ఏ విషయంలోనూ ఎక్కడా మార్పు లేదు వెంకటయ్య ఇంట్లో తప్ప. అతని ఇంటి పైన మరో అంతస్తు లేచింది. అటు బ్రాహ్మణుల దగ్గరా ఇటు ప్రభుత్వధికారుల దగ్గరా డబ్బు గుంజాడని అందరూ అనుకున్నారు.
చనిపోయిన విద్యార్ధి సమాధి మాత్రం "ఈ బలిదానం దేని కోసం? ఎవరి కోసం ఈ త్యాగం? " అని దీనంగా ప్రశ్నిస్తోంది. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోలేక మదన పడిపోతున్నాడు యతి.
16
బాబ్డ్ హెయిర్ - స్లీవ్ లెస్ బ్లవుస్ - హైహీల్స్ షూస్ లిప్ స్టిక్ - బాగా పైకి కనపడుతున్న పొట్ట పైన పల్చగా ఫారిన్ జార్జెట్ చీర - స్థూలకాయం - వయసు మీద పడుతున్న కారణంగా ఎక్కడి కక్కడ వదులుగా సంచులుగా వేలాడుతున్న చర్మం- నలుపులో కలిసే చామన చాయ, ముఖం పైన దట్టంగా అడ్డుకొన్న పౌడర్- గట్టిగా నవ్వుతూ నవ్వుతూ వెంకటయ్యతో మాట్లాడుతున్న ఆ స్త్రీని విచిత్రంగా చూస్తూ నిలబడిపోయాడు యతి. యతి అలా చూస్తూ నిలబడిపోయింది ఆమె వేష ధారణకి కాదు. వెంకటయ్య దగ్గరికి వచ్చే వాళ్ళలో "ఎన్నో వేషాల వాళ్ళు" ఉండటం యతికి బాగా అలవాటై పోయింది. ఆ రోజు వెంకటయ్య యతితో "సాయంత్రం మూడు తర్వాత రా! నీకు ఒక విప్లవకారిణి పరిచయం చేస్తాను" అన్నాడు. ఆ విప్లవ కారిణిని చూడాలని యతి ఎంతో కుతూహలంగా వచ్చాడు. ఈవిడా విప్లవకారిణి? నమ్మశక్యం కావటం లేదు. అతని మనసులో లలిత మెదిలింది. లలితను చూసినపుడు కూడా విప్లవకారిణి అనుకోలేకపోయాడు. అందుకు కారణం ఆవిడ ముఖంలో కనిపించే సాత్వికత. కాకపోతే లలితతో పరిచయమైనా కొద్ది సేపట్లోనే అది కేవలం సాత్వికత కాదనీ, సాత్విక తేజస్సు అని అర్ధం అయింది. అతి ప్రశాంతంగా ఉన్న ఆ ముఖం నిప్పులు చెరగటం చూసాడు. నిప్పులు చేరుగుతున్నప్పుడు కూడా నిగ్రహం కోల్పోకపోవడం చూసాడు. అప్పుడనుకున్నాడు ఈవిడే నిజమైన విప్లవ కారిణి అని.
యతి అలా తెల్లబోయి చూస్తోంటే వెంకటయ్య పరిచయం చేసాడు. "ఈవిడే మిసెస్ జ్వాల కుమారి. చాలా ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న సోషల్ వర్కర్. సంపూర్ణ విప్లవం రావాలని ఈమె ఆశయం. అందుకే కృషి చేస్తున్నారు" అన్నాడు. యతి చేతులు జోడించాడు. అప్పటికి విభ్రాంతి లోంచి తేరుకోలేక - వెంకటయ్య తనను అంత పోగిదినందుకు మాడెస్ట్ గా సిగ్గు పడుతున్నట్లుగా భుజాలు కుదించి నవ్వింది గర్వంగా. ఆ నవ్వు చాలా గమ్మత్తుగా ఉంది. ఎవరినో వెక్కి రిస్తున్నట్లు - యెవరి మీదో కసి ఉన్నట్లు .....తన అంతరాంతరాలలో ఉన్న రహస్యాలు యెదుటి వాళ్ళకి తెలిసిపోతాయేమోనని కంగారు పడుతూ దాచుకుంటున్నట్లు - చాలా మంది ముఖాలు నవ్వుతున్నప్పుడే బాగుంటాయి సాదరణంగా. కానీ ఈవిడ మాత్రం నవ్వుతున్నప్పుడే భయంకరంగా వుంది. అంటే అంత వికారంగా అని కాదు. ఆ నవ్వును సూక్ష్మంగా పరిశీలించగలిగిన వాళ్ళకి ఆ నవ్వులో భయపెట్టే లక్షణమేదో తప్పకుండా కనిపిస్తుంది.
"ఇవాళ సాయంత్రం మీరు మా యింటికి రావాలి. వెంకటయ్యగారు చెప్పారు మీ గురించి, మీ లాంటి వ్యక్తులు దేశానికి ఈనాడు చాలా అవసరం ఇంకా మనవాళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తున్నారు. " అంది. జ్వాల కుమారి మాట్లాడుతున్నప్పుడు మాత్రం కమెండింగ్ ధోరణి ఉంది. "అలాగే" అన్నాడు యతి. ఆ కమెండింగ్ ధోరణికి లోలోపల ఆశ్చర్యపోతూ. ఏదో ఒక లక్షణం లేకపోతే ఈ మాత్రం గుర్తింపు యెలా వస్తుంది?
