"లైబ్రరీ-నీ ఇల్లు-రామబ్రహ్మం రూము .....ఆ మూడు బస్ స్టాపులూ ఒకే రూట్ లో వున్నాయి. అవునా..... నాకు సిటీ బస్ టైమింగ్స్ కరెక్ట్ గా తెలుసు. గంటకో బస్సు ఇట్నుంచి అటూ, గంటకో బస్సు అట్నుంచి ఇటూ వెడతాయి. నువ్వు నీ ఇంటి ముందు నిలబడు. రెండు బస్ స్టాపులూ రోడ్డుకి అటూ ఇటూ వున్నాయి. కాబట్టి ఏ బస్సోచ్చినా నీకు ఎక్కడం పెద్ద కష్టం కాదు. లైబ్రరీ వైపు వెళ్ళే బస్ ముందొస్తే అది ఎక్కు. రామబ్రహ్మం ఇంటివైపు వెళ్ళే బస్సోస్తే అది ముందెక్కు, అదీ లాటరీ"
"ఇందులో ఏం లాటరీ వుంది? ప్రోబబిలిటీ ప్రకారం ఓ పదిసార్లు ఇటువైపు ఓ పదిసార్లు అటువైపు వెళతాను".
"కానీ పదిహేనుసార్లు లైబ్రరీవైపూ, అయిదు సార్లు రామబ్రహ్మం ఇంటివైపు వెడితే నీ అభిప్రాయం మార్చుకుంటావా?"
"అదెలా సాధ్యం?"
"చేసి చూడు"
* * *
ఉత్పల నెమ్మదిగా తలెత్తింది.
"నేనీ పదిరోజులూ చాలా గాఢంగా ఆలోచించాను! ఒకసారి ఆ దృక్పథంతో ఆలోచించడం మొదలు పెట్టాక ఇంతకాలం నేనెంత టైం వేస్టు చేసానో అర్థమయింది. దాదాపు ఆ స్నేహం మానుకున్నట్టే-"
"నేను రామబ్రహ్మంతో స్నేహాన్ని మానుకొమ్మని చెప్పలేదు ఉత్పలా! ఆ స్నేహానికి ఒక గమ్యం నిర్మయించుకుని- అటు సాగిపోతున్నావో లేదో ప్రతీ క్షణం చూసుకుంటూ వుండమన్నాను అంతే"
"ఆ స్నేహానికి మీరన్నట్టు ఏ గమ్యమూ లేదని ఇప్పుడనిపిస్తుంది నాకు ఏమో.....మీరన్నట్టు కొంత కాలానికి అతడు పెళ్ళి ప్రసక్తి తెచ్చినా తెచ్చివుండే వాడేమో! కానీ అప్పటికీ అతడి గురించి నాకేమీ తెలిసివుండేది కాదు. పెళ్ళి చూపుల్లో ముక్కూ, మొహం తెలియని వ్యక్తిని చేసుకున్నా- అతడిని చేసుకున్నా ఒకటే అయివుండేది. ఈ టైపు స్నేహం ఎన్నాళ్ళ చేసినా అంతకన్నా ఎక్కువ తెలిసేది కాదు. తల్లిదండ్రుల్ని బాధ పెట్టానన్న వ్యధ ఒకటి మాత్రం మిగిలి వుండేది".
"....థ్రిల్?"
"థ్రిల్....నిజమే. థ్రిల్ వుండేది ఒక పరాయి వ్యక్తి నన్నో స్త్రీగా గుర్తించడం, ఇంట్లో వ్యక్తులు కాకుండా మరో వ్యక్తితో స్నేహం ఎప్పుడెప్పుడు అతడిని కలుసుకుందామా అని సాయంత్రం అయ్యేసరికి మనసు ఉవ్విళ్ళూరటం - ఆ స్పందనా-"ఆమె మొహంలో ఏదో అస్పష్టమైన బాధగోచరించింది. ".....ఒకసారి ఈ ఆలోచన్ వచ్చాక మనసు నాజూకు భావాల్ని కోల్పోతుందేమో!"
