"కూర్చో" అన్నాను ఎదురు కుర్చీ చూపిస్తూ.
"చెప్పండి" అన్నాడు కూర్చొంటూ.
లేచి పచార్లు చేస్తూ నెమ్మదిగా అన్నాను.
"రవీ! నీకు జీవితంలో అనుభవంలేదు, అమాయకుడివి. నువ్వంటే నా కెందుకో అభిమానం. బహుశా ఒకప్పుడు నేనూ నీలా వుండటమే దానిక్కారణం కావచ్చు" ఆగేను. "హైమని నువ్వు ప్రేమించావు. ప్రేమించటం చాలా సులభం. కాని జీవితం పంచుకోవాల్సి వస్తే....."
అతనేదో చెప్పబోయాడు, వినలేదు.
"హైమ పూర్వపు జీవితం గురించి నీకు తెలుసు. అయినా ఆమెని చేసుకోవాలని అనుకుంటున్నావంటే నిజంగా నీ ఆశయం మెచ్చుకోతగింది. కానీ- ఆ ఆవేశం కాలక్రమేణా తగ్గిపోతేనే కష్టం. బహుశా నీ తండ్రి నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టవచ్చు. డబ్బు అవసరం అప్పుడు నీకు తెలుస్తుంది. దీనికంతకూ కారణం నువ్వు ప్రేమించిన అమ్మాయే అన్న భావం నీకు ఎప్పుడైనా కలిగితే ఆ క్షణం నుంచే నీకు నరకం ప్రారంభం అవుతుంది. ఇవన్నీ ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు."
రవి కుర్చీలోంచి లేచాడు, "ఇంక కొత్తగా ఆలోచించుకోనేదేదీ లేదు. ఆరు మూడయినా మూడు ఆరయినా మేం పెళ్ళిచేసుకోవటం ఖాయం" చెప్పాడు. అతడి కంఠంలో కనబడిన ధైర్యం చాలా నిజాయితీగా వుంది. షేక్ హేండ్ యిస్తూ "మంచిది, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్" అన్నాను.
"థాంక్స్" అతడు వెళ్ళబోయాడు.
"రవీ" పీల్చేను.
గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూసేడు.
"భవిషత్తులో ఎప్పుడైనా ఏ కారణంగానయినా నువ్వు హైమని బాధపెట్టినట్టు తెలిసిందంటే మాత్రం- ఎక్కడున్నా నేను నిన్ను క్షమించను, అప్పుడు నేను తీసుకోబోయే చర్య చాలా భయంకరంగా వుంటుంది...."
రవి వెళ్ళిపోయేడు.
* * *
అయిపోయింది.
అన్నీ సెటిల్ చేసేసేను. ఒక్కొక్క బంధమూ తెంపేసుకొంటున్నాను. ఒక్కొక్కరే ణా నుంచి శలవు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక్కడినే మిగిలిపోతున్నాను ఒంటరిగా.
ఆకాశం బాగా మేఘావృతమై వుంది.
కాగితాలు ముందు పెట్టుకొని కూర్చున్నాను.
ణా గుండె వేగంగా కొట్టుకొంటోంది.
భౌగోళిక పరిస్థితులూ, సూర్యుని చుట్టూ భూమి తిరిగే కాలమానం ప్రకారం బుతువులు నిర్ణయమవటం- వీటి గురించి నాకు తెలీదు. కానీ లెఖ్క తప్పుకాదని ఎందుకో మనసు చెబుతోంది.
సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం బ్రహ్మాండమైన తుఫాను వచ్చి, దాదాపు ప్రళయాన్ని సృష్టించింది. తరువాత తుఫాను ముఫ్ఫై సంవత్సరాల క్రితం వచ్చింది- తేడా ఇరవై. తరువాత మళ్ళీ పదిహేను సంవత్సరాల క్రితం తేడా. పదిహేను తరువాత అయిదు సంవత్సరాల క్రితం అంటే తేడా పదిహేను సంవత్సరాలు అంటే..... ఆ లెక్క చూస్తే- అయిదు సంవత్సరాలకి.... అంటే ఈ సంవత్సరం నిశ్చయంగా తుఫాను రావాలి. ఇది సెప్టెంబరు నెల, అంటే- ఈ నెలలోనే రావాలి- రావాలి-
నా అంచనా తప్పలేదన్నట్టు రేడియో నుంచి వాతావరణం ప్రకటన వినబడింది.
"ఒక ముఖ్యప్రకటన.... తూర్పు సముద్రంలో కేంద్రీకృతమైన వాయుగుండం మరింత బలీయమవుతోంది. దీని ఫలితంగా రాబోతున్న తుఫాను గత పది సంవత్సరాలుగా వచ్చిన రెండు మూడు తుఫాన్లకన్నా పెద్దది కావచ్చునని పరీశీలకులు భావిస్తున్నారు".
