Previous Page Next Page 
తపస్వి పేజి 24

   
    "లోపలకు రావచ్చునా? నేను భాస్కరరావుగారి లాయర్ని."
    "భాస్కరరావుగారి లాయరా? ఎందుకొచ్చారు? నా మీద కేసు పెట్టడానికి మీకేమీ అధికారం లేదు. నేను ఆపరేషన్ చెయ్యనన్నాను. నాకు పేరు ప్రఖ్యాతులొచ్చాయి. అది నా తప్పా? నాకు ప్రఖ్యాతి తెచ్చి పెట్టమని మిమ్మల్ని నేను అడిగానా? మీరు మూర్ఖులయి....చవటలయి నన్ను ఆకాశానికెత్తేసి ఇప్పుడు నన్నంటే నేను ఊరుకోను! మీరంతా చవటలు, నేను కాదు!"
    ఆ లాయర్ తెల్లబోయి నిలబడ్డాడు.
    "మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావటం లేదు. భాస్కరరావుగారు మీకెంతటి మిత్రులో ఇప్పుడు బాగా అర్ధం అయింది. ఆయన మరణంతో మీకు మనఃస్థిమితమే చెడిపోయింది. ఆయన అలాంటి విల్లు రాయటంలో ఆశ్చర్యం లేదు!"
    "ఎలాంటి విల్లు?"
    "భాస్కరరావుగారు తన యావదాస్తినీ మీ పేర వ్రాశారు!"
    లాయర్ ఆ విల్లు వామనమూర్తి చేతిలో పెట్టాడు!
    చటుక్కున ఆ కాగితాలు క్రింద వదిలేశాడు వామనమూర్తి. ఆ కాగితాలన్నీ పిశాచాలుగా మారి తనను చూసి వికటాట్టహాసం చేస్తున్నట్లుగా అనిపించసాగింది.
    కోపంతో గట్టిగా అరుస్తూ "గెటౌట్! గెటౌట్!" అని  అరిచాడు.
    ఆ మూర్తిని చూసిన లాయర్ కు నిజంగానే భయం కలిగింది.
    "ఆ కాగితాలు జాగ్రత్తగా పెట్టుకోండి!" అనేసి వెళ్ళిపోయాడు.
    వామనమూర్తి ఆ కాగితాల మీద నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు. తల గిర్రున తిరుగుతోంది. మనసు మొద్దు బారి పోతోంది- సర్వాంగాలూ వణికిపోతున్నాయి. అయినా చూపులు మాత్రం కాగితాలను వదలటం లేదు.
    ఆ కాగితాలను చేతులలోకి తీసుకున్నాడు.
    ఏదో విషం మనసంతా వ్యాపించినట్లు తిమ్మిరెక్కింది.
    ఆ కాగితాలను బీరువాలో పెట్టి భద్రంగా తాళం వేశాడు.
    గది తలుపులు తెరిచాడు. అందంగా తయారయ్యాడు.
    హాస్పిటల్ కు బయలుదేరాడు.
    
