"ఏమన్నా బాధగా వుందా?" అడిగేడు డాక్టర్.
లేదన్నట్టు లక్ష్మీనారాయణ తల అడ్డంగా వూపేడు.
"వేళ్ళు ముడవండి" ఎమడచేతిని పట్టుకొని అన్నాడు.
"లాభంలేదు డాక్టరుగారు" అన్నాడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉంటే నోరు ఓ పక్కకిపోయి వికృతంగా కనబడుతోంది.
ఏదో యింజక్షన్ చేసి డాక్టర్ బయటకొచ్చేడు. అతడితోపాటు బయటకొస్తూ, "ఏమిటి డాక్టర్! ఏమయింది?" అడిగేను. మాతోపాటు లక్ష్మీనారాయణ భార్యకూడా ఉండటంవల్ల అతడు మాట్లాడటంలేదని గ్రహించి "చెప్పండి డాక్టర్, ఎంతటి విషయమయినా విని తట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాం" అన్నాను. అప్పటికింకా లక్ష్మీనారాయణ పడుకొన్న గదినుంచి పదడుగుల దూరంగాకూడా వచ్చివుండం. నా మాటలు అతడు వింటాడన్న ఉద్దేశ్యంతో 'ష్' అన్నాడు డాక్టర్. నా తప్పు గ్రహించినట్లు నాలిక్కరుచుకొని "సారీ డాక్టర్" అన్నాను.
ముగ్గురం గదిలోకి వచ్చేక అడిగేను.
"చెప్పండి డాక్టర్. అసలేమిటి వచ్చేక అడిగేను.
"పెరాలిసిస్".
క్షణంసేపు మౌనంగా వుండి, నెమ్మదిగా "నే ననుకొంటూనే ఉన్నాను" అంది అతడి భార్య.
"నయం అవుతుందా? ప్రమాదం ఏమీ లేదుకదా?" అడిగేను.
'స్ట్రోక్ ఎడమవైపు వచ్చింది. కాబట్టి కొద్ది ప్రమాదమే, పోతే వయస్సు చిన్నదే కాబట్టి- ఎక్సర్ సైజన్ అవీ చేయించి మందులు వాడితే కొద్దిగా ఫలితం కనపడవచ్చు' చెప్పాడు.
అతడిని కార్లో దింపి. అతడు వ్రాసిచ్చిన మందులన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చాను. లక్ష్మీనారాయణ తల దగ్గర కూర్చొనివుంది అతడి భార్య. కుర్చీ లాక్కుని కూర్చొంటూ చేతిలో మందుల ప్యాకెట్ ఒకటొకటే ఎలా వాడాలో చెప్పేను.
"వీటి సంగతికేంగానీ- అసలు నాకు తగదన్నాడు కదూ డాక్టరు, ఇక జీవితాంతం ఇలానే ఉండిపోవాలన్నాడు కదూ- 'మీరన్నా నిజం చెప్పండి" హీనమైన స్వరంతో అరిచాడు.
'లేదు లేదు! తప్పకుండా తగ్గుతుంది' అన్నాడు.
'అంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారు. నాకు తెలుసు ఇది పక్షవాతం, ఇది తగ్గదు. నేనిలా యీ పక్కమీదే చావాలి! నాకు తెలుసు' తల విదిలిస్తూ బిగ్గరగా అన్నాడు.
దగ్గరగా వెళ్ళి అనునయిస్తున్నట్టు - చూడండి, మీకు తప్పకుండా తగ్గుతుంది? తగ్గేవరకూ యిక్కడే నా ఇంట్లోనే వుందురుగాని, ఎంతకాలం అయినా సరే సరేనా' అన్నాను.
అతడు భార్యవైపు తిరిగి 'చూసేవా- నిజం ఎలా బయటకొచ్చిందో ఎంతకాలం అయినాసరే- నేనిక్కడే యిలాగే, వుండాలట. అంటే.... అంటే....' ఆయాసంతో రొప్పసాగేడు. అతడి భార్య నావైపు తిరిగి- మీరు వెళ్ళిన దగ్గిరుంచీ యిదే వరస. డాక్టర్ తగ్గుతుందని చెప్పేడంటే వినరు....'