కుర్చీలోంచి ఆనందంతో గెంతబోయి ఆపుకున్నాను, బయట కొచ్చాను. మేఘాలు క్రమ్ముకొంటున్నాయి. కారిడార్ లోంచి వెళుతున్న దాదా ఆగి, నా వేపు చూస్తూ "ఏమిటి బాబూ- అంత హుషారుగా వున్నారు?" అడిగాడు. నా పెదవులమీద చిరునవ్వు నాట్యమాడింది.
"తుఫాను వస్తుందట దాదా" చెప్పాను.
అతడు ఆకాశంవైపు చూసి "రావొచ్చు బాబూ" అన్నాడు.
"మామూలు తుఫాను కాదు, పెద్దది....గాలి.... విపరీతమైన వేగంలో గాలివీస్తే......."
"వీస్తే...."
"చెరుకుతోట థ్వంసమయితే-"
"అయితే...."
"బెల్లం ధర పెరుగుతుంది దాదా, అనుకున్నదానికన్నా పదిపైసలు పెరిగినా చాలు- యాభై లక్షలమీదా రెండు లక్షలు లాభం- ఆరులక్షలు మొత్తం మనం గెల్చేం దాదా. తాతయ్యకి క్షమాపణ చెప్పనక్కర్లేదు. మనం గెల్చేం. తుఫాను వస్తోంది. అదృష్టం మనవైపే వుంది దాదా-" ఆనందంతో ణా మాటలు తడబడ్డాయి.
శంకర్ దాదా నిర్వికారంగా ఆకాశంవైపూ, కదులుతున్న మేఘాలవైపూ చూస్తూ అన్నాడు. "అవును బాబూ. భయంకరమైన తుఫాను రాబోతోంది. మనకి లాభాలు తెచ్చిపెట్టబోతోంది. ఎంతమందినో చంపెయ్యటానికి మరెంతమందినో నిరాశ్రయుల్ని చెయ్యటానికి తుఫాను రాబోతోంది.
14
తుఫాను తూర్పు దేశాన్నంతా వూపేసి వెళ్ళిపోయింది. అది వెళ్ళినా దాని ప్రభావం యింకా పోలేదు. సన్నగా జల్లులు పడుతూ ఉన్నాయి.
ఉదయం ఏడయింది, వార్తలు వస్తున్నాయి. వింటూఉండగా ఒకవార్త నన్ను నిటారుగా చేసింది.
చటుక్కున లేచి భైనాక్యూలర్స్ తీసి, లక్ష్మీనారాయణ ఇంటివైపు చూసేను. గార్డెన్ లో వున్నాడు. ఇంకా ఈ వార్తా తెలియదన్నమాట!
గబగబా స్నానం చేసేను. స్నేహితునికి ఫోనుచేసి జీపు ఒకసారి కావాలన్నాను. నేను ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అరగంట గడిచేక నా జీపు అడవివైపు దూసుకుపోయింది. వర్షంవల్లా గాలివల్లా రోడ్డుకీ అడ్డంగా చెట్లుపడి ఉన్నాయ్. అంతా బురదగా వుంది. కొంతదూరం వెళ్లేక జీప్ ఇక ముందుకు సాగదనిపించింది. దిగి నడవటం ప్రారంభించేను. నేల చిత్తడిగా వుంది - కాళ్ళు కూరుకుపోసాగేయి. దాదాపు అరగంట వెతికేక నాక్కావాల్సిన పొద దొరికింది. తీసుకుని యింటికి వచ్చేసేను.
లక్ష్మీనారాయణకీ వార్తా ఇంకా తెలిసినట్టు లేదు. ఆ ఇంట్లోంచి హడావుడి ఏవీఁ వినబడటం లేదు.
ఒక గొప్ప తుఫాను రాబోయేముందు అలుముకొన్న ప్రశాంతత అక్కడ నెలకొని ఉంది.
రాత్రి భోజనం చేసేక రవిని పిల్చి-మరుసటిరోజు విషయం మాట్లాడేను.
రాత్రి పదకొండయింది. నిద్ర పట్టలేదు.
బహుశా ఈ భవనంలో నేను పడుకోవటానికి యిదే ఆఖరి రాత్రి కావొచ్చు. మళ్ళీ జైలు! న్యాయాన్ని గౌరవించాలి.
రివాల్వర్ తీసి చూసుకొన్నాను.
ఒకే ఒక బుల్లెట్ ఉంది.