"కోల్పోదు ఉత్పలా!" నిశ్చయంగా, దృఢంగా అంది అనూష. "......ఆరోగ్యవంతమైన భావాల్లో వున్న ఆనందం అనుభవిస్తేనే గానీ తెలీదు. అందమైన హొటల్లో ఐస్ క్రీమ్ తినేవరకూ, రోడ్డు ప్రక్కన వేరుశనగ కాయలు తినడంలోనే ఆనందం వుందన్న భ్రమలో బ్రతికేస్తూ వుంటాం! మనిషి ఎదిగే కొద్దీ 'ఆనందం' అన్న పదం యొక్క విస్తీర్ణం పెరుగుతూ వుంటుంది. ఆ స్టేజీలోంచి ఈ స్టేజిలోకి వచ్చిన నేను, రెండు స్టేజిలు అనుభవించిన నేను, ఈ విషయాన్ని మాత్రం నొక్కిచెప్పగలను. చూస్తూ వుండు..... రామబ్రహ్మం కన్నా ఒక లైబ్రరీ నీకు ఎక్కువ సంతోషమిస్తుంది. ఇక థ్రిల్ అంటావా? నిజంగా అలాటి థ్రిల్లే కావల్సివస్తే- బస్ స్టాపులో అయిదు నిమిషాలు నిలబడితే పదిమంది రామబ్రహ్మంలు దొరుకుతారు."
"బస్ స్టాప్ అంటే గుర్తొచ్చింది. మీకా లెక్క ఎలా వచ్చిందో చెప్పరూ? అన్నిసార్లూ అటే వెళ్ళగలుగుతానని ఎలా ఊహించగలిగారు మీరు?"
" నేను చెప్పనవసరం లేదు. నువ్వే తెలుసుకుంటావు. తెలుసుకోవాలన్న జిజ్ఞాస నీలో మొదలైంది. అది చాలు. ఆ లెక్కలో లిటిగేషన్ ఏమీ లేదు. తర్కమూ, మాథమాటిక్స్ రెండే వున్నాయి అందులో-"
ఉత్పల నవ్వి "ఆలోచిస్తాను" అంది. అని ఆగి, "నేను రామబ్రహ్మానికి ఇదంతా చెప్పాను".
అనూష విస్మయంతో "చెప్పావా?" అని అడిగింది.
"అవును, కనీసం ఆ మాత్రం నిజాయితీతో విడిపోవడం మంచిది అనుకున్నాను".
"గుడ్. అవును. ఏమన్నాడు?"
"చాలా వాదించాడు".
"మీరో సాడిస్టు అన్నాడు. మీకు స్పందించే హృదయం లేదన్నాడు. స్వచ్ఛమైన స్నేహాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం లేదన్నాడు. ఇంకా చాలా చాలా అన్నాడు. చివరికి- ఐ లవ్యూ అని అతనన్నాడు"
"అతి తేలికైన, ప్రతీ మనిషీ మామూలుగా ఉచ్చరించగలిగే చాలా సులభమైన పదమది......పోనీ పెళ్ళి చేసుకోమనలేకపోయావా?"
"ఆ ప్రసక్తి కూడా వచ్చింది. ఇంటి సమస్యలు కొన్ని వున్నాయనీ, అవి తీరేక చేసుకుంటాననీ అన్నాడు. అవన్నీ తీరేక వస్తే అప్పుడు మళ్ళీ తిరిగి స్నేహం మొదలెడదామని అన్నాను. 'ఒక మనిషి ఆపదలో వున్నప్పుడు ఆదుకోవడానికీ', 'నిన్ను నిన్నుగా ప్రేమించుటకై' వగైరా మాటలూ అదే స్నేహమూ, ప్రేమా వగైరా చాలా చాలా అన్నాడు" ఉత్పల నవ్వింది.
"తన సమస్యలే తాను తీర్చుకోలేనివాడు, పార్కుకి రావడానికి కూడా ఇంట్లో డబ్బులు అడిగివచ్చేవాడు నిన్ను ఆపదలో ఆదుకుంటాడనుకోవడం భ్రమ. అంత వ్యక్తిత్వం వున్నవాడయితే, తన కాళ్ళమీద తను నిలబడ్డాకే ప్రేమని మొదలు పెట్టేవాడు. అయినా ఉత్పలా - ఓఅక మనిషి ఆపదలో వుంటే సాయపడటానికీ కష్టంలో వుంటే ఓదార్చడానికీ ప్రేమా, గాఢమైన స్నేహం - ఇవేమీ అక్కర్లేదు మానవత్వం చాలు. అసలు మన సమస్యల్ని ఇంకొకరు పరిష్క...."
".....మే ఐ కమిన్?"
