Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 23


     విష్టుశర్మని పట్టుకొనే విషయంలో స్వయంగా వచ్చి పనిలోపనిగా ఈ విషయమూ స్వయంగా నిర్వహించిన వాడు. ఆమెని దూరం నుంచి చూస్తున్నాడు.

    అనూషని ఎక్కించుకుని పోలీస్ వ్యాన్ వెళ్ళిపోగానే, వాళ్ళ కారూ వొటల్ వైపు వెళ్ళింది. లేచిన దుమ్ముతెర మాత్రం ఉత్పలని కప్పేసింది. జరిగింది కలో, నిజమో గ్రహించలేని స్థితిలో, కాళ్ళలో సత్తువలేనట్టు ఆ అమ్మాయి అలాగే శిలా ప్రతిమలా నిలబడిపోయింది.

    అక్కడే నిలబడి, చాలాసేపు, తనేమైనా చేయగలదా అని ఉత్పల అనుకుంది. తనమీ  చేయలేదు. అసలు  పోలీస్ స్టేషన్  ఎక్కడో కూడా ఆమెకి తెలీదు. ఆ మాటకొస్తే పోలీసులు ఒక మనిషిని అరెస్ట్ చేస్తూ వుండగా చూడటం ఆమెకదే మొదటిసారి. చేతులకి బేడీలతో అనూష తల వంచుకుని మెట్లు దిగటం ఒక ఫోటో ప్రింట్ లా ఆమె కళ్ళలో హత్తుకుపోయింది. తనే ఆ పరిస్థితిలో వుంటే ఏమై వుండేదా అని ఆలోచించింది.

    గుండె ఆగి అక్కడికక్కడే మరణించివుండేది! అవును, అందులో సందేహం లేదు.

    అది అనూష జీవితపు అత్యంత లజ్జాభరితమైన ఓటమి అని ఆమెకి తెలుసు. అయినా కూడా వంచిన ఆమె మొహంలో తలెత్తి చూస్తున్న స్థైర్యాన్ని ఆమె స్పష్టంగా గమనించగలిగింది. అనూష  మెట్లు దిగుతూ వుండగా ప్రతీ అంతస్థు వరండా లోనూ, బల్లల దగ్గరా  నిలబడి చూసిన ఉద్యోగస్తుల మొహాల్లో ఆ క్షణం ప్రతిబింబించిన భావాల్ని కూడా ఆమె గమనించింది. చూసిన ఉద్యోగస్తుల్లో నూటికి తొంభైమంది మొహాల్లో ఒక పైశాచిక ఆనందం లీలగా  ప్రతిబింబించిందనటం నిర్వివాదాంశం.

    మనసులో ఏ మూలో మురికిలా పేరుకుపోయిన ఆ (సాడిజపు) ఆనందాన్ని వదులుకోగలిగే తత్వ చింతన మనిషికి ఎప్పుడొస్తుంది?........ పోనీ అందరిలోనూ అది వుంటుందన్న నిజాన్ని గుర్తించి, వాళ్ళని పట్టించుకోకుండా తన పని తాను  చేసుకుపోగలిగే సామర్థ్యం ఎందరికి వుంటుంది? కేవలం  ఆ క్షణం అనూష కళ్ళలో దాన్ని చూడగలిగింది ఉత్పల. అందుకే "అమ్మో! అలాంటి ఆపద ఎదురవుతే నేనేం చేయగలను" అన్న ఆలోచన్లతోనే గడిపింది. ఈ రాత్రి ఆమెకి నైట్ డ్యూటీ! ఆ రాత్రి ఆస్పత్రిలో ఆమెకి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం ఎప్పుడావుతుందా  అని ఎదురుచూడసాగింది.

    ఆస్పత్రంతా ఆ చీకట్లో నిశ్శబ్దంగా వుంది. ఏదో ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నట్టు.

    కటకటాల లోపల, మోకాళ్ళమీద చేతులు ఆన్చి, తల గోడకి ఆనించి  కూర్చుని వుంది అనూష. ఆ గదిలో వున్న బల్ల మాత్రం వుంది. గదిలో ఒక మూల వున్న కూజాలో కాసిని నీళ్ళు, పక్కనే చిన్న చిప్పలాంటి గ్లాసూ వున్నాయి. దూరంగా, సబ్ - ఇన్ స్పెక్టర్  కూర్చునే చోటు నుంచి కాస్త లైటు లోపలికి పడుతూంది.

