Previous Page Next Page 
విరిజల్లు పేజి 22


    లేవబోతున్న బావగారి చేయి అందుకుని గట్టిగా గుర్తుండేట్టు నొక్కుతూ అన్నాడు.
    "ఇంతగా వూరించేట్టు చెప్పి అసలు పోయావు బావా!"
    నవ్వి నర్సింగ్ హోమ్ కి వెళ్ళాడు!

                                                       15


    "హలో! రండి!"
    చూపిన కుర్చీలో కూర్చుంటూ అన్నాడు సూర్యారావు. "ఇది నా లేటెస్ట్ వర్క్! చదవండి! ఎవరైనా చదవటానికి యోగ్యులు అనుకుంటే వారికి ఈ కాపీలు యిచ్చెయ్యండి....!"
    ఇచ్చిన బుక్ లెట్ ని అందుకొని స్థాణువులా కన్యాయంగా చూశాడు అబ్బ ఎంతెంత సమాసాలు? ఎంత మనోహరంగా వున్నాయి. కొన్ని కొన్ని కొందరికి పలుకటానికే నోటికిరావు. ఉత్సాహంగా నవ్వుతూ ఎప్పుడూ తేలిగ్గా తిరుగుతూ వుండే సూర్యారావు యింతటి చక్కటి గ్రాంధిక భాష వ్రాసి యింతటి భావాలని వెలిబుచ్చే శక్తిగల వాడనుకోలేదు. ఎవరూ అసలు అతను రచయిత అనుకోలేదు, భాగ్యాలు అన్నపేరుతో రచనలు చేస్తుంటాడు.
    ఆలోచనల్ని ప్రక్కకు పెట్టి కంగ్రాచ్ లేషన్స్ చెప్పాడు.
    "ఇంతకీ నేను మీవద్దకు వచ్చిన కారణం అడగనే లేదు."
    నవ్వుతూ అన్నారు. "మా అవసరం కొద్దీ వచ్చినా మీ అవసరం కొద్ది వచ్చినా ఎలాగో మీరే చెబుతారుకదా అనే ధీమా!"
    తనూ నవ్వుతూ అన్నాడు. "నా విషయమేలెండి. ఒకటి రెండు నెలలనుంచి నేను చిత్రమైన రోగానికి అలవాటుపడ్డాను డాక్టర్! ఉదయం నాలుగింటికి లేస్తే నా అవసరాలు తీర్చుకున్నాక వ్రాసుకుందామని కూర్చుని ఆ అయిదు గంటలవేళ బ్రహ్మాండమైన కడుపు నొప్పీ, ఆకలి దాహం లాంటిది కలుగుతుంది. ఏ బిస్కట్లో, కారప్పూస తింటే కొద్దిగా శాంతిస్తుంది. మళ్ళీ ఎనిమిదింటికోసారి టిఫిన్ చెయ్యండి అది అరగదు పదకొండుకి భోంచేస్తాను. మళ్ళీ ఒంటిగంటకే ఆకలి. ఏం చేయను? ఏదో ద్రవమో ఘనంగానే పుచ్చుకుంటాను. మళ్ళీ నాలుగింటికి టిఫిన్.... రాత్రి ఏడింటికి భోజనం....ఇక పడుకున్నాక రాత్రంతా ఒక్కటే నొప్పి. ఇదీ సంగతి__అసలు తిండంటే అంతలెక్క చేయని వాడిని దాదాపు బకాసురుడిని అయ్యాను...."
    "నా వెంటరండి"
    లాంగ్ బెంచ్ పై పడుకోబెట్టి పొత్తి కడుపుపై నొక్కుతూ ఎక్కడెక్కడ నొప్పివస్తుందో పరీక్షించాడు.
    వాష్ బేషిన్ లో చేయి కడుక్కొని మళ్ళీ స్థిమితంగా కూర్చొని అడిగాడు వేణు!
    "ఇంతకు పూర్వం ఎప్పుడైనా వచ్చిందా?"
    "ఉహుఁ__"
    "దాదాపు ఎన్ని రోజుల్నుంచి వున్నట్టు?"