'ఆయన డాక్టర్ ని అడగటం, డాక్టర్ జవాబు చెప్పటం... అంతా విన్నాను.'
'డాక్టర్ జవాబు చెప్పటం మీరెక్కడ విన్నారు?' అంది అతడి భార్య.
'నేను వింటున్నానని అతను చెప్పలేదు' అన్నాడు.
నేను కల్పించుకొని 'మీరింతగా ఎందుకు నిరాశ చెందుతున్నారో నాకర్ధం గావటంలేదు. పక్షవాతం వచ్చినవాళ్ళు సంవత్సరం తిరిగేసరికల్లా శుభ్రంగా తిరుగుతున్నారు. సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాలు' అన్నాను.
'చూసేరా చూసేరా- నాకు పక్షవాతమే - మీ నోటివెంట వచ్చేసింది' అతడు రోదించటానికి సిద్ధంగా వున్నాడు.
బైట కొచ్చేసేను.
ఇక ఆ స్థితిలో అతణ్ని ఎంత ఓదార్చిన లాభంలేదు.
మేఘాలు దట్టంగా అలుముకొని వున్నాయి. చల్లగాలి తెరలు తెరలుగా వస్తోంది.
గడియారం నాలుగు గంటలు కొట్టింది.
లోపల్నుంచి అతడి భార్య అతడ్ని ఓదార్చడం వినపడుతోంది.
నాలో ఏ విధమయిన సంఘర్షణ తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నాను.
లోపల్నుంచి యేదో చెప్పటానికి బయటకొచ్చిన లక్ష్మీనారాయణ భార్య ప్రహరీగోడ గేటువైపుచూసి, అలాగే అవాక్కయి నిలబడి పోయింది.
గేటు తలుపు తీసుకుని చేతిలో చెయ్యి వేసుకుని నెమ్మదిగా నడిచి వస్తున్నాడు. పట్టుబట్టల్తో వున్న కొత్త దంపతులు.....రవీ, హైమ.
ఇద్దరం స్థాణువుల్లా నిలబడిపోయేం.
వాళ్ళిద్దరూ నెమ్మదిగా వచ్చి లక్ష్మీనారాయణ భార్య కాళ్ళకు దణ్ణం పెట్టారు. అప్పటివరకూ కళ్ళప్పగించి చూస్తున్నదల్లా ఈ లోకంలోకి వచ్చినట్టు చిన్నగా అరిచి పడిపోయింది ఆమె. ఒక్క అంగలో ఆమెని చేరుకొని పడిపోకుండా పట్టుకున్నాను రవి రెండోవైపు పట్టుకున్నాడు. ఆమెని జాగ్రత్తగా గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టాం. 'అమ్మా.... అమ్మా....' పిలుస్తున్నాడు రవి. చాలా బెదిరినట్టు కనబడ్తున్నాడు. 'ఆవిడకిప్పుడు కావాల్సింది మానసిక ధైర్యం రవీ' అన్నాను.
తలెత్తి చూసేడు.
"ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేని సాహసాన్ని నువ్వు ప్రదర్శించేవు. అది సులభమే కానీ, దాని తరువాత పరిణామాల్ని ఎదుర్కోవటానికి కూడా నువ్వు స్థిరంగా వుండాలి. ఇది నీకు మొదటిదెబ్బ! ఇంతకన్నా పెద్ద పెద్ద దెబ్బలు నీకు ముందు ముందు చాలా తగులవచ్చు, బెదిరిపోకు."
అతడి మొహంలో స్థిరత్వం కనపడింది. "అర్థమైంది" అన్నాడు ముందుకు కదుల్తూ.
"మీ నాన్నగారు ఆ రూమ్ లో వున్నారు" అన్నాను. అతడు అటు వేపు వెళ్ళబోతుంటే "ఒక దురదృష్టకరమైన వార్త. మీ నాన్నగార్కి చిన్న నెర్వస్ స్ట్రోక్ వచ్చింది డాక్టర్ రెండు రోజుల్లో తగ్గిపోతుందన్నాడు. ఆయన అది పక్షవాతమేమోనని భయపడుతున్నాడు. నువ్వు దాని గురించి ఏవీ భయపడకు."