ఒకర్ని చంపటానికైనా, చంపలేకపోతే ఆత్మహత్య చేసుకోవటానికయినా ఒక బులెట్ చాలు. రివాల్వర్ డ్రాయరు సొరుగులోపెట్టి బయటకోచ్చేను, హైమ గదిలోంచి బెట్ లైటు పడుతోంది. లోపలి వెళ్ళేను. చలికి వత్తిగిలి పసిపాపలా నిద్రపోతోంది. ఒకప్పుడు అల్లరిగా రెపరెపలాడిన కనురెప్పలు యిప్పుడు అమాయకత్వపు పొత్తిళ్ళలోకి జారుకొని ప్రశాంతంగా ఉన్నాయి. నిద్రాభంగం కలుగకుండా తలదిండు సరిగ్గా అమర్చి బయట కొచ్చేశాను.
శంకర్ దాదా ప్రొద్దున్నే ఊరు వెళ్ళిపోయాడు. కాంట్రాక్టు సెటిల్ మెంటు ఎలా చేసుకోవాలో అతడికి వివరించేను.
రేపు హైమ వెళ్ళిపోతుంది.
ఒకరొకరే....ఒకరొకరే వెళ్ళిపోతున్నారు.
ఆలోచన్లతో రాత్రెప్పుడో నిద్రపట్టింది.
మరుసటిరోజు లక్ష్మీనారాయణనీ అతడి భార్యనీ లంచ్ కి పిలిచేను.
పదకొండు అవుతుండగా వాళ్ళు వచ్చేరు.
సోఫాలో కూర్చొంటూ, "హైమా ఏది?" అడిగింది అతడి భార్య.
"వెళ్ళిపోయింది-" అన్నాను.
"వెళ్ళిపోయిందా?"
"అవును" అన్నాను. "ఆమె వేశ్య. మరి నాతో సంస్కరింపబడటం ఇష్టంలేదో-పాత జీవితాన్ని వదులుకోవటం ఇష్టం లేకపోయిందో తెలీదు, వెళ్ళిపోతానంది. సరేనన్నాను."
లక్ష్మీనారాయణ భార్య మొహంలో రిలీఫ్ కనబడింది.
"ఎప్పుడు" అంది.
"ఈరోజు ప్రొద్దున్నే."
"అలాంటి వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకోవటమే బుద్ధి పొరపాటు. ఇంకా నయం- ఏవీఁ పట్టుకుపోలేదు" అన్నాడు అతడు.
టాపిక్ మార్చి "రండి లంచ్ చేద్దాం" అని డైనింగ్ రూమువైపు నడిచేను.
"మీ నౌకర్లు ఏరీ?" అంది టేబుల్ ముందు కూర్చుంటూ.
"మనిపించేసేను?"
"అదేం?"
"ఖర్చెక్కువని-"
ఆమె విచిత్రంగా చూసింది. అది గమనించనట్టు ముగ్గురి ప్లేట్లలోనూ వడ్డించేను.
"నా కివ్వండి. నేను వడ్డిస్తాను" అంది.
"నేను హొస్టుని కదా" నవ్వేను. లోపల లక్ష్మీనారాయణ కోసం సెపరేట్ గా ఉంచిన డిషెస్ ట్రేలో తీసుకొచ్చి పెట్టేను. మిగతా వాటితో అవి కలవకుండా.
భోజనం ముగించేక కొంచెంసేపు విశ్రాంతి తీసుకొమ్మని చెప్పి నా గదిలోకి వచ్చేసేను. మధ్యాహ్నం పన్నెండయింది. అంతకుముందు రాత్రి నిద్ర సరిగా లేకపోవటంవల్ల పడుకోగానే నిద్రపట్టేసింది.
దాదాపు రెండవుతుండగా అకస్మాత్తుగా మెలకువ వచ్చేసింది. అతడి భార్య కంగారుగా తట్టి లేపుతోంది. "ఏమయింది?" అన్నాను లేస్తూ.
"ఆయనకి-ఆయనకి-" వగరుస్తోంది.
"ఏమైంది?" అన్నాను బయటికి వడివడిగా కదుల్తూ.
"ఎడం భాగం అసలు స్వాధీనంలోలేదు. నా కేమిటో భయంగా ఉంది."
ఇద్దరం తొందర తొందరగా అతడి గదిలోకి వచ్చేం. పక్కమీద వెల్లకితలా పడుకుని వున్నాడు అతడు. మొహం అంతా చెమట పట్టేసింది. ఎడమచెయ్యి సన్నగా వణుకుతోంది. కుడి కంటిలోంచి ధారగా నీరు కారి తలగడని తడిపేస్తోంది.
వంగి చెయ్యి పట్టుకొని చూసేను ఐసుకన్నా చల్లగా వుంది. ఎడమకాలు పూర్తిగా చచ్చు పడిపోయినట్లు వేలాడుతోంది. కంగారు పడనవసరం లేదని ధైర్యం చెప్పి డాక్టరు కి ఫోన్ చేసేను. అయిదు నిముషాల్లో డాక్టర్ వచ్చేడు.
దాదాపు అరగంటసేపు రకరకాలుగా పరీక్షించేడు. అతడ్నే గమనిస్తూ నిల్చున్నాను.