ఆ సాయంత్రం వెంకటయ్యగారితో కలిసి జ్వాలా కుమారి ఇంటికి వెళ్ళాడు. అతడిని అన్నింటి కంటే ఆకర్షించింది "మనవాళ్ళు ముగ్గురు నలుగురు వస్తున్నారు" అనే మాట! ఆ అభ్యుదయవాదులను కలుసుకోవాలని అతనికి ఆరాటం కలిగింది. యతి, వెంకటయ్య జ్వాలా కుమారి ఇంటికి వెళ్ళేసరికి జ్వాలకుమారి చాలా హడావుడిగా ఇంట్లో ఫర్నిచర్ అంతా యెవరో ఫ్యును ద్వారా బయటికి పంపిస్తోంది. వెంకటయ్య నవ్వుతూ "ఏమిటండి! చేస్తున్నారు?" అంటూ ప్రశ్నించాడు. జ్వాలకుమారి రుమాలుతో నుదుటి మీద చెమట తుడుచుకుంటూ "ఎవరో చెకింగ్ కి తగలబడ్డారుటండి! ఈ ఫర్నిచర్ అంటా ఇప్పటికిప్పుడు ఆఫీసుకు తరలించమన్నాడు మా పతిదేవుడు! చస్తున్నాను. ఇవాళ ఆఫీసులో పని ఎక్కువగా వుందని శామ్యూల్ కూడా ఆఫీసులోనే ఉండిపోయాడు. గార్డెన్ వర్కంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది." అంది తన చిరాకునూ, విసుగునూ ఏ మాత్రం దాచుకోకుండా. వెంకటయ్య నవ్వుతూ "ఆ! ఎంత? ఒకటి రెండు రోజులేగా! ఆ తరువాత మీ ఫర్నిచర్ మీ కొస్తుంది. నౌకరూ వస్తాడు" అన్నాడు.
"అవుననుకోండి ! ఇవాళ అందరం చాపల మీద కుచోవాలిగా ! అలవాటు లేదు బాబూ! వెన్ను నొప్పెడుతుంది!" అని విసుక్కుంటూనే చాపలు పరిచింది. వెంకటయ్య చాపమీద కూర్చుంటూ "పోనీ మీరలా కుర్చీలో కూచోండి" అన్నాడు . యతి తెల్లబోయాడు. వెంకటయ్య లాంటి వ్యక్తీ ఆవిడకు అంత ప్రాముఖ్యం ఇస్తున్నందుకు..... అతనికి ఒక్కొక్క విషయమే అర్ధం కాసాగింది. ఈ "పోగ్రేసివ్ థాట్స్" వున్నా సోషల్ వర్కర్ భర్త ఏదో గవర్నమెంట్ ఆఫీసర్ " అయి వుండాలి! ఆఫీస్ ఫర్నిచర్ ఇంట్లో చేరింది. ఆఫీస్ ఫ్యును ఇంట్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు చెకింగ్ కోస్తున్నారో! అన్నీ హడావుడిగా సర్దేస్తున్నారు, ఒక్కసారి ఇల్లంతా కలయచూసాడు. అది రెండతస్తుల విశాలమైన భవనం. పై భాగం అద్దె కిచ్చినట్లు న్నారు. క్రింది భాగంలో ఉంటున్నారు. ఇంటిముందు చక్కని గార్డెన్, అందమైన లాన్ వున్నాయి. ఇల్లంతా ఐశ్వర్యం చిహ్నాలున్నా ఫర్నిచర్ లేక బోసిగా వుంది. జ్వలకుమారి మరోసారి భుజాలు కుదించి నవ్వుతూ "భలేవారే! మిమ్మల్ని క్రింద కూర్చోబెట్టి నేను పైన కూర్చుంటానా? ఏం చేస్తాను? నేనూ క్రిందే కూర్చుంటాను - వెన్ను నొప్పి భరిస్తాను" అని ఔదార్యాన్ని ప్రకటిస్తూ చాప మీద గోడ నానుకుని కూచుంది.
గడియారం చూసుకుంటూ "ఇంకా మనవాళ్ళు రాలేదు" అంది మాట పూర్తీ కాకుండానే సిగరెట్ కాల్చుకుంటూ రేగిన క్రాఫ్ తో ఒక యువకుడు వచ్చాడు.
"హల్లో శివ కుమార్! అయూయే ! అయీయె !" అంటూ ఆహ్వానించింది జ్వాలకుమారి నవ్వుతూ.
అతడు లోపలికి వచ్చి నోట్లో సిగరెట్ చేత్తో పట్టుకుని వెంకటయ్యను, జ్వాలకుమారిని "హలో" అని పలుకరించి యతిని చూసి "ఇతనేవరు" అన్నాడు. వెంకటయ్య "మనవాడే! స్టూడెంట్ లీడర్" అని పరిచయం చేశాడు. "అచ్చా! ఇవాళ బాధ్యత అంతా యువకుల మీదే వుందయ్యా! గ్లాడ్ టు మీట్ యూ!" అని యతిని చెయ్యి పట్టుకుని ఊపేసాడు.
"ఇదేమిటి! సోఫాలన్నీ ఏమయ్యాయి?" అన్నాడు చుట్టూ చూస్తూ.
"ఎగిరిపోయాయిలే! క్రింద కూచో! అందుకేగా చాపలేసాను ?" అంది జ్వాలాకుమారి కోప్పడుతున్నట్లు.
"అన్యాయం - నా ఇస్త్రీ ప్యాంట్ నలిగిపోతుంది. మరో ప్యాంట్ లేదు. మా హౌస్ ఓనర్ గంటకో డ్రెస్ మారుస్తాడు. వాడిని షూట్ చేసి వాడి డ్రెస్ లన్నీ తెచ్చుకోవాలని వుంటుంది."