    ఆమెని అరెస్ట్ చేసిన గంటకి పండా వచ్చాడు. కంపెనీ  లాయర్ వచ్చాడు. నిజానికి రామసుబ్బారావు ఇచ్చింది ప్రైవేటు కంప్లెయింటు కాబట్టి కంపెనీ లాయర్ రానవసరం 'లేదు. కానీ పండా కోరిక మన్నించి వచ్చాడతను.

    పండా బాగా  కదిలిపోయినట్టు కనిపించాడు. "ఏమిటమ్మా ఇదంతా?" అని అడిగాడు.

    ఏం చెపుతుంది అనూష? పండా పిలిచినట్టు పిలిచి, తను ఆయన గదిలోకి వెళ్ళగానే తన డ్రాయర్ లో "బహుమతి" పెట్టారని చెపుతుందా? ఒక దిన పత్రికని యధాతధంగా ప్రింట్ చేసారని చెపుతుందా? ఎవరన్నా నమ్మేవేనా ఇవి? తనకి వ్యతిరేకంగా నిలబడిన తన చేతి వ్రాతతో వున్న లెక్కలు, తను పూర్తిచేసిన అప్లికేషన్ ఫారమూ తనని కోర్టులో దోషిగా నిలబెడతాయి..... ఈ రాత్రి కటకటాల వెనుక పడుకో బెట్టినట్టుగా.

    లాయరు తనేమీ చేయలేనన్నాడు. ఆ విషయం అనూషకు కూడా తెలుసు బెయిలు దొరకదు.

    అరెస్ట్ చేసిన ఇఅరవై నాలుగ్గంటల్లోగా మేజిస్ట్రేటు ముందు హాజరు పర్చాలి. ఆ తరువాతే బెయిల్ సంగతి వస్తుంది. ఎంతో అత్యవసర పరిస్థితి అయితే తప్ప రాత్రిళ్ళు స్త్రీని లాకప్పులో వుంచకూడదు అన్న జడ్డిమెంట్ ని  అధిగమించి ఈ ఇన్ స్పెక్టర్ సిద్ధపడ్డాడంటే, తన వెనుక వున్న అదృశ్యహస్తంతో అతడు చాలా గాఢంగా జోడి అయ్యాడన్నమాట!

    పండా ఇన స్పెక్టర్ తో మాట్లాడాడు. ఇనస్పెక్టర్ అడ్డంగా తలూపటం ఆమెకి కనిపించింది. లాయరు ఏదో అన్తుంనాడు. ఆ తరువాత చూడలేదు.

    అయిదు నిమిషాల సంభాషణ తరువాత పండా ఆమె దగ్గరకి వచ్చాడు. విచారంగా 'లాభం లేదు' అన్నాడు. ఆమె మౌనంగా వుండిపోయింది. మొహంలో ఏ భావమూ ప్రస్ఫుటించలేదు.

    "నేను క్యారేజ్ పంపిస్తాను" అన్నాడు పండా. అతడి స్వరంలో ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తూంది. అప్పటికే అతడికి, మరుదటి రోజు పేపర్లలో రాబోయే వార్త తాలూకూ ఆచూకీ తెలిసిపోయింది. స్టాక్ హొం జనరల్ మానేజర్ అరెస్ట్..... అమాయకుడైన కస్టమర్ ని స్టాక్ హొం ఉద్యోగస్థుల చేసిన మోసం..... స్టాక్ హొంలో కుంభకోణం.....కస్టమర్ల డబ్బు మూడులక్షలు తినేసిన వైనం.....

    "వద్దు నేను రాత్రిళ్ళు భోజనం చేయను "క్లుప్తంగా అబద్దమాడింది అనూష.

    పక్కనున్న లాయరు అన్నాడు. "నేను వెళ్ళి మెజిస్ట్రేట్ తో మాట్లాడుతాను. ఏ మాత్రం వీలున్నా-రాత్రి లోపులోనే బెయిల్ కి ప్రయత్నిస్తాను".

    అనూష మాట్లాడలేదు. లాయర్ హడావుడిగా వెళ్ళాడు.

    పండా కూడా వెళ్ళబోయి తటపటాయిస్తున్నట్టు ఆగి నెమ్మదిగా అన్నాడు- "రేప్పొద్దున్న అర్జెంటుగా బోర్డు మీటింగు పెట్టమని సూచన్లు వచ్చాయ్. ఈ పది నిమిషాల్లోనే మూడు ఫోన్లు వచ్చాయి అలా."