                                     14
    
    సౌందర్య లాబ్ లోకి ప్రవేశించింది. తన రీసెర్చ్ లో మునిగి ఉన్న విక్రమ్ ఒకసారి తలెత్తి అంతలోనే తన పనిలో లీనమయిపోయాడు. ఒక స్టూల్ లాక్కొని కూర్చుంది సౌందర్య.
    ఒక గంట... రెండు గంటలు... మూడు గంటలు... గడిచాయి.
    కరెంటు ఆఫ్ చేసి అక్కడున్న ఒక బల్ల మీద సగం నడుం వాల్చి పడుకుని "థాంక్స్" అన్నాడు విక్రం.
    "ఎందుకూ? మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యనందుకా?"
    "మీరు నన్ను డిస్టర్బ్ చెయ్యరని నాకు తెలుసు. అలా డిస్టర్బ్ చెయ్యగలిగిన వారైతే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేవారు కాదు!"
    "అది కాదు. మీరు డిస్టర్బ్ కారని నాకు తెలుసు! అందుకే ఇక్కడ కూర్చోగలిగాను!"
    విక్రమ్ నవ్వాడు. అతనికి ఉల్లాసం కలిగినప్పుడు అతడు సమాధానం ఇచ్చే పద్దతి అదే! ఆ నవ్వు చూడటం సౌందర్యకు ఎంతో ఇష్టం!
    "నాకు థాంక్స్ ఎందుకు చెప్పారో చెప్పండి!"
    "మీరు రాబోయేముందు నేను ఒక విధమయిన నిరుత్సాహంతో ఉన్నాను. రీసెర్చ్ మానలేను కానీ, ఆ నిరుత్సాహం వదలటం లేదు. మీరు రాగానే నా నిరుత్సాహం మాయమయింది. ఏదో క్రొత్త ఉత్సాహం కలిగింది....అందుకు!"
    "కొంపదీసి నన్ను ప్రేమిస్తున్నానంటారా?"
    "మిమ్మల్ని చూసిన ఎవరైనా మిమ్మల్ని ప్రేమించకుండా ఉండలేరు!"
    "అయితే మీరూ  నలుగురిలా నన్ను ప్రేమిస్తున్నారన్న మాట" ఒక విధమైన ఈసడింపు సౌందర్య స్వరంలో.
    "అవును. నలుగురిలాగానే ప్రేమిస్తున్నాను. కానీ, నలుగురికంటే భిన్నంగా మిమ్మల్ని పొందటానికి కూడా ప్రయత్నిస్తున్నాను!"
    సౌందర్య సర్వాంగాలలోనూ ఒక విధమయిన సంచలనం కలిగింది. నిటారుగా కూర్చుని తీక్షణంగా అంది. "ఏమిటి మీరంటున్నది?"
    "మిమ్మల్ని ఎందరు ప్రేమించినా ఏ ఒక్కరూ పొందడానికి ప్రయత్నించలేరని..."
    విక్రమ్ చిరునవ్వు...విక్రమ్ మాటలు....సౌందర్య కోపాన్ని కరిగించేస్తున్నాయి. నిటారుగా కూర్చున్న వ్యక్తి కొద్దిగా ముందుకు తూలింది.
    "ఎందుకని?"
    "మీలో సౌందర్యం మెరిసిపోవటం లేదు. జ్వలిస్తోంది. ఆ జ్వాలకు ఎవరూ తట్టుకోలేరు."
    "మీరు తట్టుకోగలరా?"
    "ఆ జ్వాలను జ్యోతిగా చూడగలిగితే తట్టుకోగలను!"
    "చూడగలరా?"
    "ఒకనాటికి...."
    "ఏనాటికి?"
    "మీరు అన్వేషిస్తున్నది నాలో మీకు చూపగలిగినప్పుడు.... మీరు చూడగలిగిన దాన్ని అందరిచేతా గుర్తింపచెయ్యగలిగినప్పుడు..."
    "అలా చెయ్యగలరా?"
    "చెయ్యగలిగితే మిమ్మల్ని పొందగలుగుతాను. చెయ్యలేకపోతే నశించి పోతాను!"
    సౌందర్య ముఖం తెల్లగా పాలిపోయింది.
    "నశించిపోతారా?"
    "అవును. నశించిపోతాను. అయితేనేం? మళ్ళీ వస్తాను. ఈ రూపంలో కాకపోతే మరో రూపంలో! మళ్ళీ పరిశోధన ప్రారంభిస్తాను. ఈ పనిలో కాకపోతే మరో పనిలో...అప్పుడు మీరూ వస్తారు. మళ్ళీ ప్రయత్నిస్తాను. ఇంతకు ముందు నేను ఎన్నెన్ని విధాల ఏయే పరిశోధనలు జరిపాక మీరు నాకీ మాత్రం సన్నిహితంగా వచ్చారో ఎవరూ చెప్పగలరు?"
    సౌందర్య కళ్ళు మెరిశాయి.
    "మీకు నిరుత్సాహం ఎందుకు కలిగింది?"
    "డబ్బు లేదు!"

 Previous Page Next Page