Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 24

 


    "అది యుద్ధంలో! ఇక్కడ మన స్వప్రయోజనాల కోసం ఒక అమాయకురాల్ని బలిపెట్టడం.

 

    "అమాయకురాలు కాదు" ప్రతిమ ఆవేశంగా అన్నది. "ఆ అమ్మాయికి మార్జువానా ఇంజక్షన్ల అలవాటుంది. చీర మార్చినట్టు మగవాడిని మారుస్తుంది. తండ్రితో సీక్రెట్ మీటింగ్స్ లో పాల్గొంటుంది. ఒక దేశద్రోహిని నీ అందంతో మత్తులోకి దింపి, దేశాన్ని రక్షించడంలో తప్పులేదు. శీలంకన్నా దేశం ముఖ్యం అన్నది మొగవాడికి కూడా వర్తిస్తుంది."

 

    "దేశం కోసం ప్రాణాలు వదలమన్నా సిద్ధపడతాను. దేశ  ద్రోహుల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతాను. కానీ..... ఒకమ్మాయి శీలానికి ఎరగా నా వ్యక్తిత్వాన్ని బలి పెట్టలేను. అయామ్ సారీ..... మీరింకో ఏజెంట్ ని ఈ  పనికి ఉపయోగించుకోండి" అని నేత్ర లేచాడు. చీఫ్ అతన్ని వారిస్తూ-

 

    "కూర్చో..... కూర్చో...." అని  ప్రతిమ  వైపు తిరిగి "ముందు నువ్వెళ్ళి ఆ ఫైలు తీసుకురా" అన్నాడు. ఆమె హుషారుగా బయలుదేరింది. ఆమె వెళ్ళిపోయాక చీఫ్ కంఠం ఆ గదిలో మంద్రంగా వినిపించసాగింది.

 

    "నువ్వు చెప్పింది నిజమే. ధనంకన్నా, ప్రాణంకన్నా, మానం విలువైంది. ముఖ్యంగా మన భారత స్త్రీకి. కాని.... మన సీక్రెట్  సర్వీస్ చరిత్రలో పాతిక  సంవత్సరాల క్రితం ఒక అపూర్వమైన సంఘటన జరిగింది తెలుసా.......? జర్మన్ నాజీ నియంతల రహస్యాలు తెలుసుకొనడానికి అమెరికన్ ప్రభుత్వం ఒక సీక్రెట్  ఏజెంట్ ని నియమించింది. ఆ అమ్మాయి సంవత్సరం పాటు అకుంఠిత  దీక్షతో జర్మన్  భాష, ఆచార వ్యవహారాలు నేర్చుకుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని జర్మన్ గా మారి ఒక సైనికాధికారిని పెళ్ళిచేసుకుంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని జర్మన్ గా మారి ఒక సైనికాధికారిని పెళ్ళిచేసుకుంది. అతడికి ఒక బిడ్డను కూడా  కన్నది. తన జీవితాన్నే అలా హామీగా పెట్టి రహస్యాలు అమెరికాకు పంపి  ఆత్మహత్య చేసుకుంది. గూఢచారులకి ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇదంతా నిన్ను కన్ విన్స్ చేయడానికి చెప్పడం లేదు. నీ వాదన కూడా కరెక్టే. కాని.......  ఆలోచించు..... నీ కిష్టం లేకపోతే ఆ అమ్మాయిని సెక్స్ వరకూ తీసుకెళ్ళకు. ప్రతిమ రిపోర్టు ప్రకారం ఆమె "టేక్  డి లైఫ్ ఈజీ" టైప్. నీ మేల్ కారిష్మా ఉపయోగించి ఆమె నుంచి ఏ మాత్రం  విషయం రాబట్టినా మనకెంతో ఉపయోగపడుతుంది. దానికోసం నువ్వన్నట్టు ఎవరి శీలాన్నీ  బలి చెయ్యనవసరం లేదు. ఆర్ యూ కన్ విన్స్ డ్.....?"

 

    ఏజెంట్ నేత్ర చేతి గోళ్ళవైపు చూసుకుంటూ మౌనంగా వుండి పోయాడు. తన జీవితంలో ఒక పని చేయడానికి అతడు తటపటాయించడం అదే ప్రథమం.

 

    చీఫ్ అతడి వైపే చూస్తున్నాడు.

    
                                     *    *    *

 

    "ఇంకో గిన్నె ఇమ్మంటారా.....?" స్టీలు సామాన్లవాడు అడిగాడు.

 

    వద్దు నాయనా..... నా  మనవరాలు ఇవన్నీ  చూసిందంటే ఒంటి కాలిమీద  లేస్తుంది."

 

    నీటిపైన స్వర్ణరేఖ తడిసిన ఫోటో తేల్తూ కనిపించింది. ఆవిడి దాన్ని తియ్యబోయే టైములో కాలింగ్ బెల్  వినిపించింది. ఆవిడ మరింత కంగారుపడి, ఆ ఫోటో పైటతో తుడవడానికి ప్రయత్నిచింది. దాంతో పై పోర చిరిగి పోయింది. ఇంతలో బయట నుంచి "నాయనమ్మా" అన్న ప్రతిమ కేక వినిపించింది. ఆవిడ ఫోటో వైపు దిగాలుగా, భయంగా చూసింది. "చాలా ముఖ్యమైన ఫైలు బామ్మా" అని ప్రతిమ ఫోన్ లో చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.