    ఆమె దానికి కూడా సమాధానం చెప్పలేదు. పండా స్వరం మరింత చిన్నదైంది. చెప్పలేక చెపుతున్నట్టు అన్నాడు. "నీకు తెలుసుగా  మన సంస్థలో ప్రతిదీ నమ్మకం మీద జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఐయామ్ సారీ అమ్మాయ్! నిన్ను సస్పెండ్ చేయక తప్పటం లేదు" అని వెంటనే తొందర తొందరగా, "ఇది కేవలం మన కస్టమర్లను సంతృప్తిపరచటానికే! ఈ  కేసు ఒక కొలిక్కి రాగానే నిన్ను వెనక్కి తీసుకునే బాధ్యత నాది" అని ఆమె వైపే చూసాడు.

    "రేపు బోర్డు మీటింగులో ఈ నిర్ణయం తీసుకుంటున్నారా? ఈ సాయంత్రమే మీరు దీన్ని తీసుకున్నారా?"

    "రేపు బోర్డు మీటింగ్ లో డైరెక్టర్లు తీసుకోబోతున్నారు".

    "అంటే రేపు పదకొండింటి వరకూ నేను జనరల్ మానేజర్ గానే కొనసాగుతానన్నమాట" ఇంగ్లీషులో అన్నది అనూష. పండా  మొహంలో మళ్ళీ అదే ఇబ్బంది..... అంతలో అనూష అంది. "నా క్రింది వాడెవడైనా ఇంత పెద్ద తప్పు చేస్తే నేను రేపటి వరకూ  ఆగను సర్. వెంటనే సస్పెండ్ చేస్తాను. ఒక ఉన్నతాధికారిని, మరో పద్నాలుగు గంటలు అదే పదవిలో కొనసాగించటం తప్పు".

    పండా చప్పున తలెత్తి చూసాడు. ఆమె తల వంచుకుని లోపల కటకటాల వెనక్కి వెళ్ళిపోయింది. పండా ఏదో మాట్లాడబోయి, మళ్ళీ మనసు మార్చుకుని అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితుల్లో తనేమీ చేయలేనని ఆ ముసలాయనకి తెలుసు. రేపటి వరకూ ఆగక తప్పదు. రేపయినా స్వంత ఖర్చులపైనే ఈ లాయర్ ని నియమించటం, కోర్టులో వాదించటం జరుగుతుంది. ఆని ఖర్చులూ అనూషే భరించాలి!

    పండా వెళ్ళిపోయాక అనూష చాలాసేపు అలాగే కూర్చుంది. దూరంగా వరండా మెట్ల మీద కూర్చున్న కానిస్టేబుల్స్ ఇద్దరు పచ్చిబూతుల్తోఇంటి ఖర్చు విషయం మాట్లాడుకుంటున్నారు. మగాడిలా వున్న లేడీ కానిస్టేబుల్  గురక లోపలికి వినపడుతూంది. తలతిప్పి చూసిన అనూష, బల్ల వెనుకనుంచి తననే  తదేకంగా చూస్తున్న ఇన్ స్పెక్టర్  గమనించి మొహం తిప్పి, సర్దుకు కూర్చుంది.

    గడియారం గంటలు కొట్టటం ప్రారంభించింది.

    చీకటి పది ఎంత సేపయిందో తెలీదు.

     బయట పాత ఖైదీ ఎవరో పోలీసుల్తో బ్రతిమాలటం లాటి ఘర్షణ పడుతున్నాడు.

    ఆమెకి వరుసగా గతం తాలూకు సంఘటన గుర్తొచ్చాయి. అత్యుత్తమ విద్యార్థినిగా కాపాడియా మెడల్ అందుకోవటం, కేంద్ర ఆర్ధిక మంత్రి నుంచి ప్రశంసా పత్రం, బెస్ట్ మానేజ్ మెంట్ అవార్ట్ తనకి రావటం......

    ఇంత కృషీ కేవలం చిన్న సంఘటనతో పోయింది.

    రాత్రి తొమ్మిదయింది. తొమ్మిదిన్నర......పది. పాపంలాటి నల్లటి చీకటి క్రమక్రమంగా ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ పరచుకుంది. బయట వాహనాల చప్పుడు కాలం గడిచేకొద్దీ తక్కువైంది. పొంగే ఏరులా నిశ్శబ్దం ఆ గదిలో గోడల్ని నిస్తేజాన్ని పెనవేసుకుని ఆక్రమించుకుంది.