    "ఓ రెండు మూడు నెలలవుతుందేమో?"
    "ఇంకా ఎలా ఎలా వుంటుందో చెప్పండి చూద్దాం?"
    "చాలా చిత్రంగా వుంటుంది డాక్టర్. ఈ నొప్పి ఏదైనా తింటే తగ్గిపోతుంది. కడుపులో ఏదో ఇనుపగుండు బరువు ఎత్తినట్టుగా వుంటుంది. గుండెల్లో మంటగా వుంటుంది."
    "నీరసంగా అలసటగా వుంటుందా?"
    "ఉహుఁ...."
    కొన్ని సెకన్లు ఆలోచనలతో మునిగిపోయాయి. మౌనాన్ని చీలుస్తూ అన్నాడు.
    "ఏమీ లేదండీ ఇదిగాస్టిక్ ట్రబుల్. అసలు డబ్బు కాదు మనిషి తీసుకునే ఆహారంలో దిసారర్ ఏర్పడితే మీకు వచ్చిందీ జబ్బు. దీనికి ఒకటే మందు__మిత ఆహారము వేళకు తీసికొనడమూ__కారం తగ్గించటం__అసలు మానవుడీకారాన్ని వాడటాన్ని తగ్గిస్తే సగంరోగాలు తగ్గుతాయి....కానీ శరీరంపై కంట్రోలు తప్పి మనిషి బాధపడుతున్నాడు. మీరు రచయితగా ఏవేవో వూహించుకోకండి_ఈ కడుపు నొప్పిమీద ఒక కథ రాసెయ్యండి అసలు ఇది జబ్బేకాదు. మీరీకారం తగ్గించుకుని వేళకు తిండి తినండి అంతేచాలు. మీకే జబ్బు వుండదు. కొద్దిరోజుల వరకూ ఈ మెడిసిన్స్ వాడండి.  
    ప్రిస్కిప్షన్ అందిస్తూ అన్నాడు. "ఇవి వాడినన్ని రోజులూ మీవద్ద ఎప్పుడూ ఓ బిస్కట్ పాకెట్ వుంచుకోండి. గంటకోసారి ఒకటి తింటూ ఓ గ్లాసు నీళ్ళు తాగెయ్యండి. కడుపు ఖాళీగా వుండరాదు. ఎడిసిక్ మెడిసిన్స్ ఇస్తున్నాను. దాన్ని రేపకొట్టకండి"
    ప్రిస్కిప్షన్ జేబులో పెట్టుకుంటూ" ఇహ ఏమైనా కబుర్లు చెప్పండి! అన్నాడు.
    "రచయితలు మీరు! చెబితే వినేవాళ్ళం మేము."
    అతని మాటలకి అదిలిస్తూ అన్నాడు. "అదుగో ఆమాటే మరచిపోండి. హిమాలయాలంత రచయితనీ రచయిత్రినీ ఈ దేశంలో పెట్టుకుని నాబోటి వాడిని రచయితంటే నాకు సిగ్గేస్తుంది. అలా అనొద్దు."
    నవ్వాడు వేణు! వీళ్ళ సంభాషణలో లోకంలో వున్న వ్యవహారాలు అన్నీ దొర్లాయి. సామాన్యమైన రాజకీయాల్నుంచి కేంద్ర రాజకీయాల వరకూ చివరికి వీళ్ళ వూళ్ళో పోస్టు మాస్టరు ట్రాన్స్ ఫర్ గురించికూడా మాట్లాడారు.
    ఆఖర్న సెలవు తీసుకుంటూ అన్నాడు. "నిజంగా మీలాంటి డాక్టర్లుండాలి. ప్రపంచంలో అంతే! రోగి హాస్పిటల్ నుండి ఎప్పుడూ తను రోగిని అనుకోడు. ఏదో మిత్రుడిగా ఇక్కడికి వచ్చి వెళుతున్నాననుకుంటాడు. అందుకేనయ్యా నీ మందులకంటే నీమాటలే మనిషిని రోగాన్ని కుదుర్చుతున్నాయ్...."
    ఇక చాల్లేవయ్యా! భలే పొగిడావ్ కానీ...."
    నవ్వి వెళ్ళిపోయాడు సూర్యారావు. మౌనంగా మెడికల్ రిపోర్టులు చూడసాగాడు వేణు.  