రవి తలూపేడు. ఇద్దరు లక్ష్మీనారాయణ గదిలోకి వెళ్ళారు. నేను వెళ్ళలేదు. చేతికి ఎదిగివచ్చిన కొడుకుని వదులుకోవటం తండ్రికెంత బాధగా వుంటుందో ఊహించగలను. ఆ పరిస్థితుల్లో నేను అక్కడ వుండటం అవసరం.
లోపల్నుంచి లక్ష్మీనారాయణ అరవటం వినిపిస్తోంది. రవి అనునయిస్తున్నట్టు ఏదో చెబుతున్నాడు.
అయిదు నిమిషాల తర్వాత ఇద్దరూ బయటకొచ్చారు తల్లిని చూసినప్పటి బేలతనం రవి కళ్ళల్లో ఇప్పుడులేదు. "నాన్నగారు చాలా అప్ సెట్ అయ్యారు" అన్నాడు.
"కొంతకాలానికి అంతా సర్దుకుంటుంది" అన్నాను.
"అదే ఆశతో వెళ్ళిపోతున్నాను" అంటూ నా చేతులు పట్టుకొని "నాన్నగారిని మీరే చూసుకోవాలి" చెప్పాడు.
"తప్పకుండా" అన్నాను. "ఆయన స్వస్థత చేకూరేవరకు మా ఇంట్లోనే వుంటారు."
రవి కృతజ్ఞత నిండిన కళ్ళతో షేక్ హాండ్ యిచ్చి "వెళ్ళొస్తాం" చెప్పాడు.
"మంచిది బెస్ట్ ఆఫ్ లక్-"
హైమ నెమ్మదిగా వంగి నా పాదాలు స్పృశించింది. రెండు చేతుల్తోనూ ఆమెని లేవదీసి, "హైమా" అన్నాను. ఆమె కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగేయి. తలమీద చెయ్యి వేసేను- "హైందవ స్త్రీగా పరిపూర్ణత్వాన్ని పొందే అవకాశాన్ని నీకు దేవుడు ప్రసాదించేడు హైమా! ఇక పాత జీవితాన్ని మర్చిపోయి ఈ దేవుడి జీవితంలో ఈ భాగం పంచుకో. ఎప్పుడన్నా తీరిక దొరికినప్పుడు మాత్రం ఈ స్నేహితుడ్ని గుర్తు చేసుకుంటావు కదూ?" నా కంఠం బొంగురుపోయింది - ఆమె దుఃఖాన్ని అతి కష్టంమీద బిగపట్టింది. మెడలోంచి లాకెట్ తీసి ఆమె మెడలో వేసెను. "నాదంటూ యేదన్నా మిగిలితే యిదే హైమా. ఇంకేవీఁలేదు నా దగ్గర. తీసుకో" ఇద్దరి భుజాల మీదా చెయ్యివేసి గేటువరకూ సాగనంపేను. నెమ్మది నెమ్మదిగా కనుమరుగైపోయేరు.
అటువైపే చూస్తూ చాలాసేపు నిలబడిపోయేను. మెదడులో చేపల కదిలికమల్లే అస్పష్టమైన ఆలోచన్లు, సంఘర్షణ! ఎంత ఆపుకుందామన్నా అగ్ని పర్వతాన్ని బ్రద్దలు చేసుకొని బయటకు రావాలనే లావాలా పెల్లుబికే ఉద్విగ్నత.
లోపలి కొచ్చేశాను.
అతడు ఆవేశంతో ఎగిరెగిరి పడుతున్నాడు. అతడి భార్య ప్రక్కనే కూర్చుని ఓదారుస్తోంది- నన్ను చూడగానే మళ్ళీ అరవటం మొదలు పెట్టేడు.
"వెళ్ళిపోయాడా ఆ త్రాష్టుడు? చిన్నప్పట్నుంచీ పెంచి పెద్దచేసినందుకు బాగా బుద్ధి చెప్పేడు. కృతఘ్నుడు-పురుగులు పట్టిపోతాడు."
"ఆవేశపడకండి-ప్లీజ్" అన్నాను.