ఇద్దరూ ఇన్ స్పెక్టర్ ఒక లేడీ పోలీస్ తో సహా లోపలికి వచ్చాడు.
"మిస్ అనూష మీరేనా?"
"అవును"
అతడు ఉత్పలవైపు తిరిగి "మీరు కొంచెం సేపు బయటకు వెళతారా మాడమ్" అని అడిగాడు. ఉత్పలకేమీ అర్థం కాలేదు. అయినా లేచి బయట కొచ్చింది.
అతడు అనూషతో "ఈ రోజు మీరు రామసుబ్బారావు అనే ఆయనకి షేర్లు కొన్ని అమ్మారా" అని అడిగాడు.
అనూష అస్పష్టంగా అవునన్నట్టు తలూపింది.
"ఈ కాగితం మీరు వ్రాసిందేనా" అంటూ ఓఅక కాగితాన్ని ముందుకు చూపించాడు. రతీ కంపెనీ షేర్ల ధర భవిష్యత్తుల్లో ఎలా పెరుగుతుందో ఇద్దరూ కలిసి కూర్చుని ప్రొద్దున్న లెక్కలు వేసిన కాగితం అది.
"అవును" అంది.
"నేను మీ డ్రాయర్లు వెతకవచ్చా మాడమ్. ఇదిగో వారంటు".
ఇదంతా ఏమిటో ఆమెకు అర్థం కావడంలేదు. అతడెంత మర్యాదగా మాట్లాడుతున్నా ఆ కంఠంలో ఆజ్ఞని గుర్తించింది.
"ఛైర్మన్ అనుమతిలేనిదే ఆఫీసు వెతక్కూడదు."
"ఆయన అనుమతి ఇచ్చారు మాడమ్. కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కో వచ్చు".
"అక్కర్లేదు. వెతకండి".
అతడు డ్రాయరు సొరుగు తీసాడు. పై సొరుగులోపలే చిన్న ప్యాకెట్ వుంది. ప్యాకెట్ లో వాచీ- ఖరీదైన వాచీ. ఆ ప్యాకెట్ కి కట్టివున్న కాగితంమీద "కాంప్లిమెంట్స్ ఫ్రమ్ రతీ అండ్ కంపెనీ" అని వుంది.
"మాడమ్. ఈ రోజు పేపర్లు చదివారా?"
"చదివాను. ఏం ?"
ఇన్ స్పెక్టర్ తన చేతిలో పేపరు ఆమె బల్లమీద విసిరాడు చూడమన్నట్టు.... ప్రొద్దున్న తను చూసిన పేపరే అది! అవే వార్తలు!! అవే హెడ్ లైన్స్ !! కానీ..... రతీ అండ్ కంపెనీచే కొత్తరకం బట్టలు - షేరుధర పెరుగుదల- వుండాల్సిన చోట-
"రతీ అండ్ కంపెనీ మూసివేత"
అని వుంది హెడ్డింగ్.
తన కళ్ళు మోసం చేస్తున్నాయా అనిపించింది. పేపరు తీసుకుని చూసింది. మళ్ళీ అంతా అదే పేపరు..... ఒక వార్త మాత్రం మారింది. జరిగిందేమిటో కొద్ది కొద్దిగా అర్థమవసాగింది.
ఆమె ఫోన్ ఎత్తి ధరల విభాగం బ్రోకర్ కి ఫోన్ చేసింది. "పొద్దున్న రతీ కంపెనీ షేరు పదకొండు వుందన్నారు?"
"నేనా? నేను ఆఫీసుకి ఇప్పుడే వస్తున్నాను మాడమ్".
"సో..... అదీ విషయం. తన ఫోన్ బ్రోకర్ వరకూ వెళ్ళకుండా ఎవరో బయట్నుంచి మాట్లాడారు. తనని ఛైర్మన్ పిలుస్తున్నారని చెప్పి, తను వెళ్ళగానే డ్రాయర్ లో ఈ బహుమతి పడేసాడు రామసుబ్బారావు. యాధాలాపంగా పండాకి చెప్పినట్టుగా చెప్పి, తనకి దొంగ పేపరు చూపించాడు. ధరల లెక్క కట్టించి, షేర్లు కొన్నాడు. మొత్తంమీద తన చుట్టూ జాగ్రత్తగా వలపన్నారు. అమ్మాయ్...... అమ్మాయ్.... అని పిలుస్తూ భయంకరమైన సాలెగూడులోకి ఇరికించారు.