                                                              16


    "విరజా!"
    ".... ...."
    "దేవతా!"
    ".... ...."
    "పలుకవేం విరజా! ఇన్ని యేళ్ళు ఎలా విడిచి వుండ గలిగావ్? చెప్పు విరజా! ఒక్కరోజైనా ఒక్కక్షణమైనా నేను నీ మనసులో మెదలలేదా? మనసుని ప్రతారించుకుని ఎలా వుండగలిగేవ్? అసలు ఎందుకు విడిపోయావ్ విరజా! ఎలా తప్పిపోయావ్?
    అతనలా ప్రశ్నించే సరికి ఆమెకి ఆ సంఘటన గుర్తుకి వచ్చి కన్నీరు సుళ్ళు తిరిగాయ్. కన్నీరు తుడుచుకుంటూ అంది.
    "ఆ భయంకరమైన క్షణాన్ని తలుచుకుంటే ఇప్పుడుకూడా భయమేస్తోంది వేణు! మనస్సుకి ఆ స్మృతి తగులుతూనే బాధ మొదలవుతుంది. అయినా నా కష్టజీవితం నీకు చెప్పుకోకుండా వుండలేను.
    ఆ రోజు__ఆ రోజు అసలెందుకు తెల్లారాలీ? అంత క్రితంరోజు నన్నంతగా బాధించినా ఆ కాలు ఎందుకు బాగవ్వాలి? మనిద్దరమే. తోడు ఎవరూ పెద్ద వాళ్ళు లేకుండా ఆ తిరుణాలకెందుకు వెళ్లాలి? అంతా విధి? విధి! ఇది ఎప్పుడూ మనుషుల్ని ఆడించి ఏడ్పించి తనకు దాసుల్ని చేసుకుంటుంది. లేకపోతే ఆ రోజు జరిగిన సంఘటనల్లో ఏది జరుగకపోయినా ఈ రోజింత కష్టనష్టాన్ని నేను ఎదుర్కొనే దాన్ని కాదు.
    కళ్ళు తిరుగుతున్నాయని రంగుల రాట్నం దిగి వచ్చాక అలాగే భూమినుండి ఆకాశానికి, ఆకాశాన్నుండి భువికీ ఎక్కుతూ దిగుతూవున్న నిన్ను, ఆశ్చర్యంగా చూస్తూన్న నన్ను గుంపులు గుంపులుగా వస్తున్న పల్లెజనం దూరంగా త్రోసివేశారు. ఆ సందడిలో ఆ త్రోసిలాటలో చాలా దూరం వెళ్ళిపోయాను నేను.
    భయంతో దుఃఖంతో గట్టిగా ఏడుస్తూ నిన్ను వెదకని స్థలం లేదు. తిరిగినచోటే తిరిగాను. వెదకిన స్థలమే వెదికాను. అడిగినవారినే అడిగాను.
    ఎన్నో రంగుల రాట్నాలు. అన్నీ ఒకే తీరున ఉన్నాయి. వేణు రహితంగా ఇనుప మొద్దుల్లా, పుట్టగొడుగుల్లా! ప్రతిదాని వద్దకూ వెళ్లాను. తలెత్తి చూస్తే మధ్యాహ్న సూర్యుడు మండిపోవటం కనిపిస్తుంది. కాని నా వేణు కనిపించటంలేదు. అన్నీ కొత్తముఖాలే! ఒక్క ముఖంలోనైనా అందంకాని, శాంతికాని, ప్రేమకానీ కనిపించలేదు. నాకు కావలసిన ముఖం కనిపించలేదు.
    "ఏంచేయాలి? వెదుకుతూ వెదుకుతూ గట్టిగా అరుస్తూ అలాగే తిరుగసాగాను. సత్రాలు, భోజనశాలలు, అంగళ్ళూ, సర్కస్ డేరాలు, డాన్స్ ప్రోగ్రాంలు, ప్రభలు ఎన్నని చెప్పను? ఎక్కడ తిరిగినా నీవు లేవు. నీవుతప్ప అన్నీ కనిపిస్తాయి.
    కానీ నీవు లేకుంటే వాటిని కన్నెత్తికూడా చూడనని వాటికేం తెలుసు? ఎంత వెదికాను? ఎంత తిరిగాను? నీవు కనిపించందే! అప్పుడనిపించింది. నీవూ నన్ను వెదుకుతూ వస్తున్నావేమో అందుకే కనిపించటం లేదేమోనని.

 Previous Page Next Page