"అసలు తప్పంతా నాది- పాముని తీసికొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. వెళ్ళిపోతానంటే ఏమోననుకున్నానే కానీ ఈ ఉద్దేశ్యం మనసులో పెట్టుకొనే ఇలా అంది అని తెలుసుంటే అప్పుడే జాగ్రత్తపడి వెళ్ళగొట్టి వుండేవాణ్ని-"
"మన బంగారం మంచిదైతే ఇంకొకళ్ళని అనటం దేనికి? ఈ వెధవ ఇంత చదువుకుని కూడా అది కొద్దిగా అందంగా కనబడేసరికి తల్లిదండ్రుల్నీ, సంసారాన్ని మర్చిపోయి దాంతో పోతాడా- దాని తళుకూబెళుకూ పోగానే తను చేసింది ఎంత వెధవపనో తెలుసుకోడూ?"
"ఊరుకోండి-" అంటోంది అతడి భార్య. పక్కనే స్టూల్ మీదున్న సీసాలోంచి ఒకమాత్ర యిస్తూ, "ఇది ఒకటి వేసుకోండి, నిద్రపట్టదు నాకు" ఒంటిచేతితో లేవటానికి విఫలప్రయత్నం చేస్తూ అన్నాడు.
అతడ్ని పట్టుకొని కూర్చోబెట్టి మాత్ర యిస్తూ, "ఒకటికన్నా ఎక్కువ ఎటువంటి పరిస్థితుల్లోనూ వేసుకోకండి- విషంకన్నా ప్రమాదం" అన్నాను.
అది వేసుకొన్న కొంచెంసేపటికి అతడికి నిద్రపట్టింది.
నేను నా గదిలోకి వచ్చేసేను. పక్కమీద వెల్లకితలా పడుకొని పైకప్పుకేసి చూస్తూ, ఆలోచనలో మునిగిపోయేను. అరగంట గడిచింది. లక్ష్మీనారాయణ భార్య గదిలోకి వచ్చి కుర్చీ లాక్కొని కూర్చొంటూ- "నీకేమి చేయాలో తోచటంలేదు" అంది.
"ఏ విషయం?" అన్నాను.
"రవి దాన్ని తీసుకొని వెళ్ళిపోయేడు- ఈయన ఇలా అకస్మాత్తుగా పడిపోయేరు"
"మీరు ఆయన గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోకండి. ఆయనకి తగ్గేవరకూ యిక్కడే వుందురుగాని" అన్నాను.
ఆమె నొచ్చుకుంటున్నట్టు "మా గురించి మీరంత శ్రమపడుతున్నారు" అంది.
ఆమెవైపు ఆరాధనా పూర్వకంగా చూస్తూ "ఒకసారి ప్రేమించటం మొదలుపెడితే ఇలాటివి శ్రమ అనిపించవు" అన్నాను.
ఆమె సిగ్గుపడి- నాలో ఏముందని?" అంది నెమ్మదిగా.
"నా కళ్ళల్లోకి చూడండి-"
ఆమె మాట మార్చి "డాక్టరుగారు ఏమన్నారు?" అంది.
"కష్టమట. కానీ ప్రయత్నం చేస్తానన్నాడు. కాలు స్వాధీనంలోకి రాదన్నాడు ఒకటి రెండు సంవత్సరాల్లో చెయ్యి బాగుపడినా అదృష్టమేనట. మీకు చెపితే కంగారుపడతారని నాకు చెప్పేడు."
"ఈ విషయం ఆయనకి తెలియనివ్వకండి!" అంది హీనమైన స్వరంతో..........
సాయంత్రం అయిదున్నర అయింది.
విశాలమైన యిల్లు పనివాళ్ళెవరూ లేకపోవటంవల్ల బావురుమంటోంది- వున్న ముగ్గురిలోనూ ఒకరు పక్కమీదున్నారు. ఒకరికి ఆ రోగి సపర్యలతోనే సరిపోతుంది. నేను సాధారణంగా ఎక్కువ మాట్లాడను. అందువల్ల ఆ యిల్లు దాదాపు శ్మశానంలా వుంది. హైమ వెళ్ళిపోవటంతోనే ఆ ఇల్లు చిన్నబోయింది. గదిలో చీకటి నల్లగా వ్యాపిస్తోంది. ఆకాశం మరింత మేఘావృతమయింది. దూరంగా కీచురాళ్ళ చప్పుడు ఆగి ఆగి వినిపిస్తోంది.