"మాడమ్! ఒక దివాళా తీస్తున్న కంపెనీతో లాలూచీ అయి, ఒక అమాయకమైన కస్టమర్ కి దొంగ లెక్కలు చూపించి, అతడిచేత కంపెనీ మూతపడిన రోజే లక్షల షేర్లు కొనిపించినందుకు, ఫోర్జరీ, ఛీటింగ్ కేసులు క్రింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను".
అయిపోయింది. అంతా అయిపోయింది. ఎంతో పకడ్బందీగా వేసిన ఈ ఉచ్చులో తను ఇరుక్కుపోయింది! జైలు తప్పకపోవచ్చు, బెయిల్ సాధ్యమవుతుందేమో. కానీ, ఈ టైమ్ లో చేసేది ఏమీ లేదు.
ఆమె లేవబోయింది.
అప్పుడు పడ్డాయి ఆమె చేతికి సంకెళ్ళు!!!
అనూహ్యమైన వేగంతో, కనురెప్పపాటు కాలంలో ఆమె చేతులకి సంకెళ్ళు తొడిగి తాళం వేసేశాడు అతడు. నిబ్బరంగా ప్రవర్తించే అనూష కూడా దిగ్ర్భమతో అదిరిపోయిందీ చర్యకి.
"వాటీజ్ దిస్" అని బిగ్గరగా అరిచింది.
ఆమె టేబుల్ మీద వున్న పేపర్లు కట్ చేసే కత్తి చూపిస్తూ "పోలీస్ అధికారిని ఎదుర్కొన్నందుకు- పారిపోవడానికి ప్రయత్నించినందుకు" అన్నాడు. ప్రక్కనే వున్న ఆడపోలీస్ సాక్షిలా తలూపింది.
సో .....ఇదంతా ఇన్స్ స్పెక్టర్ కి కూడా తెలుసన్నమాట. ఇలా తీసుకువెళ్ళటానికి ఇతడికి "ధర" చెల్లించబడింది. ఇక వాదించి లాభంలేదు. ఒక ఆడదాని చేతికి సంకెళ్ళు వేయకూడదు కానీ తను ఇది కోర్టులోనే వాదించగలదు. కానీ తను దీన్ని ఇప్పుడేం చేయలేదు. తలవొగ్గటమే.
ఆమె తలదించుకుని "లెటజ్ గో ఇన్ స్పెక్టర్ " అంది. అందరూ బయటకొచ్చారు.
చేతులకి సంకెళ్ళతో, నెమ్మదిగా బయటకు వస్తూన్న అనూషని చూసి గొంతులో రాబోయిన కేకని బలవంతంగా ఆపుకుంది ఉత్పల. ఆమె మొహంలో రక్తం ఇంకిపోయింది. "ఏ.....ఏ .... ఏమిటిదంతా" అని అరిచింది. ఆమె మాటలు ఎవరూ పట్టించుకోలేదు. ఆమె కళ్ళనుంచి జలజలా నీళ్ళు కారసాగినయ్.
ఇన్ స్పెక్టర్ అనూషని లిప్ట్ లో క్రిందికి తీసుకు వెళ్ళలేదు. మెట్లమీద నుంచే నడిపించాడు. స్టాక్ హొం సిబ్బంది అంతా సీట్లలోంచి లేచి నిలబడి, తమ జనరల్ మానేజర్ చేతికి సంకెళ్ళతో తలవంచుకుని నడిచి వెళ్ళడాన్ని ఆసక్తితో, బాధతో, కొంతమంది ఉత్సాహంతో గమనించారు. పండా ఆఫీసులో లేడు.
పోలీస్ వ్యాన్ కి కొద్ది దూరంలో వున్న కార్లో ఇద్దరు వ్యక్తులు మాత్రం తాపీగా దీన్ని చూస్తున్నారు. ఒకరు మామూలే- సలీం శంకర్. రెండోవారు మాత్రం.......
"రూపాయికో స్కీమ్" మీద దెబ్బకొట్టిన తన ప్రత్యర్థి మీద- అంత నాజిఇగ్గానూ దెబ్బకొట్టడానికి లక్షలు ఖర్చుపెట్టి- ఒక దినపత్రికను యథాతథంగా ప్రింటుచేయించి, షేర్లు కొని, ప్లాన్ వేయగల మేధావి-
వసంత్ దాదా!