వణుకుతూన్న స్వరంతో......'ఎ.....ఎవరు మరి?' అని అడిగింది.

    "కాలేజీలో మీ క్లాస్ మేట్ ని......" అంటూ నా పేరు చెప్పాను. పది సంవత్సరాలపైగా, కాలం జ్ఞాపకాల్ని సమాధిచేసిన తరువాత, అంతకన్నా చనువుగా ఎలా మాట్లాడాలో నాకు తెలియలేదు.

    సుమద్యుతి మొహంలో భావాలు నాకు స్పష్టంగా కనపడటం లేదు. ఆమె అలాగే, స్థాణువులా, శిలా ప్రతిమలా నిశ్చేష్టంగా నిలబడిపోయి వుంది. చీకట్లో వున్న నేను...... ఆమెకి సరిగ్గా కనపడే అవకాశం లేదు. ఆమె నిశ్చలతకు బహుశా అదే కారణం అయివుంటుంది. అంతేకాదు, పది సంవత్సరాల తరువాత, అర్థరాత్రి బాల్కానీ మీంచి పైకెక్కి అకస్మాత్తుగా ప్రత్యక్షమై......... "నేను నీ స్నేహితుడ్ని" అంటే ఎవరయినా సరే ఆమెలాగే కన్ ప్యూజ్ అవుతారు.

    "దయచేసి నన్ను లోపలికి రానివ్వండి.......పూర్తిగా వివరిస్తాను" అన్నాను.

    ఆమె దాదాపు హిస్టీరిక్ గా, "నా భర్తే మిమ్మల్ని పంపించి వుంటాడు. ఇదంతా నన్ను పరీక్షించటానికి ఆడే నాటకం" అని అరిచింది.

    ఆ స్థితిలో కూడా ఆమెపట్ల నాకు జాలి కలిగింది. నేనెవరో చెప్పాక కూడా ఆమె నన్ను గుర్తించటానికి, పది సంవత్సరాలు.......మరీ సుదీర్ఘమైన కాలం కాదు. మా అనుబంధం కేవలం 'క్లాస్ మేట్స్' అన్నదే కాదు. అయినా ఆమె ఇలా ప్రవర్తిస్తున్నదంటే, ఆమె భర్త, తన సాడిస్టిక్ ప్రవర్తనతో ఆమెను ఎంతగా భయపెట్టాడో అర్థమవుతోంది.

    "నేను మీకు బహుమతిగా ఇచ్చిన పుస్తకం గురించి చెప్పినా నా మీద నమ్మకం కలగదా?" చివరి అస్త్రంగా అన్నాను.

    ఆమె అపనమ్మకంగా నడుస్తూ తలుపు తీసింది. నన్ను చూడగానే ఆమెకి అనుమానం పోయింది. అయినా ఆ అర్థరాత్రి తాలూకు సందిగ్ధం వదల్లేదనుకుంటాను. "రండి" అంటూ గదిలోకి నడిచింది. నేను కదల్లేదు.


    ".......నా ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే.......ఇట్నుంచి ఇటే వెళ్ళిపోతాను. నాక్కావలసిన సమాధానం అది కాకపోతే" అన్నాను.

    నిజంగానే- నాక్కావలసిన సమాధానం కాకపోతే, ఈ అర్థరాత్రి అడ్వెంచర్ కి నేను జీవితాంతం సిగ్గుపడాలి.

    "ఏమిటా ప్రశ్న?" ఆమె అడిగింది అభావంగా. వివరాలన్నీ చెప్పి ఆమెను కన్ ప్యూజ్ చేయడం ఇష్టంలేక, "మా దగ్గర పెరుగుతున్న బిడ్డకి తల్లి మీరేనా.......?" అడిగాను క్లుప్తంగా.

    "నేనే" అంది మరింత క్లుప్తంగా.



                         *    *    *

    లోపలికి వెళ్ళాక ఆమె చూపించిన కుర్చీలో కూర్చున్నాను. ఒక్కసారిగా నాకెంతో రిలీఫ్ కలిగింది. భగీరధుడికి గంగని చూసాక కలిగే సంతోషం అది. గమ్యం ఇంకా చాలా దూరం వుందని నాకు తెలుసు. ఆమె నా ఎదురుగా నున్న కిటికీ దగ్గర నిలబడి "ఇప్పుడు చెప్పండి. ఇన్ని సంవత్సరాల తరువాత నా అవసరం ఏం కలిగింది?" అనడిగింది. ఆమె  అలా అడగటం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. కృపానంద్ తో సాంగత్య ఆమెను ఆవిధంగా తయారుచేసిందా.....?ఏమో......

    నేనేదో అనబోయే లోపల ఆమె సందిగ్దంగా చూస్తూ "అబ్బాయికి ఏం పేరు పెట్టారు?" అంది.

    "అంకిత్ " చెప్పాను.

    ఆమె పెదవులు అస్పష్టంగా ఆ పేరును ఉచ్ఛరించాయి. కొద్దిగా కళ్ళల్లో నీళ్ళు పేరుకుంటూండగా అంది. "నాకలా వాడిని మీ ఇంటి ముందు అప్పగించడం అసలు ఇష్టంలేదు. కానీ బలవంతంమీద వదిలివేయాల్సి వచ్చింది. లేకపోతే ఆయన చంపుతానని బెదిరించాడు" అని ఓక్షణం ఆగి,......ఆ శిశువుని" అంది.

 Previous Page Next Page