 

    బైటనుంచి బెల్ ఆగకుండా మోగుతోంది.

 

    ఆవిడ పైల్ తీసింది.

 

    అందులో ఇంకా చాలా ఫోటోలున్నాయి. అందులో ఒక ఫోటో తీసి, చప్పున కవర్ లో పెట్టేసి, దాన్ని ఫైల్లో దోపి, ఫైలు యథాస్థానంలో వుంచి, వెళ్ళి తలుపు తీసింది.

 

    "ఏమిటి నాయనమ్మా ఇంత ఆలస్యం.....? అంటూ ప్రతిమ హడావుడిగా వచ్చి, తెరిచి వున్నా బీరువా చూసి, "నీకు నిర్లక్ష్యం ఎక్కువైపోతోంది. ముఖ్యమైన కాగితాలున్నాయని చెప్పానుగా....." అంటూ అక్కడికి  వెళ్ళి ఫైలు తీసుకుంది.

 

    ఎంత వేగంగా వచ్చిందో, అంత వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

 

    నాయనమ్మ కవర్లో పెట్టిన ఫోటో హంసలేఖది.

    
                                   *    *    *

 

    హంసలేఖ గది అది.

 

    గవాస్కర్  పోస్టరు, బీటిల్స్ బొమ్మ గోడకి వున్నాయి.

 

    అధునాతనమయిన డ్రెస్సులు హ్యంగర్స్ కి వ్రేలాడుతున్నాయి. అంతా మోడరన్ గా వుంది. గదిలో ఒక మూల టి.వి. వుంది.

 

    టి.వి.లో కోహినూర్ అడ్వర్డయిజ్ మెంట్  వస్తోంది. కుటుంబ నియంత్రణ గురించిన ప్రకటన అది. అబ్బాయి అమ్మాయి పెదవుల దగ్గరగా వచ్చి ఆగిపోయాడు.

 

    "ఆగండి......" అని అరిచింది హంసలేఖ-

 

    "ముద్దు పెట్టుకోబోయే ముందు మరోసారి ఆలోచించండి. మరో బిడ్డకు ఇదా తరుణం? బిడ్డకూ బిడ్డకూ మధ్య ఎడముండేలా  చూసుకోవడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు కలగకుండా చేసే ఏకైక ఉత్తమ మార్గం నిరోధ్" అంటూ పాకెట్ ఎత్తి  పట్టుకుంది.

 

    తలుపు దగ్గర చప్పట్లు  వినిపించాయి.

 

    స్వర్ణరేఖ నవ్వుతూ లోపలకు వచ్చింది. లేఖ సిగ్గుపడింది.

 

    "ఏమిటి...... చదువు మానేసి  అడ్వర్టయిజ్ మెంట్ కంపెనీలో చేరి పోతున్నావా.....?" అంది స్వర్ణ. ఆమె కంఠంలో క్రితం రాత్రి తాలూకు హేంగో వర్ లేదు.

 

    "లేదక్కయ్యా....... రేపు కాలేజీ తరపున పక్క పల్లెకి మా స్టూడెంట్సంతా  వెళ్ళి వాలంటరీ ప్రోగ్రాం ఇవ్వాలి. డానికి రిహార్సల్స్ చేస్తున్నా" అంది. స్వర్ణరేఖ చూస్తుండగా తన  ఉపన్యాసం కొనసాగించింది.

 

    "కేవలం చదువు లేకపోవడంవల్ల, అవగాహన లేకపోవడంవల్ల గంపెడు సంసారాన్ని సృష్టించి మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఇదిగో నిరోధ్.... ముద్దు  పెట్టుకోబోయే ముందు ఈ టాబ్లెట్ వేసుకుంటే మీకు పిల్లలు పుట్టరు" పాకెట్  ఎత్తి  పట్టుకుని  రిహార్సల్స్ కొనసాగించింది.

 

    వింటున్న  స్వర్ణరేఖ అదిరిపడి- "ఏమిటి? ఇంకోసారి చెప్పు. అంది. హంసలేఖ ఇంతకు ముందు అన్నది మరొకసారి  చెప్పింది. స్వర్ణరేఖకి చెల్లి  కెలా చెప్పాలో అర్థం కాలేదు.

 

    "రేపా పల్లెలో ఇలాగే ఉపన్యాసం ఇచ్చావంటే వంకాయల్తో- టమోటాల్తో కొడతారు" అంది వస్తున్నా నవ్వా పుకుంటూ.

 

    "ఏం ? ఎందుకని?" అని అడిగింది హంసలేఖ కోపంగా.

 

    స్వర్ణకు ఏం చెప్పాలో తోచలేదు. "లోపల టాబ్లెట్లుండవు. ఆ పాకెట్  విప్పి చూడు" అనేసి ఇక అక్కడ వుండడం మొహమాటమేసి వెళ్ళిపోయింది.

 Previous Page Next Page