    ఆమె అలాగే కూర్చుని వుంది.



                                        13

   

    "రాకేందు బింబమో! రాజీవమో? మించుటద్దమో! లేక నెమ్ముద్దు మొగమో? చెల్వొందు కల్వలో? చేపలో? మరుని నా రాచంబులో? లేక లోచనములో? కోరకంబులో? విరిగుత్తులో? బంగారు కుండలో? లేక వక్షోరుహములో....."

    "నాకేమీ అర్థం కావటంలేదు బాబూ" అంది ఎదురుగా వున్న అమ్మాయి. ఆమెకి ఇరవై ఏడేళ్ళుంటాయి. ఆమె నగ్నత్వాన్ని చూసి వెలుతురు చిరునవ్వుతో కళ్ళుమూసుకుని చాలా సేపైంది.

    బిల్హాణుడు నవ్వేడు.

    "ఏం లేదు పిల్లా. నాకు అత్యంత సంతృప్తినిచ్చిన అమ్మాయి ముందు ఆశు కవిత్వం అలా పొంగివస్తుంది".

    "రాకేందు బింబమంటే ఏమిటి?"

    "రాకేందు బింబమునకర్ధమడిగిద వేలనే
    ఇందువదనా నీ వదనమొకమారు ఏదైన......"


    అతడు పూర్తిచేయబోతూ వుండగా ఇంటర్ కమ్ మ్రోగింది. బిల్హణుడు మాట్లాడటం పూర్తిచేసి, "మా బాస్ కి అసలు పనిలేదు. తను అనుభవించడు ఇంకొకర్ని అనుభవించనివ్వడు"- అన్నాడు.

    ఆమె "నే వెళ్ళనా" అంటూ చీరె అందుకుని లేవబోతూ వుంటే అతడు ఆపుచేసి 'ఇప్పుడే వస్తాను ఉండు' అంటూ వెళ్లబోయాడు.

    "ఆలస్యమవుతుందేమో" అందా అమ్మాయి. బిల్హణుడు అన్నాడు.

    "కుడి చేతిని వేస్తి హిమాలయం మీద
    మరి వామహస్తము వింధ్య మీద........
    శిఖరాగ్ర సమావేశము మొదలవలకనే
    అతివరో! అతిక్రూరడైన మాబాసు పిలిచినే"


    అంటూ "అయిదు నిమిషాల్లో వచ్చేస్తాను" అని బయల్దేరాడు.

    జానీ అప్పుడే వచ్చినట్టున్నాడు. అలసటగా కూర్చుని వున్నాడు. బిల్హణుడిని చూసి, "ఏమిటి ఈ రోజు విశేషాలు" అని అడిగాడు. ప్రతిరోజు రాగానే ఆ రోజు విశేషాల గురించి అడగటం అతడి అలవాటు.

    "గణేశ్ దళం ఈసారి వినాయక చవితి చందాలని దాదాపు రెట్టింపు చేయటానికి నిశ్చయించుకుంది..... కలాసపాలెం హత్యలో ముఖ్యమైనవాడు రామూ అని తెలిసింది. కానీ పోలీసులకి ఇంకా సాక్ష్యం దొరకలేదు. బహుశ దొరకదు కూడా..... ఎందుకో తెలీదుకానీ సలీంశంకర్ అనుచరులందరూ ప్రొద్దున్నించి తోక తెగిన కోతుల్లా తిరుగుతున్నారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్ దగ్గిర కాపు వేశారు. వాళ్ళ కార్లు, మోటారు సైకిళ్ళు చాలా కనపడుతున్నాయి ఈ రోజు. విషయం ఏమిటో కనుక్కొమ్మని మనవాళ్ళని పంపాను. వసంత్ దాదా కూడా వూర్లోనే వున్నాడు. బహుశ సలీంశంకర్ ని ఆ జపాను పోలీసు పట్టుకుపోయే విషయంలో అనుకుంటాను. అన్నట్టు వసంత్ దాదా అంటే గుర్తొచ్చింది. నీ చిన్న చిలక- అదే నీ బట్టలు విప్పించి నిన్ను  నానా కష్టాలు పెట్టిన ఆ అనూషని పోలీసులు సాయంత్రం అరెస్ట్ చేసారు......"

 Previous Page Next Page